Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
ఈ వారం కథ: సముద్రం
Published on Sun, 12/07/2025 - 11:07
మలక్కా జలసంధి ..మలయా ద్వీపకల్పం సుమత్రా ద్వీపానికి మధ్య ఉన్న 930 కిలోమీటర్లు ఉన్న జలసంధి.అక్కడ నుండి పశ్చిమానికి 90 మైళ్ళ దూరంలో ఒక ఓడ ఆగి ఉంది. ఆ ఓడ మీద ఒక నలజెండా ఎగురుతూ ఉంది. దాని మీద ఒక పుర్రెబొమ్మ ఉంది.ఆ ఓడలో సుమారు ఒక ఇరవై మంది వరకు ఉన్నారు. ఓడ డెక్ మీద కూర్చున్న వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది వాళ్ళ వాలకం. వారందరి చేతుల్లోనూ పుర్రెలతో తయారు చేసిన మద్యం గ్లాసులు ఉన్నాయి. వాటిల్లో పోసిన ‘రమ్’ తాగుతూ వినోదిస్తున్నారు.ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ డెక్ మీదకు కొన్ని చేపలను విసిరేసి సముద్రంలో కలిసిపోయింది.చెవులకు రింగు పెట్టుకుని; తలకు నల్లటి పాగా కట్టుకుని, ఆ పాగాలో పిడిబాకు ఉంచిన ఒక వ్యక్తి తన పక్కన పడి ఉన్న పెద్దచేపను చేతిలోకి తీసుకున్నాడు.
దాని నోరు తెరిచి, తాను తాగుతున్న రమ్‌ను నోటిలో పోశాడు. తర్వాత దాన్ని నోటిలో పెట్టుకుని నమలసాగాడు.అదంతా చూస్తున్న మిగిలిన అందరూ ‘హే నాయకా’ అంటూ అరవసాగారు. వాళ్ళందరూ అలా అరుస్తున్న సమయంలో సముద్రంలో ఈదుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి డెక్ మీదకు వచ్చాడు. అందరూ నిశ్శబ్దమై పోయారు. ‘నాయకా!’ అంటూ అతడికి సలాం చేశాడు.తరువాత తాను తెచ్చిన వివరాలతో ఒక మ్యాప్ అతడికి అందించాడు. అది చూసిన అతడు ‘మన ఓడను ఇక్కడి నుంచి ఉత్తరం దిశగా మళ్లించండి. మనం ఎదురు చూస్తున్న నౌక ఇంకొన్ని గంటల్లో బయల్దేరుతుంది’ అని ఆజ్ఞాపించాడు. ఓడ ముందుకు కదిలింది.అందరూ తమ వద్ద ఉన్న పిడిబాకులను తుపాకులను, కత్తులను పట్టుకుని ఉన్నారు. వారందరూ తమ నాయకుడి ఆజ్ఞ కోసం సిద్ధంగా ఉన్నారు.వారందరూ స ..ము ..ద్ర.. పు .. దొం.. గ.. లు ... పైరేట్స్!
సాల్ శెట్టి ద్వీపం..దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై ఓడరేవు.కదలడానికి సిద్ధంగా ఉన్న కార్గో నౌకలతో; సముద్రతీరానికి చేరుకుంటున్న ఇతర నౌకలతో; ప్రయాణికులతో; అటు ఇటు తిరుగుతూ తమతమ విధులు నిర్వర్తిస్తున్న ఓడల సిబ్బందితో కిటకిటలాడుతోంది.తీరంలో కొద్దిదూరంలో ఒక పెద్ద నౌక లంగరు వేసి ఉంది. అది ముంబై తీరం నుంచి సింగపూర్ వరకు ప్రయాణించే క్రూజ్ షిప్ అయిన ‘రాయల్ డైమండ్ డాన్’.ప్రయాణికులందరూ ఒక్కొక్కరుగా ఓడలోకి వెళ్తున్నారు. ఎంట్ర¯Œ ్స వద్ద వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే వారిని డెక్ మీదకు పంపిస్తున్నారు.
