నువ్వు ఏడ్చే రోజు దగ్గర్లోనే ఉంది.. ABN రాధాకృష్ణను ఏకిపారేసిన నాగార్జున యాదవ్
Breaking News
ఈ వారం కథ: మరణం కంటే భయంకరం ఏమిటో తెలుసా?
Published on Sun, 04/05/2026 - 09:50
దబ్బుమని చప్పుడు వచ్చింది. కొంచెం పెద్దదే. అందరికీ వినపడగలిగేంత పెద్దది. దాని వెంబడి ఒక మూలుగు, ఆర్తనాదం వంటిది. అది కొందరికైనా వినపడే అవకాశం తక్కువ. పద్దెనిమిది ఫ్లోర్ల వంతునున్న రెండు టవర్లు. ఫ్లోరుకు రెండు వంతున మూడు పడగ్గదుల ఇళ్లు. పైచివరి అంతస్తులో పొందికైన పెంట్ హవుసులు చెరొకటి. వెంటిలేషన్ కోసం అన్నట్టుగా రెండు టవర్ల మధ్య ఖాళీ సందు. చుట్టూతా వాహనం తిరగగలిగేపాటి బాట. ఓపాటి గార్డెన్ లాంటి ఏర్పాటు. లోపలకు బయటకు కూడా చూడగలిగేలా సీసీ కెమెరాలను పొదువుకున్న ఎత్తయిన ప్రహరీగోడ. దాని నెత్తిన శిరోభూషణంలాగా ఎలక్ట్రిక్ కంచె. మూడు షిఫ్టుల్లో అప్రమత్తంగా కాపలా ఉండే గార్డుల ఏర్పాటుతో ప్రధాన గేటు. అది ఒక చిన్న కమ్యూనిటీ.
మొత్తానికి అక్కడే ఎక్కడో వచ్చింది చప్పుడు.పక్కనున్న ఖాళీ నేలలో బోరు డ్రిల్లింగ్ జరగడం లేదు. ఆకాశం ఉరమడం లేదు. జోరు వాన హోరు లేదు. ఆలయాలూ ప్రార్థనస్థలాల మైకుసెట్లు గొంతెత్తిన పాటలూ పిలుపులూ గాలిసవారీ చేయడం లేదు. పంచభూతాతీతమైన ఎటువంటి శబ్దోపద్రవాలూ ఆ సమయానికి అక్కడ లేవు. అలాగని, ఆ ప్రాంతమంతా నిర్జనంగా ఉందని కాదు– కిక్కిరించని జనసందోహం చెదురుమదురుగా ఒంటరి ఒంటరిగా పరచుకుని ఉన్నారు. పరివేష్టించిన జాగా ట్రాకుగా మార్నింగ్ వాకులు చేస్తున్నారు, పచ్చిక మేటలే మ్యాటుగా దేహాన్ని వంగదీస్తూ, సాగదీస్తూ యోగాది కసరత్తుల్లో మునిగి ఉన్నారు, ఒకరో ఇద్దరో సిమెంటు బెంచీలమీద ప్రాణాల్ని కుదేసి మాటలాడుకుంటున్నారు.
కానీ ఆ చప్పుడు ఎవరికీ వినపడలేదు. అలాగని, బధిరులు కాదు, చెవులు దిబ్బెడలు వేయలేదు– అయినా ఎవరూ ఆ చప్పుడు వినలేదు. మరేం చేస్తున్నారు? మెజారిటీ చెవులు వాంఛిత కర్ణభూషణాలతో అలరారుతున్నాయి. ఫోను సంభాషణాలూ, సంగీతమూ, పాటలూ ఆ చెవుల్లోకి ప్రవహిస్తున్నాయి. కొందరి చెవుల్లోకి పక్కనున్నవాడి నోర్లు ప్రవహిస్తున్నాయి. ఆ నోర్లలోకి, ఆ ఇద్దరి సమక్షంలో లేని ఇంకొకరి ప్రెవేటు వ్యవహారాలన్నీ జలలాగా ఊరుతున్నాయి. ఏ ప్రవాహాలూ లేని చెవులు, నిష్క్రియగా పరధ్యానంలో ఉన్నాయి. ఎ..వ్వ..రూ ఆ చప్పుడు వినలేదు. క్షణాలూ నిమిషాలు కాదు, అరగంట గడిచిపోయింది.
