Breaking News

అతి చేరువలో అమరత్వం!

Published on Sun, 06/22/2025 - 07:25

అమరత్వం మానవాళి పురాకాంక్ష.. ఇంతవరకు అది ఒక అపూర్ణస్వప్నం..
అమరత్వం అసాధ్యమైనదేమీ కాదు, అచిరకాలంలోనే సాధ్యమవుతుందట!

అపూర్ణస్వప్నంగా మిగిలిన అమరత్వం అచిరకాలంలోనే సాధ్యమవుతుందని ఇటీవల శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రకటనలు మానవాళిలో ఆశలు రేకెత్తిస్తున్నాయి. భౌతిక శరీరంతో యథాతథంగా అమరత్వం పొందడానికి ఇంకా చాలాకాలమే పట్టవచ్చు గాని, సాంకేతిక అమరత్వం సాధించడానికి అట్టేకాలం పట్టదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరణం తర్వాత శరీరం నుంచి వేరుపడిన మానవ చేతనను కంప్యూటర్లలోకి అప్‌లోడ్‌ చేయడం ద్వారా సాంకేతిక అమరత్వం సాధించే ప్రక్రియ మరో పాతికేళ్లలోనే అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు. ఇప్పటి ప్రమాణాల ప్రకారం ఒక మనిషి వందేళ్లు బతకడమే చాలా గొప్ప. అయితే, ఇదివరకటితో పోల్చుకుంటే, ప్రపంచవ్యాప్తంగా శతాయుష్కుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. 

మరో పాతికేళ్లలో వైద్యరంగం సాధించే అభివృద్ధి మానవుల ఆయుఃప్రమాణాన్ని గణనీయంగా పెంచగలదని శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. మనుషులు భౌతిక అమరత్వం సాధించడానికి ఇంకెంత కాలం పడుతుందో ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నా, మనుషులు శతాయుష్షును అధిగమించడం త్వరలోనే సాధ్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక పురోగతి మరింత వేగం పుంజుకుంటే, మనుషులు దాదాపుగా భౌతిక అమరత్వం సాధించడం కూడా అసాధ్యమేమీ కాదని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ భావన గురించి, అమరత్వ సాధన దిశగా శాస్త్ర సాంకేతిక పరిశోధకులు సాగిస్తున్న పరిశోధనలు, శాస్త్రవేత్తల అంచనాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం.

నాలుగేళ్లలోనే యంత్రాలతో అనుసంధానం
‘మరో నాలుగేళ్లలోనే కృత్రిమ మేధ పూర్తిగా అభివృద్ధి చెంది, మానవ మేధకు దీటుగా తయారవుతుంది. మానవులు యంత్రాలతో అనుసంధానమయ్యే కొత్త శకం ప్రారంభమవుతుంది. కంప్యూటర్లు, ఆండ్రాయిడ్‌ శరీరాల ద్వారా మనుషులు అమరత్వం పొందే పరిస్థితులు 2045 నాటికే సాధ్యమవుతాయి. ఈ సాంకేతికత మరింతగా అభివృద్ధి చెంది 2050 నాటికి అపర కుబేరులకు అందుబాటులోకి వస్తుంది’ అని గూగుల్‌ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ రే కర్జ్‌వీల్‌ చెబుతున్నారు. ఇదివరకు ఆయన వేసిన సాంకేతిక అంచనాలు పూర్తిగా నిజయం కావడంతో మనుషుల అమరత్వంపై ఆయన తాజా అంచనాలు కూడా నిజం కాగలవని ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిశోధకుల్లో చాలామంది విశ్వసిస్తున్నారు. కంప్యూటర్లు చదరంగం చాంపియన్లను ఓడించగలవని, స్మార్ట్‌ఫోన్లు సామాన్యుల చేతుల్లోకి రాగలవని కర్జ్‌వీల్‌ దశాబ్దాల కిందటే అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా అంచనాలపై శాస్త్ర సాంకేతిక రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

