Breaking News

ప్రపంచంలో అభయారణ్యాలు

Published on Sun, 06/29/2025 - 08:52

ప్రపంచంలో అభయారణ్యాలు ఉండటం సహజం. అడవులలోని కొండ కోనలను, వాగు వంకలను, చెట్టు చేమలను, పక్షులు, జంతువులను పరిరక్షించడానికి అభయారణ్యాలను ఏర్పాటు చేస్తుంటారు. కొన్ని చోట్ల అభయారణ్యాలే కాదు, భయారణ్యాలు కూడా ఉంటాయి. ఆ అరణ్యాలలోకి అడుగు పెట్టాలంటేనే వెన్నులో వణుకు మొదలవుతుంది. సాహసించి ఎవరైనా ఆ అరణ్యాలలోకి వెళ్లినా, వారికి చిత్రవిచిత్రమైన రీతిలో అంతుచిక్కని అనుభవాలు ఎదురవుతుంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న అలాంటి కొన్ని భయారణ్యాల గురించి, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.

ఎల్ఫిన్‌ ఫారెస్ట్‌
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న కీకారణ్యం ఇది. ఈ అడవిలోకి అడుగు పెట్టడానికి పట్టపగలు కూడా జనాలు భయపెడతారు. ఈ అడవి చుట్టూ అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అడవిలో అమెరికన్‌ మూలవాసుల ఆత్మలు సంచరిస్తుంటాయని, ఒక మంత్రగత్తె ఆత్మ కూడా సంచరిస్తూ ఉంటుందని స్థానికులు కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎల్ఫిన్‌ అడవి నడిబొడ్డున ఒక సన్నని రాతి దారి ఉంది. మెలికలుగా ఉన్న ఈ దారిలోనే ఇక్కడ మూలవాసులు అతీంద్రియ శక్తుల కోసం ఆత్మలను ఆవాహన చేసేవారని చెబుతారు. ఈ అడవిలోని లోయకు ఎగువనున్న కొండల మీద మూలవాసుల సమాధులు ఉన్నాయంటారు. ఈ ప్రాంతంలో అక్కడక్కడా కనిపించే చిన్నారుల పాదముద్రలు మూలవాసుల పిల్లలవి కావచ్చని భావిస్తారు. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని హత్యలు సహా పలు అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. కొందరు సాహసించి ఈ అడవిలోకి వెళితే, వాళ్లకు అంతుచిక్కని అనుభవాలు ఎదురయ్యాయని చెబుతారు. రకరకాల ప్రచారాలు, భయాల కారణంగా స్థానికులెవరూ ఈ అడవిలోకి వెళ్లడానికి సాహసించరు. అందుకే, ఈ అడవి నిత్యం నిర్మానుష్యంగా ఉంటుంది.

బ్లాక్‌ ఫారెస్ట్‌
పగలు, రాత్రి దాదాపు ఒకేలా ఉండే ఈ అడవి జర్మనీ నైరుతి ప్రాంతంలో ఉంది. ఈ అడవి అసలు పేరు ‘ష్వార్జ్‌వాల్డ్‌’. అడవి నిండా ఎత్తయిన చెట్లు దట్టంగా పెరిగి ఉండటంతో పట్టపగటి వేళలో కూడా ఇక్కడి నేల మీద సూర్యకిరణాలు దాదాపు పడవు. అందువల్ల పగటి వేళలో కూడా ఈ అడవి చీకటిగానే ఉంటుంది. నిత్యం చీకటిగా ఉండటం వల్లనే దీనికి ‘బ్లాక్‌ ఫారెస్ట్‌’ అనే పేరు వచ్చింది. ఈ అడవిలో కొన్ని అంతుచిక్కని సంఘటనలు జరిగాయి. ఇక్కడ కొందరు అంతుచిక్కకుండా గల్లంతైపోయారు. ఈ అడవిని అల్లుకుని ప్రచారంలో ఉన్న కథల ఆధారంగా జర్మన్‌ రచయితలు బ్రదర్స్‌ గ్రిమ్‌ (జాకోబ్, విల్‌హెల్మ్‌) ‘హాన్సెల్‌ అండ్‌ గ్రెటెల్‌’ అనే పుస్తకం రాశారు. ఇందులో ఈ అడవిలో అంతుచిక్కకుండా తప్పిపోయిన ఇద్దరు పిల్లల ఉదంతాన్ని రాశారు. ఈ అడవిలో ఇప్పటికీ కనిపించే పిల్లల పాదముద్రలు అప్పట్లో తప్పిపోయిన వారివేనని స్థానికులు నమ్ముతారు. ప్రపంచంలోనే అత్యంత నిర్మానుష్యంగా కనిపించే అడవుల్లో బ్లాక్‌ ఫారెస్ట్‌ కూడా ఒకటి.

