Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
కంపెనీలు కావు.. కల్పతరువులు
Published on Sun, 11/16/2025 - 07:40
ఉద్యోగులు మంచి కంపెనీలను కోరుకుంటారు. కంపెనీలు మంచి ఉద్యోగులను కోరుకుంటాయి. మంచి ఉద్యోగులను ఎంపిక చేసుకోవడం, వారిని కాపాడుకోవడం వల్లనే కంపెనీలు విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి కంపెనీల్లో ఉద్యోగాలు పొందడానికి అభ్యర్థులు పోటీపడుతుంటారు. మంచి ఉద్యోగులను కాపాడుకోగలిగే కంపెనీలు ఉత్తమ కంపెనీలుగా ఎదుగుతున్నాయి. అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉండే వంద అత్యుత్తమ కంపెనీలను ఎంపిక చేసిన ఫార్చూన్ పత్రిక ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’– 2025 పేరుతో ఒక జాబితాను విడుదల చేసింది. వీటిలోని పది అత్యుత్తమ కంపెనీల కథా కమామిషు చూద్దాం. వీటిలో పనిచేయాలని ఉద్యోగులు ఎందుకు ఉవ్విళ్లూరుతుంటారో తెలుసుకుందాం...
మంచి కంపెనీలు అంటే అపర కుబేరుల ఆ«ధ్వర్యంలో నడిచే కంపెనీలు అనుకుంటే పొరపాటేనని ‘ఫార్చూన్’ జాబితా రుజువు చేస్తోంది. ఉద్యోగులకు మంచి వేతనాలు చెల్లించడమే కాకుండా, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల కోసం చర్యలు తీసుకోవడం; ఉద్యోగుల అభివృద్ధిలో పైరవీలకు తావు లేకుండా పనితీరుకు మాత్రమే ప్రాధాన్యమివ్వడం; ఉద్యోగుల అనుభవాన్ని, పనితీరును మదింపు వేసి పదోన్నతులు కల్పించడం; పని ప్రదేశంలో ఆహ్లాదకర పని వాతావరణాన్ని కల్పించడం; ఉద్యోగుల కష్టసుఖాలను పరిగణనలోకి తీసుకుని, వారికి తగిన వెసులుబాట్లు కల్పించడం వంటి మానవీయ చర్యల కారణంగానే ఈ కంపెనీలు అత్యుత్తమ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ‘ఫార్చూన్’ జాబితాలోని టాప్–10 కంపెనీల పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం...
1 హిల్టన్
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న బహుళజాతి సంస్థ హిల్టన్ వరల్డ్‌వైడ్. ఆతిథ్యరంగంలో ఈ కంపెనీ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వర్జీనియాలోని మెక్‌లీన్‌లో దీని ప్రధాన కేంద్రం ఉంది. కాన్రాడ్ హిల్టన్ 1919లో ప్రారంభించిన ఈ కంపెనీకి ప్రస్తుతం క్రిస్టఫర్ నాసెట్టా సీఈవోగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో దాదాపు రెండులక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అన్ని స్థాయుల్లోనూ ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడమే కాకుండా, ‘హిల్టన్’ యాజమాన్యం వారి సంక్షేమానికి, అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ‘కేర్ ఫర్ ఆల్’ కార్యక్రమం నిర్వహిస్తోంది. ‘హిల్టన్ ఫ్లెక్స్’ కార్యక్రమం పేరిట ఉద్యోగులు తమకు అనువైన వేళల్లో వచ్చి పనిచేసి వెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. ‘గో హిల్టన్’ పేరిట ఉద్యోగుల పర్యాటక ఖర్చులను చెల్లిస్తోంది. ‘హిల్టన్’ సంస్థ తన విజయాలకు ఉద్యోగులే కారణమని చెబుతుంది. నిజానికి ఉద్యోగులకు పూర్తి సంతృప్తికరమైన జీవితాన్ని అందించడమే ‘హిల్టన్’ను ‘ఫార్చూన్’ జాబితాలో మొదటి స్థానంలో నిలిపింది.