ఓడ ఎక్కబోయే ముందు ఒక అందమైన యువతి ఫోన్ మాట్లాడుతూ అక్కడ నిలబడి ఉంది. మాట్లాడుతూ మాట్లాడుతూ యథాలాపంగా ముందుకు చూసింది. అక్కడ ఒక వ్యక్తి తన వద్దకే వస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఆ వ్యక్తి కలర్ గాగుల్స్ ధరించి, జేబుల్లో చేతులు పెట్టుకుని ముందుకు వస్తున్నాడు. తల పైకెత్తి ఓడను చూస్తూ వస్తున్నట్టు ఆమెకు అర్థమైంది.ఈలోగా ఆ గాగుల్స్ ఉన్న వ్యక్తి వచ్చి ఆమెను ఢీ కొట్టాడు. ఆ ఢీ కొట్టడంతో ఆమె పట్టుకున్న ఫోన్, అతను పెట్టుకున్న గాగుల్స్ ఒకేసారి కింద పడిపోయాయి. ‘ఏయ్ మిస్టర్ కళ్ళు పైకి పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది.’ అంటూ తన ఫోన్ కోసం కిందకు వంగింది. ‘సారీ మిస్’ అంటూ ఆ వ్యక్తి కూడా గాగుల్స్ కోసం కిందకు వంగాడు. అదే సమయంలో ఇద్దరి తలలు మరోసారి ఢీ కొట్టుకున్నాయి.అబ్బా అనుకుంటూ పైకి లేచింది ఆ యువతి. ‘ఏయ్ మిస్టర్ ఇలాంటి పెద్ద ఓడను ఎప్పుడూ చూడలేదా?’చిరుకోపంగా అడిగింది.
‘ఇప్పుడే మొదటిసారి ఇంత పెద్ద ఓడను చూస్తున్నాను.’ అమాయకంగా మొహం పెట్టి ఆమెకు బదులిచ్చాడు. అతడి కళ్ళు అల్లరిగా నవ్వుతున్నాయి.ఆమెను చూస్తూ ‘మీరు చాలా అందంగా ఉన్నారు. మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు బాగా సరిపోతారు’ అని ముందుకు నడుస్తూ చెప్పాడు అతడు.‘అయినా నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నట్టు ఇతడికి అర్థమైందా?’ మనసులో అనుకుంటూ, ‘మిస్టర్ పోకిరి’ అనుకుంది ఆమె.తరువాత ఓడ ఎక్కడానికి వెళ్ళింది. మిస్టర్ పోకిరి కూడా డెక్ మీదకు చేరుకున్నాడు.అరగంట తర్వాత మెల్లిగా ‘రాయల్ డైమండ్ డాన్’ అరేబియా సముద్ర జలాల్లో ముందుకు కదిలి క్రమేణా వేగం పుంజుకుంది.
ఇండియన్ నేవీ హెడ్ క్వార్టర్స్...ఒక బులెట్ ప్రూఫ్ కారు శరవేగంగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి కిందకు దిగాడు. ఆ వ్యక్తి మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతడిని చూడగానే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ‘సెల్యూట్’ చేస్తున్నారు. కాని, అదంతా పట్టించుకోని ఆ వ్యక్తి పరిగెడుతున్నట్టే లోపలకు అడుగు పెట్టాడు.నాలుగు అంతస్తులున్న ఆ భవనంలో మూడవ అంతస్తులో ఉన్న సౌత్ బ్లాక్ వింగ్. లిఫ్ట్ కోసం చూడకుండా క్షణానికి రెండు మెట్లు ఎక్కుతూ వింగ్‌లోకి దూసుకుపోయాడు.సౌండ్ ప్రూఫ్ గది అయిన ఆ గదిలోకి దూసుకువచ్చిన ఆ వ్యక్తిని చూశాడు నేవీ చీఫ్ అగర్వాల్. తన నోట్లో ఉన్న సిగార్‌ను బయటకు తీస్తూ ఆ వ్యక్తి వంక చూశాడు.
ఆ వ్యక్తి నేవీ ఆఫీసర్ తరుణ్ మిశ్రా.‘బాస్! అక్కడ దాడి జరగబోతోంది. రాయల్ డైమండ్ డాన్ నౌకను పైరేట్స్ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నారని మనకు రహస్య సమాచారం అందింది. వెంటనే మన వాళ్ళను అలెర్ట్ చేయకపోతే నౌకలో ఉన్న ప్రయాణికులను సముద్ర దొంగలు ప్రాణాలతో వదిలిపెట్టరు.’ తరుణ్ కంగారుగా చెప్పాడు.అంతా వింటున్న అగర్వాల్ ఏమీ మాట్లాడకుండా మళ్లీ సిగార్ నోట్లో పెట్టుకుని, పైకి లేచాడు. అతడిని చూస్తూ .. ‘ఈ సమాచారం నాకు కొన్ని గంటల కిందటే వచ్చింది’ అన్నాడు తాపీగా.‘బాస్! మరిప్పుడు డైమండ్ డాన్ నౌకను కాపాడటం ఎలా?’ ఆందోళనగా అడిగాడు.
