Breaking News

నవతరానికి తెలియని... నిజామ్ కాలపు కళాకారిణి!

Published on Sun, 04/26/2026 - 15:52

ఎక్కడో ఆస్ట్రేలియాలో పుట్టి, వయోలా వాద్యం నేర్చుకొన్న ఓ అమ్మాయి... ఓ అమెరికన్ సినిమాలో నేపథ్యంలో వినిపించిన ప్రసిద్ధ గాయకుడు నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట విని, దక్షిణాసియా ప్రాంతపు ప్రత్యేక సంగీత రీతులపై ప్రేమ పెంచుకుందంటే నమ్మగలరా? బ్రిటన్ చేరిన ఆ అమ్మాయి ఆ సంగీతాభిరుచిని కొనసాగించింది.  ఏకంగా సంగీతంలోనే పరిశోధన చేసి, ఇవాళ నిజామ్ కాలపు సంగీతం, సంగీతజ్ఞుల కథలపై సాధికారిక రచయిత్రిగా మారింది. 18వ శతాబ్దంలో మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు పాలనా శకంలోకి భారతదేశం జారిపోతున్న వేళ... మన సంగీతం, సంగీతజ్ఞులు, తవాయిఫ్‌ల జీవితాలలో సాగిన ప్రయాణం, వచ్చిన మార్పులకు అక్షర రూపం ఇచ్చింది. స్లయిడ్ల రూపంలో అలనాటి చిత్రపటాలు, ఛాయాచిత్రాలు చూపిస్తూ, ఆ కథలన్నీ ఆమె చెబుతుంటే, ఎవరైనా కళ్ళు, చెవులు అప్పగించక తప్పదు.

మరీ ముఖ్యంగా చాలామందికి తెలియని మన హైదరాబాదీ చరిత్ర చెబుతుంటే, నేటికీ నాంపల్లిలో ఆనవాళ్ళున్న నిజామ్ కాలపు అపురూప కళాకారిణి – కవయిత్రి – పలుకుబడి గల వేశ్యామణి మాహ్ లఖా బాయ్ (1768-1824) జీవితం వివరిస్తుంటే అబ్బురంగా అనిపిస్తుంది. లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్‌తో మన భాగ్యనగరం నడిబొడ్డున విద్యారణ్య స్కూల్‌ విశాల ప్రాంగణంలో ‘మంథన్’ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రసంగం చరిత్ర, సంగీత, సంస్కృతీ ప్రియులకు అక్షరాలా అలాంటి అనుభవాన్నే అందించింది.

మనకు తెలీని మన చరిత్ర... ఓ పాశ్చాత్య మహిళ పరిశోధన...
క్యాథరిన్ ప్రాథమికంగా దక్షిణాసియా ప్రాంత సంగీతం, చరిత్రను అధ్యయనం చేసి, అక్షరబద్ధం చేస్తున్న చరిత్రకారిణి. ఇప్పటి వరకు లోచూపుకు నోచుకోని విస్తారమైన భారతీయ రచనలు, అలాగే అలనాటి చిత్రకారులు గీసిన బొమ్మల లాంటి విజువల్ సోర్స్‌లపై ఆమె ప్రధానంగా దృష్టి పెట్టారు. మౌలికమైన పరిశోధన సాగిస్తున్నారు. 

అందులో భాగంగా ఆమె మన హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. సంగీతంతో ముడిపడిన పలువురు పాతకాలపు కళాకారుల కథలను జనం ముందుకు తెస్తున్నారు. ఆ క్రమంలోనే ఆనాటి పరిస్థితులు, ఆ కాలపు వ్యక్తుల స్వతంత్రత, అనుబంధాలు, అనురాగాలు, అధికార వ్యవస్థ అన్నింటినీ అక్షరబద్ధం చేసి, చర్చకు పెట్టడం రచయిత్రిగా, పరిశోధకురాలిగా క్యాథరిన్ ప్రత్యేకత.

ప్రస్తుతం క్యాథరిన్ లండన్‌లోని సుప్రసిద్ధ కింగ్స్ కాలేజ్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యూజిక్‌కు హెడ్‌. దాదాపు 25 మంది దాకా పీహెచ్డీ విద్యార్థులు చరిత్ర, మానవశాస్త్రం, దక్షిణాసియాలోని పలు సంగీత సంస్కృతుల ప్రదర్శన లాంటి వివిధ అంశాలపై ఆమె సారథ్యంలోనే పరిశోధన చేయడం విశేషం. 

