Breaking News

వింట‌ర్‌లో సెల్యులైటిస్‌తో స‌మ‌స్యా..? అయితే ఇలా చేయండి!

Published on Sun, 12/31/2023 - 10:45

'సెల్యులైటిస్‌ అనేది ఓ చర్మవ్యాధి. కొన్ని బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌లతో చర్మంపై పగుళ్లు రావడం,  ఎర్రబారడం, కొద్దిపాటి వాపు మంట వంటి లక్షణాలతో బాధించే ఈ వ్యాధి తాలూకు బాధలు చలికాలంలో ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా ఉన్నప్పుడు మరింత ఎక్కువవుతాయి. అసలు సెల్యులైటిస్‌ రావడానికి ఏయే అంశాలు కారణమవుతాయి, లక్షణాలేమిటి, చలికాలంలో ఇది ఎందుకిలా మరింత ఎక్కువగా బాధిస్తుంది వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.'

చర్మం పగుళ్లుబారినట్లుగా కనిపిస్తూ, కొద్దిపాటి వాపు, ఎర్రబారడం వంటి వాటితో వ్యక్తమయ్యే ఈ వ్యాధి స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్‌ వంటి బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. చర్మంపై ఒకచోట వస్తే మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకరినుంచి మరొకరికి వ్యాపించదు.

ప్రేరేపించే అంశాలు..
స్ట్రెప్టోకాకస్, స్టెఫాలోకాకస్‌ వంటి బ్యాక్టీరియా వల్ల వచ్చినప్పటికీ... కొన్ని అంశాలు దీన్ని తీవ్రతరం చేస్తాయి. అవి.. కాళ్లు, చేతుల్లోని రక్తనాళాల్లో ఏమైనా సమస్యలతో రక్తసరఫరాలో తేడాలు, ఊబకాయం, కాళ్లవాపులు, డయాబెటిస్‌, మద్యం తాగే అలవాటు కారణాలతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనం కావడం. 
లక్షణాలు..  
ఈ ఆరోగ్య సమస్యలో కనిపించే ఓ కీలకమైన అంశం ఏమిటంటే.. సాధారణంగా సెల్యులైటిస్‌ దేహంలోని ఒకవైపునే కనిపిస్తుండటం విశేషం. ఈ వ్యాధి ఉన్నవారిలో కనిపించే సాధారణ లక్షణాలివి..

  • ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కలకు వ్యాపిస్తూ ఉంటాయి. 
  • వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోవడం (టెండర్‌నెస్‌)
  • నొప్పి, వేడిగా అనిపించడం
  • జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరంగా వ్యక్తం కావడం
  • సెల్యులైటిస్‌ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్‌) రావడం.
  • కొందరిలో చర్మంపై గుంటల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపించడం (స్కిన్‌ డింప్లింగ్‌)

చలికాలంలో బాధలు ఎందుకు పెరుగుతాయంటే..
సెల్యులైటిస్‌ లక్షణాలతో వచ్చే బాధలు చలికాలంలో పెరగడానికి, ఈ సీజన్‌లో చర్మంపై కనిపించే కొన్ని అంశాలు దోహదపడతాయి. ఉదాహరణకు..

చర్మం పొడిబారడం (డ్రైస్కిన్‌):
ఈ సీజన్‌లో తేమ తగ్గడంతో చర్మం బాగా పొడిబారిపోతూ ఉండటం చాలామందికి అనుభవంలో వచ్చే విషయమే. పైగా చలిగాలులకు వెళ్లినప్పుడు మరింతగా పెరుగుతుంది. ఇలా పొడిబారిన చర్మం బ్యాక్టీరియా చేరడానికి అనువుగా ఉంటుంది. దాంతో సెల్యులైటిస్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సీజన్‌లో మాయిశ్చరైజర్లతో చర్మాన్ని తేమగా ఉంచుకుంటే ఇలా పగుళ్లుబారడంతో పాటు సెల్యులైటిస్‌నూ నివారించవచ్చు.

వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనపడటం / వ్యాధినిరోధక శక్తి తగ్గడం:
చలికాలంలో మామూలుగానే వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరు కాస్త మందగించే అవకాశముంది. దీనికి తోడు డయాబెటిస్‌ ఉండటం, మద్యం అలవాట్ల వంటివి ఉంటే అది వ్యాధి నిరోధక వ్యవస్థను మరింత మందకొడిగా మార్చవచ్చు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సమతులాహారం తీసుకోకపోవడం, ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ వంటి పోషకాలు తక్కువగా ఉండటం లాంటి అంశాలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశముంది.

సెల్యులైటిస్‌ నివారణ ఇలా...

  • చర్మాన్ని శుభ్రంగా, తేటగా ఉంచుకోవాలి.
  • ఘాటైన రసాయనాలతో కూడిన వాసన సబ్బులు కాకుండా, మైల్డ్‌ సోప్‌ వాడాలి.
  • మిగతా చర్మంతో పోలిస్తే.. మేనిపై పొడిగా ఉండే భాగాలైన మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్‌ వంటివి రాసి, తేమగా ఉండేలా చూసుకోవడం మంచిది.
  • చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం చేయకూడదు.
  • గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే అక్కడి నుంచి బ్యాక్టీరియా చర్మంపై దాడి చేసే అవకాశాలుంటాయి. 
  • చలికాలంలో చర్మానికి మంచి రక్షణ కలిగేలా, ఒళ్లంతా కప్పి ఉంచేలాంటి దుస్తులు వాడటం మేలు.
  • చలిగాలులు వేగంగా తాకకుండా ఉండేలా దుస్తులు ఉండాలి.
  • తమ వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు.
  • ఇల్లు శుభ్రం చేసుకోవడం, తోటపని వంటి మన రోజువారీ కార్యక్రమాల్లో చర్మానికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తపడాలి.
  • ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్‌ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్‌ క్రీమ్స్‌ వంటివి రాస్తూ, గాయాలు వేగంగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. 
  • పాదాల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా బాగా పొడిబారి పగుళ్లకు అవకాశం ఉండే మడమలు, అలాగే వేళ మధ్యభాగాలు తేమతో, ఆరోగ్యంగా ఉంచుకునేలా జాగ్రత్త వహించాలి. రోజూ తగినన్ని నీళ్లు తాగాలి.
  • వ్యాధినిరోధక వ్యవస్థ చురుగ్గా ఉండేందుకు అన్ని పోషకాలూ, విటమిన్లు, మినరల్స్‌తో కూడిన మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. 
  • డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, తమ జబ్బులను అదుపులో పెట్టుకునేలా క్రమం తప్పకుండా మందులు వాడటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • క్రమం తప్పకుండా ఆరోగ్యపరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.

చివరగా.. చలికాలంతో కొన్ని సౌకర్యాలున్నప్పటికీ.. దాంతోపాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలనూ తీవ్రం చేసే సీజన్‌ అది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చర్మాన్నీ, దేహాన్నీ ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ సీజన్‌ నిరపాయకరంగా గడిచిపొతుంది.

ఇవి చ‌ద‌వండి: వింట‌ర్‌లో ముఖం తేట‌గా ఉండాలంటే వెంట‌నే ఇలా చేయండి!

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)