60% పూర్తయిన బ్రిడ్జిని మధ్యలో ఆపేసిన కూటమి
Breaking News
మానవీయత మనిషికి అసలైన మకుటం
Published on Mon, 04/20/2026 - 04:21
మానవ జన్మ ఒక అద్భుత కావ్యం అయితే, దానికి మాననీయత ఒక మకుటం వంటిది. మనిషి రూపం కేవలం ప్రకృతి ప్రసాదం, కానీ మనిషి వ్యక్తిత్వం అతను స్వయంగా మలచుకున్న శిల్పం. సమాజమనే అడవిలో అందరూ మనుషులుగా తిరుగుతుంటారు, కానీ సంస్కారమనే చందన గంధాన్ని పూసుకున్నవారే ‘మాననీయులు’ గా గుర్తింపు పొందుతారు. బాహ్యమైన అలంకారాలు కంటికి కనిపిస్తాయి, కానీ మాననీయత అనే అలంకారం గుండెలను తాకుతుంది.
నిజమైన మాననీయత అంటే ఎవరూ చూడనప్పుడు కూడా ధర్మాన్ని అనుసరించడం. అధికారమున్నప్పుడు అణకువగా ఉండటం, శక్తి ఉన్నప్పుడు క్షమించడం మాననీయుల లక్షణం. మనిషిని కేవలం ఒక జీవిగా కాకుండా, ఒక మానవీయ శక్తిగా మార్చేది మాననీయత. గౌరవప్రదమైన ప్రవర్తన, ఉన్నతమైన నైతిక విలువలు., ఇతరుల పట్ల చూపే ఆదరాభిమానాల కలయికే మాననీయత.
సృష్టిలో అత్యున్నతమైనది మానవ జన్మ. అయితే, కేవలం పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాలేరు. మనిషిని మహనీయుడిగా, గౌరవప్రదమైన వ్యక్తిగా మార్చేది మాననీయత. సమాజ గమనానికి, మానవ సంబంధాల మనుగడకు మాననీయతే మూలాధారం.
మాననీయత– అనే పదం గౌరవానికి చిహ్నం. ఒక వ్యక్తి తన మాట తీరు, ప్రవర్తన, పనుల ద్వారా ఇతరుల మనస్సులో సంపాదించుకునే స్థానమే ఇది. ఇది కేవలం బాహ్య రూపానికి సంబంధించినది కాదు, అంతర్గత సంస్కారానికి సంబంధించినది.
ఏ పరిస్థితిలోనైనా సత్యాన్ని పలకడం, నమ్మకద్రోహం చేయకపోవడం. వ్యక్తిగత సామాజిక జీవితంలో నియమ నిబంధనలను పాటించడం. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయడం. ఎంతటి ఉన్నత స్థితికి వెళ్లినా గర్వం లేకుండా సామాన్యులతో కలసిపోవడం. ఇలా మన ప్రవర్తనల వల్ల ఏ రంగంలోనైనా నైతికత పాటిస్తూ పనిచేసేవారికే శాశ్వతమైన గుర్తింపు లభిస్తుంది.
నేటి పోటీ ప్రపంచంలో విలువలు కనుమరుగవుతున్నాయి. స్వార్థం, అసూయ వంటి గుణాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి సమయంలో మాననీయత ఒక వెలుగు దివిటీలా పనిచేస్తుంది. పెద్దలను గౌరవించడం, పిల్లలకు సంస్కారాన్ని నేర్పడం ద్వారా కుటుంబాలు బలపడతాయి. లంచగొండితనం, అక్రమాలకు తావు లేకుండా పనిచేయడం వల్ల వృత్తికి గౌరవం పెరుగుతుంది.
సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ధర్మం వైపు నిలబడటం కూడా మాననీయతలో భాగమే. మంచిని ఆలోచించడం, మంచిని పలకడం, మంచిని చేయడం అనే త్రివిధ శుద్ధిని పాటిస్తూ మనమందరం మాననీయులుగా ఎదగడానికి ప్రయత్నిద్దాం. మనుషుల మధ్య గౌరవం ఉన్నప్పుడే శాంతియుత సమాజం ఏర్పడుతుంది.
మాననీయత అనేది అంగడిలో కొంటే దొరికేది కాదు, అది మన ఆలోచనల నుండి, మన పెంపకం నుండి పుడుతుంది. వ్యక్తిగత గౌరవమే సమాజ గౌరవంగా మారుతుందని గుర్తించి, ఉన్నతమైన విలువలతో జీవించడం మనందరి బాధ్యత. మాననీయత అనేది వ్యక్తిత్వాన్ని పరిమళించేలా చేస్తుంది. మనం ఇతరులకు ఇచ్చే గౌరవమే తిరిగి మనకు మాననీయతగా లభిస్తుంది.
సాంకేతికత పెరుగుతున్నా, మానవీయ విలువలు తగ్గకుండా చూసుకోవడమే నేటి అవసరం. రూపం కన్నా శీలం మిన్న, ఆస్తి కన్నా వ్యక్తిత్వం మిన్న. ఆ వ్యక్తిత్వమే మనిషిని మాననీయుడిగా నిలబెడుతుంది.
పువ్వు వాడిపోయినా దాని సువాసన గాలిలో నిలిచి ఉన్నట్లు, మనిషి భౌతికంగా మరుగైనా అతని మాననీయత తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. రాసే ప్రతి అక్షరం, మనం వేసే ప్రతి అడుగు మాననీయతకు దర్పణం పట్టాలి. ‘శీలం లేని విద్య, సువాసన లేని కాగితపు పువ్వు’ వంటిది. మాననీయతకు పునాది శీలమే. ఎదురుగాలి వీస్తున్నా, ధర్మమనే దీపాన్ని ఆరిపోకుండా కాపాడుకోవడమే మాననీయుడి పంథా.
– ఆనంద ‘మైత్రేయ’మ్
Tags : 1