మొఘల్, దక్కనీ, దక్షిణాసియాలో వలస పాలకుల కాలపు కళలు, సంస్కృతి తదితర అంశాలపై క్యాథరిన్ ప్రసంగాలకు బోలెడంత డిమాండ్. బ్రిటీష్ లైబ్రరీ నుంచి మన జైపూర్ లిటరరీ ఫెస్టివల్ దాకా ఆమె ప్రసంగించని వేదిక లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం సంగీతం, సంగీత కళాకారులపై ఆంక్షలు విధించినప్పుడు దాన్ని నిరసిస్తూ, అంతర్జాతీయ వేదికపై అందరినీ కూడగట్టడంలోనూ ఆమె కీలకపాత్ర పోషించడం విశేషం.

 

క్యాథరిన్ పరిశోధించి రాసిన ‘మ్యూజిక్ అండ్ మ్యుజీషియన్స్ ఇన్ లేట్ మొఘల్ ఇండియా: హిస్టరీస్ ఆఫ్ ది ఎఫిమెరల్ (1748 – 1858)’ అనేక ఇతర అంశాలతో పాటు మన నిజామ్ పాలనా కాలపు హైదరాబాద్ సంగతులనూ పాఠకుల ముందుకు తెచ్చింది. అందులో - మొఘల్ చక్రవర్తుల ఏలుబడిలో, ఆ పైన బ్రిటీషు వారి ఆరంభ కాలంలో... ఢిల్లీ నుంచి లక్నో, హైదరాబాద్, జైపూర్ దాకా వివిధ ప్రాంతాల్లో, పర్షియన్, వ్రజ భాష, ఉర్దూ, ఇంగ్లీషుల్లో సాగిన సంగీత రచనల ఆధారంగా తొమ్మిదిమంది సంగీత కళాకారుల జీవితాలను పాఠకుల ముందు పెట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మొఘలాయీల యుగం నుంచి బ్రిటీషు వారి శకంలోకి మారుతున్న ఆ కాలంలో మన సాంస్కృతిక, కళా రంగం ఎలా దానికి ప్రతిస్పందించిందన్నది ఆ రచన ప్రధానమైన దృష్టి కోణం.

అపురూపమైన ఆ పరిశోధనాత్మక కృషిని ప్రపంచ ప్రసిద్ధ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ 2022లో పుస్తకంగా ప్రచురించింది. ఆశ్చర్యపరిచే ఆ కృషికి అనుబంధంగానే, హైదరాబాద్‌లోని ‘మంథన్’ సంస్థ ఆధ్వర్యంలో ‘స్టోరీస్ ఆఫ్ మ్యూజికల్ లైఫ్ ఇన్ నిజామీ హైదరాబాద్ (క్రీ.శ. 1780-1830)’ అన్న అంశంపై ఏప్రిల్ 24న క్యాథరిన్ తన తాజా ప్రసంగం చేశారు. ఎంతో లోతైన వివరాలు, విశ్లేషణ, అందుకు ఆధారభూతమైన చరిత్ర గ్రంథాలు, పరిశోధనలో తనకు కలిగిన స్వీయాభిప్రాయాలను సభికులతో ఆమె పంచుకున్నారు.

ప్రాణం పోసుకున్న నిజామ్ గజల్ గాథలు!
సరిగ్గా గంటసేపు సాగిన ప్రసంగంతో అప్పటి నిజామ్ కాలానికి తీసుకువెళ్ళారు క్యాథరిన్. పరిశోధనలో భాగంగా హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియమ్, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు లండన్ లోని బ్రిటీష్ లైబ్రరీ, అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ దాకా అనేక చోట్ల నుంచి ఆమె ఎంతో అరుదైన సమాచారం సేకరించారు. 

అలా తాను సేకరించిన అనేక ప్రాచీన ఉర్దూ, పర్షియన్ రచనా ప్రతులలోని బొమ్మలు, సంగతులను ఆమె తన ప్రసంగంలో పంచుకున్నారు. మాటల్లో సందర్భానుసారంగా... నిజామ్ కాలపు చిత్రకారులు వెంకటచలం సహా పలువురు గీసిన చిత్రాలను ప్రదర్శించడంతో ఆనాటి సంగతులు కళ్ళకు కట్టినట్టయింది. జగత్ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ తీసిన అలనాటి హైదరాబాద్ ఛాయాచిత్రాలనూ ఉపయోగించారు.

