Breaking News

శంబసాధనుడి వధ

Published on Sun, 01/04/2026 - 06:30

పూర్వం కేసరి అనే వానరుడు ఉండేవాడు. హిమాలయాల దిగువ ప్రాంతంలో రాజ్యం చేస్తూ ఉండేవాడు. ఆయన అరవైవేల మంది వానర యోధులకు అధినాయకుడు. పార్వతీ పరమేశ్వర భక్తుడైన కేసరి ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు ప్రసన్నుడై, ప్రత్యక్షమైన పరమేశ్వరుడి నుంచి అనేక వరాలు పొందాడు. అదేకాలంలో శంబసాధనుడు అనే అసురుడు ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించి, అనేక వరాలు పొందాడు. వరగర్వంతో అతడు ముల్లోకాలలోని లోకులను పీడించడం మొదలుపెట్టాడు. దేవతలను, పన్నగులను, అప్సరకాంతలను హింసించేవాడు.

‘నేను తప్ప మణులను మీరెవరూ ధరించరాదు’ అంటూ దేవతాసర్పాల తలలపైనున్న మణులను పెరికివేసి, వాటిని కిరీటంపై ధరించేవాడు. ‘ఇక నుంచి నన్నే కొలవండి’ అంటూ అప్సరకాంతలను కొప్పు పట్టి ఈడ్చుకొచ్చి, తన కొలువులో వారిచేత ఊడిగం చేయించుకునేవాడు. ‘యజ్ఞభాగాలన్నీ ఇకపై నాకే దక్కాలి’ అంటూ దేవతల కిరీటాలను కాళ్లతో తన్నేవాడు. వారిని చిత్రహింసలు పెట్టేవాడు. శంబసాధనుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించసాగాయి. దేవతలు అతడిని నిలువరించడానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకున్నారు. వారంతా బితుకు బితుకుమంటూ బతకసాగారు.

దేవతలు ఎంతగా ఒదిగి ఉంటున్నా, వారి పట్ల శంబసాధనుడి దాష్టీకాలు నానాటికీ పెరగసాగాయి. అతడి పీడ ఎలా విరగడ అవుతుందోనని దేవతలు మథనపడసాగారు. చివరకు అతడికి వరాలు ఇచ్చిన బ్రహ్మదేవుడే తరుణోపాయం చెప్పగలడని తలచి, మూకుమ్మడిగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. ‘బ్రహ్మదేవా! నీ వల్ల వరాలు పొందిన శంబసాధనుడు మా పాలిటి పీడగా మారాడు. వాడి సంహారానికి తగిన తరుణోపాయం చెప్పి, మమ్మల్ని అతడి బాధల నుంచి రక్షించు’ అని మొరపెట్టుకున్నారు.

దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు, ‘దేవతలారా! దిగులు చెందకండి. శంబసాధనుడు నా వరాలను దుర్వినియోగం చేసుకుంటున్నాడు. అతడికి కాలంతీరే రోజులు ఆసన్నమయ్యాయి. అతడిని సమర్థంగా ఎదుర్కొని, అతడిని అంతమొందించగల వీరుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. అతడే వానరాధిపతి కేసరి. మీరంతా వెళ్లి అతడిని ఆశ్రయించండి. కేసరి తప్పక మీ మనోభీష్టాన్ని నెరవేర్చగలడు’ అని సెలవిచ్చాడు. బ్రహ్మదేవుడి మాటలతో దేవతలంతా కేసరి వద్దకు వెళ్లారు. ‘ఓ మహాత్మా! వానరశ్రేష్ఠా! శంబసాధనుడు మమ్మల్ని పీడిస్తున్నాడు. అతడిని ఎదిరించగల వీరాధి వీరుడవు నువ్వొక్కడివేనని సాక్షాత్తు బ్రహ్మదేవుడు చెబితే, నీ వద్దకు వచ్చాం. 

