పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు
Breaking News
ఈ వారం కథ: రైలు పట్టాలపై పదిపైసలు
Published on Sun, 01/11/2026 - 11:33
‘‘పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టెనేని బిగియ పట్టవలయు పట్టి విడుచుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినుర వేమ!’’ యాభైమంది ఐదో తరగతి పిల్లలతో ఉన్న ఆ క్లాసు కోలాహలంగా ఉంది. టీచర్ దృష్టిలో పడాలని ఒకరిని మించి ఒకరు పెద్దపెద్ద గొంతులతో బోర్డుపైన ఉన్న పద్యాన్ని అందరికంటే ముందు చెప్పడానికి తాపత్రయ పడుతున్నారు. పద్యం చెప్తున్న రమణ ఒక్కసారిగా గొంతు తగ్గించి, పక్కనున్న వెంకట్ డొక్కలో చిన్నగా పొడిచి ‘బయటికి వెళ్దాం’ అన్నట్టుగా కంటితో సైగ చేశాడు.వెంకట్ అతని వంక చూసి ‘వద్ద’న్నట్టుగా కళ్ళతోనే వారించాడు. ‘రాకపోతే నీ అంతు తేలుస్తా’ అన్నట్లుగా వేలు చూపిస్తూ బెదిరించాడు రమణ.
కాసేపటికి రీసెస్ బెల్ కొట్టడంతో పుట్టలోంచి చీమలు వచ్చినట్లుగా క్లాసులోంచి పిల్లలంతా బయటకు వచ్చారు. ఒకర్నొకరు తోసుకుంటూ ఆడుకున్నారు. కనిపించే చెట్టుకొమ్మల్ని పట్టుకుని వేలాడారు. చిన్న చిన్న కర్రపుల్లల్ని చేతిలో పట్టుకుని కనిపించిన కుక్కల్ని తరుముతూ కొంతసేపు ఆడుకుని వెనక్కి తిరిగారు. ‘‘ఏరా.. రైలును చూట్టానికి ఎప్పుడెళ్తున్నావు’’ అన్నాడు శ్రీను.ఆ మాటలకు పెద్దగా నవ్వసాగాడు రమణ. వాడెందుకు నవ్వుతున్నాడో అర్థంకాక ‘‘పిచ్చిపట్టిందా... అలా నవ్వుతున్నావ్’’ అన్నాడు శ్రీను. నవ్వడం ఆపి శ్రీను వైపు చూస్తూ ‘‘ఈడిని క్లాసులో నుంచి రమ్మంటేనే బయటికి రావడానికి భయపడ్డాడు. ఇక రైలును చూశాడంటే అక్కడి నుంచి వెనక్కి రాడేమో! వీడొట్టి పిరికోడు..’’ అన్నాడు రమణ.
ఆ మాటలకు వెంకట్ ఉక్రోషంగా చూశాడు. మిగతా పిల్లలంతా తన వైపు వేళాకోళంగా చూడడం అవమానంగా అనిపించింది. రమణ వైపు చూస్తూ ‘‘నాకేమీ భయం లేదు. తప్పకుండా రైలును చూసొత్తా’’ అన్నాడు. ఆ మాటలకు మళ్ళీ పెద్దగా నవ్వుతూ ‘‘రైలుని చూడ్డానికే ఇంత భయపడేవాడు ఇక రైలు పట్టాలపై పది పైసల బిళ్లనెలా పెడతాడు?’’ అన్నాడు రమణ. ఏమీ మాట్లాడకుండా వాడివైపు చూశాడు వెంకట్. వాడి చూపుల నిండా వేళాకోళం, వెక్కిరింత కనిపించింది. వెంకట్ వాడి వంక చూస్తూ ‘‘ఈరోజు ఎలాగైనా అక్కడికి వెళ్తాను. రైలును చూస్తాను. రైలు పట్టాలపై పదిపైసల నాణెం పెట్టి తీసుకొచ్చి, నీకు చూపిస్తాను’’ అన్నాడు ఉక్రోషంగా.‘అవేమీ జరిగే పనులు కాదులే... పద పద’ అన్నట్లుగా నవ్వాడు రమణ. పిల్లలంతా క్లాసుకు చేరుకున్నారు.
