Breaking News

ఆకాశానికి ఆమె పేరు.. విశ్వానికి కొత్త చూపు...

Published on Tue, 09/01/2026 - 04:57

నక్షత్రాల వైపు చూడొద్దన్నారు... కానీ ఆ నక్షత్రాల మధ్యే తన పేరు రాసుకుంది. అమ్మాయిలకు సైన్స్ ఎందుకన్నారు... కానీ ఆ సైన్స్ చరిత్రలోనే తన సంతకాన్ని  చిరస్థాయిగా నిలుపుకుంది. అంతరిక్ష పరిశోధనల్లో మగవాళ్ల పేర్లే పై చేయి అవుతున్న చోట నింగిని చూసే సరికొత్త కళ్లకు తన పేరును బహుమతిగా ఇచ్చిందామె. నాసా నిన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఫ్లాగ్‌షిప్‌ స్పేస్‌ టెలిస్కోప్‌కు ఆమె పేరే పెట్టింది.‘నాన్సీ గ్రేస్‌ రోమన్‌’... ఆ అసాధారణ మహిళా శాస్త్రవేత్త స్ఫూర్తి గాథ ఇది.

‘అమ్మాయిలు హోమ్‌సైన్స్‌ మాత్రమే చదవరు.
అంతరిక్షాన్ని కూడా ఛేదిస్తారు’.... అన్నది ఆ అమ్మాయి ‘ఏం చదువుతావు’ అని అడిగిన స్నేహితులతో. ఆగస్ట్‌ 30, 2026. కెన్నడి స్పేస్‌ సెంటర్‌ నుంచి నాసా... ‘హబుల్‌’ కంటే వందరెట్లు శక్తివంతమైన సరికొత్త టెలిస్కోప్‌ను నింగిలోకి పంపింది. దానితో పాటు ‘రోమన్‌’ అనే అక్షరాలు కూడా నింగిలోకి వెళ్లాయి. 

ఎందుకంటే ఆ టెలిస్కోప్‌కు నాసా ‘నాన్సీ గ్రేస్‌ రోమన్‌’ పేరు పెట్టింది. ఒకప్పుడు ప్రపంచం ఆమెను తారలకు దూరంగా పెట్టాలని చూస్తే నేడు ఆ పేరు ఏకంగా ఆకాశానికే చేరింది. అంతరిక్ష రంగంలో హబుల్, జేమ్స్‌ వెబ్‌ వంటి ప్రసిద్ధ పురుషుల పేర్లే వినిపిస్తుంటే ఆ పురుషాధిక్య కోటను బద్దలు కొడుతూ మారుమోగుతున్న నాన్సీ గ్రేస్‌ రోమన్‌ ఎవరు?

అమ్మాయిలకు సైన్స్ ఎందుకు? 
1925లో అమెరికాలో జన్మించిన నాన్సీకి ఐదేళ్ల వయసులోనే నక్షత్రాలంటే పిచ్చి. హైస్కూల్‌ చదివే రోజుల్లో ఆమె ‘ఆస్ట్రానమీ క్లబ్‌’ పెట్టాలని చూస్తే ‘ఇది అమ్మాయిల సబ్జెక్ట్‌ కాదు, నువ్వు హోమ్‌ సైన్స్ చదువుకో’ అని టీచర్లు నిరుత్సాహపరిచారు. కాని నాన్సీ వినలేదు. సైన్స్‌ చదవడం తన కల అని చెప్పింది. కాలేజీలో ఫిజిక్స్‌ చదువుతున్నప్పుడు ఆ డిపార్ట్‌మెంట్‌లో ఆమె ఒక్కతే అమ్మాయి. 

1949లో చికాగో యూనివర్సిటీలో ఖగోళ శాస్త్రంలో పిహెచ్‌.డి. చేస్తున్నప్పుడు విచిత్రమైన వివక్ష ఎదురైంది. ఆడవాళ్లు రాత్రిపూట అబ్జర్వేటరీ (నక్షత్రశాల)లో ఉండకూడదనే నిబంధనతో ఆమెను రానిచ్చేవారు కాదు. నక్షత్రాలను చూడకుండా పరిశోధన చేయాలన్నమాట. దానికీ నాన్సీ వెనకడుగు వేయలేదు. పగలంతా డేటాను విశ్లేషించి, రాత్రిపూట అసిస్టెంట్స్‌తో పరిశీలనలు చేయించేది.

 అలా ఆమె చేసిన ‘నక్షత్రాల కదలికల పరిశోధన’ (ఉర్సా మేజర్‌ మూవింగ్‌ గ్రూప్‌) ఎంత గొప్పదంటే ఇప్పటికీ ఖగోళ శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో  ప్రాథమిక పాఠంగా నిలిచింది. నక్షత్రాల వయసును బట్టి వాటి కదలికలు, అవి ఉండే గెలాక్సీ  ప్రాంతాలు మారుతాయని నాన్సీ కనిపెట్టిన విషయం ఖగోళ శాస్త్రంలో పెద్ద దార్శనికత అయ్యింది. అయినప్పటికీ ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరితే మగ ప్రొఫెసర్ల జీతంలో 60 శాతం మాత్రమే ఇచ్చేవారు. కారణం? ఆమె స్త్రీ కావడమే!

