Breaking News

అందరికీ ఆహార భద్రత ఓ ఎండమావేనా!

Published on Sun, 11/30/2025 - 01:59

దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యల్లో మొదటిది ఆహార భద్రత. ప్రపంచ ఆహార భద్రత సూచీ ప్రకారం 2022 నాటికి 113 ప్రధాన దేశాలలో భారత్‌ 68వ స్థానం పొందగా 2024 నాటికి, అంటే రెండేళ్ల తర్వాత 127 ప్రధాన దేశాలలో 105వ స్థానానికి దిగజారింది. దేశ జనాభాలో ఆకలితో బాధపడుతున్న వారిసంఖ్య 22 కోట్లుగా అంచనా వేస్తుండగా, అందులో అధిక శాతం మంది వ్యవసాయం వృత్తిగా చేసుకొన్న రైతులు, రైతు కూలీల కుటుంబాల వారే. దేశ జనాభాకు తిండిగింజల్ని పండిస్తున్న రైతాంగమే కడుపు నిండా తిండికి నోచుకోకపోవడం అన్నది జీర్ణించుకోలేని చేదు వాస్తవం. ఇతర రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగంలో ఆదాయాలు పెరగడం లేదు. జాతీయ శాంపుల్‌ సర్వే ప్రకారం 1960–2020 మధ్య వ్యవసాయ రంగంలో నికరా దాయం 4 రెట్లు మాత్రమే పెరిగింది. 

ఇదే సమయంలో పారిశ్రామిక నికరాదాయం 75 రెట్లు పెరిగింది. 2004లో ఒక వ్యవసాయ రంగ శ్రామికుడి ఉత్పాదకత రూ. 11,964 ఉండగా, పారిశ్రామిక రంగ కార్మికుడి ఉత్పాదకత రూ. 66,323గా ఉన్నట్లు తేలింది. అంటే ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు వ్యవసాయదారుల కంటే ఎక్కువ ఆదాయం వస్తోందన్నమాట! ఈ కారణంగానే కార్మికులు, కూలీలు వ్యవసాయ రంగాన్ని వీడి పెద్ద సంఖ్యలో ఇతర రంగాల వైపు మళ్లుతున్నారు. ప్రతీ ఏటా సాగు ఖర్చులు నిరంతరంగా పెరుగు తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటేటా 14 ప్రధాన పంటలకు కొంతమేర కనీస మద్దతు ధరల్ని పెంచుతున్న మాట నిజమే గానీ, ఆ పెరిగే మొత్తం రైతు కుటుంబ, సాగు ఖర్చులను పూడ్చలేక పోతున్నాయి. 

హరిత విప్లవం స్ఫూర్తిగా...
దేశంలో 1950 దశకం చివర్లో వచ్చిన ‘హరితవిప్లవం’ కారణంగా వ్యవసాయోత్పత్తులు గణనీయంగా పెరిగాయి. హరిత విప్లవం నాటి  సమయంలో దేశంలోని పలు రాష్ట్రాలు వ్యవసాయ, భూ సంస్కరణలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశాయి. అధిక దిగుబడి సామర్థ్యం గల వంగడాలను ప్రవేశపెట్టాయి. బంజరు భూములు సాగులోకి వచ్చాయి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువుల ఉపయోగం మొదలైంది. యంత్రాల వినియోగం కూడా రావడంతో సకాలంలో వ్యవసాయ పనులు పూర్తికావడం సాధ్యమైంది. గోధుమ, వరి, నూనె గింజలు, పప్పు ధాన్యాలు పుష్కలంగా పండి వాటి ఉత్పత్తి సాలీనా 7 శాతం చొప్పున పెరిగింది. దాంతో, ప్రజల అవసరాలకు పోను కొంతమేర ఎగుమతులు చేసే స్థాయికి దేశం చేరింది. 

ఇప్పుడు దేశంలో సాగు భూములు క్రమంగా కుంచించుకు పోతున్నాయి. వ్యవ సాయ యోగ్యమైన భూముల్ని పారిశ్రామిక వాడలుగా, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మార్చేయటం గత దశాబ్దకాలంగా ఎక్కువైంది. హరిత విప్లవమే కాదు... 1980–90 మధ్యకాలంలో పాల ఉత్పత్తిని పెంచడానికి పలు చర్యలు చేపట్టి శ్వేత విప్లవాన్ని సాధ్యం చేశారు. చేపలు, రొయ్యల ఉత్పత్తుల తలసరి లభ్యతను పెంచి నీలి విప్లవాన్నీ, అలాగే నూనెగింజల ఉత్పత్తిలో అనూహ్య వృద్ధిని సాధించి ‘బ్రౌన్‌ రివల్యూషన్‌ను సాధించిన ఘనత మనది. అయితే ‘అన్నపు రాశులు ఒకచోట.. ఆకలి దప్పులు మరొక చోట’ అన్నట్లుగా తలసరి ఆహార ధాన్యాల లభ్యత పెరిగినప్పటికీ దేశాన్ని ఆకలి రహిత భారత్‌గా తీర్చిదిద్దలేక పోవడం లోపమే!

ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలంటే ఏడాది పొడవునా వారికి ఉపాధి, మెరుగైన ఆదాయం లభించాలి. అరకొరగా తీసుకొనే ఆహారంలో తగినన్ని పోషకాలు లేకపోవడంతో వారు అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఆహార భద్రతకు తోడుగా పోషకాహార భద్రత కల్పించాలంటే, ప్రజల ఆహార అలవాట్లను మార్చాలి. ఇటీవలి కాలంలో పాతకాలపు ఆహారపు అలవాట్లకు మెజారిటీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. అంటే, వరి అన్నానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన, జొన్న, సజ్జ, రాగులు, ఊదలు, కొర్రలు వంటివాటిని ఎక్కువగా తీసుకొంటున్నారు. అందుకే ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలతో పాటు చిరు ధాన్యాలను కూడా తెల్ల రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేయాలి.

ప్రజలందరికీ ఆహార భద్రత చేకూరాలంటే ముందుగా రైతులకు ఆదాయ భద్రత  కలగాలి. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది గానీ అది ఆచరణలో అరకొరగానే అమలు జరుగుతోంది. రైతుల ఆదాయం పెరగాలంటే వ్యవసాయరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలు, గిడ్డంగుల సౌకర్యం మెరుగుపడాలి. వ్యవసాయ దిగుమతులు తగ్గాలి. సాగు వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి. ఆహార భద్రత అనే అంశం రైతాంగం ఆదాయ భద్రతతో ముడిపడి ఉందనే వాస్తవాన్ని గ్రహించనంత వరకూ, ఆ దిశగా చర్యలు చేపట్టనంత వరకూ అందరికీ ఆహార భద్రత అన్నది ఓ ఎండమావిగానే మిగిలిపోతుంది.


డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త మాజీ కేంద్ర మంత్రి, శాసన మండలి సభ్యులు

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)