టీచర్ మళ్ళీ పద్యాన్ని వల్లె వేయించసాగింది. ప్రతి పదం దగ్గరా ఆగుతూ, దాని భావాన్ని చెప్తూ, ఎవరైనా పిల్లలు తప్పు చెప్తే దాన్ని సరిచేసి మళ్లీ చెప్పసాగింది. వెంకట్ వింటున్నాడే గాని, కళ్లముందు రైలు కదలాడసాగింది. ఒక్కడే రైలు స్టేషన్ దగ్గరికి నడిచి వెళ్లగలడా? ధైర్యం చేసి వెళ్లినా, రైలు పట్టాలపై పదిపైసల బిళ్లను ఉంచగలడా? అనే ప్రశ్నలతో కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు.వెళ్లగలనో లేదోననే సందేహం వచ్చింది. ఎలాగైనా వెళ్లాలనే పట్టుదల పెరిగింది. టీచర్ చెప్తున్న పద్యం మనసులో సుడులు తిరగసాగింది.మధ్యాహ్నం భోజనం బెల్ మోగింది. వినయ్ వంక ఒకసారి చూసి ఇంటికి బయల్దేరాడు వెంకట్.
ఆవేశంలో కాళ్లకు చెప్పులేసుకోవడం కూడా మర్చిపోయి వచ్చాడు గాని, పగబట్టినట్లుగా తరుముతున్న ఎండను తట్టుకోలేక రోడ్డు పక్కనున్న మొక్కజొన్న చేను గట్టు మీద, దారి పక్కన గుట్టలుగా పేరుకుపోయిన ఎండుటాకుల మీదా నడవసాగాడు.నిర్లక్ష్యంగా గాలికి రేగుతున్న జుట్టును చేత్తో ఎగ దోసుకుంటున్నాడు. దాహంతో నాలుక పిడచకట్టుకు పోతోంది. పెదవుల్ని మాటిమాటికీ తడుపుకుంటున్నాడు. ధారగా కారుతున్న చెమటను ఒక చేత్తో తుడుచుకుంటూ, సూటిగా కళ్లమీద ఎండ పడకుండా మరో చేతిని అడ్డుపెట్టుకుంటూ నడకలో వేగం పెంచాడు. ‘ఎప్పుడెప్పుడు వెళ్లి రైలును చూస్తానా’ అనే కోరిక వాడిని నిలబడనీయట్లేదు. కాళ్లకు మొక్కజొన్న మోళ్లు గుచ్చుకుంటున్నాయో, ముళ్ళు గుచ్చుకుంటున్నాయో కూడా తెలియకుండా నడుస్తున్నాడు.
వెంకట్ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పెనుమాక రైల్వేస్టేషన్. సింగిల్ ట్రాక్ కావడం వల్ల నిర్దేశించిన సమయాల్లో తప్ప ఎక్కువగా రైళ్ల రాకపోకలుండవు. రైలొచ్చే ముందు కొట్టే గంట గురించి, పట్టాల మీదకి రైలు వచ్చేటప్పుడు చేసే చప్పుడు గురించి, అది వదిలే పొగ గురించి స్నేహితులంతా కథలు కథలుగా చెప్తే క్లాసులో చాలాసార్లు విన్నాడు. పైగా చాలామంది స్నేహితులు ‘రైలును చూడ్డానికి పెద్దవాళ్లతో వెళ్లాలని, ఒక్కరే వెళ్తే చాలా భయంగా ఉంటుందని’ చెప్పడం గుర్తొచ్చింది. మనసులో భయంగానే ఉన్నా ఎలాగైనా ఆ పూటే రైలును చూసి రమణగాడి నోరు మూయించి, అందరి ముందూ తానేంటో నిరూపించుకోవాలనే తపన వెంకట్ ఆశను మరింత బలపరచింది.
కాలికేదో గుచ్చుకోవడంతో ‘అమ్మా’ అనుకుంటూ కాలివైపు చూసుకున్నాడు. మొక్కజొన్న మోడు రెండు వేళ్ల సందులో గుచ్చుకుని చర్మం చీరుకుపోయి రక్తం కారసాగింది. ఒక్కసారిగా వెంకట్ నడకలో వేగం తగ్గింది. గట్టుమీద కూర్చుండిపోయి రెండు వేళ్ల మధ్యలోనూ కొంచెం ఉమ్ము రాసుకున్నాడు. కాలి బొటనవేలినీ, తర్వాత వేలినీ మెల్లగా చేతితో రుద్దుకున్నాడు. కొంచెం నొప్పి తగ్గిందనుకున్నాక పైకి లేచి నడక సాగించాడు. అతనితో పాటే తేనెటీగల్లా ఆలోచనలు కూడా వెంబడించాయి. లేత వొంటిని ఎండ కిరణాలు తొలిచేస్తున్నాయి. ముందుకు వంగి కాళ్లవైపు చూసుకున్నాడు. చీరుకుపోయి, దుమ్ము కొట్టుకుపోయిన కాళ్లు కనిపించాయి. గూటం తెగిపోయి ఇంటి దగ్గర వదిలొచ్చిన చెప్పుల్ని వేసుకొచ్చినా బాగుండేదని అనుకున్నాడు మనసులో. మాటిమాటికీ ఆ చెప్పులకు గూటం బిగించుకుంటూ నడిస్తే నడక సాగదని అనుకుని వాటిని ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాడు.
