Breaking News

బొంగరపు ఆట నేర్పే జీవిత‌ సత్యాలు!

Published on Mon, 06/08/2026 - 14:12

బొంగరం ఒక ఆసక్తికరమైన ఆట వస్తువు. దాని ఆకారం, నిర్మాణం విలక్షణంగా ఉంటాయి. ముల్లు చుట్టూ తాడు చుట్టి నేలమీదకు గిరాటేస్తే అది తిరిగే తీరు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు జీవిత తత్త్వాన్ని కూడా తెలియజేస్తుంది. మనిషి కూడా ఎవరో విసిరిన బొంగరం లాంటివాడే. ఎవరు విసిరారో తెలియకపోయినా, తనప్రమేయం లేకుండా జీవితమంతా గిరగిరా తిరుగుతూ, ఆగాలన్నా ఆగలేక, ఆగాలనుకున్నప్పుడు ఆగలేక, తిరిగి, తిరిగి చతికిలపడతాడు. ఆటగాడు లేపి తీసుకుపోతాడు.

తాడు చుట్టే తీరులోనే బొంగరం తిప్పే విద్య అంతా ఉంది; బిగుతుగా వేస్తే సరిగ్గా తిరుగుతుంది, వదులుగా వేస్తే పడిపోతుంది. ఒక్క పొర వదులైనా బొంగరం తూలుతుంది. విసిరే క్షణంలో మూడు పనులు ఒకేసారి జరగాలి– కింద విసరడం, తాడు లాగడం, చేయి వదలడం. ఆ మూడూ సరిగ్గా కుదిరితేనే బొంగరం సరిగ్గా నేలను తాకి తిరుగుతుంది.

కొంతమంది నిపుణులు బొంగరాన్ని అరచేతిలో వేసి తిప్పుతారు. బొంగరాలాట బాగా ఆడేవారు మేధావులు కాదు. వాళ్లెవరికీ బొంగరం తిరగడం వెనక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలూ తెలియవు. ఆ మాటకొస్తే బొంగరానికి కూడా తెలియవు! కొన్ని నైపుణ్యాలు కొంతమందికి సహజంగా వస్తాయి. సొంతంగా తయారుచేసుకున్న చిన్న సంగీత పరికరంలో సప్తస్వరాలు మధురంగా పలికిస్తూ, మనోజ్ఞంగా శ్రుతిశుభగంగా పాడే రోడ్డుపక్క విద్వాంసులకి ఎవరు నేర్పుతారు? ఏళ్లతరబడి శ్రమతో, ఖర్చుతో కూడిన సాధన చేసినవారికి కూడా అబ్బని స్వర, లయాది ఙ్ఞానం పుట్టుకతో వచ్చిన విద్య వీళ్ళది. పూర్వజన్మలు, పునర్జన్మలు నమ్మేవారి భాషలో పూర్వజన్మ సుకృతం.

కదలిక జీవితం– ఆగితే పతనం
బొంగరం చూడటానికి సరళంగా కనిపిస్తుంది; కలపతో చేసిన శంఖాకార శరీరం, కింద ఇనుప ముల్లు. కానీ ఆ ఆకారంలో చాలా లెక్క ఉంది. పైభాగం భారంగా ఉంటుంది. అది తిరిగే శక్తిని నిల్వ చేస్తుంది. కింది ముల్లు సన్నగా, గట్టిగా ఉంటుంది. మందగించినప్పుడు ఆటగాడు కొంచెం పదును పెడతాడు. ఎంత పదునుగా ఉండాలో, ఎంత మందంగా ఉండాలో అంతే ఉండాలి. అది శాస్త్ర ప్రమాణం.

ముల్లు కొన మీదనే బొంగరం యావత్తు శరీరభారం నిలబడుతుంది. ఒక చిన్న బిందువు మీద విశ్వసంతులనం. ఇది కేవలం భౌతికశాస్త్రం కాదు. ఇది ఒక తత్త్వం. మనిషి జీవితంలో కూడా ఒక కేంద్రబిందువు ఉంటే చాలు, యావత్తు జీవన భారం మోయవచ్చు, ప్రపంచంలో తిరుగుతూ మనుగడ సాగించవచ్చు. పదునైన మెదడుతో జీవితాన్ని తీవ్రంగా తీసుకునేవారు, సన్నటి పదునైన ముల్లు ఉండే బొంగరంలాగే, ప్రపంచంలో ఎక్కువ సేపు తిరుగుతూ జీవితంలో కొట్టుమిట్టాడుతారు. జీవితాన్ని వచ్చినది వచ్చినట్టు స్వీకరించే సామాన్యులు మాత్రం మొద్దు ముల్లు ఉండే బొంగరంలాగా పరిమితంగా తిరిగి నిశ్శబ్దంగా ఆగిపోతారు.