మైలో: నేను నిద్రలేచినంత మాత్రాన నా దినచర్య మొదలు కాదు. నా యజమాని కూడా లేవాల్సిందే. విశ్వాసం అనే పదాన్ని ముద్దర కొట్టి వదిలేసిన పరాధీన బతుకు. నా పేరు మైలో. కుక్కని. రాట్‌వీలర్ జాతి నాది. పేరును బట్టి నేను సోల్జర్ని. నన్ను పెంచుకునే అదృష్టాన్ని పొందిన వాడి పేరు రాజేంద్ర. అవును మరి.. అదృష్టం వాడిదే. వాడి మిత్రుల్ని, చుట్టాల్ని పోగేసినప్పుడెల్లా.. నన్ను వాడి హోదాకు ఒక చిహ్నంలాగా ప్రదర్శిస్తాడు. ‘మీ కుక్క భలే ఉంది గురూ’ అంటారు. నా జాతిలో ఏ కుక్కయినా ఒకలాగే ఉంటుంది. నా జాతికుక్కలు మాత్రమే ఎరిగిన వాడికి, బహుశా ఇక్కడి వీధుల్లో ఊరకుక్క ‘భలే’ అనే ఫీలింగిస్తుందేమో. ‘నువ్వు సూపర్ గురూ’ అంటారు రాజేంద్రని.
నాలాగా నేను ఉండడంలో, వాడి సూపర్ ఏమిటో నాకు అర్థం కాదు! సరే, విషయానికి వస్తాను. నేను లేచి అరగంటైంది. వాడింకా లేవలేదు. బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాలి. నేను వెళ్లి, రాగలను. కానీ వాడు నన్ను ఒంటరిగా వెళ్లనివ్వడు. తలుపుకు గొళ్లెమే అయితే తీసుకుని వెళ్లేదాన్నేమో.. తాళమూ వేస్తాడు. అందమైన గొలుసు చేతిలో పట్టుకుని నా వెంట నడవడం వాడికి మజా. ఏసీ పడగ్గదిలో సుఖంగానే ఉన్నదిగానీ, దేహం తొందరపెడుతోంది. వాడి పడకమీదికి చేరి, ప్రేమగా చేత్తో నిమిరాను, మెలకువలోకి వచ్చి నన్ను వాటేసుకుని గిలిగింతలు పెట్టాడు. నేను గారాలు పోయాను! మొత్తానికి ట్రాక్ సూటు తొడిగి తయారై నా వెంట వచ్చాడు.
ముందు బయటకు తీసుకెళ్లాడు. అవసరం తీర్చుకున్నాను. తిరిగొచ్చాక, రెండు టవర్లను ప్రదక్షిణం చేసినట్టుగా నాలుగు రౌండ్లు తిరిగాం. ఇంకో రౌండు తిరిగితే ఇంట్లోకి తీసుకెళ్లిపోతాడు. కానీ నా కుక్క బుద్ధికి ఏదో తేడా కొడుతోంది. కొంచెం గింజుకున్నాను. నడవకుండా మొరాయించాను. అటుకేసి గొలుసును ఈడ్వడానికి ప్రయత్నించాను. రాజేంద్రకు ఏదో అనిపించింది. అటువైపు ఆడకుక్క ఉందేమో అనుకున్నాడు. ‘యూ నాటీ బోయ్’ అంటూ చిలిపితనం ప్రదర్శిస్తూ వంగి నా మెడపట్టీ దగ్గరున్న క్లిప్ వదిలేశాడు. ఉరికాను. రెండు టవర్ల మధ్య, సన్నని ఇరుకైన చీకటి గుయ్యారం వంటి ఆ సందులోకి. ఫ్లాట్లలో వెంటిలేషన్ కోసం అని ఆ ఖాళీ వదిలారు గానీ, గ్రౌండ్ లెవెల్లో మసగ్గానే ఉంటుందక్కడ.
