Breaking News

కథాకళి: డర్టీ మెటల్‌

Published on Sun, 04/26/2026 - 01:43

ఐదేళ్ళుగా మేం ఐదుగురం మిత్రబృందం ప్రతి ఆదివారం రమ్మీ ఆడటం అలవాటు. అలా రోజు సిట్టింగ్‌లో...  ‘‘మనిషి ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడు?’’ ఆ ఆదివారం వశిష్ట అడిగాడు.‘‘చాలావాటిని.’’ ఒకరు చెప్పారు.‘‘ఆ చాలావాటిలో దేన్ని అధికంగా ప్రేమి్తాడన్నది నా ప్రశ్న.’’‘‘అది మనిషికి మనిషికి మారుతూంటుంది.’’ చెప్పాను.‘‘నీకేం ఇష్టం? ఎన్నటికీ పోగొట్టుకోడానికి ఇష్టపడనిది.’’ వశిష్ట నన్ను అడిగాడు.‘‘మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఇచ్చిన రూపాయి కాసు. దాన్ని ఖర్చు చేయకుండా దాచుకున్నాను.’’ చెప్పాను.‘‘నాకు ఉప్మా ఇష్టం. నేను చేసుకునే వెజిటబుల్‌ ఉప్మా.’’ మాలోని హాస్యప్రియుడైన లాయర్‌ చెప్పాడు.‘‘నువ్వు ఉప్మాని మించి ఇష్టపడేది ఏం లేదా?’’

‘‘ఇష్టం అనేది కాలాన్ని, సమయాన్ని, సందర్భాన్ని బట్టి మారుతూంటుంది. నాకు ఉదయం కాఫీ ఇష్టం. సాయంత్రం టీ ఇష్టం. రాత్రికి బీర్‌ ఇష్టం. నేను పోయే టైమ్‌ని బట్టి ఆ సమయంలో కాఫీ లేదా టీ తాగుతూ లేదా ఉప్మా తింటూ పోవాలనుకుంటున్నాను.’’‘‘నాకు నా ఇంట్లో, నా పక్కలో, నిద్రలో మరణించడం ఇష్టం. ఓసారి ఓ బంధువుని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు చూశాను. స్ట్రెచర్‌ మీద తీసుకెళ్ళే ఓ వ్యక్తి, వెనకే ఆక్సిజన్‌ సిలిండర్‌ని తోసుకెళ్ళే ఓ అటెండర్‌. ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాక అనిపించింది, రోగం రొష్టు రాకుండా, ఇంట్లోనే మరణించడానికి మించిన యోగం లేదని. ఇంట్లో మరణం నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది.’’ మరొకరు చెప్పారు.

‘‘ఫిలసాఫికల్‌.’’ నేను చెప్పాను.‘‘చిన్న సవరణ. ఉప్మా కాదు. ఉప్మాలోని ఉప్పు. సరిపడ ఉప్పు. ఓసారి నేను ఎక్కువ ఉప్పు వేసి తినలేకపోయాను. సరిపడ ఉప్పు వేసిన ఉప్మా.’’ లాయర్‌ వృత్తిలోని అతను నవ్వుతూ సవరించాడు.‘‘నీకు?’’ నాలుగోవాడిని అడిగాను.‘‘మన జెండా.’’ వాడు చేతిలోని ముక్కలని చూసి, ఓ ముక్కని వేశాక చెప్పాడు.కొద్దిసేపు ఆగి నేను అడిగాను.‘‘వశిష్టా. తమరికి ఏమి ఇష్టమో సెలవివ్వనా? మీ ఆవిడ ముక్కంటే కదా?’’అంతా నవ్వారు.‘‘వశిష్ట తన భార్య ముక్కు మీద కవిత్వం రాశాడు.’’ చెప్పాను.‘‘కాని మీ ఆవిడకి బంగారం అంటే ఇష్టం. కాబట్టి నువ్వు కూడా బంగారాన్ని ఇష్టపడుతున్నావేమో?’’ ఒకరు అడిగారు.

వశిష్ట ప్రతీ మేరేజ్‌ ఏనివర్సరీకి, తన భార్య పుట్టినరోజుకి, ఉమెన్స్ డేకి భార్యకి ఏదైనా బంగారు ఆభరణాన్ని బహుకరిస్తుంటాడని మాకు మా భార్యల ద్వారా తెలుసు. ‘మీరూ ఉన్నారు ఎందుకు? మీ ఫ్రెండ్‌ వశిష్ట వాళ్ళ ఆవిడకి ఏం కొనిచ్చాడో తెలుసా?’ అనే డైలాగ్‌ మేము చాలాసార్లు విన్నాం. ఇలాంటి ఆడవాళ్ళ ముచ్చట్లకి ఆ ఐదుగురికి వాట్సాప్‌ గ్రూప్‌ కూడా ఉంది. ‘‘ప్రపంచంలోని పద్దెనిమిది శాతం బంగారం ఇండియన్‌ భార్యల దగ్గరే ఉందని చదివాను. అది పాతికవేల టన్నుల బంగారమట. అందులో చాలా భాగం వశిష్ట భార్య దగ్గరే ఉంది.’’ ఒకరు నవ్వుతూ చెప్పారు.‘‘మా ఆవిడకి బంగారం ఇష్టం కాబట్టి ఆమెని సంతోషపెట్టడానికి కొనిస్తూంటాను. నాకు నా భార్యంటే ఇష్టం. 