‘మరేం పర్వాలేదు. సముద్రదొంగలను వెంటాడి వేటాడడానికి మన మెరైన్ కమాండో విజయ్ రాణా– డైమండ్ డాన్ నౌకలో ఉన్నాడనే సమాచారం కూడా వచ్చింది. పదిహేను రోజులు సెలవు తీసుకున్న విజయ్ ఆ షిప్‌లో వెళ్తున్నాడని తెలిసింది’ అన్నాడు.ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు తరుణ్ మిశ్రా. తమ చీఫ్ కంగారు లేకుండా అలా తాపీగా ఎందుకున్నాడో అర్థమైంది.అనంత సాగర జలాలలో ‘డైమండ్ డాన్’ నౌక 2 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తోంది. ప్రయాణికుల్లో కొంతమంది తమ తమ క్యాబిన్లలో ఉండిపోయారు. కొంతమంది నౌకలో ఉన్న ఫుడ్ కోర్ట్స్‌లో– నౌకను చూడాలని కుతూహలంతో ఇలా ఎవరికి వారు తమతమ పనులలో ఉన్నారు.‘డైమండ్ డాన్ రెస్టారెంట్’ తాటికాయలంత మెరిసే అక్షరాలతో రాసిన పేరుని చూస్తూ లోపలికి అడుగు పెట్టాడు మిస్టర్ పోకిరి. అలా అడుగుపెట్టగానే అతడి కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి.
కారణం అక్కడ మిస్ ఇంటర్నేషనల్ ఫుడ్ తింటూ కూర్చుని ఉంది. ఆమెను చూడగానే ‘ఈ బ్రహ్మచారి జీవితం ఈ భామకే అంకితం’ అని పాడుతూ.. ఫుడ్ తీసుకుని వెళ్లి ఆమె ముందు కూర్చున్నాడు. ఆమె అతడిని కళ్ళెత్తి చూసి ‘ఇక్కడకు కూడా వచ్చేసాడు మిస్టర్ పోకిరి’ అనుకుంటూ తినడం మొదలెట్టింది.‘హలో మిస్! నేను మిస్టర్ బ్రహ్మచారిని మాత్రమే కాని, పోకిరిని మాత్రం కాదు’ అన్నాడు. తినడం మొదలుపెడుతూ.తాను మనసులో అనుకున్న మాటలు ఇతడికెలా తెలిశాయనుకుంటూ ఆమె ఆశ్చర్యపోయింది.ఉన్నట్టుండి తమను ఎవరో గమనిస్తున్నట్టు బలంగా అనిపించసాగింది అతడికి.వెంటనే అతడు అలెర్ట్ అయ్యాడు.
కనుచివరల నుంచి చుట్టూ గమనించాడు. అందరూ ఎవరి పనుల్లో వారున్నారు కాని, మిస్ ఇంటర్నేషనల్ వెనుక ఉన్న కుర్చీల్లో ఉన్నవారు యథాలాపంగా తమనే గమనిస్తున్నారు.వారు మొత్తం నలుగురు ఉన్నారు. ఏదో తింటూ, తాగుతూ కనురెప్ప వేయకుండా ఆమెనేచూస్తున్నారు. ఆమె తినడం ముగించి, లేచి బయటకు నడిచింది. మిస్టర్ పోకిరి కూడా లేచి, ఆమె వెనుక వెళ్ళడానికి అన్నట్టుగా ముందుకు కదిలాడు.