ప్రసిద్ధ నర్తకి మాహ్ లఖా బాయ్, ఆమెకు సంగీతం నేర్పిన గురువు - తాన్‌సేన్ వంశీకుడైన ఖుషాల్ ఖాన్ ‘అనూప్’, వారి గురు – శిష్య సంబంధం, అలాగే ఆమెతో సాన్నిహిత్యం సాగించిన మరాఠా యోధుడు రాజా రావ్ రన్‌భా తదితరులను వెరసి, ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించించారు. వెరసి, అలనాటి నిజజీవిత పాత్రలు అనేకం ఆ అనర్గళ ప్రసంగంలో ప్రేక్షకుల ముందు ప్రాణం పోసుకున్నాయి. 

నిజామ్ చరిత్రలో ప్రసిద్ధుడైన మీర్ ఆలమ్ మరణానంతరం మహారాజా చందూలాల్ ప్రధానమంత్రి అయ్యారు. “బ్రిటీషు, రాజకీయ అతిథులను ఆకట్టుకొనేందుకు ఆయన మాహ్ లఖా బృందంతో భారీ నృత్య, గాన ప్రదర్శనలు ఏర్పాటు చేయించేవారు. . ఆయనకూ, మాహ్ లఖా బాయ్‌కీ అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది” అని క్యాథరిన్ పాత కథలు తవ్వి పోశారు.

1798లో నిజామ్‌కూ, ఈస్టిండియా కంపెనీ వారికీ మధ్య ఒప్పందం కుదిరింది. నిజామ్ సంస్థాన రక్షణ బాధ్యతలు చేపట్టిన బ్రిటీషు సేనలు ఆ నిమిత్తం అన్నట్టుగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ ఏరియాలో దండు విడిచాయి. ఇక, హైదరాబాద్‌లో ప్రత్యేక బ్రిటీషు రాజప్రతినిధికి బ్రిటీష్ రెసిడెన్సీ ఏర్పాటైంది. ఆ సంగతులతో పాటు భారతీయ సంగీతం, సంగీత కళాకారులపై బ్రిటీషు వారి ప్రభావాన్ని క్యాథరిన్ ప్రస్తావించారు. 

మన సుదీర్ఘమైన రాగప్రదర్శన బ్రిటీషర్లకు అర్థం కావడం కష్టం. అందుకని, అప్పట్లో తవాయిఫ్‌లు గజల్స్ లాంటివి గానం చేసేవారు. నృత్యగీతాలతో అలరించేందుకు ప్రయత్నించేవారు అని తెలిపారు. ఆనాటి పాపులర్ నృత్యగీతాల బాణీని బ్రిటీషర్లు ఇట్టే పట్టుకొని, దాన్ని ఎలా తమదైన పద్ధతిలో పాడేదీ క్యాథరిన్ స్వయంగా ఆలపించి వినిపించి, సభికుల కరతాళధ్వనులు అందుకున్నారు.

నాంపల్లి, మౌలాలీ సాక్షిగా... నేటికీ ఆ ఆనవాళ్ళు
“1738 నాటికే... గోల్కొండ ప్రాంతం ఎంతో ప్రముఖమైనది. హైదరాబాద్ చాలా కీలకమైన కేంద్రం. పంజాబీ ఖత్రీల మొదలు ఇరానియన్ల వరకు ఎన్నెన్నో ప్రాంతాలు, వర్గాలకు చెందిన పలువురు మేధావులు, అధ్యయనశీలురు, సైనిక యోధులు, అద్భుతమైన వృత్తినిపుణులు హైదరాబాద్‌కు వలస వస్తుండేవారు. అదీ హైదరాబాద్ ఘన చరిత్ర” అని క్యాథరిన్ విశ్లేషించారు. 

