శభాష్ జగన్ అంటున్న కూటమి నేతలు..
Breaking News
ఆమె జీవితం..ఆమె ఇష్టం
Published on Tue, 04/07/2026 - 03:44
మీరట్‌లో ఒక రిటైర్డ్ జడ్జి విడాకులు పొందిన తన కుమార్తెను మేళతాళాలతో ఇంటికి తీసుకువచ్చి అదే తన తీర్పు అన్నాడు. ‘ఐ లవ్ మై డాటర్’ టీ షర్ట్‌లు ధరించి బంధువులంతా ఆమెను స్వాగతించారు. మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు తన కంటే 20 ఏళ్లు ఎక్కువ వయసున్న భర్తతో వేగలేకపోతున్న భార్యను విడాకులకు ముందే తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉండే తీర్పును వెలువరించింది. వివాహం ఎంతో బాధ్యతతో నిర్వహించాల్సిన బంధం. పురుషుల వ్యవహారశైలిలో మార్పును ఈ రెండు తీర్పులు సూచిస్తున్నాయి.
‘వివాహ బంధంలో మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది. అది సరయ్యే మార్గం లేదు. ఆమెను బయటకు తేవడమే ఉత్తమం అని భావించాను. అదే నా తీర్పు’ అన్నారు మీరట్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర కుమార్ శర్మ. శనివారం (ఏప్రిల్ 4న) ఆయన కుమార్తె ప్రణిత వశిష్టకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి ఇంటికి ఆయన తన కూతురుని బ్యాండ్ బాజాలతో, పూలహారాలతో, స్వీట్స్‌తో ఊరేగింపుగా తీసుకొని వచ్చాడు. బంధువులు అందుకు తోడు నిలిచారు. వీరంతా నల్లటి టీషర్టులు ధరించారు. ఆ టీషర్ట్‌ల పై ‘ఐ లవ్ మై డాటర్’ అనే నినాదం ఉంది. సమాజానికి విడాకులంటే చిన్న చూపు పోవడానికే ఇదంతా చేయాల్సి వచ్చిందని ఆ తండ్రి తెలియచేశాడు.
2018లో వివాహం
జ్ఞానేంద్ర కుమార్ శర్మ తన కుమార్తె ప్రణిత వివాహాన్ని 2018లో షాజహాన్‌పూర్‌కు చెందిన ఒక ఆర్మీ మేజర్‌తో జరిపించారు. అయితే పెళ్లయిన నాటి నుంచి భర్త ఆమెను మానసికంగా, శారీరకంగా బాధిస్తున్నాడు. ఒక బిడ్డ జన్మించినా అతని వైఖరిలోమార్పు లేదు.
తండ్రిగా ఇదంతా చూసి ఆమెకు ధైర్యమివ్వడానికి తోడు నిలిచాడు జ్ఞానేంద్ర కుమార్ శర్మ. ‘కుమార్తె బాధలో ఉంటే దాని నుంచి బయట పడేసే బాధ్యత తండ్రిగా నా మీద ఉంది. ఆమె గౌరవాన్ని కాపాడటం ముఖ్యం. ఏ కుమార్తే, తన తల్లిదండ్రులకు బరువు కాదు’ అన్నాడాయన. ప్రణిత పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒక సంస్థలో ఫైనాన్షియల్ డైరెక్టర్‌గా పని చేస్తోంది. ‘మేము భరణం ఆశించలేదు.
మాకు వద్దు కూడా’ అన్నారు ఆ తండ్రీ కూతుళ్లు. ‘ఇన్నాళ్లు అత్తగారింటిలో నేను మానసికంగా బలహీనపడుతూ వచ్చాను. దీనికి ముగింపు పలకాలనుకున్నాను. నేను చెప్పేది ఒకటే.... కష్టాలను సహిస్తూ కూచోవద్దు. పరిష్కారం వెతకండి’ అంది ప్రణిత. కళ్లకు కనపడుతున్న ఇలాంటి తీర్పులను చూసి వివాహ వ్యవస్థ లోటుపాట్లను తల్లిదండ్రులు, భార్యాభర్తలు మరింతా మెరుగ్గా సరి చేసుకోవాలి. ఎవరి బాధ్యతలు, హక్కులు వారు తెలుసుకోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి.
నచ్చిన వ్యక్తితో ఉండొచ్చు
మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియెర్ బెంచ్ ఏప్రిల్ 2న ఇచ్చిన మరో తీర్పు కూడా స్త్రీ నిర్ణయానికి వత్తాసు పలికింది. 40 ఏళ్ల వయసు కలిగిన భర్త తన భార్య కనిపించడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయగా అతని 19 ఏళ్ల భార్య కోర్టు ముందు ప్రత్యక్షమైంది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని, తన సమ్మతం ప్రకారమే మరో వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయానని ఆమె కోర్టుకు తెలిపింది.
కోర్టులో భర్త, అత్తామామలు, తల్లిదండ్రుల ఎదుట తన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించింది. దాని ప్రకారం 19 ఏళ్ల వయసున్న తనకు రెట్టింపు వయసున్న భర్తతో జీవించాలని లేదని, ఆ సంగతి ఎన్నిసార్లు చెప్పినా భర్త వినక బాధిస్తున్నాడనీ, ఇంటి నుంచి పుట్టింటికి వెళితే తల్లిదండ్రులు బలవంతంగా మళ్లీ అతని వద్దకే పంపుతున్నారనీ, ఈ నేపథ్యంలో తనకు నచ్చిన వ్యక్తి దగ్గరకు వెళ్లిపోవాలన్నది ఆమె అభ్యర్థన.
ఈ వేడుకోలు విన్న కోర్టు ఇప్పటి వివాహంలో ఇంకా విడాకులు జరక్కపోయినా ఆమెను తనకు నచ్చిన వ్యక్తితో ఉండవచ్చని ఆర్డర్ పాస్ చేసింది. అంతే కాదు ఆమెకు నచ్చిన కుర్రాడిని పిలిచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకుంది. విడాకులయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని, అంతవరకుగాని ఆ తర్వాత గాని ఆమెను ఏ విధంగానూ బాధించనని ఆ కుర్రాడు హామీ ఇచ్చాడు. అయినప్పటికీ కోర్టు ఆరునెలల పాటు ‘శౌర్య దీదీ’ పరిశీలనలో ఉండాలని ఆమెను ఆదేశించింది. కోర్టు నియమించిన మహిళా అడ్వకేట్ ఆమెతో పాటు ఒక మహిళా కానిస్టేబుల్ ఆరు నెలల పాటు ఆమె జీవితాన్ని పరిశీలిస్తూ ఏదైనా సహాయం కావాలంటే చట్టపరంగా తక్షణం అందిస్తారు. ఇది మధ్యప్రదేశ్ ప్రభుత్వం గత కొన్నాళ్లుగా ‘శౌర్య దీదీ’ పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ.
Tags : 1