Breaking News

మాటల్లో మార్పు రాకపోతే బంధాల్లో మార్పు రాదు

Published on Sun, 06/15/2025 - 10:31

తల్లిదండ్రుల మాటలు పిల్లల్లో భద్రతనివ్వాలి, బలమవ్వాలి, ఉత్సాహాన్ని నింపాలి. కానీ చాలా సందర్భాల్లో అవే మాటలు పిల్లల్లో భయాన్ని నాటేస్తాయి. దాంతో పిల్లలు తమ తప్పులను భయంతో దాచడం నేర్చుకుంటారు. లేదా మౌనంగా తిరగబడతారు. చివరకు తల్లిదండ్రుల ప్రేమకూ, పిల్లల బాధకూ మధ్య ఓ అఘాతం ఏర్పడుతుంది. 

ఇలా జరగకుండా ఉండాలంటే, పిల్లల వ్యక్తిత్వాన్ని చిన్నబుచ్చే మాటలు; ప్రేమను బెదిరింపుగా మార్చే పదాలు; పిల్లల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించే వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలి. వాటిని మార్చుకుని పిల్లల్లో ఆశనూ, ఆశయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మాట్లాడాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. 

‘‘నీకు అన్నీ కొనిపెడుతున్నాం, చదివిస్తున్నాం. ఇంకేం కావాలి?’’
చాలామంది తల్లిదండ్రులు ఈ వాక్యాన్ని ప్రేమతో, బాధ్యతతో, త్యాగాన్ని గుర్తుచేసే కోణంలో చెబుతారు. కాని, పిల్లలకు ఇది లావాదేవీలా అనిపిస్తుంది. ప్రేమ అనేది కేవలం తినిపించడం, చదివించడం వంటి బాహ్య సౌకర్యాలకు మాత్రమే పరిమితం అనుకుంటారు. దాంతో, వారు తమ ఎమోషనల్‌ అవసరాలను తల్లిదండ్రుల నుంచి కాకుండా, బయటి ప్రపంచం నుంచి పొందాలని ప్రయత్నిస్తారు. కొంచెం సానుభూతి చూపినా వారికి దగ్గరవుతారు. 

(చదవండి: హాట్‌టాపిక్‌గా విమానంలోని 11A సీటు..ఎవ్వరూ ఎందుకిష్టపడరంటే..?)

‘‘నీకు అన్నీ సమకూర్చడం పేరెంట్స్‌గా మా బాధ్యత. నువ్వు ఆనందంగా ఉన్నావా?’’ అని అడిగితే చాలు. తల్లిదండ్రులు తనతోనే ఉన్నారనే అనుభూతిని పెంచుతుంది. ‘నా భావాలు తల్లిదండ్రులకు ముఖ్యం’ అనే భద్రతా భావన పెరుగుతుంది. కంగారు పడకుండా తమ బాధలను, కలలను, భయాలను పంచుకుంటారు. తల్లిదండ్రుల పట్ల గౌరవం, అనుబంధం, కృతజ్ఞత లాంటి భావాలు పెరుగుతాయి. 

‘‘నీ కోసమే బతుకుతున్నా!’’
ఈ వాక్యం తల్లిదండ్రుల త్యాగాన్ని చెప్పేదే అయినా, బిడ్డ వల్లనే తన బతుకు భారమైపోయిందన్న సందేశాన్ని పంపిస్తుంది. ‘‘అమ్మ, నాన్న నాకోసం జీవితాన్నే వదిలేశారు. మరి నేను నా కోరికల కోసం బ్రతికితే ఎలా?’’ అనే భావనను నాటుతుంది. కోర్సులు, కెరీర్, పెళ్లి నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోలేరు. ప్రేమ అనేది త్యాగం కావాలన్న తప్పుడు నమ్మకం వారిలో చెరగని చిహ్నంలా మిగిలిపోతుంది. తర్వాత కూడా ఇతరులతో సంబంధాల్లో తామే త్యాగం చేయాలన్న కండిషనింగ్‌తో బతకాల్సి వస్తుంది.  