1768లో జన్మించిన మాహ్ లఖా బాయ్ జీవితంలోని ముఖ్యాంశాలను ఆమె వివరించారు. “1824లో చనిపోయే వరకు నాంపల్లి ప్రాంతంలోనే మాహ్ లఖా నివసించారు. ఆమె నమ్మి, ప్రార్థించిన మౌలాలీకి భక్తిసమర్పణంగా మరణానంతం సికింద్రాబాద్‌లోని మౌలాలీ గుట్ట పాదాల చెంత తన తల్లి సమాధి పక్కనే ఆమె భౌతికకాయాన్ని కూడా సమాధి చేశారు. ఇవాళ్టికీ వాటిని చూడవచ్చు.”

స్వీయ ఉర్దూ గజల్స్‌ను సమగ్రమైన సంపుటిగా పుస్తక రూపంలో తెచ్చిన తొలి భారతీయ వేశ్యామణి (తవాయిఫ్) మాహ్ లఖా బాయ్. నిజామ్ సంస్థానంలో సాక్షాత్తూ పాలకులకే ప్రభుత్వ విధానాలు, దౌత్యానికి సంబంధించి సలహాలు, సూచనలు అందించిన బహుముఖ ప్రజ్ఞావంతురాలు. నాటి హైదరాబాద్ నిజామ్ సంస్థానంలోని ఓ ప్రియమైన వేశ్యకు దత్త పుత్రికగా పెరిగిన మాహ్ లఖా అత్యుత్తమ గురువుల వద్ద సమగ్ర శిక్షణ పొందారు. 

ఆ రోజుల్లోనే కళాకారిణిగా, చింతనాశీలిగా, గుర్రపుస్వారీ, ఈటె విసరడం, ధనుర్విద్య, వేటాడడంలో దిట్టగా, చివరకు యుద్ధం సైతం చేయగల వీరవనితగా ఎదిగిన తీరు ఇవాళ తలుచుకుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజుల్లోనే ఆమెను రాజాస్థానంలో కులీనుల వర్గంలోని పెద్దల్లో ఒకరి (సీనియర్ ఉమ్రాహ్)గా నిజామ్ రాజు చేర్చుకోవడం విశేషం.

ఆ రోజుల్లో నిజామ్ రాజు ఆమెకు ఇచ్చిన జాగీర్లలో... నేటి హైదర్ గూడా, చందానగర్, సయ్యద్ పల్లి, అడికిమెట్ తదితర ప్రాంతాలున్నాయి. మొత్తానికి, కవయిత్రిగా, కథక్ నర్తకిగా, హిందుస్తానీ శాస్త్రీయ గాయనిగా, ఆ లలిత కళలన్నీ ఆడపిల్లలకు నేర్పేందుకు పాఠశాలలు స్థాపించిన వ్యక్తిగా మాహ్ లాఖాది విలక్షణమైన కథ. 

ప్రస్తుతం నాంపల్లిలో బజార్ ఘాట్ దగ్గర, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ కార్యాలయానికి సమీపంలో నెలకొన్న ఎం.ఎ.ఎం. గవర్నమెంట్ మోడల్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకప్పుడు మాహ్ లాఖా కార్యక్షేత్రం. అక్కడే ఆమె ఎంతోమంది వనితలకు ఆట, పాటల్లో శిక్షణ నిచ్చినట్టు చరిత్ర.

రెండొందల ఏళ్ళ నాటి మన రాతప్రతి... బ్రిటన్‌లో భద్రంగా!
“నిజానికి, ఆమె అసలు పేరు చందా బీబీ. చంద్రబింబం లాంటి చెక్కిళ్ళు గలది అనే అర్థంలో నిజామ్ ఆమెకు పెట్టిన పేరు - మాహ్ లఖా బాయ్. ఆమె తల్లి రాజ్ కున్వర్. ఆ రోజుల్లో రాజ్‌పుతానా నుంచి వలస వచ్చిన రాజ్ కున్వర్ సంతానం లేని తన చెల్లెలికి మాహ్ లఖాను దత్తత ఇచ్చింది. ఆ చెల్లెలు నాటి నిజామ్‌కు ప్రధాని అయిన నవాబ్ రుక్న్ ఉద్దౌలాకు ప్రీతిపాత్రమైన వేశ్యామణి. 