పన్యాల జగన్నాథదాసు
అమరత్వం పొందాలనేది మనిషి చిరకాల స్వప్నం. ఎంతటి ధైర్యశాలి మనిషినైనా భయపెట్టేవి రెండే రెండు: అవి జరా మరణాలు. పురాణకాలం నుంచే జరా మరణాలను జయించాలనే తపన మనుషుల్లో ఉంది. ప్రాక్‌ పాశ్చాత్య పురాణాలలో ఇందుకు సంబంధించిన గాథలు కనిపిస్తాయి. అమరత్వం కోసమే దేవ దానవులు క్షీరసాగర మథనం చేశారు. క్షీరసాగరం నుంచి పుట్టిన అమృతాన్ని సేవించడం వల్లనే దేవతలు అమరులయ్యారని మన పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి గాథ పురాతన గ్రీకు పురాణాల్లోనూ ఉంది. ‘అంబ్రోజియా’ అనే ఆహార పదార్థాన్ని ఆరగించి, ‘నెక్టర్‌’ అనే అమృతంలాంటి పానీయాన్ని సేవించడం వల్లనే ఒలింపస్‌ పర్వతంపై నివసించే దేవతలు అమరులుగా మారారని గ్రీకు పురాణాల కథనం.

 ప్రపంచంలోనే ఆది పురాణమైన ‘గిల్గమేష్‌’లో కూడా అమరత్వ భావనకు ఉంది. ‘గిల్గమేష్‌’ క్రీస్తుపూర్వం 2100 సంవత్సరాల నాటిది. అంటే, అప్పటి నుంచే అమరత్వం సాధించాలనే తపన మనుషుల్లో ప్రబలంగా ఉండేదనడానికి ఇదొక నిదర్శనం.ఆ తర్వాత వచ్చిన కాల్పనిక సాహిత్యంలోనూ అమరత్వంపై అనేక కల్పనలు ఉన్నాయి. ఆంగ్లో–ఐరిష్‌ రచయిత జొనాథన్‌ స్విఫ్ట్‌ రాసిన ‘గలివర్స్‌ ట్రావెల్స్‌’లో ‘లుగ్‌నాగ్‌’ అనే కాల్పనిక ద్వీపరాజ్యంలో ఉండే ‘స్ట్రల్‌బ్రగ్స్‌’ అనే మనుషులు ఎంత వృద్ధులైపోయినా, మరణం లేకుండా ఉంటారు. అమరత్వం చుట్టూ ఎన్ని కల్పనలు ఉన్నా, చాలామంది దానిని ఎప్పటికీ నెరవేరని కలగానే భావిస్తూ వచ్చారు. పుట్టిన వారికి మరణం తప్పదని, అది ప్రకృతి సహజ ధర్మమని చెబుతూ వచ్చారు. భగవద్గీత కూడా ఇదే విషయాన్ని ‘జాతస్య హి ధ్రువో మృత్యుః’ అని చెప్పింది. అయినా మనిషికి అమరత్వం మీద ఆశ చావలేదు. అమరత్వ సాధనకు ప్రయత్నాలనూ మానుకోలేదు.

శాస్త్రవేత్తల ప్రయత్నాలు
మరణానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. వీటిలో అతి సాధారణమైన కారణం వార్ధక్యం. ఇప్పటికీ చాలామంది వార్ధక్యాన్ని జీవితంలో ఒక సహజమైన దశగానే పరిగణిస్తున్నారు. కొందరు వైద్య శాస్త్రవేత్తలు మాత్రం వార్ధక్యాన్ని ఒక వ్యాధిగా పరిగణిస్తున్నారు. ఎలాంటి వ్యాధికైనా నివారణ మార్గాన్ని కనుగొనడమే శాస్త్రవేత్తల పని. అంతకంటే ముందుగా వ్యాధి మూలకారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరంలోని జీవకణాలకు వయసు మళ్లకుండా నిరోధించగలిగితే, వార్ధక్యాన్ని నివారించడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చారు. కనీసం శరీరంలోని జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియను నెమ్మదించేలా చేయగలిగితే గణనీయంగా ఆయుర్దాయాన్ని పొడిగించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయ పడుతున్నారు. జీవకణాల్లో వయసు మళ్లే ప్రక్రియ నెమ్మదించేలా చేయడానికి, కుదిరితే పూర్తిగా వయసు మళ్లే ప్రక్రియను నిలిపివేయడానికి సాధ్యమయ్యే మార్గాలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇందుకు అనేక ప్రయోగాలను సాగిస్తున్నారు. 