అనుకున్నదానికంటె ఘోరంగా ఉంది. అరమీటరు మందాన కాస్త కుంకుమరంగు ఎరుపుతో పరచుకుని ఉంది. దగ్గరికెళ్లి చూద్దునుకదా.. తల పగిలే ఉంది. మొహానికి దగ్గరగా నా తల నిక్కించి వాసన చూశాను, శ్వాస లేదు. ఎడమకాలిని చాచి చిక్కబడుతున్న ఎరుపుని తడిమాను. జిగటగా తగిలింది. ఇంకా ఎక్కువసేపు స్టడీ చేయాల్సిందేమీ లేదు. కన్ఫర్మ్. ఒక్క పరుగున తిరిగి వెళ్లేసరికి.. ‘అప్పుడే వచ్చేశావా మైబోయ్’ అంటూ రాజేంద్ర గొలుసు క్లిప్ అందుకున్నాడు. తగిలించబోతే వెనక్కు తగ్గి రుంజుకున్నాను. అరుస్తూ, ఆ సందుకేసి గెంతి, ఆగి, రెండుసార్లు అరచి, మళ్లీ రాజేంద్ర కాళ్ల దగ్గరకు వచ్చి, సందు దిక్కుగా తిరిగి తోకాడిస్తూ నిల్చున్నాను. వాడు గ్రహించాడు. గొలుసు తగిలించకుండానే, నా వెనుక వచ్చాడు. చూసిన వాడికి విషయం అర్థమైంది. నేను అరవకుండా తోకాడిస్తూ వాడినే చూస్తున్నాను. నిజంగానే భయపడ్డాడు. పెద్దగా కేక పెట్టాడు.‘‘సె..క్యూ..రి..టీ..’’ఆ చప్పుడుకు– ఈ అరుపుకు మధ్య గంట గడిచింది!
సెక్యూరిటీ పోస్టు:‘‘పతా హై.. యే హై కౌన్’’‘‘నహీ సాబ్’’నన్ను ఆశ్రయించి జీవిస్తున్న వాడు.. కనీసం ఆ శవం దగ్గరికెళ్లి మొహం చూసే ప్రయత్నాన్ని, మొహమాటానికైనా చేయకుండానే, జవాబిచ్చాడు. వాణ్ణి తప్పుబట్టలేం. నిజమే చెప్పాడు. వాడికి ఎవ్వరూ తెలియదు. చివరికి ‘పతా హై’ అంటూ అడిగిన వాడితో సహా! జాలిపడ్డాను. మావాడి మీద కాదు. చుట్టుముట్టిన వాళ్లందరి మీద! తమకు రక్షణగా ఎవరుంటున్నారో, వారికి తామెవ్వరో తెలియకపోవడమంత దౌర్బల్యం ఇంకేం ఉంటుంది.
నా పేరు సెక్యూరిటీ పోస్టు. నా ఒంటి మీద ‘సెక్యూరిటీ’ అని రాయిస్తే సరిపోయేది. కానీ ‘పోస్టు’ అని కూడా జోడించారు. అదేదో నా కులం తోకలాగా! అందువల్ల నేను పోస్టు డబ్బా కంటె కొంచెం పెద్దదిగా ఉంటాను. ఫోర్ బై ఫోర్ స్క్వేర్ కట్టడం అనుకోండి. ఒకవైపు ద్వారం ఓకే. రెండు వైపుల నిలువెత్తు గవాక్షాలు! ప్రహరీ గేటు వైపుండే గవాక్షానికి వెలుపల ఓ పాత కుర్చీ, బల్ల. దాని మీద విజిటర్సు రిజిస్టరూ, దానికి ప్లాస్టికు దారంతో కట్టిన పేనా, పక్కనే ఇంటర్ కమ్ ఫోనూ. లోపల కిటికీ లేని వైపు యూనిఫాంలు తగిలించే కొక్కేలు. íసీసీ కెమెరాల ఫుటేజీ చూసే టీవీ, వాటిని రికార్డు చేసే హార్డ్ డిస్కు. నెత్తిన నెలవంక లాగా ఒక కెమెరా. ఇదీ నా స్వరూపం. కేక వినపడగానే నా చెంత ఉన్న ఇద్దరిలో ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్లాడు.