2 సింక్రనీ
అమెరికా కేంద్రంగా ప్రధానంగా ఆర్థిక, బీమా రంగాల్లో పనిచేస్తున్న బహుళజాతి సంస్థ సింక్రనీ. కనెక్టికట్‌లోని స్టామ్‌ఫర్డ్‌లో దీని ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కంపెనీ 1932లో తొలుత ఆర్థిక సేవల సంస్థగా ప్రారంభమైంది. తర్వాతికాలంలో ఆరోగ్య, గృహవసతులు, రీటైల్ తదితర రంగాలకు విస్తరించింది. ప్రస్తుతం ఇందులో దాదాపు ఇరవైవేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ తన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ఉద్యోగులు ఇంటి నుంచి కార్యాలయానికి రాకపోకలు జరపడానికి వీలుగా విద్యుత్ వాహనాలు, విద్యార్హతలను మెరుగుపరచుకోవాలనుకునే ఉద్యోగులకు ట్యూషన్ ఫీజులు, ఇతర ఖర్చుల చెల్లింపు వంటి ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే, ఉద్యోగులకు పిల్లలు పుడితే, తల్లిదండ్రులకు వేతనంతో కూడిన సెలవులు, సంతానలేమితో బాధపడే ఉద్యోగులకు ఐవీఎఫ్ చికిత్స ఖర్చులను కూడా చెల్లిస్తోంది. వీలైన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, నిర్ణీత వేళల్లో పనిచేసేవారికి కూడా ప్రతి శుక్రవారం ‘ఫ్లెక్స్ ఫ్రైడే’ వెసులుబాటు తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం తన పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరచుకునే నిబద్ధత ‘సింక్రనీ’ని ఈ స్థాయికి తెచ్చింది. ఉద్యోగం చేయడానికి ఇది అద్భుతమైన సంస్థ అని ఇందులో పనిచేసే 94 శాతం ఉద్యోగులు చెబుతుండటమే దీని విజయానికి గీటురాయి.
3 సిస్కో
ఇది కూడా అమెరికన్ బహుళజాతి సంస్థల్లో ఒకటి. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో ప్రధాన కార్యాలయం గల ఈ కంపెనీ ఐటీ రంగంలో సేవలందిస్తోంది. నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ సహా పలు సాంకేతిక సేవలు అందించే ఈ కంపెనీ 1984లో ప్రారంభమైంది. ఉద్యోగులకు సంతృప్తికరమైన పనివాతావరణం కల్పించడానికి సిస్కో అనేక చర్యలను అమలు చేస్తోంది. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం కోసం పలు వసతులు కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పని ప్రదేశంలో మార్పు చేర్పులను ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా చేపడుతోంది. ఉద్యోగుల నైపుణ్యాల మెరుగుదల కోసం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనే ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేస్తుండటం సిస్కో ప్రత్యేకత. ఉద్యోగుల అభిప్రాయాలకు విలువనిస్తూ, వారికి తగిన ప్రయోజనాలను అందించడంలో ముందంజలో ఉండటమే సిస్కోను అత్యుత్తమ స్థాయికి చేర్చించింది. తమ అభిప్రాయాలకు యాజమాన్యం విలువనివ్వడం వల్ల ఈ సంస్థలోని ఉద్యోగులు పూర్తి సంతృప్తితో పనిచేసుకోగలుగుతున్నారు.
4 అమెరికన్ ఎక్స్‌ప్రెస్
ఆర్థిక సేవల రంగంలో 175 ఏళ్లుగా పనిచేస్తున్న ఈ అమెరికన్ బహుళ జాతి కంపెనీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఉంది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ట్రావెలర్స్ చెక్కులు, బీమా, పర్యాటక రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తోంది. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ కంపెనీలో దాదాపు 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేయడం తమ అదృష్టంగా ఉద్యోగులు భావిస్తారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది. ఉద్యోగం వల్ల ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఉద్యోగులు కోరుకునే వేళల్లో పనిచేసే వెసులుబాటుతో పాటు వారు ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తోంది. సంతృప్తికరమైన వేతనాలు; ఉద్యోగాల్లో అభివృద్ధి సాధించడానికి వీలుగా విద్యార్హతలు పొందడానికి చదువుకునే విద్యార్థులకు చదువుల ఖర్చుల చెల్లింపు; ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఉచిత ఆరోగ్య బీమా; పారదర్శకమైన నాయకత్వం ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి. ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగులందరికీ సమానావకాశాలు కల్పించడం; ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో తలెత్తే సమస్యల పరిష్కారంలో తోడ్పాటునందించడం వంటి చర్యల ద్వారా ‘అమెరికన్ ఎక్స్‌ప్రెస్’ తన ఉద్యోగుల మనసులను చూరగొంటోంది.