బ్రిటిష్‌ ఫ్యూచరాలజిస్ట్‌ ఇయాన్‌ పియర్సన్, గూగుల్‌ ఇంజినీరింగ్‌ డైరెక్టర్‌ రే కర్జ్‌వీల్, బ్రిటిష్‌ జన్యుశాస్త్ర నిపుణుడు అబ్రీ డి గ్రే వంటి శాస్త్రవేత్తలు 2050 నాటికల్లా కంప్యూటర్లలోకి, రోబోలలోకి మెదడులోని ఆలోచనలను అప్‌లోడ్‌ చేసే పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు ప్రపంచంలోని అపర కుబేరులు ఈ ప్రక్రియ ద్వారా అమరత్వాన్ని పొందగలరని అంచనా వేస్తున్నారు. మరో పాతికేళ్లలో ప్రపంచంలోని సంపన్నులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని, మరణానంతరం తమ చేతనను కంప్యూటర్లలోకి లేదా రోబోల వంటి ఆండ్రాయిడ్‌ శరీరాల్లోకి అప్‌లోడ్‌ చేయడం ద్వారా అమరత్నాన్ని సాధించగలరని ఇయాన్‌ పియర్సన్‌ చెబుతున్నారు. 

మరో నాలుగేళ్లలోనే– అంటే, 2029 నాటికల్లా మానవ మేధకు దీటుగా కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతుందని అబ్రీ డి గ్రే చెబుతున్నారు. మానవ మేధకు దీటైన స్థితికి కృత్రిమ మేధ చేరుకున్నాక మనుషులకు, యంత్రాలకు మధ్య అనుసంధానం తేలికవుతుందని, ఈ ప్రక్రియ ద్వారా 2045 నాటికే మనుషులు అమరత్వం సాధించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు, రానున్న పాతికేళ్లలో వైద్యరంగం కూడా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని, 2050 నాటికి వార్ధక్యాన్ని నయం చేయగలిగే పరిస్థితులు ఏర్పడతాయని, ఫలితంగా 2050 తర్వాత మనుషులు వెయ్యేళ్లకు పైగా ఆయుర్దాయాన్ని పొందగలుగుతారని కూడా గ్రే అంచనా వేస్తున్నారు. 

ప్రపంచంలోని అమిత సంపన్నులు 2050 నాటికల్లా తమ భౌతిక మరణం తర్వాత కూడా అమరులుగా ఉండటానికి సాంకేతికతను వినియోగించుకుంటారని, తమ చేతనను కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్‌ శరీరాల్లోకి అప్‌లోడ్‌ చేయడం ద్వారా అమరత్వాన్ని సాధించగలుగుతారని పియర్సన్‌ చెబుతున్నారు. తొలినాళ్లలో ఈ సాంకేతికత చాలా ఖరీదుగా ఉంటుందని, మరో దశాబ్దం తర్వాత ఎగువ మధ్యతరగతి వారికి కూడా అందుబాటులోకి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు. 

కంప్యూటర్లలోకి, ఆండ్రాయిడ్‌ శరీరాల్లోకి మేధా చేతనను అప్‌లోడ్‌ చేసే సాంకేతికత 2060 నాటికల్లా కొంత తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి రాగలదని చెబుతున్నారు. ఇదేకాలంలో వైద్యరంగం కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని; క్యాన్సర్, గుండెజబ్బులు వంటి ప్రాణాంతకమైన వ్యాధులను పూర్తిగా నయం చేయగలిగే చికిత్స పద్ధతులు అందుబాటులోకి వస్తాయని; జన్యు సవరణ పద్ధతులు మరింతగా అభివృద్ధి చెంది, వయసు మళ్లిన కణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించగలిగే స్థాయికి చేరుకుంటుందని పియర్సన్‌ చెబుతున్నారు. త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా కృత్రిమ అవయవాల తయారీ, కృత్రిమ మేధ సహాయంతో రూపొందే చికిత్స పద్ధతులు రానున్న కొద్ది దశాబ్దాల్లోనే మనుషుల ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించగలవని ఆయన అంటున్నారు.