‘‘నీతో జీవించడం నా జీవితంలో అతి గొప్ప భాగం. నువ్వు నీ పంథాలో నడవాలి, నేను నీ వెంటే ఉంటాను’’ అని చెప్పి చూడండి. ఈ ఒక్క వాక్యంలో ఆత్మీయత, స్వేచ్ఛ, అనుబంధం మూడూ వ్యక్తమవుతాయి. తల్లిదండ్రుల ప్రేమ నిబంధనలపై ఆధారపడదన్న నమ్మకంతో వారు తమ నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతారు. కొడుకు/కూతురు అనే పరిధిలో కాకుండా తమ వ్యక్తిగతమైన గమ్యాన్ని అన్వేషించే బలమైన వ్యక్తిగా ఎదుగుతారు.

‘‘నీ మాటలు వింటుంటే గుండె పగిలిపోతుంది!’’
ఈ వాక్యం తల్లిదండ్రుల భావోద్వేగ బాధను వ్యక్తపరుస్తోంది అనిపించినా, నిజానికి ఇది పిల్లల వ్యక్తిత్వ అభివ్యక్తిని అణచివేసే వాక్యం. తమ మాటలు పెద్దవాళ్లకు బాధ కలిగించవచ్చని, కాబట్టి నిశ్శబ్దంగా ఉండటమే మంచిదన్న అభిప్రాయాన్ని నాటుతుంది. దీంతో పిల్లలు తమ అసలు భావాలను పంచుకోకుండా దాచేస్తారు. ఫేక్‌ పర్సనాలిటీలో జీవించడం ప్రారంభిస్తారు. దీర్ఘకాలంలో ఇది యాంగ్జయిటీ, డిప్రెషన్‌ లేదా కోపానికి దారి తీస్తుంది. 

దీనికి బదులుగా ‘‘నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసుకోవాలనుంది. అదేమిటో చెప్పడం వల్ల మనం నిజంగా దగ్గర కావచ్చు’’ అని చెప్పడం వల్ల పిల్లలలో భద్రతను, విశ్వాసాన్ని, స్పష్టతను నాటుతుంది. ఎలాంటి భావాలనైనా తల్లిదండ్రులతో పంచుకోవాలనిపిస్తుంది. వారు తమ నిజమైన భావాలను అంగీకరించడంలో సామర్థ్యం, ఆత్మగౌరవం పెరుగుతుంది.

‘‘నువ్విలా ఉంటే నీతో ఎవ్వరూ కలవరు!’’
ఈ వాక్యం ఇతర మాటలకంటే తీవ్రంగా పిల్లల ఆత్మగౌరవంపై తీవ్రమైన దెబ్బ తీస్తుంది. తమ వ్యక్తిత్వం పట్ల అసహనం, తమలో మారలేని లోపాలు ఉన్నాయన్న అపోహ, భవిష్యత్తులో ఒంటరిగా ఉండిపోతామన్న భయం నాటుతుంది. దీనివల్ల సోషల్‌ యాంగ్జయిటీ మొదలవుతుంది. వారిని బంధాలకు దూరంగా ఉంచుతుంది. 

ఇతరులకు నచ్చేందుకు తమ అసలైన భావనలను, అభిరుచులను దాచిపెడతారు. ‘‘నేను కలవదగిన వ్యక్తిని కాను’’ అన్న కోర్‌ బిలీఫ్‌ బలపడుతుంది.‘‘నువ్వు మారాలనుకునే క్షణం నుంచే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారటం మొదలవుతుంది’’ అని చెప్తే మార్పును శిక్షగా కాక, శక్తిగా చూపుతుంది. 

‘నాలో మార్పు సాధ్యమే’, ‘నేను మారగలను’ అనే గ్రోత్‌ మైండ్‌ సెట్‌ను నాటుతుంది. దీనివల్ల నా జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయనే భావన చిగురిస్తుంది. మార్పు అవకాశం బయట ఎక్కడో లేదని, తనలోనే మొదలవుతుందనే ఇంట్రాస్పెక్షన్‌తో పిల్లలు ఎదుగుతారు. 
సైకాలజిస్ట్‌ విశేష్‌
www.psyvisesh.com

(చదవండి: అంతటి ప్రమాదంలోనూ చెక్కుచెదరని భగవద్గీత..! వీడియో వైరల్‌)
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)