తను వెళ్ళేసరికి రైలు వచ్చి వెళ్ళిపోతే స్నేహితుల ముందు తలవంపులవుతుందని, అందరూ తనను వెక్కిరిస్తారని భయపడ్డాడు. కడుపునిండా అన్నం తింటే ఆలస్యమవుతుందని, తిన్నానన్న పేరుకి నాలుగు మెతుకులు తిని బయల్దేరాడు. ఎలాగైనా రైలుబండిని చూసి, స్నేహితుల ముందు భుజాలెగరేయాలనే ఆశ వాడిని నిలవనీయట్లేదు. పక్కనున్న రోడ్డుమీద ఎడ్లబండ్లు వెళ్తూ కనిపించాయి. ఎద్దులు కదిలినప్పుడల్లా వాటి మెడలోని గంటల చప్పుడు వాడికి ఆహ్లాదంగా అనిపించింది. ఎతై ్తన మూపురాన్ని ముద్దుగా చూశాడు. బండికి ‘జల్ల’ కట్టి ఉంది.మండుతున్న ఎండకు రోడ్డుమీద పెద్దగా జనసంచారం లేదు. అక్కడక్కడా నడుస్తున్నవాళ్ళు గొడుగులు వేసుకుని నడుస్తున్నా చీర కొంగుతోనో, పైపంచెతోనే విసురుకుంటూ వెళ్తున్నారు. అలా ఎదురైనవాళ్ళు అంత ఎండలో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వెంకట్‌ని పిచ్చివాడిని చూసినట్లుగా చూడసాగారు. వారిని దాటుకుని ముందుకు నడవసాగాడు.
ఆకాశానికి కాసేపు కరుణ కలిగి వర్షం పడితే తప్ప భూమాత చల్లబడేలా లేదు. అడుగులు పొయ్యి మీదున్న పెనం మీద పడుతున్నాయో, రోడ్డు మీద పడుతున్నాయో తెలియనంత తీవ్రంగా ఉంది ఎండ. నోరు తడారిపోయింది. నీటికోసం చుట్టూ చూశాడు. దారిలో మొక్కజొన్న తోటలకు దూరంగా పొలంలో ఒకచోట మోటార్ కనిపించింది. అది చూడడంతో వెంకట్ ప్రాణం లేచి వచ్చింది.రెండు చేతులతోనూ చెమట పట్టిన బుగ్గల్ని తుడుచుకుంటూ ఆనందంగా ఆ నీటి మోటార్ వైపు నడిచాడు. గట్టుమీదగా పొలాల మధ్యలో నడుస్తుంటే వాళ్లమ్మ వెనకాల నడుస్తూ చీరచెంగును కప్పుకున్నట్లుగా అనిపించింది. కోతకు సిద్ధమైన మొక్కజొన్న తోట బంగారురంగులో మెరిసిపోతోంది.గబగబా నీటి మోటర్ దగ్గరకెళ్ళి కాసిని నీళ్లతో మొహం కడుక్కుంటే ప్రాణం లేచొచ్చింది. దోసిళ్లతో తీసుకుని తనివితీరా నీళ్ళు తాగాడు.