అలా మాహ్ లఖా బాయ్ నిపుణులైన గురువుల వద్ద అత్యుత్తమ శిక్షణ పొందేందుకు వీలు కలిగింది. ఆ రోజుల్లో నిజామ్ మొదలు సంస్థాన ప్రధానమంత్రులు, ఉన్నత సైనికాధికారులు, చివరకు బ్రిటీష్ రెసిడెంట్ వరకు పలువురితో మాహ్ లఖాకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ఫలితంగా, ఆమె ఎంతో పేరు, పలుకుబడి గల తవాయిఫ్‌గా రాణించింది.

టిప్పు సుల్తాన్‌పై తమ సంయుక్త సేనల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్రిటీషు వారికి నిజామ్ సంస్థానం భారీ విందు, వినోద కార్యక్రమం ఏర్పాటు చేసింది. 1799 అక్టోబర్ 18 రాత్రి నిజామ్ సంస్థాన ప్రధాన మంత్రి మీర్ ఆలమ్ నివాసంలో ఆ అపూర్వ గానాబజానా సాగింది. ఆ నృత్య ప్రదర్శన సమయంలో అందమైన క్యాలిగ్రఫీ చేతిరాతతో రూపొందిన తన గజల్స్ రాతప్రతిని ఆనాటి అసిస్టెంట్ బ్రిటీష్ రెసిడెంట్... సర్ జాన్ మాల్కోమ్‌కు ఆత్మీయంగా బహూకరించారు మాహ్ లాఖా బాయ్. 

అలా ఆ రోజు ఆమె స్వయంగా సంతకం చేసి, కానుకగా ఇచ్చిన ఆ గజల్స్ సంపుటి రాతప్రతి ఇప్పటికీ బ్రిటీష్ లైబ్రరీలో భద్రంగా ఉంది” అని క్యాథరిన్ చెబుతుంటే ‘మంథన్’ నిర్వహించిన ఈ ప్రసంగానికి హాజరైన సభికులు అబ్బురంగా చెవులప్పగించి విన్నారు. అలాగే, “మాహ్ లఖా బాయ్ ప్రోద్బలంతో ఆమె గురువు ఖుశాల్ ఖాన్ అనూప్ ‘రాగ్ దర్శన్’ అనే సంగీత శాస్త్ర గ్రంథం రచించారు. ఆ రచన రాతప్రతి పెన్సిల్వేనియా యూనివర్సిటీ లైబ్రరీలో నేటికీ పదిలపరచబడింది” అని ఆమె వివరించారు.

ఆసక్తికరమైన ఆలోచనల ‘మంథన్’
ప్రపంచ ప్రసిద్ధులైన ఆలోచనాపరులు మనసు విప్పి మాట్లాడే వేదికగా ‘మంథన్’ చిరకాలంగా భాగ్యనగర వాసులకు సుపరిచితం. సాహిత్యం, సంగీతం, సంస్కృతి, సమాజం... ఇలా పౌర జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని రకాల అంశాలపైనా ఎప్పటికప్పుడు ప్రముఖులను ఆహ్వానించి, వారితో ప్రసంగాలు, ప్రశ్నోత్తరాలు, చర్చలు నిర్వహించడం కొన్నేళ్ళుగా ‘మంథన్’ చేస్తున్న మంచి పని. క్రియాశీలమైన ఈ సంభాషణల ద్వారా ప్రజాస్వామ్య, లౌకిక విలువలను బలోపేతం చేయాలన్నది ఈ పౌర సంస్థ ఆశయం. 

అందులో భాగంగానే, ఎప్పటికప్పుడు తాజా ప్రచురణలతో ముందుకొచ్చిన ప్రసిద్ధ పుస్తక రచయితలతో, అధ్యయనశీలుర ప్రసంగాలు, సంభాషణలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ ఏప్రిల్‌లో ఇటీవలే ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు టి.ఎం. కృష్ణతో ఆలోచనాత్మక సంవాదం సాగించిన ‘మంథన్’, వారం తిరిగేసరికి సంగీత చరిత్రకారిణి క్యాథరిన్ బట్లర్ స్కోఫీల్డ్‌తో ఈ ఆసక్తికరమైన సంభాషణ జరపడం విశేషం. అయితే, ఇలాంటి అపురూప కార్యక్రమాలపై మీడియాలో ఎక్కడా మచ్చుకైనా మొక్కుబడిగా మూడు ముక్కలు కనిపించకపోవడమే విషాదం.
రెంటాల జయదేవ

(చదవండి: సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!)

#

Tags : 1

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)