ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్
Breaking News
అచ్చం పండ్ల తరహాలో నోరూరించే డిజర్ట్స్..!
Published on Tue, 03/24/2026 - 16:51
కేకు కావచ్చు.. పూతరేకు కావచ్చు.. కాదేదీ కళకు అనర్హం అంటున్నారు ఆధునిక చెఫ్స్. తినిపించడానికి ముందు కనిపించే విధానంలోనూ వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. నోరూరించే రుచులను చూడగానే ఆకట్టుకునే కళా నైపుణ్యాన్ని అద్దుతున్నారు. అదే విధంగా తాను సృష్టించిన పేస్ట్రీలకు అచ్చమైన పండ్ల రూపాలను అందిస్తూ అంతర్జాతీయంగా వైరల్ అయ్యాడు పారిస్‌కు చెందిన ఓ ప్రముఖ చెఫ్. ఇప్పుడు ఆయన సృష్టించిన పండ్ల తరహా డిజర్ట్స్ భాగ్య నగరానికి కూడా వచ్చేయడం విశేషం.
సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం చాలా చిన్నదిగా మారిపోయింది. దుబాయ్‌లోని కునాఫా చాక్లెట్ నుంచి టోక్యోలోని మెత్తటి పాన్‌కేక్స్ వరకు ఖండాలను దాటి తరలివస్తున్న ఆహార ధోరణులను మనం నగరంలోనూ చూడగలుగుతున్నాం. ఇదే క్రమంలో సిటీకి వచ్చేసింది పారిస్ డిజర్ట్. పండ్ల ఆకారాన్ని పోలిన ఇవి చూసేందుకు కూడా పండ్లలా కనిపిస్తాయి. పేస్ట్రీ కళలోని నైపుణ్యాన్ని మనసుకు హత్తుకునేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు.
ఫ్యాషన్ క్యాపిటల్ నుంచి..
పారిస్ అనగానే ఫ్యాషన్ ప్రియుల కలల చిరునామా అని తెలిసిందే. మన డిజైనర్లకు అక్కడ ప్రదర్శనలో పాల్గొనడం అంటే జీవితకాలపు కల సాకారం కావడమే. అలాంటి వస్త్రశైలి గురించి మాత్రమే చర్చలు చేసే సిటీ.. తొలిసారి అక్కడి డిజర్ట్స్ గురించి కూడా మాట్లాడుతోంది. దీనికి కారణం అక్కడి ప్రసిద్ధ పేస్ట్రీ మేకింగ్ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ సృష్టించిన పండ్ల ఆకారపు స్వీట్లు.ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
డిజర్ట్ ట్రెండ్..
నిమ్మకాయలు, ఆపిల్, స్ట్రాబెర్రీ, పీచెస్.. ఇలా అనేక రకాల పండ్ల రూపాలకు ప్రతి సృష్టి చేస్తున్నారు. అచ్చం ఆయా ఫలాలను పోలిన రూపంలో సృష్టించిన డిజర్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి ప్రత్యేకంగా మారడానికి కారణం నిజమైన పండ్లలా అనిపించే వాటి రూపం మాత్రమే కాదు, రుచి కూడా. ఈ డిజర్ట్స్‌లో మూస్, కంపోట్, స్పాంజ్, చాక్లెట్ పొరలు రుచికరమైన ఆకృతులను సమతుల్యం చేశాయి. తద్వారా ఆధునిక పేస్ట్రీ వైవిధ్యానికి అంతర్జాతీయ చిహ్నంగా ఇవి మారాయి.
నగరానికి వచ్చేశాయ్..
అంతర్జాతీయంగా నెటిజన్లను ఆకట్టుకున్న ఈ పండ్ల ఆకారపు డిజర్ట్స్ ఇప్పుడు నగరంలోనూ సందడి చేస్తున్నాయి. బహుళ పొరలను ప్రదర్శించే ఈ స్వీట్ శిల్పాలను తెలంగాణ రాష్ట్రం బంజారాహిల్స్‌లోని నోమ్ కేఫ్ వంటి పేరున్న కేఫ్స్ అందిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా పర్షియన్ చెఫ్‌లను సైతం తీసుకొస్తున్నారు. ఈ ఫ్రూట్ డిజర్ట్స్ మెనూలో రాస్‌బెర్రీ, ఆర్కిటిక్ బ్లిస్ బెర్రీ, హాజెల్‌నట్, గ్రీన్ ఆపిల్, కొబ్బరి, బొప్పాయి, క్రౌన్ పియర్ వంటి రుచులు నగరంలో కొలువుదీరాయి.
(చదవండి: అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాయ్..! కానీ 17 కిలోమీటర్లు..)
Tags : 1