చీరుకుపోయిన కాలివేళ్లను నీళ్లతో శుభ్రంగా కడిగాడు. పైన అంత ఎండకాస్తున్నా నీళ్ళు అంత చల్లగా ఉండడం ఎంతో హాయిగా అనిపించింది.అక్కడినుంచి వెనక్కి తిరిగాడు. బయటికి కనిపిస్తున్న మొక్కజొన్నల మీద పిట్టలేవో వాలి చిట్టి నోటితో అందినంత తింటూ తృప్తి పడుతున్నాయి. వాటివైపు చూస్తూ మళ్లీ గట్టును సమీపించాడు.దారిమధ్యలో ఏవో చిన్నచిన్న పాకలు, ఐస్ ఫ్యాక్టరీ కనిపించాయి. ఐస్ ఫ్యాక్టరీ ముందు ఆగి ఉన్న కొన్ని లారీల్లో పెద్ద పెద్ద ఐస్ బాక్సుల్ని ఎక్కిస్తున్నారు. ఐస్ బాక్సుని చూస్తుంటే వెంకట్ నోట్లో నీళ్లూరాయి.‘పాస్’ బెల్ కొట్టినప్పుడు వాడి స్నేహితుడు రమణ తినే సేమ్యా ఐస్ వాడి కళ్లముందు కదలాడింది. ‘ఉస్’ అని లోపలికీ బయటికీ లాగుతూ వాడు సేమ్యా ఐస్ చప్పరించినప్పుడల్లా వెంకట్ ప్రాణం అలా ఆకాశంలోకి ఎగిరి మళ్లీ నేలమీదకి వచ్చేది.
ఒకసారి ధైర్యం చేసి ‘నాకోసారి ఇత్తావా, చప్పరించి ఇచ్చేత్తాను’ అని అడిగాడు.దానికి రమణ నుదురు ముడతలు పడింది. ‘‘ఛీ... అట్టాశేత్తే ఎంగిలి కదూ! నేనివ్వను’’ అన్నాడు. ఆ మాటలకు వెంకట్ ఉత్సాహమంతా వేడి పెనం మీద వేసిన నీటిబొట్టులా ఆవిరయింది. ఎలాగైనా సేమ్యా ఐస్ కొనుక్కుని వాడి ముందే తనివితీరా చప్పరించాలనే ఆలోచన కలిగింది.ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా వాడిలో ఏదో తెలియని అసంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు తన కళ్లముందు కనిపిస్తున్న రకరకాల ఐసుల్ని చూస్తుంటే వాడి నోట్లో అప్రయత్నంగా నీళ్లూరాయి. ముందుకు నడుస్తున్నాడే గాని, వాడి ప్రాణమంతా ఐస్ బాక్సుల మీదే ఉంది. దారివంక కాసేపూ, వెనక వైపు కాసేపూ చూస్తూ ముందుకు నడుస్తున్న వాడల్లా హఠాత్తుగా ఆగిపోయాడు.దారి చీలిపోయిన దగ్గర నుంచుని దిక్కులు చూశాడు. ఏ దారిలో వెళ్తే రైల్వేస్టేషను తొందరగా వస్తుందో తెలియక తికమకపడసాగాడు. ఎండ కుదురుగా నిలబడనివ్వడం లేదు.
ఎండ బాధకంటే కొంచెం దూరం నడిచినా ఏం కాదులే అనుకుని తోచిన దారివైపు నడవసాగాడు.తాటాకు చూరుకింద నులకమంచం వేసుకుని కునికిపాట్లు పడుతున్న అవ్వ కనిపించింది. ఆమెకి దూరంగా నుంచుని ‘‘అవ్వా.. రైలుటేసను దెగ్గిరికి ఇటేపు ఎల్లొచ్చా?’’ అని అడిగాడు ఆయాసపడుతూ. మామ్మ బోసి నోట్లో నుంచి వింత నవ్వొకటి పెదాలపై కనబడకుండా మెరిసింది. కాసేపయ్యాక ‘‘రైలెక్కి ఏ దేశమెల్తన్నా. కాళ్లకి శెప్పులు కూడా లేకుండా బైలెల్లావ్’’ అంది. వెంకట్‌కి ఏమి చెప్పాలో తెలియక దిక్కులు చూస్తూ నిలబడిపోయాడు. వాడి అవస్థను గమనించిన అవ్వ ‘అటే పో’ అన్నట్లుగా చేతిని పైకెత్తి దారివైపు చూపించింది.కాలనీలా ఉన్న ఇళ్లను దాటిన తర్వాత కొంచెం దూరంగా రైలుపట్టాలు కనిపించాయి. వాటిని చూస్తూ ఎదురెదురుగా ఉన్న రైలు పట్టాలు ఎంతదూరం వెళ్తాయో అంచనా వేయసాగాడు.