5 ఎన్‌విడీయా
ఐటీ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ కాలిఫోర్నియాలోని శాంటా క్లారా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. ముప్పయ్యేళ్లకు పైగా పనిచేస్తున్న ఈ సంస్థ ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వైవిధ్యభరితమైన సేవలను అందిస్తోంది. చిప్స్ తయారీ, డిజైనింగ్, గేమింగ్, ఏఐ సహా పలు సేవలను ప్రపంచవ్యాప్తంగా అందిస్తోంది. ఎన్‌విడీయా కంపెనీలో దాదాపు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకసారి ఇందులో ఉద్యోగంలో చేరాక మానేసే వారు అతి తక్కువ. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, సంస్థలోని వివిధ బృందాలు ఉన్నా, ఏ బృందానికి ఆ బృందం స్వయంప్రతిపత్తితో పనిచేసేలా ప్రతి బృందానికి స్వేచ్ఛాయుత వాతావరణం, ఉద్యోగులు అందరూ ఒకేసారి సెలవులను ఆస్వాదించేలా వారాంతపు సెలవులు మాత్రమే కాకుండా, ప్రతి మూడునెలలకు ఒకసారి వరుసగా రెండు రోజులు సెలవులు, ప్రతి ఏడాదిలో ఇరవైరెండు వారాల పాటు వేతనంతో కూడిన సెలవులు తీసుకునే వెసులుబాటు ఈ సంస్థను ఉద్యోగుల పాలిటి ఉత్తమ సంస్థగా నిలుపుతున్నాయి. ఉద్యోగులకు నచ్చిన వేళల్లో పనిచేసుకునే వెసులుబాటు, వారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ఆర్థిక మద్దతు, దిగువ స్థాయి ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని విధానపరమైన మార్పులు చేపట్టడం వంటి చర్యలు ఈ సంస్థను అగ్రగామిగా నిలుపుతున్నాయి.
6 వెగ్‌మాన్జ్
రిటైల్ రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళ జాతి సంస్థ న్యూయార్క్‌లోని రోషెస్టర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. జాన్ వెగ్‌మాన్, వాల్టర్ వెగ్‌మాన్ అనే సోదరులు 1916లో ఈ సంస్థను ప్రారంభించారు. ‘వెగ్‌మాన్జ్’ సంస్థకు ఇప్పుడు అమెరికాలో మొత్తం 111 సూపర్ మార్కెట్ స్టోర్లు ఉన్నాయి. ‘ఫార్చూన్’ పత్రిక 1998లో ‘బెస్ట్ కంపెనీస్ టు వర్క్’ జాబితాను విడుదల చేయడం ప్రారంభించిన నాటి నుంచి వెగ్‌మాన్ ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో చోటు దక్కించుకుంటూ వస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 54 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగ భద్రత, సంతృప్తికరమైన వేతనాలు, పనితీరు ఆధారంగా పదోన్నతులు, ప్రతి ఆరునెలలకు ఒకసారి వేతనాల పెంపు, యాజమాన్య నిర్ణయాల్లో పారదర్శకత, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ఉచిత ఆరోగ్య బీమా, పనివేళలను కోరుకునే రీతిగా ఎంపిక చేసుకునే వెసులుబాటు, ఉద్యోగులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తోంది. ఇన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ‘వెగ్‌మాన్జ్’ ఉద్యోగులు తమ యాజమాన్యం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.
7 యాక్సెంచర్
ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగానికి చెందిన ఈ బహుళ జాతి సంస్థ ఐర్లండ్ రాజధాని డబ్లిన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. దాదాపు 120 దేశాలలో కార్యాలయాలు ఉన్న ఈ కంపెనీలో 7.79 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్ట్రాటజీ, కన్సల్టింగ్, ఆపరేషన్స్ తదితర సేవలు అందిస్తున్న ఈ కంపెనీ తన క్లయింట్స్‌కు ఎప్పటికప్పుడు కావలసిన పరిష్కారాలను అందించే దిశగా పరిశోధనలపై భారీగా ఖర్చు చేస్తుంది. ఉద్యోగులను నిరంతర అధ్యయనం చేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రాజెక్టుల ఎంపికలోను, కెరీర్ రంగాల ఎంపికలోను, పనివేళల ఎంపికలోను ఉద్యోగులకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తుంది. అధ్యయనానికి, సృజనాత్మకతకు పెద్దపీట వేయడమే కాకుండా, పనితీరు ఆధారంగా ఉద్యోగుల పురోభివృద్ధికి భరోసా కల్పిస్తుండటంతో ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, పిల్లలు పుట్టినప్పుడు తల్లి దండ్రులకు వేతనంతో కూడిన సెలవులు మాత్రమే కాకుండా, సంతాన సాఫల్య చికిత్సలు పొందేవారికి, పిల్లలను దత్తత తీసుకునేవారికి కూడా వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేస్తుండటం ఈ కంపెనీ ప్రత్యేకత.
