ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం
Breaking News
ట్రెండ్‌ను ఫాలో కాదు… సెట్ చేసిన సిరిసిల్ల శ్రీకాంత్ విజయం
Published on Sun, 03/22/2026 - 07:35
చదివింది సాఫ్ట్వేర్.. చేస్తోంది హార్డ్‌వేర్ బిజినెస్. ట్రెండ్‌ను ఫాలో కావడం కాదు.. సెట్ చేస్తామంటున్నారు సిరిసిల్లకు చెందిన పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే). తన పేరుతోనే కంపెనీని ఏర్పాటు చేసి భవన నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని సరఫరా చేస్తున్నారు. వంద మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగం రాలేదని ఉసూరమనే యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్నప్రాయంలోనే పారిశ్రామిక వేత్తగా ఎదిగిన శ్రీకాంత్ సక్సెస్ స్టోరీ.

సిరిసిల్ల: సామాన్యుడు పారిశ్రామికవేత్త కావాలంటే ఎంతో శ్రమించాలి. మరెంతో సాహసించాలి. ఎన్నో ఎదురుదెబ్బలను ఓర్చుకోవాలి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో ‘పుల్లూరోళ్ల’ హార్డ్‌వేర్ షాప్ అంటే.. తెలియనివారుండరు. ‘పుల్లూరి’ పరివారంలో ఓ వ్యాపారి పుల్లూరి శ్రీకాంత్(39). అందరిలాగే తెలుగు మీడియంలో సిరిసిల్లలోనే చదువుకున్న ఆ యువకుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి ఉద్యోగ వేటలో పడ్డారు. ఏడాదికి రూ.లక్ష జీతం వస్తే చాలు.. జీవితంలో సెటిల్ అయిపోవచ్చనే నమ్మకంతో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్వూ్యకు వెళ్లాడు. కానీ ఆ ఉద్యోగం రాలేదు. సిరిసిల్లకు చేరి అమ్మనాన్నలు రాధా, కృష్ణమూర్తిలకు తోడుగా వ్యాపారంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఎంతకాలం చిరువ్యాపారం అని ఆలోచించిన ఆ యువకుడు.. కొనే స్థాయి నుంచి అమ్మే స్థాయికి ఎదగాలని భావించాడు. సిరిసిల్లను వీడి భార్య ప్రణిత, కూతురు దేవహాసిని, కొడుకు రిషికేశ్‌తో హైదరాబాద్‌కు చేరారు. పుల్లూరి శ్రీకాంత్(పీఎస్కే) పేరుతో ఓ సంస్థను స్థాపించి అనతికాలంలోనే రూ.వందల కోట్ల వ్యాపారానికి చేరుకున్నారు.
వ్యాపార కుటుంబం నుంచి..
సిరిసిల్లలో మంచి పేరున్న వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన పుల్లూరి శ్రీకాంత్(39) చిన్న వయసులోనే నిర్మాణరంగంలో స్థిరపడ్డారు. శ్రీకాంత్ తాత, నానమ్మలు పుల్లూరి లక్ష్మీనారాయణ, అనసూర్యలు చిరువ్యాపారులు. వారి వారసత్వ వ్యాపారాన్ని మరింత పెంచుతూ శ్రీకాంత్ తల్లిదండ్రులు పుల్లూరి రాధా, కృష్ణమూర్తి స్థానికంగా హార్డ్‌వేర్ వ్యాపారాన్ని విస్తరించారు. ఆ వ్యాపారాన్ని ఆకాశమెత్తుకు చేర్చుతూ పారిశ్రామికవేత్తగా పీఎస్కే స్టీల్, పీఎస్కే సిమెంట్‌తోపాటు భవన నిర్మాణాలు, వంతెనలు, రోడ్లు, అపార్టుమెంట్లు, విల్లాల నిర్మాణాలకు అవసరమైన అన్ని వస్తువులను నేరుగా సరఫరా చేసే స్థాయికి చేరారు. నిజానికి ఈ వ్యాపార రంగంలో మార్వాడీ సేట్లు, ఉత్తర భారతానికి చెందిన బడా వ్యాపారులు స్థిరపడి ఉండగా.. వాళ్లకు ధీటుగా నమ్మకంగా.. శ్రీకాంత్ ఆ రంగంలో రాణిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని షాద్‌నగర్‌లో కంపెనీలో భాగస్వామిగా మారి సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగేళ్లుగా నిర్మాణ రంగంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించారు.