వాడి చిట్టిబుర్రకు తట్టలేదు, ఊహకు అందలేదు. ముందుకు వంగుని నాలుగురాళ్లను చేత్తో తీసుకున్నాడు. కాలుతున్న ఇనుపముద్దని చేత్తో తీసుకున్నట్లుగా చురుక్కు మనిపించి వదిలేశాడు. దూరంగా చెట్టుకింద నీడ కనిపించడంతో అటువైపు నడిచాడు.బరువైన సామాన్లను నెత్తిన మోసుకుంటూ, చంకలో చంటిపిల్లలతో వచ్చిన వాళ్లతో స్టేషనంతా కిటకిటలాడుతోంది. ఆ టైంలో ఒకటే రైలు కావడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. పొరుగూరులో పనులకెళ్ళే వాళ్ళు సామాన్లు నింపిన గోతాల్ని తలమీద పెట్టుకుని అటుఇటూ తిరగసాగారు.వాళ్లవైపు చూస్తున్న కొద్దీ వెంకట్‌లో ఆత్రుత ఎక్కువైంది. అంతవరకూ రైలు గురించి వినడమే తప్ప ప్రత్యక్షంగా చూసింది లేదు. తర్వాత క్లాసులో ఏదైనా నాణేన్ని రైలుపట్టాలపై పెడితే పెద్దగా అవుతుందని రమణ చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఎలాగైనా ఆ అనుభూతిని పొందాలనే తపనతో రూపాయి కోసం ఇల్లంతా గాలించాడు. చివరికి ఎక్కడో సత్తు పదిపైసల నాణెం కనిపించింది.
దానిని జాగ్రత్తగా నిక్కరు జేబులో వేసుకుని బయల్దేరాడు. అది గుర్తుకొచ్చి జేబుల్ని తడుముకున్నాడు. పదిపైసల బిళ్ల చేతికి తగలడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న స్టేషనులో కలకలం మొదలయింది. టికెట్ తీసుకుని అక్కడక్కడా దూరంగా నిలబడ్డ ప్రయాణికులంతా హడావిడి పడుతూ ట్రైనులో ఎక్కడెక్కడ ఖాళీ ఉంటుందో అంచనా వేసుకుంటూ అక్కడికి చేరుకోసాగారు. మైకులో అనౌన్సుమెంటు వినిపిస్తోంది. రైల్వే కూలీల పరుగులు, తినుబండారాలు అమ్మేవాళ్ల పరుగులతో ప్రశాంతమైన వాతావరణం కాస్తా తిరునాళ్లలా మారిపోయింది.చెట్టు కింద నిల్చున్న వెంకట్ భయంభయంగా రైలుపట్టాల వైపు కదిలాడు. తనను ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశారు.
ఎవరి పనుల్లో వారుండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. రైలొచ్చేటప్పుడు ఏదైనా స్తంభంలాంటి గట్టి ఇనుప వస్తువును పట్టుకోవాలని, లేకపోతే ఆ వేగానికి ట్రైన్ కిందకి వెళ్ళిపోతామని భయపెట్టిన రమణ గుర్తొచ్చాడు.ఎదురుగా కనిపిస్తున్న ట్రాక్ కొండచిలువలా కనిపించింది. జేబులో నుంచి పదిపైసల బిళ్ల తీసి పట్టా మీద పెట్టాడు. రైలు వేగానికి అదెక్కడికి ఎగిరిపోతుందో తెలియలేదు. దగ్గర నుంచోవాలంటే భయంగా ఉంది. పదిపైసలు బిళ్ళ పెట్టిన ప్రాంతానికి గుర్తుగా ఏమైనా ఉందేమోనని చుట్టూ చూశాడు. సమాంతరంగా ఉన్న రెండు రైలుపట్టాలకు మధ్యలో ఎర్రరంగు రాసిన చెక్కలు కనిపించాయి. చురుగ్గా దాని చుట్టూ చూసి దానికి ఎదురుగా పట్టా మీద పదిపైసలు బిళ్ల పెట్టి దూరంగా వచ్చాడు. దూరంగా రైలు కూత వినిపిస్తోంది. ప్రయాణికులందరిలో ఆదుర్దా మొదలయింది. దూరంగా నిల్చుని చూస్తున్న వెంకట్‌లో ఆందోళన ఎక్కువయింది.
