Breaking News

ప్రత్యామ్నాయ సాగుకు బ్రాండ్‌ అంబాసిడర్‌

Published on Sun, 03/26/2023 - 02:24

పీవీ సతీశ్‌ 1987లో రిలయన్స్ కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌. తన మిత్రులతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామీణ, నిరక్షరాస్య, దళిత మహిళల చేత కెమెరా పట్టించి క్రికెట్‌ మ్యాచ్‌లకు ఏమాత్రం తీసిపోని అంతర్జాతీయ పురస్కారాలు పొందే విధంగా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు.

చిరు ధాన్యాల గురించి 30 ఏళ్ల ముందు మాట్లాడినప్పుడు అందరూ వెర్రివాడని అనుకున్నా, పట్టుబట్టి వాటిని పండించడమే కాక, ఏకంగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను అందించే హోటల్‌ను ప్రారంభించిన ఆయన ధైర్యాన్ని మెచ్చు కోకుండా ఉండలేము. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రపంచం అంతా జరుపుకొంటున్న ఈ 2023 సంవ త్సరంలోనే సతీశ్‌ అసువులు బాయడం కాకతాళీయం. 

వ్యవసాయం, జీవ వైవిధ్యం, సంప్రదాయ పద్ధతులు, విత్తనాలు, మెట్ట వ్యవసాయం – ఇలా ఆయన స్పృశించని అంశమే కనపడదు. 25 ఏళ్ళ ముందు జీవవైవిధ్య జాతరలు మొదలు పెట్టి గ్రామాల్లో వాటి ఆవశ్యకతను అందరికీ తెలి సేలా చేస్తూ, వాటిలో గ్రామస్థుల భాగస్వామ్యం సాధించాడు. ప్రత్యామ్నాయ రేషన్‌ షాప్‌ అన్న కలను సాకారం చెయ్యడం కోసం గ్రామాలలో పడావుగా ఉన్న భూములలో జొన్నలను పండించి, గ్రామీణ రైతు కూలీలకు పని కల్పించి, పండిన జొన్నలను సేకరించి, తిరిగి గ్రామాలలోనే పేదవారికి తక్కువ ధరకు అందించడం అనే మహత్తరమైన కార్యక్రమాన్ని దిగ్వి జయంగా నిర్వహించాడు. 

జహీరాబాద్‌ ప్రాంతంలో రబీలో కేవలం మంచుకే పండే పంటలను ‘సత్యం’ పంటలుగా ప్రాచుర్యానికి తెచ్చి, వాటి పోషక విలువలను అందరికీ తెలియచేశాడు. అందరూ గడ్డి మొక్కలుగా తీసిపారేసే వాటిని ‘అన్‌కల్టివేటెడ్‌ ఫుడ్స్‌’ (సాగు చేయని ఆహారాలు)గా ప్రాచుర్యంలోకి తెచ్చాడు.

‘ఎకనామిక్స్‌ ఆఫ్‌ ఎకొలాజికల్‌ అగ్రికల్చర్‌’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంటలను పండించే రైతుల అనుభవాలను క్రమబద్ధంగా డాక్యుమెంట్‌ చెయ్యడం ద్వారా వారికి ఎటువంటి సహాయం అందాలో అక్షరబద్ధం చేశాడు. కమ్యూనిటీ మీడియా ట్రస్టును ఏర్పాటు చేసి గ్రామీణ, దళిత మహిళల చేత వీడియో డాక్యు మెంట్‌లను తీయించడమేకాక, అంతర్జాతీయ వేదికలలో ఈక్వేటర్‌ ప్రైజ్‌ సాధించే స్థాయిలో వారిని నిలబెట్టాడు.

దేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నెల కొల్పడం, కేవలం 10వ తరగతి చదివిన ఇద్దరు అమ్మాయి లతో దాన్ని నడపడం ఆషామాషీ కాదు. విత్తన బ్యాంక్‌ ద్వారా దాదాపు 75 గ్రామాలలో విత్తనాలను సకాలంలో అందే ఏర్పాటు చేసి మంచి పంటలు పండించుకునేలా చెయ్యడం చిన్న విషయం కాదు.