శంబసాధనుడిని సంహరించి, నువ్వే మమ్మల్ని రక్షించాలి’ అని అన్నారు. కేసరి వారికి అభయమిచ్చాడు. దేవతలు ఒకవైపు కేసరిని కలుసుకుని, అభయం పొందితే, మరోవైపు నారదుడు మహతి మీటుకుంటూ శంబసాధనుడి వద్దకు వెళ్లాడు. ‘దేవమునీ! ఎక్కడి నుంచి తమరి రాక, లోక విశేషాలేమిటి?’ అని అడిగాడు శంబసాధనుడు. ‘దైత్యశ్రేష్ఠా! నీ సంహారం కోసం దేవతలంతా వానర రాజును ప్రార్థిస్తున్నారు. ఈ సంగతి నీ వరకు రాలేదా? నీ గూఢచారులు ఏం చేస్తున్నారు? నెలగ్రాసం తీసుకుని నిద్రిస్తున్నారా?’ అన్నాడు.

నారదుడు ఈ మాట చెప్పడంతోనే శంబసాధనుడు మండిపడ్డాడు. ‘పోనీ జ్ఞాతులే కదా అని ప్రాణాలతో విడిచిపెడితే, దేవతలంతా నా ప్రాణాలకే ఎసరుపెడతారా? కోతిమూకకు రాజైన వాడితో నన్ను అంతం చేయాలనుకుంటారా? వాళ్ల అంతుచూస్తాను’ అంటూ ఆయుధాలు ధరించి, దేవతల మీదకు దండెత్తాడు. శంబసాధనుడిని చూసి, దేవతలు కాలికి బుద్ధి చెప్పారు. కొందరు కొండగుహల్లో తలదాచుకున్నారు. కొందరు కేసరి వద్దకు వెళ్లి, శంబసాధనుడు దండెత్తి వస్తున్న సంగతి చెప్పారు. కేసరి దేవతలకు అండగా, శంబసాధనుడి ఎదుటకు వచ్చి నిలిచాడు.

‘ఓరీ! రాక్షసాధమా! లోకకంటకుడవైన నిన్ను అంతం చేయడానికి వచ్చాను’ అన్నాడు. ‘ఓరీ! కోతీ! నువ్వు మితిమీరి మాట్లాడుతున్నావు. నాతో పోరుకు నిటలాక్షుడే తటపటాయిస్తాడు. నువ్వెంత? చిటికెలలో నిన్ను యమపురికి పంపిస్తాను’ అన్నాడు శంబసాధనుడు. ఇద్దరూ ఒకరితో ఒకరు కలపడ్డారు. శంబసాధనుడి మీదకు కేసరి ఒక బండరాయి విసిరాడు. అతడు తన గదతో బండరాయిని తుత్తునియలు చేశాడు. కేసరి వెంటనే మరో బండరాయి విసిరాడు. అది నేరుగా శంబసాధనుడి రొమ్మును తాకింది. ఆ దెబ్బకు అతడు తూలిపడ్డాడు.

‘ఓరీ! వానరా! నువ్వు బలశాలివే, తగినవాడివే! ఈసారి చూడు’ అంటూ తన గదను కేసరి మీదకు విసిరాడు. ఆ గద కేసరిని తాకి పిండి పిండిగా నేల రాలింది. ఈసారి శంబసాధనుడు శూలం విసిరాడు. కేసరి దానిని ఒడిసి పట్టుకుని, ముక్కలుగా విరిచి అవతల పడేశాడు. ఆయుధాల పని అయిపోవడంతో శంబసాధనుడు కేసరితో బాహాబాహీకి తలపడ్డాడు. ఒకరినొకరు కొట్టుకుంటూ కలబడ్డారు. చివరకు కేసరి పిడికిలి బిగించి, శంబసాధనుడి ఛాతీపై ఒక్కపోటు పొడిచాడు. అతడు నెత్తురు కక్కుకుంటూ అక్కడికక్కడే చచ్చాడు. అది చూసి దేవతలంతా హర్షధ్వానాలు చేశారు.

సాంఖ్యాయన

 

Videos

సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్

భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు

తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!

అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు

టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు

లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు

చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..

ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....

తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు

Photos

+5

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ క్యూట్ మెమొరీస్ (ఫొటోలు)

+5

మాయాబజార్ సావిత్రి లుక్‌లో యాంకర్ సుమ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్‌ (ఫొటోలు)

+5

‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మృణాల్‌ (ఫొటోలు)

+5

తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (ఫొటోలు)