దుమ్ము రేపుకుంటూ స్టేషనులో ఆగింది ట్రైన్. దిగేవాళ్లతో ఎక్కేవాళ్లతో హడావిడిగా ఉంది. ఒకర్నొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ సామాన్ల బరువుతో కంపార్టుమెంట్లలోకి ఎక్కుతున్న జనాల్ని చూస్తుంటే వెంకట్‌లో గుండెదడ మొదలయింది.ఒక పెట్టె వెనక ఇంకో పెట్టెతో ఇంటి దగ్గర చూసిన ‘రోకలిబండ’లా అనిపించింది ట్రైన్. ‘ఒక్క రోజులో ఎంతమందిని చేరవేస్తుందో’నని తనలో తానే ఆశ్చర్యపడ్డాడు. ట్రైన్ ఎప్పటికి కదులుతుందో తెలియదు, తన పదిపైసలు బిళ్ల ఎక్కడ పడుతుందో తెలియదు. తనలో తనే కాసేపు ఆరాటపడ్డాడు.ట్రైన్ బయల్దేరుతుందన్నట్లుగా మైకులో ప్రకటన వినిపించింది.
ఇంజిన్ పెట్టెలో ఉన్న గార్డు పచ్చ జెండా ఊపడంతో రైలు కదిలింది. వెంకట్ చూపు మొత్తం తాను పెట్టిన పది పైసల బిళ్లవైపు మళ్ళింది. నెమ్మదిగా కదిలినంత సేపూ దృష్టి అక్కడ నిలిచిందిగాని, వేగాన్ని పుంజుకున్నాక చూపు మందగించింది.నెమ్మదిగా ముందుకు కదిలి పది పైసల నాణెం కోసం వెతికాడు. పెట్టిన ప్రాంతంలో కనిపించక కంగారుపడ్డాడు.ఎంతో కష్టపడి ఇల్లంతా వెతికి తెచ్చాడు. ఆ నాణెం పెద్దదైతే బడికెళ్లాక స్నేహితుల ముందు గొప్పగా చూపించాలనుకున్నాడు. కాని, చూస్తుంటే పరిస్థితి అలా జరిగేలా లేదు.
నాణెం పెట్టిన ప్రాంతానికి అటూ ఇటూ వెతికాడు. ఎర్రరంగు పూసిన చెక్కదిమ్మకు కొద్ది దూరంలో కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. గబగబా పరిగెత్తి ఆ బిళ్లని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నాడు. పెద్దగా కనిపిస్తున్న నాణెం వంక ఆశ్చర్యంతోనూ, ఆనందంతోనూ చూస్తుంటే వెంకట్ కళ్ళు పెద్దవయ్యాయి. కళ్లల్లో నీళ్ళు చిప్పిల్లాయి. జాగ్రత్తగా దాన్ని చేతుల్లోకి మార్చి మార్చి తీసుకుని కళ్ల నిండుగా చూసుకున్నాడు. ఆ తర్వాత జాగ్రత్తగా దాన్ని నిక్కరుజేబులో వేసుకున్నాడు. రాళ్లను, పట్టాలను దాటుకుంటూ వచ్చిన దారివైపు నడవసాగాడు.
బాల్యంలో పుట్టిన కోరికలు చిరుగాలిలా మొదలై పెనుగాలిలా మారతాయి. తీరిపోయిన తర్వాత ఉత్సాహ తరంగాలై పట్టుకుని ఊపేస్తాయి. కారుతున్న చెమటను చేత్తో తుడుచుకుంటూ జేబులో వెడల్పుగా కనిపిస్తున్న పదిపైసల నాణేన్ని తడుముకున్నాడు.ఆనందంతో అడుగులెలా పడుతున్నాయో తెలియట్లేదు. అన్నం వేళ దాటిపోయినా ఆకలిగా లేదు. ఎండ నిలువునా తగలబెడుతున్నా స్పృహ లేదు. వెంకట్ కళ్లముందు ట్రైన్ చూసిన ఆనందం పదిపైసల నాణెం విస్తరించినట్లుగా రెట్టింపయింది.
స్కూలుకెళ్లాక స్నేహితుల ముందు తానొక హీరో, అందరూ తనను ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తారు. తన దగ్గరున్న పెద్దదైన పది పైసల నాణేన్ని చూడడానికి ఎగబడతారు. తాను మాత్రం ఎవరికీ చూపించకుండా కాసేపు దోబూచులాడతాడు. వాళ్లకు ఇచ్చినట్టే ఇచ్చి, చూపించినట్టే చూపించి వెంటనే దాచేస్తాడు. అందరికీ ఉక్రోషం మొదలవుతుంది. ఒక్కసారి జేబులో నాణేన్ని చేతిలోకి తీసుకుని గాల్లోకి ఎగరేశాడు.వాడి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ అది గాల్లో గిరికీలు కొట్టసాగింది.
Tags : 1