నా భార్య మీద ఇష్టాన్ని నేను అలా ప్రదర్శిస్తూ ఉంటాను.’’ వశిష్ట చెప్పాడు.ఈ చర్చ జరిగిన కొంత కాలానికి వశిష్ట భార్య మరణించింది. ఈ కాలంలో అకాల మరణానికి కారణమైంది కేన్సర్‌. అది ఫోర్త్‌ స్టేజ్‌లో కాని బయటపడలేదు. బయటపడ్డ రెండు నెలలు తిరగకుండానే ఆమె గతించింది.వశిష్ట దుఃఖాన్ని పట్టలేకపోయాం. ఆ పదిహేను రోజులు మేము నలుగురం అతని వెన్నంటే ఉన్నాం. ఆ తర్వాత చాలా ఆదివారాలు మేము నలుగురమే రమ్మీ ఆడాం. తన భార్య పోయిన ఎనిమిదో ఆదివారం వశిష్ట వచ్చాడు. ఐదారు నిమిషాల తర్వాత వశిష్ట చెప్పాడు. ‘‘ఓసారి ‘మనిషి దేన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు?’ అనే అంశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నేను అధికంగా ప్రేమించేది మా ఆవిడని చెప్పాను. గుర్తుందా?’’‘‘అవును. అందులో మాకు ఎలాంటి సందేహం లేదు.’’ చెప్పాను.‘‘కాదు. 

మా ఆవిడ మరణించాక నాకు తెలిసింది. నేను ప్రేమించేది మా ఆవిడని కానే కాదు. ఆవిడ ప్రేమించే డర్టీ మెటల్ని. బంగారాన్ని.’’ నెమ్మదిగా చెప్పాడు.‘‘అంటే నువ్వు ఇంతకాలం మీ ఆవిడ ఇష్టపడుతుందని బంగారం కొనలేదా?’’ అడిగాను.‘‘ఆవిడ మరణించకపోతే అసలు నాకీ సంగతే తెలిసేది కాదు. ఆవిడ శవాన్ని వైకుంఠ రథంలో తరలించేటప్పుడు నేను ఆవిడ నోట్లోని రెండు బంగారు కట్టుడు దంతాలని కటింగ్‌ ప్లయర్‌తో పెకలించి తీసుకున్నాను. భార్యని ప్రేమించే ఎవరైనా, జీవం లేనంత మాత్రాన చేసే పనేనా అది?’’ వశిష్ట ప్రశ్నించాడు.అతని మెళ్ళోని బంగారు గొలుసుకి ఆవిడ రెండు దంతాలు మెరుస్తూ కనిపించాయి. 

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  
 

#

Tags : 1

Videos

కాల్చింది మెకానికల్ ఇంజనీర్, ఉన్నత విద్యాంతుడు కూడా.. ఎందుకు చేశాడంటే..!

పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు

మాలీవుడ్ న్యూ ఇండస్ట్రీ హిట్ గా వాలా 2.!

విశాఖలో కుప్పకూలిన రైల్వే బ్రిడ్జి

"కాల్పులు అయిపోయాయి ఇక తినండి.." ట్రంప్ షాకింగ్ రియాక్షన్

వరుణాస్త్రతో భారత్ సత్తా.. ఇక సముద్రంలో శత్రుదుర్భేద్యం

పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై పేర్ని నాని రియాక్షన్

No పెట్రోల్.. No డీజిల్.. APలో వాహన దారుల కష్టాలు

లేస్తే మనిషిని కాను

ఏపీలో డీజిల్, పెట్రోల్ కొరత.. తండ్రి, కొడుకు ఏం పీకుతున్నారు

Photos

+5

ఈవెంట్‌లో జంటగా అల్లు శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

ఫ్రెండ్స్‌తో నైట్ పార్టీలో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

అంబానీ ఇంట పాప్ స్టార్ రిహన్నా సందడి.. ఆటపాటలతో కోలాహలం (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 26-మే 03)

+5

‘వాలా 2’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

'గాయపడ్డ సింహం' ట్రైలర్ లాంచ్‌ (ఫొటోలు)

+5

మాళవిక మోహనన్ గ్లామర్ ధమాకా (ఫొటోలు)

+5

అందమైన అంబానీ ఫ్యామిలీ.. ఐకానిక్‌ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఉయ్యాల జంపాలా' నటి (ఫొటోలు)

+5

తెలంగాణ ప్రజలకు అమ్మగా మారాలనుకుంటున్నా.. కవిత పార్టీ ప్రకటన (ఫొటోలు)