తర్వాత రెండోవాడిని కూడా పిలిచారు. వాడు కూడా తెలియదనే చెప్పాడు. ఎలా తెలుస్తుంది వాళ్లకసలు? మాది పోష్ డీలక్స్ అపార్టుమెంట్స్ అనే చెప్పాలి. వాచ్మెన్ ఫ్యామిలీకి ఓ చిన్న ఇల్లు వేసి ఇక్కడే కాపురం ఉంచడం, వాడికో ఇస్త్రీ బండి పెట్టివ్వడం వీళ్లకు నచ్చదు. సెక్యూరిటీని ఏజన్సీకి అప్పగించారు. ఆ ఏజన్సీ రోజూ తమ మనుషుల్ని పంపుతుంది. ఒక్కొక్కడికీ ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ. రోజుకు నలుగురు వస్తారు. ఒకసారి వచ్చినవాడు మరురోజు వస్తాడని గ్యారంటీ లేదు. వాళ్ల డ్యూటీ గేట్ సెక్యూరిటీ మాత్రమే. పైగా వీళ్లంతా పైనున్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు. మన భాషారాదు, ఇంగ్లీషూ రాదు. ఎవడైనా లోపలకు రావాలనుకుంటే ‘నామ్’ అంటారు.. ‘ఫ్లాట్’ అంటారు.. చెబితే ఆ ఫ్లాట్‌కు ఇంటర్ కమ్‌లో కాల్ చేసి చెప్తారు. పంపమంటే, సంతకం చేయించుకుని పంపుతారు.. లేదంటే లేదు అంతే!
వాకింగులోని వాళ్లూ, యోగ ముద్రాంకితులూ, ఉదయపు ఎండకోసం వచ్చి తీరిగ్గా కూచుని కబుర్లు చెప్పుకుంటున్నవాళ్లూ.. ఓ యాభైమందికి పైగా ఆ చిన్న ఇరుకు సందులో.. అప్పటికే చుట్టూ చేరారు. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అక్కడ చేరినవాళ్లు మొబైళ్లలో పైన తమ ఫ్లాట్స్‌లోని వాళ్లకు కాల్స్ చేస్తున్నారు. ఒక్కొక్కరూ వస్తున్నారు. అందరిలోకి కాస్త చొరవగా ఉన్న ఒక మనిషి.. ‘డిడ్ ఎనీ బడీ నో హిమ్.. ఇతనెవరో ఎవరికైనా తెలుసా.. ఇవన్ యారో..’ అని భాషలు మార్చి మార్చి పదేపదే అడుగుతున్నాడు. జవాబు రావడం లేదు. గుమికూడిన జనంలో.. ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నట్టే లేదు.. చాలా వరకు!
నా దగ్గరినుంచి వెళ్లిన రెండో సెక్యూరిటీ వాడు కొంచెం నయం.. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూసిన తర్వాత.. ‘‘ఫ్లాట్ తో మాలూమ్ నై సాబ్. యే తో అందర్వాలా హీ హై.. కన్ఫర్మ్’’ అన్నాడు. మహా అయితే అంతా డెబ్భయి ఇళ్లు. అందరూ మహా సంపన్నులు. పెద్దపెద్ద వాళ్లు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా టైం లేని వాళ్లు. ఇక పోయిన ప్రాణాన్ని, జిగటగా గడ్డకట్టిన ఒక చిన్న ఎర్రటి మడుగులో సగం మునిగిన మొహాన్ని ఎలా గుర్తుపడతారు. ఎవరనేది తెలియలేదు. ఎవరో అన్నారు.. ‘కాల్ ది పోలీస్ ఫస్ట్’.చొరవైన వాడే.. మొబైల్ అందుకుని 100 నొక్కాడు.ఆ చప్పుడుకు– ఈ నొక్కడానికి మధ్య గంటన్నర గడిచింది.