అంతలో ఆ గమనిస్తున్నవారిలో ఒకడు అతడి వద్దకు అడ్డుగా వచ్చాడు. వాడిని చూసిన మిస్టర్ పోకిరి ‘ఎవరు బాస్ నువ్వు? అడ్డు తప్పుకో’ అన్నాడు మిస్ ఇంటర్నేషనల్ వెళ్లిన వైపుగా చూస్తూ...వాడితో ఉన్న మిగిలిన ముగ్గురూ మిస్టర్ పోకిరిని చుట్టుముట్టారు. అప్పుడు గమనించాడు వారందరినీ... వారి వాలకం... వారి మాటల్లో కరుకుదనం... వారి బలిష్టమైన చేతులు... శరీరాలు కనుచివరల నుంచి గమనించాడు అతడు. అక్కడ ఉన్న నలుగురూ అదే తీరులో ఉన్నారు.వాళ్లెవరో అతడికి అర్థమైపోయింది. ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. చుట్టూ చూశాడు. స్త్రీలు, చిన్నపిల్లలతో సహా నౌకలో చాలామంది అక్కడున్నారు.వారందరినీ వీళ్ళు చుట్టుముడితే? అసలు వీళ్ళు నౌకలోకి ఎలా రాగలిగారు?ఎంతమంది వచ్చారు? ఆలోచిస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు మిస్టర్ పోకిరి.ఆలోచిస్తూ డెక్ మీదకు వచ్చాడు.
అప్పటికే అక్కడ మిస్ ఇంటర్నేషనల్ డెక్ మీద నిలబడి సముద్రాన్ని చూస్తోంది.అతడిని చూడగానే ఆమె ‘వచ్చేశాడు మిస్టర్ పోకిరి’ అని మనసులోనే తిట్టుకుంది.కాని, అతడి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. అతడి మెదడు శరవేగంగా ఆలోచిస్తోంది.అతడి వెనగ్గా వచ్చిన నలుగురిలో ఇద్దరు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టారు.అది చూసిన మిస్టర్ పోకిరి ఆమె చేయి పట్టుకుని ముందుకు పరుగు తీశాడు.వాళ్లిద్దరూ డెక్ చివరిభాగానికి చేరుకున్నారు. అక్కడ ఆ సమయంలో ఎవరూ లేరు.తమను చుట్టుముట్టిన ఆ ఇద్దరినీ మిస్టర్ పోకిరి గాలిలోకి డైవ్ చేస్తూ, ఊహించని వేగంతో ఒక్కసారిగా తన్నాడు. ఆ వేగానికి వాళ్లిద్దరూ అల్లంతదూరంలో పడ్డారు.
పైకి లేచి అక్కడినుంచి పారిపోయారు. వారిని చూసి మిగిలిన ఇద్దరు కూడా అక్కడినుంచి జారుకున్నారు. అదే సమయంలో అతడి షూ నుంచి జారిపడిన ఐడీ కార్డును చేతిలోకి తీసుకున్న మిస్ ఇంటర్నేషనల్ ఆ కార్డు చూసి, స్థాణువులా అలా నిలబడిపోయింది.ఆమె ముందుకు వచ్చిన మిస్టర్ పోకిరి ‘హలో మిస్!’ అన్నాడు.ఆ మాటలకు ఉలిక్కిపడి తేరుకున్న ఆమె ‘మీరు మెరైన్ కమాండో విజయ్ రాణా’... అంటూ ఆగిపోయింది.తాను మిస్టర్ పోకిరి అనుకుంటున్నవాడు విజయ్ రాణా నా? అతడి గురించి తాను ఎన్నోసార్లు విని ఉంది. ఎన్నో నౌకలను, ఎందరో ప్రయాణికులను కాపాడటంలో విజయ్ రాణాను మించిన సాహసవంతుడు ఎవరూ లేరని ఎన్నోసార్లు విని ఉంది. అలాంటి వ్యక్తి తన ఎదురుగా తనతో పాటే ఉంటూ తనను కాపాడటం అనేది ఆమెకు నమ్మశక్యం కాకుండా ఉంది.
‘హలో మిస్!’... చిటికె వేస్తూ మళ్ళీ పిలిచాడు విజయ్ రాణా. తేరుకున్న ఆమె ‘నా పేరు అర్చన. మనదేశం తరపున నేను సింగపూర్‌లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ పోటీలకు వెళ్తున్నాను’ అన్నది.‘మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నారో అంతా నాకు తెలుసు’ అన్నాడు విజయ్ రాణా.ఆ మాటలకు అర్చన ఆశ్చర్యంగా ఉండిపోయింది.‘అర్చనా! మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాం. ఈ నౌకలో ఉన్న ప్రయాణికులందరినీ కాపాడాలి. నువ్వు వెంటనే నీ కేబిన్‌లోకి వెళ్ళిపో, క్విక్!’ అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలాడు విజయ్ రాణా.అర్చన ‘ఏమైంది?’ అని అడిగింది. వెళ్తూ వెళ్తూ ‘ఈ నౌకలో సముద్రపు దొంగలున్నారు’... చెబుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్ రాణా.