‘మ్యూటంట్‌’ మానవులు
మనుషులకు మానవాతీత శక్తులు ఉండటం కాల్పనిక సాహిత్యంలోను, సినిమాల్లోను మాత్రమే చూసి ఉంటాం. ఇలాంటి మానవులు త్వరలోనే మన మధ్య సంచరిస్తారని, మరో ఐదేళ్లలోగా ‘మ్యూటంట్‌’ మానవులు మన మధ్య తిరుగాడుతారని లండన్‌కు చెందిన ఫ్యూచరిస్ట్, టెక్నాలజీ ఇన్వెస్టర్‌ హెర్బర్ట్‌ సిమ్‌ చెబుతున్నారు. కొత్తగా రాబోయే ఈ ‘మ్యూటంట్‌’ మానవజాతిని ‘ఎక్స్‌–మెన్‌’గా అభివర్ణిస్తున్నారు. జన్యు ఉత్పరివర్తనల ద్వారా రూపొందే ఈ ‘పరివర్తిత’ మానవులు లేదా ‘మ్యూటంట్‌’ మానవుల శక్తి సామర్థ్యాల ముందు ప్రస్తుతం ఉన్న మానవుల శక్తి సామర్థ్యాలు ఎందుకూ కొరగావని సిమ్‌ చెబుతున్నారు. 

త్వరలోనే ‘మ్యూటంట్‌’ మానవుల రాకతో ఇప్పటి ఆధునిక మానవులు వాడుకలో పనికిరాకుండా పోతారని ఆయన అంచనా వేస్తున్నారు. ‘మ్యూటంట్‌’ మానవుల రూపకల్పన కోసం చేపట్టే పరిశోధనలకు హెర్బర్ట్‌ సిమ్‌ భారీ ఎత్తున నిధులు వెచ్చిస్తున్నారు. హెర్బర్ట్‌ సిమ్‌ తన స్టార్టప్‌ సంస్థ ‘న్యూరోచిప్‌ డాట్‌ కామ్‌’ ద్వారా ‘మ్యూటంట్‌’ మానవుల రూపకల్పన కోసం ప్రయోగాలు సాగిస్తున్నారు. మెదడులోని ఆలోచనలను చదవగల హెల్మెట్‌పై ఆయన ప్రయోగాలు చేపడుతున్నారు. ‘మ్యూటంట్‌’ మానవులు ప్రాణాంతక వ్యాధులను సైతం తట్టుకుని, సులువుగా ఐదువందల ఏళ్లు బతకగలరని సిమ్‌ చెబుతున్నారు.

అమరత్వంపై నైతిక మీమాంసలు
అమరత్వం చేరువలోనే సాధ్యమవుతుందని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమరత్వ సాధన ఎలా ఉన్నా, మానవుల ఆయుర్దాయం గణనీయంగా పెరుగుతుందని పలువురు శాస్త్రవేత్తలు నమ్మకంగా చెబుతున్నారు. ఈ పరిణామాలు సంభవిస్తే, భవిష్యత్తులో తలెత్తబోయే సమస్యలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మానవులు అమరత్వం సాధించినా, కనీసం శతాబ్దాల తరబడి బతకగల స్థితికి చేరుకున్నా, ప్రపంచం మరింత జటిలంగా మారుతుందని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రపంచ జనాభా అదుపు తప్పి పెరుగుతుందని, అప్పుడు వనరుల పంపిణీలో మరిన్ని వ్యత్యాసాలు తలెత్తి, మనుషుల మధ్య కీచులాటలు, నేరాలు పెరుగుతాయని, దేశాల మధ్య యుద్ధాలు పెచ్చరిల్లుతాయని వారు హెచ్చరిస్తున్నారు.

 మనుషులు అమరులైతే, జనాభా మరింతగా పెరగడం తప్ప ప్రపంచానికి ప్రయోజనం ఉండదని, పైగా పర్యావరణానికి తీరని హాని జరుగుతుందని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జీవితంలో మరణం ఒక సహజ పరిణామమని, మరణం ఉన్నప్పుడే మనుషులకు జీవితం విలువ అర్థమవుతుందని, మరణమే లేకుండాపోతే జీవితానికి విలువ ఉండదని, అలా ఎంతకాలం జీవించినా దండగేనని కొందరు తత్త్వవేత్తలు పెదవి విరుస్తున్నారు. ఎవరు ఏమన్నా, ‘అమరత్వం అతి చేరువలోనే’ అని ఊరిస్తున్న శాస్త్రవేత్తలు మాత్రం తమ పరిశోధనలను మరింత ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.

