కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
తరాలు మారినా తరగని ఆదరణ
Published on Tue, 03/31/2026 - 08:39
ఉదయం లేచాక అల్పాహారం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ.. నూనె లేకుండా తయారయ్యే ఈ వంటకం అల్పాహారాల్లో ముందు వరుసలో ఉంటుంది. చిన్నారులు, వృద్ధులకు సైతం సులభంగా జీర్ణమయ్యే దీనిని తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా దక్షిణ భారత దేశ ప్రజలకు ఇదే ప్రధాన అల్పాహారం. వైద్యులు సైతం దీనిని పోషకాహారంగా చెబుతుంటారు. ఇవన్నీ తెలిసినవే.. ఇప్పుడిదంతా ఎందుకు? అంటే.. ఇడ్లీ గురించిన కొన్ని విశేషాలు..
‘హెవీగా ఏం వద్దు.. జస్ట్ ప్లేట్ ఇడ్లీ ఉంటే చాలు.. పొద్దున్నే గారెలు, వడలు.. మనకి కష్టం గానీ.. నాలుగు ఇడ్లీ అయితే.. లైట్‌గా ఉంటుంది..’ ఇలాంటి మాటలు చాలా మంది నోటి నుంచి వింటూనే ఉంటాం. ఇడ్లీ అంటే మనకంత క్రేజ్ మరి. ఇంటర్నేషనల్ రుచులు ఎన్ని పరిచయమైనా.. ఇండియాలో ఇడ్లీ అంటే ఇప్పటికీ ఇంటి వంటకమే. ఇటీవల నగరవాసులు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్‌పై పలు ఫుడ్ డెలివరీ యాప్స్ చేసిన అధ్యయనంలోనూ ఇడ్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది.
నేపథ్యం ఇదీ..
కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఈ వంటకం ఇండోనేషియాలో పుట్టి భారతదేశానికి వచ్చింది. శతాబ్దాల చరిత్ర కలిగి ప్రసిద్ధ దక్షిణ భారత ఆవిరి వంటకంగా నిలిచిన ఇడ్లీని గౌరవించటానికి, ప్రతి సంవత్సరం మార్చి 30న ప్రపంచ ఇడ్లీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం 2015లో ప్రారంభమైంది. దీనిని చెన్నైకి చెందిన ఓ ప్రముఖ క్యాటరర్ ఎం.ఎనియవన్ ప్రారంభించారు. 2015 మార్చి 30న 1,328 రకాల ఇడ్లీలను సృష్టించి ఇడ్లీ మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. దీంతో పాటే వరల్డ్ ఇడ్లీ డేకి గుర్తింపు తెచ్చారు. 2022లో రెండు వేల రకాలను చేసి మతిపోగొట్టారు. అంతేకాదు 125 కేజీల బరువున్న ఇడ్లీతో గిన్నిస్ రికార్డుకెక్కాడు.
నగరంలో ఇడ్లీ ప్రియులు..
ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్స్ నిర్వహించిన ఓ అధ్యయనంలో పోషక విలువలు అధికంగా అందించేదిగా ఈ అల్పాహారాన్ని అత్యధికులు అభిమానించే, ఎక్కువగా ఆర్డర్ చేసే అల్పాహారంగా నిలిచింది.. ఇడ్లీ వినియోగంలో దక్షిణాది నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నైతో పాటు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని తేలింది. దీని వ్యక్తిగత వినియోగంలో హైదరాబాద్‌కు చెందిన ఒక వినియోగదారుడు ఒక సంవత్సరంలో కేవలం ఇడ్లీ కోసం రూ.7.3 లక్షలు ఖర్చు చేయడం ద్వారా రికార్డ్ సృష్టించారు.
పొడి పొడిగా..
