Breaking News

శ్రీశ్రీ ఒక తీరని దాహం

Published on Sun, 06/15/2025 - 01:00

జలజల పారే గంగా గోదావరీ అనే జీవ నదులూ, మబ్బుల్ని తాకే హిమాలయ పర్వత శ్రేణులూ, పున్నమి వెన్నెల్లో తాజ్‌ మహల్‌ సౌందర్యమూ, బిస్మిల్లాఖాన్‌ షెహనాయి రాగాల లాలిత్యమూ... వీటి గురించి మళ్లీ మళ్లీ మాట్లాడుకున్నా బావుంటుంది. కాటుక కంటినీరు చనుకట్టు పయింబడ యేల ఏడ్చెదో... బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్‌... మందార మకరంద మాధుర్యమును గ్రోలు... వంటి తియ్యని తెలుగు కవిత్వాన్నీ, సిరులు మించిన పసిడి బంగారు జిలుగు దుప్పటి జారగా... అంటూ కవ్వించే జనార్దనాష్టకం పద్యాల నడకలోని తూగునీ ఎన్నిసార్లు పాడుకున్నా అదే చెక్కుచెదరని అందం. అంతే తన్మయత్వం!మహాభారతం, ‘కన్యాశుల్కం’, ‘అన్నా కరెనినా’, ‘ద బ్రదర్స్‌ కరమజోవ్‌’, ‘వన్‌ హండ్రెడ్‌ ఇయర్స్‌ ఆఫ్‌ సాలిట్యూడ్‌’, చలం ‘ఓ పువ్వు పూసింది’– ఎలాగో ‘మహాప్రస్థానమూ’ అంతే. 

ఒక సూపర్‌ క్లాసిక్‌. మరిచిపోలేని మాస్టర్‌ పీస్‌! అది తెలుగు సాహిత్యాన్ని యుద్ధరంగంలోకి నడిపించింది. తెలుగు కవిత్వాన్ని అజేయమైన శక్తిగా నిలిపింది. నీలాకాశంలోకి తెలుగు పతాకాన్ని ఎగరేసింది. విశ్వనాథ సత్యనారాయణ లాంటి పండితుడూ,సంప్రదాయవాదీ విస్తుపోయాడంటే, శ్రీశ్రీ ఎగరేసిన జెండాలా, సంస్కృత సమాసాలకు తల్ల కిందులై కాదు, అందులోని స్వచ్ఛమైన అచ్చమయిన కవిత్వాన్ని చూసి, అలా రాయడం మరొకరి వల్లకాదని తెలిసి! ‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ లెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌ అది మోసిన బోయీ లెవ్వరు?’– విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఆ నాలుగు లైన్లూ చదివి, దివాకర్ల వెంకటావధాని, రెండు మూడొందల ఏళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో ఇలా అన్నవాడెవడూ లేడని ఒక ఉద్వేగంతో చెప్పారు. 

శ్రీశ్రీని పరుసవేది అన్నాడు జ్వాలాముఖి. మోడువారిన చెట్టు చిగురించి మళ్లీ జీవితంలోకి ప్రవేశించడం మనకి నేర్పుతుంది. శ్రీశ్రీ కవిత్వం చదివిన వాళ్ళందరి అనుభవమూ అదే. మనో వాక్కాయకర్మ శుద్ధి పరిపూర్ణంగా గలవాడికి మాత్రమే అలాంటి కవిత్వం సిద్ధిస్తుంది. సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. 

మహాప్రస్థానానికి 75 ఏళ్లు అంటున్నారు. తొలిసారి 1950లో అచ్చయింది గనక ఇలా అనొచ్చు. హంగ్రీ థర్టీస్‌లోనే 1934–40 మధ్యనే శ్రీశ్రీ ఈ గీతాలు రాశారు. రాసి తొంభై సంవత్సరాలు అయింది. సెలబ్రేట్‌ చేసుకోడానికి ఒక అకేషన్‌ అని తప్పితే, జీవ నది లాంటి ఆ కవిత్వం మన సంస్కృతిలో, అనుభూతిలో, మన రక్తంలో ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. మహాప్రస్థానంలో మీకు ఏ కవిత ఇష్టం? కొంపెల్ల జనార్ధనరావు కోసమా? ఎచటికి పోతావీ రాత్రి? దారిపక్క చెట్టుకింద కూర్చున్న ముసిల్దా? సంధ్యా సమస్యలా? శైశవ గీతా? గంటలా? కవితా ఓ కవితా? ఇలా మనం ఎన్ని పొయెమ్స్‌ అయినా చెప్పగలం. 

వాటిని అప్పచెప్పగలం కూడా! అయితే, తాను రాసిన వాటిల్లో శ్రీశ్రీకి బాగా నచ్చిన కవిత ఏదో తెలుసా? అది మహాప్రస్థానంలో లేదని కూడా తెలుసా? ‘శరశ్చంద్రిక’ నాకు యిష్టం అని ఒక సందర్భంలో చెప్పారు శ్రీశ్రీ. ఆ దీర్ఘ కవిత ‘ఖడ్గసృష్టి’లో మొట్టమొదటిది! నవీన విశ్వవిద్యా లయాల్లో పురాణ కవిత్వంలాగా శ్రవణ యంత్రశాలల్లో శాస్త్రీయ సంగీతం లాగా ఇలా వచ్చావేం వెన్నెలా? అంటూ వెన్నెలలో మహాకవి సంభాషణ మొదలవుతుంది. సాదాసీదాగా, నిరలంకారంగా, ఊర్నే నువ్వూ నేనూ మాట్లాడుకున్నట్టే ఉంటుంది. శరశ్చంద్రిక చదవడం పూర్తి అయ్యేసరికి మనం ఒక వెన్నెల తుఫాన్‌లో చిక్కుకుపోతాం. సాక్షాత్తూ వెన్నెల సముద్రం మీద సంతకం చేస్తున్న దృశ్యం ఒక మహత్తరమైన పెయింటింగ్‌లా మనోఫలకం మీద నిలిచిపోతుంది. 