∙∙
దెబ్బ తిన్న దొంగలు కచ్చితంగా ఊరికే ఉండరు. ప్రయాణికులను భయపెట్టడమో, దోచుకోవడమో చేసే పనిలో తప్పకుండా ఉంటారని అనుకున్నాడు విజయ్ రాణా. ముందు ఈ నౌకలోకి పైరేట్స్ ఎంతమంది వచ్చారో తెలుసుకోవాలనుకుంటూ నౌక కెప్టెన్ శ్రీకర్ వద్దకు వెళ్ళాడు.‘కెప్టెన్ మన నౌకలో సముద్రపు దొంగలు ప్రవేశించారు. వారెంతమంది ఉన్నారో మొదటగా తెలుసుకోవాలి. తరువాత వారినెలా ఎదుర్కోవాలో చూద్దాం’ అన్న రాణా మాటలకు శ్రీకర్ అదిరిపడ్డాడు.‘అట్టే సమయం లేదు’ అని చెబుతున్న రాణా మాటలకు శ్రీకర్ వెంటనే వెళ్లి, నౌకలో ఉన్న కెమెరాల ఫుటేజీ మొత్తం విజయ్ రాణాకు చూపించసాగాడు.
కిందటి రాత్రి నౌక ఒకచోట లంగరు వేసినప్పుడు లంగరు కోసం ఉపయోగించిన మోకులాంటి తాడు ద్వారా వాళ్ళందరూ నౌకలోకి సాధారణ ప్రయాణికుల రూపంలో వచ్చారు. వాళ్ళు సుమారు ఇరవై మంది వరకు ఉన్నారని కనిపెట్టాడు విజయ్ రాణా.అది చూడగానే వెంటనే, నౌకలో సిబ్బందిని ఆపదలో ఉన్నప్పుడు అలెర్ట్ చేసే అలారం మోగించాడు.శ్రీకర్ వెంటనే ‘మీరు విజయ్ రాణా కదా!’ అడిగాడు. చిరునవ్వుతో ఔనన్నట్లుగా తలాడించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు.ఇక ఎంతమంది సముద్రపుదొంగలు దాడి చేసినా తమకు ఎలాంటి భయం లేదనుకుంటూ తన క్యాబిన్‌లోకి వెళ్ళాడు శ్రీకర్. అతను లోపలకు రాగానే అక్కడే ఉన్న దొంగల నాయకుడు అతడికి తుపాకీ గురి పెట్టాడు. తరువాత అతడిని బందీగా చేసుకుని, నౌకను దారి మళ్ళించమని ఆదేశించాడు.
అలారం మోగగానే నౌకలో పై అంతస్తులలో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ప్రమాదాన్ని శంకించారు. అన్ని క్యాబిన్లకు ఉన్న లాక్ సిస్టమ్‌ను ఫ్రీజ్ చేసేశారు. దాని వల్ల లోపల ఉన్నవాళ్లు బయటకు రాలేరు. బయట వాళ్ళు లోపలికి పోలేరు. కాని, భయంతో కేకలు వేస్తున్న మిగిలిన ప్రయాణికులను సముద్రపు దొంగలు చుట్టుముట్టి, అందరి తలలకు తుపాకులు ఎక్కుపెట్టారు. అందరినీ నౌక డెక్ మీదకు తీసుకు వచ్చారు. వారిలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. డెక్ మీద ప్రయాణికులందరినీ నిలబెట్టారు. వారి చుట్టూ దొంగలు చుట్టుముట్టి ఉన్నారు.
కెప్టెన్ శ్రీకర్ కాబిన్... దొంగల నాయకుడు అతడి పక్కనే ఉండి తలకు తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. నౌకను తనకు ఇష్టం వచ్చిన దిశలో మళ్లిస్తున్నాడు.శ్రీకర్ చేసేదేమీ లేక అతడు చెప్పినట్టుగానే నౌకను నడుపుతున్నాడు.ఇంతలో ఒక్కసారిగా దొంగలనాయకుడు దూరంగా ఎగిరి పడ్డాడు. అతడి చేతిలోని తుపాకీ అల్లంత దూరంలో ఎగిరి పడింది.మెరుపువేగంతో కదిలి ఆ తుపాకీని అందుకున్నాడు విజయ్ రాణా. దొంగల నాయకుడిని ఇద్దరూ కలిసి పెడరెక్కలు విరిచి కట్టారు. అతడిని చెరోపక్క పట్టుకున్న విజయ్ రాణా, శ్రీకర్ డెక్ మీదకు వచ్చారు.అక్కడ తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న దొంగలందరూ ఆ దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.
