ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు
Breaking News
కుటుంబమే కీలకం
Published on Sun, 03/29/2026 - 05:45
ప్రముఖ మనస్తత్వవేత్త ఎరిక్ ఎరిక్సన్ తన ఎనిమిది దశల వికాస సిద్ధాంతంలో మొదటి దశను ‘ట్రస్ట్ వర్సెస్ మిస్‌ట్రస్ట్’ అని పిలిచారు. శిశువు జన్మించిన మొదటి ఏడాదిలో తల్లిదండ్రులు ఇచ్చే ఆదరణ, రక్షణ ఆ బిడ్డలో ‘ఈ ప్రపంచం సురక్షితమైనది’ అనే నమ్మకాన్ని కలిగిస్తాయి. ఒకవేళ ఆ దశలో నిర్లక్ష్యానికి గురైతే, ఆ బిడ్డ పెద్దయ్యాక ఎవరినీ నమ్మలేని వ్యక్తిత్వాన్ని అలవరచుకుంటాడు.
మానవ పరిణామ క్రమంలో మనిషిని ఒక సామాజిక జీవిగా తీర్చిదిద్దే మొదటి పాఠశాల ‘కుటుంబం’. ఒక వ్యక్తి సమాజంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు, ఇతరులతో బంధాలను ఎలా కొనసాగిస్తాడు అనే అంశాలన్నీ ఆ వ్యక్తి పెరిగిన కుటుంబ వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. సైకాలజీ పరిభాషలో చెప్పాలంటే, వ్యక్తిత్వం అనేది కేవలం జన్యువుల కలయిక మాత్రమే కాదు, అది అనుభవాల సమాహారం. ఆ అనుభవాలకు కేంద్ర బిందువు కుటుంబం.
ఒక కుమ్మరి మట్టిని ఎలాగైతే తన చేతులతో నొక్కుతూ, సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాడో, తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి.
మాటల కంటే చేతలు మిన్న
కుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటే, పిల్లలు ‘గౌరవం’ అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. వారు విన్న దానికంటే, కళ్లారా చూసిన దాన్నే ఎక్కువగా నమ్ముతారు. పెద్దలను గమనించడం ద్వారా పిల్లలు నేర్చుకుంటారని అల్బర్ట్ బండూరా తన ‘సోషల్ లెర్నింగ్ థియరీ’లో నిరూపించారు. ఇంట్లో తండ్రి కోపాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాడు? తల్లి సమస్యలను ఎలా ఎదుర్కొంటోంది? తాతయ్య ఇతరులతో ఎలా మాట్లాడుతున్నాడు? ఇవన్నీ బిడ్డ మెదడులో నిక్షిప్తమైపోతాయి.
ఉదాహరణకు, ఒక ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి, బయట చాలా సౌమ్యంగా ఉంటూ ఇంట్లో మాత్రం భార్యపై అరుస్తూ ఉంటాడు. అతని కుమారుడు అది చూస్తూ పెరిగాడు. ఆ అబ్బాయి పెద్దయ్యాక తన భాగస్వామితో కూడా అదే ‘అగ్రెసివ్’ ప్రవర్తనను ప్రదర్శిస్తాడు. ఎందుకంటే, అతని దృష్టిలో మగతనం అంటే అధికారం చలాయించడం అనే తప్పుడు భావన నాటుకుపోయింది. దీనినే ‘ఇంటర్‌జెనరేషనల్ ట్రాన్స్‌మిషన్ ఆఫ్ బిహేవియర్’ అంటారు.
ఫ్యామిలీ డైనమిక్స్ – ఎమోషనల్ ఇంటెలిజెన్స్
వ్యక్తిత్వ వికాసంలో ఐక్యూ (తెలివితేటలు) కంటే ఈక్యూ (భావోద్వేగ పరిణతి) ముఖ్యం. కుటుంబంలో భావోద్వేగాలను పంచుకునే స్వేచ్ఛ ఉంటేనే బిడ్డలో ఈక్యూ పెరుగుతుంది. ‘మగపిల్లలు ఏడవకూడదు‘ అని అణచివేయడం వల్ల, వారు పెద్దయ్యాక తమ భావాలను వ్యక్తపరచలేని ‘ఎమోషనల్లీ స్టంటెడ్’ వ్యక్తులుగా మారుతారు. కుటుంబం అనేది ఒక సురక్షిత ్రపదేశంగా ఉండాలి, అక్కడ తప్పులు చేసినా క్షమించబడతామనే ధైర్యం ఉండాలి.
మనం ఇంటికి వేసే రంగులు (బయట ప్రపంచానికి కనిపించే మన నడవడిక) అందంగా ఉండవచ్చు. కాని, వర్షం వచ్చినా, భూకంపం వచ్చినా ఇల్లు నిలబడాలంటే పునాది (కుటుంబం ఇచ్చిన మానసిక స్థైర్యం) బలంగా ఉండాలి. పునాదిలో పగుళ్లు ఉంటే, పైన ఎన్ని రంగులు వేసినా ప్రయోజనం లేదు. అలాగే, వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే, అవి కుటుంబ వాతావరణం నుండి వచ్చినవే అయి ఉంటాయి.
మార్పు మన నుండే...
కుటుంబం వ్యక్తిత్వానికి పునాది అనగానే, మనలోని లోపాలకు తల్లిదండ్రులను నిందించడం పరిష్కారం కాదు. కార్ల్ జంగ్ అన్నట్లు, ‘నేను నా గతాన్ని మార్చలేను కాని, నా భవిష్యత్తును నేను నిర్మించుకోగలను.’ మన కుటుంబం నుంచి మనకు వచ్చిన నెగటివ్ పాటర్న్స్‌ను గుర్తించడం మొదటి అడుగు. ఆ తర్వాత వాటిని మార్చుకుంటూ, మన తర్వాతి తరానికి ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణాన్ని అందించడం మన బాధ్యత.
నేటి కాలంలో కుటుంబ సభ్యులంతా ఒకే గదిలో ఉన్నా, ఎవరి మొబైల్స్‌లో వారు నిమగ్నమై ఉంటున్నారు. దీనిని ‘ఫబ్బింగ్’ అంటారు. ఇది పిల్లల్లో ‘నిర్లక్ష్యానికి లోనవుతున్నాం’ అనే భావనను కలిగిస్తుంది. నాణ్యమైన సమయం గడపకపోవడం వల్ల పిల్లలు తమ వ్యక్తిత్వానికి కావాల్సిన సామాజిక నైపుణ్యాలను కోల్పోతున్నారు. ముఖాముఖి సంభాషణలు లేకపోవడం వల్ల సహానుభూతి తగ్గుతోంది.
-సైకాలజిస్ట్ విశేష్
ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
www.psyvisesh.com
Tags : 1