రక్షక్:నా పేరు రక్షక్. సెక్టార్ వెహికల్ అంటుంటారు నన్ను. 100 నుంచి మా మాధాపూర్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. అక్కడ నుంచి రౌండ్స్‌లో ఉన్న సెక్టార్ వెహికల్లోకి సెట్లో సమాచారం వచ్చింది. నన్ను అధిరోహించి ఒక హెడ్ కానిస్టేబులు, ఇంకో కానిస్టేబులు మాత్రమే ఉన్నారు. అయినా వాళ్లకు జంకేమిటి? ఎంచక్కా ఇక్కడకు వచ్చేసాం. ఇలాంటివి ఎన్ని చూసి ఉంటారని? ఏమీ జడుసుకోలేదు. ఆశ్చర్యపోలేదు.
కాకపోతే, అక్కడ ఏడుపులూ పెడబొబ్బలు లేకపోవడం, అనుభవం కొద్దీ, గమనించి ‘‘ఇంకా ఎవరిదో గుర్తుపట్టలేదా’’ అని మాత్రం అన్నారు. ఆ మాటకు, గుమికూడిన వాళ్లలో ఎవరైనా సిగ్గుపడ్డారో లేదో నేను గమనించలేదు. ‘‘లైబ్రరీలో చూశాను.. ఫ్లాట్ తెలీదు గానీ..’’ అని ఒకే పెద్దాయన అన్నాడు. ఇప్పుడైనా వాళ్లు సిగ్గుపడ్డారో లేదో!మరో అరగంటలో మోటారు సైకిల్‌పై ఎస్సై కూడా వచ్చేశాడు. అనుభవమే వారికి పనిలో వేగం అందిస్తుందనుకుంటా. ఆయన వచ్చాక టైం వేస్ట్ జరగలేదు. ఆ ఇరుకు సందువైపు ఫేస్ చేస్తూ ఉన్న రెండు టవర్లలోని ఫ్లాట్స్ నంబర్లన్నింటినీ రెండు కాగితాలపై వరుసగా రాశాడు మొత్తం 36 తేలాయి.
ఆ ఫ్లాట్స్ వాళ్ళు ఎవరైనా అక్కడ గుమికూడిన జనంలో ఉన్నారేమో అని ఒక్కొక్క నంబరూ ఎలుగెత్తి అరుస్తూ అటెండెన్స్ పిలిచినట్లుగా పిలవసాగాడు. 20 మంది దాకా అక్కడే ఉన్నారు. ఆ నంబర్లు అన్నింటినీ స్ట్రైక్ ఆఫ్ చేసిన కాగితాలను చెరో కానిస్టేబుల్ చేతికిచ్చి రెండు బ్లాకుల్లోని మిగిలిన ఫ్లాట్ల వద్దకు వెళ్లి ఇంట్లో ఎవరైనా కనిపించడం లేదేమో అడిగి రమ్మని పురమాయించాడు.
ఆ చప్పుడుకు– ఈ పురమాయింపుకు మధ్య మూడు గంటలు గడిచాయి.