ప్రలోభాలకూ, పద్మశ్రీలకూ తలవంచని తీరానికి చెందిన వాడు. పురిపండా అప్పలస్వామి ఒరియా సాహిత్య చరిత్ర రాసిన తెలుగువాడు. చేతిరాతతో లండన్‌ మహాప్రస్థానం ఎందుకూ? అని శ్రీశ్రీ సందేహిస్తున్నపుడు, పురిపండా ఇలా అన్నారు: ‘మహా ప్రస్థానం ఈ శతాబ్దంలో తెలుగులో వచ్చిన ఏకైక మహాకావ్యం. నాకు తెలిసినంత మట్టుకు మరే భారతీయ భాషలోనూ ‘కవితా ఓ కవితా’ అంత గొప్పగీతం రాలేదు’. ఈ మాట ఒక జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు కన్నా తక్కువదేమీ కాదు. మార్క్సిస్ట్‌ ఈస్థటిక్స్‌కి మహా ప్రస్థానమే ఒక సజీవ ఉదాహరణ. 

గదిలో ఎవరూ లేరు, గదినిండా నిశ్శబ్దం, సాయంత్రం ఆరున్నర, గదిలోపల చినుకుల వలె చీకట్లు... అని మొదలవుతుంది ‘ఆకాశ దీపం’, వట్టి వచనం. తొంభై సంవత్సరాల క్రితం ఇలా రాయడానికి ఎంత ధైర్యం శ్రీశ్రీకి? ‘దీపం ఆరిపోయింది – తారగా మారిపోయింది’ అని కవిత ముగిసేసరికి గుండె పేలి పోతుంది. అందుకే చలం ‘బుద్ధున్నవాడెవడూ దీన్ని కవిత్వం అనడు’ అన్నారు. ఈ కవి అప్పీల్‌ బుద్ధినీ, వివేకాన్నీ, కళానిబంధ నల్నీ మించిన ఏ అంతరాళానికో తగుల్తుంది. ఆ అంతరాళం అనేది ఉన్నవాళ్ళకి అని చెప్పారు. 

నిప్పులు చిమ్ముకుంటూ... అంటూ ఆరు లైన్ల పొట్టి కవిత రాసినా, కవితా ఓ కవితా అని ఆరేడు పేజీల దీర్ఘకవిత్వం రాసినా శ్రీశ్రీలో ఆవేశం, సముద్ర కెరటమై ఎగిసిపడుతుంది. లెనిన్, స్విన్‌ బర్న్, సాల్వడార్‌ డాలీ, కొంపెల్ల జనార్ధనరావు... ఇలా ఎవరి గురించి రాసినా పాఠకుణ్ణి నిద్రపోనివ్వని శ్రీశ్రీ ముద్ర మనందరి కలెక్టివ్‌ ఎక్స్‌పీరియ¯Œ ్స! కనకదుర్గా చండ సింహం జూలు దులిపే ఆవులించింది – అనే శుద్ధవచనాన్ని నరాలు తెగే కవిత్వంగా మార్చే రహస్యం తెలిసినవాడు –అతనొక్కడే! 

మహాప్రస్థానము, ఖడ్గసృష్టి మాత్రమే రాసి శ్రీశ్రీ చేతులు దులుపుకోలేదు. సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరిక్కులు, గల్పికలు, అనువాదాలు, నాటికలు, కథలు, వీలునామా, సినిమా పాటలు, ఆత్మకథ ‘అనంతం’ – మరెన్నో రాశాడు. అద్భుతాలు చేశాడు. జీవితాంతమూ రాస్తూనే ఉన్నాడు. ఎంత రాశాడో అంతకు మించి చదువుకున్నాడు. శ్రీశ్రీ జ్ఞాని. రుషితుల్యుడు. కష్టజీవు లందరికీ మిత్రుడు. తెలుగుజాతి వరపుత్రుడు. 

దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అమృతం కురిపించినా, వెలుతురెక్కడ సోనియా అంటూ బైరాగి విలపించినా, చెట్లు కూలుతున్న దృశ్యాన్ని చూసి అజంతా కన్నీళ్లు పెట్టినా; జనంలో నడు, కాలాన్ని వెంటపెట్టుకు నడూ అని మక్దూమ్‌ మొహియుద్దిన్‌ పిలుపు ఇచ్చినా, సత్యమూర్తి చిరుగాలి సితారా సంగీతం వినిపించినా;ఎండ్లూరి సుధాకర్, మద్దూరి నగేష్‌బాబు వెలివాడల వేదనని కన్నీటి అక్షరాలుగా పరిచినా అది శ్రీశ్రీ తిరుగుబాటు వేదాంతానికి ఉత్తేజపూర్వకమైన కొనసాగింపు మాత్రమే. 

గురజాడ వేంకట అప్పారావు పరిచిన వారసత్వపు వెలుతురు దారుల్లో శ్రీశ్రీ, ఎర్రకాంతుల ఇనోదయాన్ని డిస్కవర్‌ చేసి, నవ్య కవిత్వంతో నిండిన వేల పాలపుంతల్ని ప్రసాదిస్తే ఆ వెలుగు వెన్నెల జోడిలో ఆధునిక తెలుగు కవిత్వం మానవ జీవన మాధుర్య సౌందర్య తీరాలను తాకి పరవశిస్తోంది.

తాడి ప్రకాష్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత ‘ 97046 41559 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)