వందకు పైగా ఉద్యోగులు
పీఎస్కే సంస్థలో వంద మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. నిర్మాణ రంగంలోని ప్రముఖ కంపెనీలకు హోల్‌సేల్‌గా మెటీరియల్ సరఫరా చేస్తూ వ్యాపారం సాగిస్తున్న శ్రీకాంత్ నెలకు రూ.50లక్షల నుంచి రూ.60లక్షల వేతనాలను తన వద్ద పనిచేసే ఉద్యోగులకు పంపిణీ చేస్తున్నారు. ‘అల్ఫా’ సర్కిల్ పేరుతో ప్రముఖులను, ప్రముఖ కంపెనీలను భాగస్వాములను చేస్తూ పరస్పర సహకారంతో వ్యాపారాన్ని విస్తరించేందుకు శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీల కలయికతో పీఎస్కే వ్యాపారం విస్తరించింది. ప్రస్తుతం ఏటా రూ.వందల కోట్ల మేరకు టర్నోవర్‌తో పీఎస్కే వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పీఎస్కే వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంతో శ్రీకాంత్ ముందుకు సాగుతున్నారు.
అంచెలంచెలుగా..
శ్రీకాంత్ ఒకేసారి తన వ్యాపారాన్ని పెంచుకోకుండా.. హైదరాబాద్ మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుని వ్యాపారాన్ని విస్తరించారు. రాష్ట్రవ్యాప్తంగా హోల్‌సేల్ హార్డ్‌వేర్ షాపులకు సిమెంట్, స్టీల్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని బెంగళూర్, వైజాగ్ పట్టణాలకు విస్తరించారు. స్టీల్, సిమెంట్ ఉత్పత్తి రంగాల్లో ఎంతో పేరున్న ప్రముఖ కంపెనీలతో పోటీ పడుతూ నమ్మకంతో ఉన్నత స్థితికి చేరారు. పీఎస్కే సంస్థ వ్యాపార రంగంలో స్థిరపడి ముందుకు సాగడంతో గ్లోబల్ ఐకాన్ అనే సంస్థ 2023లో శ్రీకాంత్‌కు డాక్టరేట్‌ను అందించింది. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్న జీ–20 సదస్సులోనూ శ్రీకాంత్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవితోపాటు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పీఎస్కే సంస్థ వ్యాపారాన్ని అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ధార్మిక కార్యక్రమాల్లో, సామాజిక సేవలోనూ ముందున్నారు.
లక్ష మందికి ఉపాధి లక్ష్యం
2030 నాటికి దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించి లక్ష మందికి ఉపాధి కల్పించడమే నా లక్ష్యం. ఆ దిశగా పట్టుదలగా అడుగులు వేస్తున్నాను. ప్రముఖ కంపెనీల కొలాబ్రేషన్‌తో వ్యాపారాన్ని విస్తరిస్తున్నాను. ‘అల్ఫా సర్కిల్’ను ప్రపంచ వ్యాప్తం చేస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి ఉంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలగా అనుకున్నది సాధించడమే నా లక్ష్యం. ప్రస్తుతం వ్యాపారంలో ఎంతో బిజీగా ఉన్నాను. మరింత విస్తరించి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తా.
– పుల్లూరి శ్రీకాంత్, పీఎస్కే సంస్థ వ్యవస్థాపకుడు
Tags : 1