కాఫీ కప్పు: ఏ13బీ. కాలింగ్ బెల్ మోగింది. ముందుగదిలోనే కూర్చుని కాఫీ తాగుతున్న అనిల్.. ‘‘అమ్మా వాకింగు నుంచి నాన్నొచ్చినట్టున్నాడు చూడూ’’ అని కేకేశాడు. వంటింట్లోంచి ఆమె వచ్చి తలుపుతీసింది. ఎదురుగా కానిస్టేబులు. విషయం తెలిశాక, ‘కిందికి వెళ్లి చూసొస్తా’నంటూ అనిల్ శాండల్స్‌లో కాళ్లు పెట్టాడు. ‘వాకింగుకు వెళ్లిన మీ నాన్న కూడా అక్కడే ఉంటాడేమో.. తొందరగా రమ్మను.. ఆయన టిఫినుకు లేటైంది’ వెనుకనుంచి అమ్మణ్ణమ్మ కేకేసింది. ఆ జనంలో ఆయన లేడని ఆమెకు తెలీదు.
నా పేరు కాఫీ కప్పు. ఫిల్టర్ కాఫీ నా ప్రత్యేకత. ‘ఆయన’కు శ్రీమతి అందించే ప్రతి ఉదయపు జీవనోత్సాహాన్ని నేనే! ఆయన నాకు కొన్నేళ్లుగా చాలా బాగా తెలుసు. తెల్లారిందని పల్లెకు చెప్పడానికి తాము కూస్తున్నామని కోళ్లు అనుకుంటాయి. ఆకలేసిందని తనకు చెప్పడానికి అవి కూస్తున్నాయని ఆయన అనుకుంటాడు. వాటి కూత పూర్తికాక ముందే లేచి, మేతతో తయారవుతాడు. ఒక్కో గంపను ఎత్తి, కోళ్లను వదులుతూ గింజలు నేలపై చల్లుతూ తన రోజును మొదలెడతాడు. వేసిన గింజలన్నీ తిన్న కోళ్లు తమ స్వప్రయత్నం ప్రారంభిస్తూ పెరటి బాట పట్టేసరికి ఆరుగంటలవుతుంది.
గంట కొట్టినట్టుగా అమ్మణ్ణి కాఫీ గ్లాసుతో వాకిట్లోకి వస్తుంది. (అది కూడా నేనే. పల్లెలో నా రూపం గ్లాసే) ఇద్దరూ కలిసి మట్టి అరుగు మీద కూర్చుని కాఫీ తాగుతారు. ఆ తర్వాతే మిగిలిన దినచర్య. అలా బతకడం అలవాటైన ఈశ్వరయ్యని తెచ్చి ఇక్కడ నాలుగు గోడల మధ్య బందీ చేశారు. తారసిల్లిన ప్రతిప్రాణినీ పలకరించుకుంటూ ఊరంతా తిరగడం, గుడికో పొలానికో వెళ్లి రావడం మాత్రమే తెలిసిన ఈశ్వరయ్య కొత్తగా వాకింగ్ నేర్వలేకపోయాడు. ప్రయత్నించాడు గానీ పలకరింపు కూడా ఉండని, మౌన శవయాత్ర లాంటి ఆ నడకలు రుచించక మానుకున్నాడు. ఎప్పుడైనా లైబ్రరీ దాకా వెళ్లి వచ్చేవాడు. ఇంతకుముందు ఎవరో ‘చూసినట్టుగా ఉన్న’దని అనడం అందువల్లే.
ఇవాళ కూడా అమ్మణ్ణి ఆరు గంటలకే ఆయన చేతికి నన్ను అందించింది. అనిల్, అతడి భార్య అప్పటికి నిద్ర లేవలేదు. అప్పుడే లేవరు. నన్ను అందించి, ఆమె వంటగది శుభ్రం చేసే పనిలో పడింది. ఆయన నాతో సహా బాల్కనీలోకి చేరాడు. చివరి చుక్క వరకు, నాలోని ఉత్తేజాన్ని ప్రతిసారీ తనలోకి వంపుకునే ఈశ్వరయ్య.. కనీసం నన్ను ఒక్కసారైనా చుంబించకుండా.. పొగలు కక్కుతూ ఆశ్చర్యపోతున్న నన్ను రెయిలింగ్ గోడపై ఒక చివర్న ఉంచాడు. లోపల సుడిగుండాలు. ఎన్నో, ఏవేవో, ఎందుకు, ఎలా తిరుగుతున్నాయో ఎవరికి తెలుసు? నానుంచి కాస్త దూరం జరిగి రెయిలింగ్ మీదుగా ముందుకు వంగాడు. ‘రెయిలింగ్ యోగా’ భంగిమేమో అని నవ్వుకున్నాను, పొగలు కక్కుతూనే. ఇంకొంచెం వంగాడు. ఇంకా వంగాడు. ఇంకా.. వంగాడు! అసలు అది వంగడమేనా? నేను కంగారు పడేలోగానే అది జరిగింది.