డెవిల్స్‌ ట్రాంపింగ్‌ గ్రౌండ్‌
అమెరికాలోని ఉత్తర కరోలినాలో అడవి నడిమధ్యన ఉన్న విచిత్ర ప్రదేశం ఇది. ‘బెయిర్‌ క్రీక్‌ ’ వాగు సమీపంలో ఉన్న దేవదారు వృక్షాల అడవి నడిమధ్యన ఈ వృత్తాకర ప్రదేశం ఖాళీగా కనిపిస్తుంది. దట్టమైన అడవిలో కనీసం గడ్డిపరకలైనా మొలవని ఈ ప్రదేశం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మర్మమే! దాదాపు 40 అడుగుల పరిధిలో ఉన్న ఈ ప్రదేశంలో అడవిలో సంచరించే జంతువులేవీ అడుగు పెట్టవు. దీని సమీపానికి వచ్చినా, చుట్టూ తిరిగి వెళతాయే గాని, దీని లోపల అడుగు పెట్టి, ఇటు నుంచి అటు దాటే ప్రయత్నం చేయవు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని కొందరు ఔత్సాహికులు ఇక్కడకు పెంపుడు జాగిలాలను తీసుకు వచ్చినా, ఆ జాగిలాలు దీని చుట్టూ తిరిగి, విచిత్రంగా మొరిగాయే తప్ప దీని లోపలకు అడుగు పెట్టలేదు. ఒక్కోసారి ఇక్కడ ఎవరో పారవేసినట్లుగా అంతుచిక్కని వస్తువులు కనిపిస్తుంటాయి. అలాగే, అంతుచిక్కని పాదముద్రలు కూడా కనిపిస్తుంటాయి. అందుకే, స్థానికులు దీనిని ‘దయ్యాల మైదానం’గా అభివర్ణిస్తుంటారు. రాత్రివేళ ఇక్కడ దయ్యాలు వచ్చి ఆటలాడుకుంటూ, నృత్యం చేస్తూ కాలక్షేపం చేస్తాయని కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఎపింగ్‌ ఫారెస్ట్‌
ఇంగ్లండ్‌లోని అత్యంత పురాతనమైన అడవి ఇది. దాదాపు ఆరువేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ దట్టమైన అడవి అతీంద్రియ శక్తులకు ఆలవాలమని స్థానికులు చెబుతుంటారు. నాలుగు శతాబ్దాల కిందట నాటి రాజులు ఈ అడవిలో వేట సాగించేవారట! నేరాలు చేసి పారిపోయేవారికి, దోపిడీ ముఠాలకు, యుద్ధం నుంచి పారిపోయిన సైనికులకు ఈ అడవి ఒకప్పుడు సురక్షిత స్థావరంగా ఉండేదని చెబుతారు. పద్దెనిమిదో శతాబ్దిలో డిక్‌ టర్పిన్‌ అనే దోపిడీ ముఠా నాయకుడు ఈ అడవిని అడ్డాగా చేసుకుని, అటవీ మార్గం గుండా వచ్చే బాటసారులను దోచుకునేవాడు. తనను ఎదిరించేవారిని నిర్దాక్షిణ్యంగా చంపేవాడు. ఇరవయ్యో శతాబ్దిలో ఈ అడవిలో కనీసం పదకొండు హత్యలు జరిగాయని చెబుతారు. అరవయ్యేళ్ల కిందటి వరకు హంతక ముఠాలు తమ చేతిలో హత్యకు గురైనవారి మృతదేహాలను ఈ అడవిలో పారవేసేవారు. అంతుచిక్కని చాలా హత్యలకు కేంద్రంగా ఉన్న ఈ అడవిలో హత్యలకు గురైనవారి ఆత్మలు సంచరిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతుంటారు. ఈ అడవిలోకి అడుగుపెట్టిన కొందరు తమకు అంతుచిక్కని రీతిలో విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయని చెబుతుంటారు. సాహసికులు, అతీంద్రియ శక్తులపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులు తప్ప మామూలు మనుషులెవరూ ఈ అడవి జోలికి వెళ్లరు.