దొంగలనాయకుడి తలకు తుపాకీ గురిపెట్టిన విజయ్ వారిని చూస్తూ, ‘అందరూ మీ తుపాకులను, కత్తులను పక్కన పెట్టండి. లేకుంటే మీ నాయకుడి ప్రాణాలకు ముప్పు వస్తుంది’ అన్నాడు.దొంగలందరూ కలిసి తమ తుపాకులను, కత్తులను ఒక చోట పెట్టారు. ‘అందరినీ వదిలేయండి. లేకపోతే...’ అన్నాడు శ్రీకర్.అందరినీ వదిలి దొంగలందరూ ఒకపక్కగా వచ్చారు. వారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. అదే సమయంలో తప్పించుకున్న దొంగల నాయకుడు ముందుకు వేగంగా కదిలి తన తలపాగాలో దాచి ఉన్న పిడిబాకును బయటకు తీసి దగ్గరలో ఉన్న అర్చనను ముందుకు లాగి, ఆమె కంఠానికి గురి పెట్టాడు.అది చూసిన విజయ్ రాణా కదలకుండా అక్కడే ఆగిపోయాడు.‘మర్యాదగా మమ్మల్ని ఇక్కడనుండి వెళ్లనివ్వండి. లేకపోతే ఈ అమ్మాయిని చంపేస్తాను’ అన్నాడు దొంగల నాయకుడు.అందరూ అక్కడే ఆగిపోయారు. దొంగలందరినీ వదిలిపెట్టారు.
అర్చనను ముందుకు తీసుకెళ్తున్నాడు దొంగలనాయకుడు. విజయ్ రాణా ఊహించని మెరుపువేగంతో కదిలి, దొంగలనాయకుడిని వెనుక నుంచి ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకు దొంగల నాయకుడు ముందుకు తూలి పడిపోయాడు. కాని, రెప్పపాటులో మిగిలిన దొంగలందరూ అర్చనను చుట్టుముట్టారు. ఆమెను మధ్యలో పెట్టుకుని ముందుకు నడుస్తున్నారు.పైకి లేచిన దొంగలనాయకుడు విజయ్ రాణాను చూసి, వికటంగా నవ్వుతూ ముందుకు కదిలాడు.వారందరూ కలిసి డెక్ అంచుల వరకు వెళ్లారు. అర్చనను తీసుకుని సముద్రంలో ఉన్న తమ మరపడవలో వెళ్లిపోవాలని దొంగల నాయకుడు మిగిలినవారిని ఆదేశించాడు.అలాగే చూస్తూ ఉండిపోయిన విజయ్ రాణా మెరుపువేగంతో కదిలాడు. అతడు ఏం చేస్తాడా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. రెప్పపాటు వేగంలో డెక్ దగ్గరకు చేరుకోవడం... ఒక పెద్ద రాకాసి అల ఉవ్వెత్తున లేచి డెక్ మీదకు ఉరకడం రెండు ఒకేసారి జరిగాయి.
అల ధాటికి కొట్టుకుపోతున్న అర్చనను ఒక చేత్తో గట్టిగా హత్తుకుని, డెక్ మీద ఉన్న బలమైన ఉక్కు పైపును మరొకచేత్తో గట్టిగా పట్టుకున్నాడు విజయ్ రాణా.ఆ అల ధాటికి సముద్రంలోకి కొంతమంది దొంగలు కొట్టుకుపోగా, మిగిలినవారిని అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది బంధించారు. సముద్రపు దొంగల దాడికి గురైన నౌకలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక భద్రతతో ఇండియాకు తిరిగి పంపిస్తున్నారు. ఆ నౌక డెక్ మీద విజయ్ రాణా పక్కన అర్చన కూడా ఉంది.ఆమెను చూస్తూ ‘మిస్ ఇంటర్నేషనల్ పోటీలు మిస్ అయిపోయావు’ అన్నాడు విజయ్ రాణా. ‘ఈ మిస్టర్ పోకిరికి మిసెస్ కావాలని.. కావాలనే ఆ పోటీలు మిస్ చేసుకున్నాను’ అన్నది అతడిని చుట్టేసి, అతని ప్రేమకు, సాహసానికి బందీ అవుతూ...
∙శ్రీసుధామయి
Tags : 1