తాడు లాగే వేగమే బొంగరానికి శక్తి. విసిరే కోణమే దానికి దిశ. కానీ అన్నింటికంటే ముఖ్యమైనది తాడు విసిరిన తర్వాత వదిలేయాలి. అది తన దారిన తాను తిరుగుతుంది. భగవద్గీత చెప్పిన కర్మసిద్ధాంతం ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది. సరైన ప్రయత్నానికి కోణం, బలం, విడుపు మూడూ సమానంగా కావాలి.

బొంగరం వేగంగా తిరిగేటప్పుడు పడిపోదు. వేగం దానికి రక్ష. తిరిగే వేగం ఎక్కువగా ఉన్నప్పుడు బొంగరం ఏ వైపు నుండి వచ్చే శక్తినైనా తట్టుకుంటుంది. వేగం తగ్గినప్పుడే గురుత్వాకర్షణ, రాపిడి, గాలి నిరోధం వంటి బయట శక్తులు బొంగరం తిరిగే సామర్థ్యం మీద వ్యతిరేకంగా పని చేయగలుగుతాయి.  

వేగంగా తిరిగే బొంగరం (Bongaram) మధ్యలో స్థిరంగా కనిపిస్తుంది. బయటంతా కదలిక, లోపల నిశ్శబ్దం. స్టోయిక్‌ తత్త్వజ్ఞానులు చెప్పే ‘ఇన్నర్‌ సిటడెల్‌’ తత్త్వం ఇదే. పడిపోయే బొంగరం గిలగిల్లాడుతూ, గిరగిర తిరుగుతూ చివరి శ్వాస తీసుకున్నట్టు ఆడుతుంది. జీవితపు చివరి దశలో మనిషి కూడా ఇలానే ప్రవర్తిస్తాడు. కదలికలో ఉన్నప్పుడే సంతులనం ఉంటుంది. స్తబ్ధత పతనానికి మొదలు. ‘చల్తీ కా నామ్‌ గాడీ’ అని కదా హిందీలో మాట!

బొంగరాలాట మానవజాతి ఉమ్మడి వారసత్వం. పేర్లు మారతాయి, తత్త్వం మారదు. తెలుగులో బొంగరం, హిందీలో లట్టూ (Lattu), తమిళంలో బంబరం, ఇలా వేర్వేరు పేర్లతో బొంగరం ప్రపంచంలో ఇంకా తిరుగుతోనే ఉంది. అన్ని వస్తువులలాగే ఇప్పుడు రూపాంతరం చెంది అమెజాన్లో దొరుకుతోంది.

చ‌ద‌వండి: బీబీఏ కంటే పునాది ముఖ్యం.. ఐఐఎమ్‌ బెంగళూరు పాఠం

ఈనాటి యువకులు బాల్యంలో నేర్చుకోవలసిన ఆట బొంగరాలాట. బొంగరం ఇప్పుడు భారతదేశపు వీధుల్లో కనిపించదు. తాడు చుట్టే ఓర్పు, విసిరే ధైర్యం, వదిలే నైపుణ్యం కాలం చెల్లిన విద్యలు కావు. అవి జీవిత విద్యలు. నిర్మాణంలో సమతుల్యత, ప్రయత్నంలో గాఢత, ఫలితం మీద నిర్లిప్తత, వేగంలో స్థిరత్వం, క్షీణతలో స్థితప్రజ్ఞత బొంగరం నేర్పే సత్యాలు!

- డాక్ట‌ర్‌ కొవ్వలి గోపాలకృష్ణ 
అమెరికాలో ఆంకాలజీ డ్రగ్‌ డెవలప్‌మెంట్‌ లీడ్‌ సైంటిస్ట్‌ 

#

Tags : 1

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)