8 మేరియట్
ఆతిథ్య రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మేరీలాండ్‌లోని బతీజ్దా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది మేరియట్ ఇంటర్నేషనల్ సంస్థకు వివిధ దేశాల్లో ఆరువందలకు పైగా హోటళ్లు, రిసార్టులు ఉన్నాయి. ‘మనుషులే ప్రధానం’ సిద్ధాంతంతో పనిచేసే మేరియట్ సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి, సంతృప్తికి అత్యధికంగా ఖర్చు చేస్తుంది. కంపెనీ అంతర్గత వ్యవహారాల్లో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. ఉద్యోగులతో తరచు సమావేశాలు నిర్వహించడం, ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకుని, విధాన నిర్ణయాలలో మార్పులు చేయడం వంటి చర్యల ద్వారా మేరియట్ సంస్థ ఉద్యోగుల విశ్వాసాన్ని, అభిమానాన్ని చూరగొంటోంది. పనితీరు ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులు, బహుమతులు ఇవ్వడం, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, సెలవులలో ఉద్యోగులు పర్యటనలకు వెళ్లేటప్పుడు తమ హోటళ్లలో డిస్కౌంట్‌కు బస, ఆహార పానీయాలు అందించడం, ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ చెల్లింపు, ఉద్యోగులకు కంపెనీలో వాటాల కేటాయింపు వంటి చర్యల ద్వారా మేరియట్‌లో పనిచేయడాన్ని ఉద్యోగులు గొప్ప అవకాశంగా భావిస్తారు.
9 పినాకిల్
ఆర్థిక సేవల రంగానికి చెందిన ఈ అమెరికన్ కంపెనీ టెనెసీలోని నాష్‌విల్లె ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. బ్యాంకింగ్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్, మార్టిగేజ్ తదితర సేవలను అందించే ఈ కంపెనీలో దాదాపు మూడున్నర వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలతో పాటు కంపెనీలో పరిమిత మొత్తాల మేరకు వాటాల కేటాయింపు; ఉద్యోగుల వ్యక్తిగత జీవితానికి ఇబ్బంది లేని పనివేళలు; లక్ష్యాలను సాధించిన ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహకాలు; ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా; రిటైరైన ఉద్యోగులకు పింఛను చెల్లింపు; వేతనంతో కూడిన సెలవులు; ఉద్యోగులపై ఆధారపడే తల్లిదండ్రుల సంరక్షణ కోసం ప్రత్యేక అలవెన్సు వంటి చర్యల ద్వారా పినాకిల్ సంస్థ ఉద్యోగులు పనిచేయడానికి అన్ని విధాలా అనువైన సంస్థల్లో అగ్రశ్రేణిలో నిలుస్తోంది. ఇందులో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తుండటం దీని విజయానికి నిదర్శనం.
10 వరల్డ్ వైడ్ టెక్నాలజీ
సాంకేతిక రంగానికి చెందిన ఈ అమెరికన్ బహుళజాతి సంస్థ మిసోరీలోని మేరీలాండ్ హైట్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. అప్లికేషన్ డెవలప్‌మెంట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్, స్ట్రాటెజిక్ రిసోర్సింగ్, గ్లోబల్ సప్లై చెయిన్, ఇంటిగ్రేషన్ నెట్‌వర్కింగ్ తదితర సేవలను అందిస్తున్న ఈ కంపెనీలో దాదాపు పన్నెండువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలను చెల్లించడంతో పాటు వరల్డ్ వైడ్ టెక్నాలజీ కంపెనీ వారికి అనేక ప్రయోజనాలను కల్పిస్తోంది. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా, ప్రమాద బీమా; ఉద్యోగ విరమణ తర్వాత జీవితం సజావుగా సాగడానికి రిటైర్‌మెంట్ పథకం; ఉద్యోగుల్లో ఎవరికైనా పిల్లలు పుడితే తల్లులతో పాటు తండ్రులకు కూడా వేతనంతో కూడిన సెలవులు; సంతాన సాఫల్య చికిత్సల కోసం ఆర్థిక సాయం, సెలవులు, పిల్లలను దత్తత చేసుకోవడానికి వేతనంతో కూడిన సెలవులు; అనువైన పనివేళలను ఎంపిక చేసుకునే వెసులుబాటు; నాయకత్వ శిక్షణ తదితర కార్యక్రమాల ద్వారా వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఉత్తమ సంస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇందులో పనిచేసే వారిలో తొంభైఐదు శాతానికి పైగా ఉద్యోగులు పూర్తి సంతృప్తితో ఉన్నట్లు చెబుతారు.
ఉద్యోగులు లోటులేని జీవితాలను గడపడానికి తగినట్లుగా సంతృప్తికరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, పనివేళల్లో వెసులుబాట్లు, వివిధ అవసరాలకు వేతనాలతో కూడిన సెలవులు, పనితీరుకు తగిన గుర్తింపు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల పట్ల పట్టింపు వంటి చర్యల ద్వారానే ఈ కంపెనీలు ఉద్యోగుల పాలిటి కల్పతరువుల్లా ఉంటూ అగ్రశ్రేణిలో నిలుస్తున్నాయి.
Tags : 1