పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
Breaking News
కోతి నిద్ర
Published on Sun, 12/21/2025 - 06:38
ఒకరోజు ఉదయం నల్లబండ మీద కూర్చొని అంజి అనే కోతి ఆవులిస్తూ ఏదో ఆలోచిస్తోంది. అక్కడే తిరుగుతున్న అంజి మిత్రులు ఎలుగుబంటి, నక్క, తోడేలు, నెమలి, కోకిల అంజిని గమనించాయి.
‘అంజీ! ఏంటి నీ కళ్లు ఎర్రగా ఉన్నాయి!?’ అడిగింది ఎలుగుబంటి...
‘రాత్రి పూట సరిగా నిద్ర పట్టడం లేదు!’ అంది అంజి .
‘నువ్వు రోజూ సాయంత్రం తాటికల్లు తాగు, హాయిగా నిద్రపడుతుంది!’ అంది నక్క.
‘తాటి కల్లు వద్దు, ఈతకల్లు తాగావంటే మత్తుగా నిద్రపడుతుంది’ అంది తోడేలు.
‘కాదు... కాదు నీళ్లలో తేనె కలుపుకొని తాగు! వెంటనే నిద్రలోకి జారుకుంటావు!’ అంది ఎలుగుబంటి.
‘తాగుడు కాదు! నువ్వు ప్రతిరోజూ అరగంట నాట్యం చేశావంటే అలసిపోయి బ్రహ్మాండంగా నిద్ర వస్తుంది!’ అంది నెమలి.
‘నాట్యంకన్నా అరగంట పాటలు విన్నావంటే, వద్దన్నా కునుకు పడుతుంది!’ అంది కోకిల.
ఇలా కోతి అడగకుండానే తమకు తోచిన సలహాలు ఇచ్చాయి.
అంజి అన్నిటి సలహాలు విని బుర్ర గోక్కుంటూ ఇంటికి పోయింది.
తెల్లారి అంజి మళ్లీ నల్ల బండకు చేరింది.
‘అంజీ! రాత్రి తాటికల్లు తాగావా?’ ఆత్రంగా అడిగింది నక్క.
‘లేదు!’ అంది అంజి.
‘అయితే, నేను చెప్పినట్లు ఈత కల్లు తాగుంటావు!’ అంది ఆసక్తిగా తోడేలు.
‘కాదు!’ అంది
‘అంజి మత్తు పానీయాలు ఎందుకు తాగుతుంది. నేను చెప్పిన తేనె నీళ్లు తాగుంటుంది’ అంది ఎలుగుబంటి.
‘లేదు... లేదు!’ అంది అంజి.
‘ఓహో! నేను చెప్పినట్లు నాట్యం చేసుంటుంది’ అంది నెమలి.
‘కాదు... కాదు’ అంది అంజి.
‘ఇంకేముంది నా మాటకు విలువ యిచ్చి పాటలు విని ఉంటుంది’ అంది కోకిల.
అంజికి చికాకు వేసింది. ‘ఆపండి మీగోల! నేను అసలు ఎవరి సలహానూ పాటించలేదు. మిమ్మల్ని సలహా ఇమ్మని కోరనూ లేదు’ అంది కోపంగా.
వెంటనే నల్లబండ మీద నుంచి చెట్టు మీదకు దూకి, అక్కడి నుంచి నేరుగా వైద్యుడు ఏనుగు వద్దకు పోయింది. తన సమస్య చెప్పింది.
ఏనుగు అంజిని పరీక్షించి, ‘ఇంకా ఆలస్యం చేసి ఉంటే, నీ కంటికి, ఒంటికి ప్రమాదం జరిగేది’ అంటూ కొన్ని వేరు మందులు ఇచ్చింది. ‘వీటిని వాడుతూ, ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే రోగం నయమవుతుంది’ చెప్పింది ఏనుగు.
‘ఈలోకంలో అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలిచ్చే వాళ్లకు లోటులేదు. పైగా సలహాలు పాటించకుంటే వారికి శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది’ అని తెలుసుకుంది అంజి.
Tags : 1