నగరంలో లభించే ఇడ్లీలు తమిళనాడు స్టైల్ కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. పిండిని బియ్యానికి బదులు ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. ఇది వాటికి ప్రత్యేకమైన ఆకృతి ఇస్తుంది. నగరవ్యాప్తంగా అవుట్‌లెట్స్ ఉన్న వరలక్ష్మి టిఫిన్స్, తాజా కిచెన్, మాదాపూర్‌లోని నన్నయ్య, బాబాయ్ హోటల్ వంటివి ఈ పొడి ఇడ్లీలకు పేరొందాయి.
ఎన్నెన్నో వెరైటీలు..
ఇడ్లీని కాలానికి తగ్గట్టుగా.. ప్రతి ఒక్కరికీ ప్రియమైన ఆహారంగా మార్చడంలోనూ అనేక మంది ప్రయత్నాలు ఫలించాయి. ఇందులో నెయ్యి, పొడి ఇడ్లీ, రవ్వ, కాంచీపురం, చిట్టి ఇడ్లీ వంటివి గత కొంత కాలంగా ప్రసిద్ధ రకాలు. కాగా ఇటీవల మరింతగా పెరిగిన ఆరోగ్య స్పృహతో రాగి ఇడ్లీ, మిల్లెట్ ఇడ్లీ.. వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇడ్లీకి జతగా సాంబార్ కొబ్బరి చట్నీ, కారం పొడి.. వంటివి అదిరిపోయే కాంబినేషన్‌గా అల్పాహార ప్రియులు వరి్ణస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని బెస్ట్ ఇడ్లీ ప్లేసెస్ విశేషాలివీ..
నేతితో నేర్పుగా..
నగరంలో బాగా పేరొందినవి ఘీ ఇడ్లీ. వేరుశెనగలు, మినపపప్పు, శనగపప్పు వంటి పప్పుధాన్యాలు, వెల్లుల్లి, ఎండు మిరపకాయల ముతక మిశ్రమమైన పొడిని, ఆవిరి మీద ఉడికించిన ఇడ్లీల మీద దట్టంగా పూసి, దానిపై నెయ్యిని చిలకరిస్తారు. కొన్ని చోట్ల తాజాగా తీసిన వెన్నను కొద్దిగా కలుపుతారు, జూబ్లీహిల్స్‌లోని సదరన్ స్పైస్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపంలోని కేఫ్ కాడలే, నగరంలో పలు చోట్ల ఉన్న పంచకట్టు దోస ఔట్‌లెట్‌లు, మాదాపూర్ కొంపల్లిలోని కాంచి కేఫ్.. వంటి ప్రదేశాల్లో ఇది ఫేమస్.
మినీ కోసం మెనీ..
సాంబార్‌లో ముంచిన మినీ ఇడ్లీలు/ కారంగా ఉండే పిస్తా పొడిలో వేయించినవి సిటీలో బాగా ఫేమస్. ఇవి దాదాపు ఫింగర్ ఫుడ్ లాగా ఉన్నా, దేశీ స్టైల్‌లో ఉంటాయి. ఈ రకం ఇడ్లీలు జూబ్లీహిల్స్‌లోని కాఫీ సంగం వంటి చోట్ల ఆదరణ పొందుతున్నాయి.
కర్రీ కూరి..
మెత్తటి ఇడ్లీలను చిక్కటి గ్రేవీలతో మేళవిస్తారు. ఇడ్లీలు ఆ గ్రేవీని పూర్తిగా పీల్చుకుని, సాధారణంగా తేలికపాటి టిఫిన్‌గా ఉండేదాన్ని కడుపు నింపే భోజనంగా మారుస్తాయి. బ్రేక్ ఫాస్ట్ లంచ్ మేళవించే బ్రంచ్ లవర్స్‌కు ఇవి బెస్ట్. కూరలతో ఇడ్లీ తినడం ఒక విభిన్నమైన అనుభూతి. చికెన్ కర్రీ ఇడ్లీ, పాయా షోర్బా ఇడ్లీ, మటన్ ఇడ్లీ సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి ఇడ్లీ రుచి చూడాలంటే.. కూకట్‌పల్లిలోని చిత్తూరు నాయుడు రెస్టారెంట్ వంటి ప్రదేశాల్లో లభిస్తాయి.
Tags : 1