బడి మానేసిన పిల్లల కోసం ‘పచ్చ సాల’ ఏర్పాటు చేసి, దానిలో పదవ తరగతి పూర్తి చేసేలోపు కనీసం ఆరు రకాల లైఫ్‌ స్కిల్స్‌లో ప్రావీణ్యం సంపాదించేలా వాళ్లకు తర్ఫీదు ఇప్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు బతికే ధైర్యం కల్పించడంలో ఆయన పాత్ర కీలకం. పీజీఎస్‌ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం) వంటి ఒక ప్రత్యామ్నాయ సర్టిఫికేషన్‌ పద్ధ తిని మన దేశంలో తీసుకువచ్చి అమలు చేయడం, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సొసైటీలో వ్యవస్థాపక పాత్ర అనేవి చిన్న విజ యాలు కాదు. 

జన్యుమార్పిడి పంటలపై అలుపెరగని పోరాటం చెయ్యడం ఆయన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనికోసం ప్రత్యేకంగా సౌత్‌ ఎగైనెస్ట్‌ జెనెటిక్‌ ఇంజి నీరింగ్‌ అనే వేదికను ఏర్పాటు చేసి, చాలా దేశాలలోని స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిమీదకు తెచ్చి, అసత్య ప్రచారం చేస్తున్న కంపెనీల మాయాజాలాన్ని రుజువులతో సహా ఎండ గట్టి కొన్ని రకాలపై నిషేధం విధించే స్థాయి పోరాటం నెరిపాడు.

మిల్లెట్స్‌ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టి, దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో చిరుధాన్యాల మీద చర్చా వేది కలు ఏర్పాటు చేసి వినియోగదారులకు చైతన్యం కలిగించే పనిని నెత్తికెత్తుకుని ప్రపంచం దృష్టిని మిల్లెట్స్‌ వైపు మరల్చారు.ఇన్ని వైవిధ్యభరితమైన పనులతో నిమిషం తీరిక లేని జీవితం గడిపిన సతీశ్‌ మన వ్యవసాయ రంగం గురించి కన్న కలలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయి. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులకే ఒక బ్రాండ్‌గా నిలిచారు సతీశ్‌. ఆయన ప్రస్థానంలో నాకూ భాగం కల్పించిన ఆ ప్రియ మిత్రుడికి అశ్రు నివాళి.

సక్ఖరి కిరణ్‌ 
వ్యాసకర్త ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, వికాస స్వచ్ఛంద సంస్థ

Videos

గిరిజనుల రక్తం తాగుతున్న జనసేన ఎమ్మెల్యే

రోహిత్‌ను నిండా ముంచిన గిల్

సుడిగుండంలో కొట్టుకుపోతారు కూటమికి CPI రామకృష్ణ మాస్ వార్నింగ్

జగన్ ను దెబ్బ తీయాలనే బాబు చిల్లర రాజకీయాలు

భవిష్యత్తులో అమెరికాకు ప్రయాణంపై శాశ్వత నిషేధం

Low Class Politics: దావోస్ లో ఇమేజ్ డ్యామేజ్

బీసీసీఐ భారీ మోసం! RCBపైనే విరాట్ భారం

పాలసీల ముసుగులో స్కాములు.. స్కీములు

హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

Sailajanath: లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే

Photos

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)

+5

#MissWorld2025 : పిల్లలమర్రిలో అందగత్తెల సందడి (ఫొటోలు)

+5

ముంబై వాంఖడేలో రో‘హిట్‌’ శర్మ స్టాండ్‌.. ఆనందంలో ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'బకాసుర రెస్టారెంట్' మూవీ ట్రైలర్‌ విడుదల వేడుక (ఫొటోలు)

+5

శ్రీవిష్ణు ‘#సింగిల్’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అందాల భామలు (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌: 13 ఏళ్లకే హీరోయిన్.. ఛార్మి జీవితాన్ని మార్చేసిన సినిమా ఏదంటే?

+5

ఈ తప్పులు చేస్తే EPF క్లెయిమ్‌ రిజెక్టే.. (ఫొటోలు)

+5

Miss World 2025 : ఎకో పార్క్ కు ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)