డౌహిల్‌ ఫారెస్ట్‌
ఇది పశ్చిమ బెంగాల్‌లోని కుర్సియాంగ్‌ పట్టణానికి చేరువలో ఉంది. ఈ అడవికి సమీపంలోనే వందేళ్ల నాటి విక్టోరియా బాయ్స్‌ హైస్కూల్‌ ఉంది. దట్టంగా దేవదారు చెట్లు పెరిగిన ఈ అడవిలోనే కాకుండా, అడవికి దగ్గరగా ఉన్న స్కూల్‌లో కూడా అతీంద్రియ శక్తులు సంచరిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. చీకటి పడిన తర్వాత ఈ పరిసరాల్లో మానవమాత్రులు కనిపించడం చాలా అరుదు. డౌహిల్‌ అడవి నుంచి విక్టోరియా బాయ్స్‌ హైస్కూల్‌ వైపు వెళ్లే దారిని ‘డెత్‌ రోడ్‌’గా పిలుచుకుంటారు. ఈ దారిలో అనేక అసహజమైన సంఘటనలు జరగడమే దీనికి కారణం. చీకటి పడ్డాక ఈ దారిలో వస్తుండగా దయ్యాలను చూశామని కొందరు చెబుతుంటారు. ఈ దారిలో ప్రయాణిస్తున్నప్పుడు వికృతమైన నవ్వులు, భయపెట్టే ధ్వనులు వినిపించినట్లు ఇంకొందరు చెబుతుంటారు. స్థానికులు చెప్పే మరో విచిత్రమైన ఉదంతమేమిటంటే, ఈ ప్రాంతంలో రాత్రివేళ తలలేని బాలుడు ఒకడు కాపలాగా తిరుగుతుంటాడని, ఎవరైనా గమనిస్తే, పరుగుతీస్తూ అడవిలోకి పారిపోయి, అదృశ్యమైపోతాడని చెబుతారు. ఆ బాలుడికి తల ఉండదని, మెడ ఉండాల్సిన చోట ఒక నిలువైన కట్టె ఉంటుందని చెబుతుంటారు. రాత్రివేళ ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడానికి స్థానికులు ఇప్పటికీ భయపడతారు.

హోయా బాచూ
ప్రపంచంలో అతీంద్రియ శక్తులకు ఆలవాలంగా పేరుమోసిన అడవుల్లో ‘హోయా బాచూ’ ఒకటి. ఇది రుమేనియాలో ఉంది. అడ్డదిడ్డంగా మెలికలు తిరిగి దట్టంగా పెరిగిన ఇక్కడి చెట్లను పగటి వేళలో చూస్తేనే జనాలు భయపడతారు. ఇక రాత్రివేళ అయితే, ఈ అడవి పరిసరాల్లోకి అడుగు పెట్టడానికి కూడా సాహసం చేయరు. సాధారణంగా ఈ అడవి నిర్మానుష్యంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొందరు ఔత్సాహికులు ఇక్కడి అంతుచిక్కని రహస్యాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో వెళుతుంటారు. అలా వెళ్లినవారు కూడా చాలామంది ఈ అడవిలో కొంతదూరం ప్రయాణించాక కడుపులో వికారం మొదలై వాంతులయ్యాయని, గుండెదడ మొదలైందని చెబుతుంటారు. ఈ అడవి పరిసరాల్లో కనిపించిన ‘యూఎఫ్‌ఓ’ను ఒక సైనికుడు 1968లో ఫొటో తీయడంతో ఇక్కడ అతీంద్రియ శక్తులపై ప్రచారం మరింత ఎక్కువైంది. ఆ ఫొటో ప్రచారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తల బృందాలు ఈ అడవిలో పరిశోధనలు జరిపాయి. అడవి పైనుంచి యూఎఫ్‌ఓ సంచరించిన ప్రాంతంలో చెట్లు చచ్చిపోయాయి. ఆ ప్రదేశంలో ఇప్పటి వరకు ఒక్క మొక్క కూడా మొలవలేదు. దీనికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను చెప్పలేకపోతున్నారు. బహుశా, యూఎఫ్‌ఓ రేడియేషన్‌ ప్రభావం కారణంగానే ఈ ప్రదేశంలో తిరిగి మొక్కలు మొలవడం లేదని చాలామంది భావిస్తున్నారు. 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)