ఈశ్వరయ్య పైనుంచి కిందికి జారిపోయాడు. నేను నిశ్చేష్టనైపోయాను. పొగలూ చల్లారిపోయి, కాఫీ పొక్కు కట్టింది.కొన్ని క్షణాలకు దబ్బున చప్పుడు వినిపించింది. కొన్ని నిమిషాలకు, ఇప్పుడు, అనిల్ కిందకు వెళ్లిన తర్వాత, ఏడుపు వినిపించింది. నా అంతఃకర్ణాలను గ్రౌండ్ ఫ్లోర్ దాకా రిక్కించాను. వెక్కుతూ వెక్కుతూ ‘‘మా.. నాన్న’’ అంటున్నాడు. నా అంతఃచక్షువులను కూడా కిందికి సారించాను. నాన్న పక్కనే మోకాళ్లపై కూలబడ్డాడు. చుట్టూ ఉన్న గుంపు మొత్తం కాస్త స్థిమితపడ్డారు. అప్పటిదాకా ఉన్న సస్పెన్స్ తీరిపోయినందుకు! ‘‘ఏ ఫ్లాట్?’’ ఎవరిని ఉద్దేశించామనే స్పష్టత లేకుండా అనేక సిగ్గులేని గొంతుకలు గునగున గొణుగుతున్నాయి. కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గరకెళ్లి ‘‘ఏ13బీ సార్’’ అనడంలో అందరికీ జవాబు దొరికింది. సస్పెన్స్ తీరిపోయింది గనుక.. ఒకరిద్దరు తమ ఇళ్లకు మళ్లుతున్నారు. ఒకరిద్దరు మళ్లీ చెవులకు తగిలించుకుంటున్నారు. ఈలోగా అంబులెన్సు సైరన్ కూడా వినిపించింది.ఆ చప్పుడుకు– ఈ సైరన్ చప్పుడుకు మధ్య మూడున్నర గంటలు గడిచాయి.
గీతామందిరం:
నా పేరు గీతామందిరం. ఈ గేటెడ్ ప్రపంచానికి నేనే కమ్యూనిటీ హాలును. నాలుగు అల్మరాలను ఓ మూలగా పేర్చిన లైబ్రరీ అనే పదార్థం కూడా యిక్కడే. పదిరోజుల కిందట తొలుత ఉస్మానియా అంబులెన్సు మీద, తర్వాత వైకుంఠరథం మీద సవారీ వెళ్లిన పెద్దాయన నాకు తెలుసు. ఇవాళ ఆయనకు పెద్దకర్మట. ఇక్కడ నా సమక్షంలో ప్రవచనం ఏర్పాటుచేశారు. ఆత్మానంద స్వామి వచ్చాడు. నీట్‌గా ట్రిమ్ చేసిన బెత్తెడు గడ్డం, పొందికైన బట్టతలతో ఉన్నాడు. కాషాయాంబరాలు, మెడలో రంగురంగుల పూసలు. దణ్ణం పెట్టించుకోడానికి తగిన గెటప్పులోనే ఉన్నాడు. స్వామీజీ వస్తున్నారని వాట్సాప్ గ్రూపులో బాగా ప్రచారం జరగడం వలన.. చాలా ఫ్లాట్స్ నుంచి మనుషులొచ్చారు. అనిల్ కుటుంబం ఎటూ ఉంది. ఆయన ప్రారంభించాడు.
