జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది
Breaking News
ఆత్మలకు ఆలవాలం!
Published on Sun, 01/11/2026 - 06:01
ఆ ఊరు ఆత్మలకు ఆలవాలంగా పేరుమోసింది. నిజానికి ఆ ఊరు తొలిరోజుల్లో ప్రపంచంలో మిగిలిన అన్ని ఊళ్లలాగానే జనసంచారంతో కళకళలాడుతూ ఉండేది. ఇది ఆత్మలకు ఆలవాలంగా మారి, దయ్యాల ఊరిగా పేరుమోయడం వెనుక పెద్ద కథే ఉంది. బ్రెజిల్‌లో ఉన్న ఈ ఊరి పేరు పారానాపియాకాబా. బ్రిటిష్‌వారు కాఫీ రవాణా కోసం బ్రెజిల్‌లో రైలుమార్గం నిర్మించారు. సావో పాలో రైల్వే కంపెనీ రవాణా కేంద్రంగా ఇక్కడ 1860లో ఈ ఊరిని నిర్మించారు. అప్పట్లో ఇక్కడి నుంచి భారీ ఎత్తున కాఫీ రవాణా సాగేది.
లండన్‌లోని బిగ్‌బెన్ గడియారం నమూనాలోనే ఈ ఊరి నడిబొడ్డున ఒక నిలువెత్తు గడియారాన్ని నెలకొల్పారు. ఊళ్లో ఏ మూల నుంచి చూసినా ఈ గడియారం కనిపిస్తుంది. సెర్రా డూ మార్ పర్వత శ్రేణుల మధ్యనున్న ఈ ఊరు అప్పట్లో ప్రశాంతతకు ఆలవాలంగా ఉండేది. ఈ ఊళ్లోనే లిడియా మాకిన్సన్ ఫాక్స్ అనే బ్రిటిష్ కులీన మహిళ తన పిల్లలతో కలసి కొండపై నిర్మించిన ప్యాలెస్‌లో ఉండేది. ఈ ఊళ్లో 1902లో యెల్లో ఫీవర్ విజృంభించింది. లిడియా తన పిల్లలతో ప్యాలెస్‌లోనే తలుపులు వేసుకుని ఉండిపోయింది. లిడియా, ఆమె పిల్లలు అందులోనే మరణించారు.
అప్పటి నుంచి ఈ ఊళ్లో అతీంద్రియ సంఘటనలు జరగడం మొదలైనట్లు స్థానికులు చెబుతారు. ఊరి నడిబొడ్డున ఉన్న గడియారం రాత్రి 11.47 గంటలకు తనంతట తానే ఆగిపోతుందని, అర్ధరాత్రి వేళ చర్చిలోని గంట మోగుతూ ఉంటుందని చెబుతుంటారు. కొందరైతే, రాత్రివేళ లిడియా ఇంటి పరిసరాల్లో ఒక మహిళ, ఆమె నలుగురు పిల్లలు నడుస్తూ ఉండటాన్ని కూడా చూసినట్లు చెబుతారు. ప్రస్తుతం ఈ ఊళ్లో దాదాపు వెయ్యిమంది మాత్రమే మిగిలారు. ఈ ఊళ్లో విక్టోరియన్ నిర్మాణశైలికి అద్దంపట్టే పలు ప్రాచీన భవంతులు ఇప్పుడు పాడుబడిన స్థితికి చేరుకుని, భూత్ బంగ్లాలను తలపిస్తాయి. అతీంద్రియ శక్తులపై ఆసక్తిగల కొందరు పర్యాటకులు అప్పుడప్పుడు ఈ ఊరికి వస్తూ పోతుంటారు.
Tags : 1