త్వరలో జరగబోయే పరిణామాలు

అమరత్వ సాధన దిశగా త్వరలోనే పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం ఎప్పుడెప్పుడు ఏయే మార్పులు జరుగనున్నాయో చూద్దాం.. 

2029
ఈ ఏడాది నాటికి మానవులకు, యంత్రాలకు అనుసంధానం ఏర్పడుతుంది. మనుషులు తమ మేధా చేతనను కంప్యూటర్లలోకి లేదా ఆండ్రాయిడ్‌ శరీరాల్లోకి ఎక్కించగలుగుతారు. ఆ విధంగా భౌతిక మరణం తర్వాత కూడా జీవితాన్ని కొనసాగించగలుగుతారు.

2050
ఈ ఏడాది నాటికి వైద్యరంగం వార్ధక్యాన్ని ఇతర వ్యాధుల మాదిరిగానే నయం చేయగలదు. జన్యు సవరణ పరిజ్ఞానం వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే స్థాయికి అభివృద్ధి చెందగలదు. అబ్రీ డి గ్రే చెబుతున్న ప్రకారం వెయ్యేళ్లు బతకగల మనుషులు ఇప్పటికే పుట్టి ఉంటారు. జీవకణాల వార్ధక్యాన్ని వెనక్కు మళ్లించే పద్ధతులపై పరిశోధనల కోసం డి గ్రే ‘లాంజివిటీ ఎస్కేప్‌ వెలాసిటీ ఫౌండేషన్‌’ నెలకొల్పి, ఇతర శాస్త్రవేత్తలతో కలసి విస్తృతంగా పరిశోధనలు సాగిస్తున్నారు.

2030
మనుషులకు, యంత్రాలకు మధ్య దాదాపుగా ఏకత్వం ఏర్పడుతుంది. మరణం వల్ల మనుషుల భౌతిక శరీరం అంతరించిపోయినా, యంత్ర శరీరాల ద్వారా మనుగడ సాగించగల సాంకేతికత అభివృద్ధి చెందుతుంది. మనుషులకు, యంత్రాలకు మధ్య ఏకత్వం చేరువలోనే ఉందంటూ, సరిగా ఏడాది కిందట– 2024 జూన్‌లో రే కర్జ్‌వీల్‌ ‘ది సింగులారిటీ ఈజ్‌ నియరర్‌’ పేరుతో పుస్తకం రాశారు.

2045
ఈ ఏడాదిలోగా మనుషులు మరణానంతరం ‘సైబోర్గ్‌’లుగా మనుగడ కొనసాగించగలరు. కంప్యూటర్లలోకి అప్‌లోడ్‌ చేసిన మేధాచేతనను ఇతర అధునాతన సాంకేతికతతో రూపొందించిన యంత్ర శరీరాల్లోకి డౌన్‌లోడ్‌ చేయడం సాధ్యమవుతుంది. ఈ యంత్ర శరీరాలు మనుషుల మాదిరిగానే పని చేస్తాయి.

వార్ధక్య నివారణ సుసాధ్యం
కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నట్లుగా 2050 నాటికి అమరత్వ సాధన మాట ఎలా ఉన్నా, ‘సెనోలైటిక్‌’ ఔషధాలతో వార్ధక్య నివారణ సుసాధ్యమవుతుందని బ్రిటిష్‌ శాస్త్రవేత్త ఆండ్రూ స్టీల్‌ చెబుతున్నారు. ఈ అంశంపై ఆయన ‘ఏజ్‌లెస్‌’ అనే పుస్తకం రాశారు. ‘సెనోలైటిక్‌’ ఔషధాలు శరీరంలోని మృతకణాలను, జోంబీ కణాలను తొలగించి, జీవకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి వార్ధక్య లక్షణాలను వెనక్కు మళ్లించడంతో పాటు ఆయుర్దాయాన్ని గణనీయంగా పొడిగించడానికి ఉపయోగపడతాయి. వార్ధక్యం వల్ల మరణం సంభవించడమనేది 2050 తర్వాత చరిత్రగానే మిగిలిపోతుందని ఆండ్రూ స్టీల్‌ చెబుతున్నారు. 
 

#

Tags : 1

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)