‘‘ఈశ్వరయ్య పరమేశ్వరుడిలో లీనమయ్యాడు. మీరందరూ ఇక్కడ ఉండేవాళ్లే.. కానీ, ఈశ్వరయ్య శివైక్యం చెందిన మూడున్నర గంటల దాకా ఆయన ఎవరో మీలో ఎవ్వరూ గుర్తుపట్టలేదంటే ఎంత సిగ్గు?’’ ఆత్మానంద పాజ్ ఇచ్చాడు.‘అలా గడ్డిపెట్టు వెధవలకి. ముదనష్టపు ప్రపంచం. ఇరుగు పొరుగు ఎవ్వరో తెలియకుండా ఇనుప తెరలు కట్టేసుకున్న ప్రపంచం. హృదయాల్ని హిడెన్ ఫోల్డర్లలో దాచేసి.. కృతకమైన బంధాల్ని, ఉద్వేగాల్ని వెలుపలినుంచి తమపైకి వెల్లువెత్తించుకునే ప్రపంచం! అమానవీయత తమ తరం లక్షణంగా మారుతోందనే స్పృహ కూడా లేని దౌర్భాగ్యపు ప్రపంచం!’ ఆత్మానందకు జేజేలు అనుకుంటూ మిగిలినోళ్లను ఈసడించుకున్నాను నేను. ఆయన కొనసాగించాడు.
‘‘ఇది తప్పు. మనుషుల మధ్య బంధాలు ఉండాలి. సత్సంగాలు జరుగుతూ ఉండాలి. కలుస్తూ ఉండాలి. మీలో మీరు కలవడం కాదు, గురువుల్ని పిలిచి, సద్బోధలు గ్రహిస్తూ ఉండాలి..’’ వీడి పాసుగూల. పెద్దదినాన్ని కూడా మార్కెటింగుకు వాడుకుంటున్నాడే! ‘‘ఈశ్వరయ్య మరణం లాంటిది మరొకటి జరగకూడదు. మంత్రంలాంటి మాట చెబుతాను పాటించండి’’‘నీ మార్కెటింగ్ ఎలా తగలడ్డా పర్లేదుగానీ, మంచి మంత్రం చెప్పు స్వామీ..’ ఆశగా ఎదురుచూస్తున్నాను. ‘‘తమ ఇళ్లలో పెద్దవాళ్లను, ముసలివాళ్లను ‘మెయింటైన్’ చేస్తున్న ప్రతి ఒక్కరూ..’’భళా.. ఇలాంటి పాఠాలే స్వాములనుంచి ప్రపంచానికి అందాలి. నా ఉత్సుకత పెరిగిపోయింది. ‘‘తమ బాల్కనీలకు గట్టి ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకోండి..’’ ఆత్మానంద ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు. గంట ప్రవచనానికి మాట్లాడుకున్నారంట. అప్పుడే ఎందుకు ఆపుతాడు?
చివరగా నేను: నా పేరు ఈశ్వరయ్య. ఆ రోజున నేను, నా విముక్తిని, బలవంతంగా, ఈశ్వరేచ్ఛతో నిమిత్తం లేకుండా, పుచ్చుకున్నాను. ఇవాళ్టిదాకా నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండాలని అందరూ అనుకుంటుండబట్టి.. ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని వేచిచూశాను. ఇక చాలు. «పరమేశ్వరుడి లీలలో లీనమయ్యే ముందు.. ఈ నాటకం చాలించేముందు, ఎవడో స్వామిట కదా, నాకోసమే వస్తున్నాడుట కదా.. విందామని ఆగాను. ఆ అమృతోపదేశాన్ని విన్నాను. రాయజాలని భాషలో, ఎవరికీ వినపడదని తెలిసినా, గట్టిగా తిట్టుకుని, నా దారిన చక్కాపోయాను. ![]()
Tags : 1