సొంత క్యాబిన్‌ కూడా లేని చీఫ్‌!
1959లో నాసా ఏర్పడితే, కేవలం ఆరు నెలలకే నాన్సీని పిలిచి ‘చీఫ్‌ ఆఫ్‌ ఆస్ట్రానమీ’గా బాధ్యతలు అప్పగించారు. అప్పటికే ఆమె ఖ్యాతి అది. దాంతో నాసా చరిత్రలో అత్యున్నత ఎగ్జిక్యూటివ్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా నిలిచింది. 

అయినా ఆఫీసులో వివక్ష తప్పలేదు. మొదట్లో ఆమెకు సొంత క్యాబిన్‌ కూడా ఇవ్వలేదు. మీటింగుల్లో మగవాళ్లు ఆమె మాటను లెక్కచేసేవారు కాదు. అయినా తలవంచకుండా నిలబడింది. ‘టెలిస్కోపులను భూమి మీద కాకుండా ఆకాశంలో పెడితేనే విశ్వం గుట్టు విప్పగలము’ అనే తన ఆలోచనను నిజం చేయడానికి పోరాడింది.

మదర్‌ ఆఫ్‌ హబుల్‌
భూమి వాతావరణం అంతరిక్షంలోని నక్షత్రాలను చూడటానికి అడ్డు. అందుకే టెలిస్కోపును నేరుగా అంతరిక్షంలోకి పంపాలని నాన్సీ గ్రహించింది. ఒక భారీ అంతరిక్ష టెలిస్కోప్‌ను నిర్మించాలని ఆమె ప్రతిపాదించినప్పుడు.. ‘ఇది చాలా ఖరీదైన వ్యవహారం’ అంటూ అందరూ చేతులెత్తేశారు. అయినా నాన్సీ వెనక్కి తగ్గలేదు.

 అమెరికన్‌ పార్లమెంట్‌ దగ్గరకు స్వయంగా వెళ్లి,  ప్రాజెక్ట్‌  ప్రాముఖ్యతను వివరించి ఒప్పించింది. ఆమె చేసిన అలుపెరగని పోరాటం 1990లో చారిత్రాత్మక ‘హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ను నింగిలోకి ప్రవేశపెట్టింది. విశ్వం వయసును లెక్కగట్టడంలో, ‘బ్లాక్‌ హోల్స్‌’ ఉనికిని ప్రపంచానికి చూపించడంలో హబుల్‌ సాధించిన విజయాల వెనుక నాన్సీ కృషే ఉంది. అందుకే ఆమెను ‘మదర్‌ ఆఫ్‌ హబుల్‌’ అంటారు.

 ప్రాజెక్టును కాపాడిన ఆమె పేరు
2018లో, 93 ఏళ్ల వయసులో నాన్సీ కన్నుమూసినా ఆమె పేరుకు ఉన్న విలువ అమెరికాలో కొనసాగుతూనే ఉంది. హబుల్‌ కంటే వందరెట్లు సామర్థ్యం ఉన్న కొత్త అంతరిక్ష టెలిస్కోపు  ప్రాజెక్టుకు నాసా సిద్ధమైనప్పుడు బడ్జెట్‌ కారణాల వల్ల ఐదుసార్లు రద్దు చేయాలని చూశారు. అయితే నాసా సైన్స్ హెడ్‌ థామస్‌ జుర్బుచెన్‌ మాస్టర్‌ ΄్లాన్‌ వేసి ఆ  ప్రాజెక్టుకు నాన్సీ పేరు పెట్టాడు. ఆ పేరు పెట్టిన  ప్రాజెక్టును మూలన పడేయడం అప్రదిష్ట కనుక అడ్డంకి తొలిగి పోయింది.

 2020లో నాసా ఈ  ప్రాజెక్టును ‘నాన్సీ గ్రేస్‌ రోమ¯Œ స్పేస్‌ టెలిస్కోప్‌’ అని ప్రకటించి గౌరవించింది. ఈ భారీ టెలిస్కోప్‌ ఆగస్టు 30న రాకెట్‌ సహాయంతో విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి ప్రస్తుతం ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన నిర్దేశిత కక్ష్య వైపు పయనిస్తోంది. త్వరలో విశ్వాన్ని చూసే కొత్త చూపు మానవజాతికి ఇవ్వనుంది. ఇకపై ఆకాశంలో మెరిసే ప్రతి నక్షత్రం నాన్సీ పేరు వల్ల కూడా మరింత ఉజ్వలంగా వెలగనుంది.       

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)