పాటకు గ్రహణం వీడింది

Published on Sat, 10/24/2026 - 01:03

గాయపడిన కోయిల కొమ్మచాటుకు తప్పుకుంటుంది. ఇక అది కూయదు. పాడదు. కాని పాట ప్రేమికులు ఆ కోయిలను వెతుకుతారు. కోయిల కోసం పరితపిస్తారు.
ఉత్తరాంధ్రను తన పాటతో ఊపిన గరివిడి లక్ష్మి కథ ఇదే. జగానికి పాట ఇచ్చి జగం కళ్ల నుంచి దూరంగా జరిగిన ఆమెను మళ్లీ ఆమె బయోపిక్‌ సజీవం చేసింది.
గ్రహణం వీడి ఈ తరానికి తెలిసేలా చేసింది. ‘గరివిడి లక్ష్మి’ సినిమా నేపథ్యంలో ఆమెకో పూమాల.

వీధిలోకి పాట పాడుతూ ఫకీరు వస్తే అతన్ని చూసి గాయకుడైన వాడు గతంలో ఉన్నాడు. అతడి పేరు మహమ్మద్‌ రఫీ. తంబూరా మీటుతూ తత్త్వం పాడుతూ వీధిలోకి వచ్చిన బైరాగిని చూసి పాట వెంటబడిన గాయని ఉంది. ఆమె  పేరు గరివిడి లక్ష్మి.
  
కాలం మారినప్పుడల్లా కళ మారుతుంది. కళ మారినప్పుడల్లా నవ కళాతేజం ఉద్భవిస్తుంది. ఉత్తరాంధ్రలో దేశీయ బుర్రకథ, జానపదాలు, పాటలు పల్లెలకు ప్రాణవాయువు. వేడుకైనా, జాతరైనా, పెళ్లైనా, పేరంటమైనా పాట అక్కడ తొలి ముత్తయిదువులా ఉంటుంది. 1980ల వరకూ అక్కడ రాజ్యమేలిన బుర్రకథ మూస ధోరణి వల్ల ఆదరణ కోల్పోతున్నప్పుడు ఆ రంగంలో తళుక్కున మెరిసిన తార గరివిడి లక్ష్మి. 

విజయనగరం జిల్లా గరివిడిలో జన్మించిన రెడ్డి విజయలక్ష్మికి తండ్రి ఆదరణ లేదు. తల్లి ఉన్నా పట్టించుకోదు. అలాంటి సమయంలో చుట్టుముట్టిన ఒంటరితనం నుంచి లక్ష్మిని గట్టున పడేసింది పాట. చదువు లేకపోయినా గురువు లేకపోయినా కేవలం ఏకసంథాగ్రాహకత్వం వల్ల పాటను అందుకుంది లక్ష్మి. అనుకోకుండా బుర్రకథలోకి వచ్చి ఆ వెంటనే సొంత ట్రూప్‌ను కూడా స్థాపించుకోగలిగింది. 

విరాటపర్వం, బాలనాగమ్మ కథ, బొబ్బిలియుద్ధం కథలను చెప్పడంలో ఆరితేరిన లక్ష్మిని ఉత్తరాంధ్ర గరివిడితో కలిపి ‘గరివిడి లక్ష్మి’గా గుర్తించడం  మొదలుపెట్టింది. కేవలం బుర్రకథను చెప్తే ఆమెకు పేరు రాకపోను. ఆమె  గురువు చెప్పినట్టు ‘బుర్రకథలో కొందరు పాట బాగా పాడతారు కొందరు కథ బాగా చెప్తారు కొందరు నాట్యం బాగా చేస్తారు’... గరివిడి లక్ష్మి మూడింటిలోనూ మేటిగా నిలిచింది. 

గొప్ప గొంతు... గొప్ప వాక్చాతుర్యం... నాట్యంలో వేదిక మీద అద్భుతమైన నైపుణ్యం అంతేనా? ఆమె కాలానికి తగినట్టుగా సొంత పాటలను కూర్చింది. జానపద బాణీలకు మాటలను అద్దింది. కొంత శృంగారం... కాస్త మోటు సరసం... నిద్ర మత్తు వదలడానికి కథలో ఈ గుళికలను కలిపింది. గరివిడి లక్ష్మి బుర్రకథతో ఉత్తరాంధ్రను ఏలింది.
  
కళాకారులు కళ మీద బతుకుతారు. కాని కళాకారుల మీద ఎవరెవరు బతుకుతారో చెప్పలేం. ఆ కళలో ఉన్నది స్త్రీ అయితే చెప్పే పనే లేదు. తండ్రులో, భర్తలో పీడిస్తారు. గరివిడి లక్ష్మికి చదువు లేకపోవడంతో ఆమె పాటలను క్యాసెట్లు చేసి అమ్ముకున్నవారు కొందరు... ఆమె పక్కన చేరి సొమ్ము చేసుకున్నవారు కొందరు... ఆమెను ఏమార్చినవారు కొందరు... చివరకు సినిమా వాళ్లు కూడా ఆమె పాటలు తీసుకుని  ఇవ్వాల్సిన క్రెడిట్‌ ఇవ్వలేదు.

 ‘గరివిడి లక్ష్మి’ పేరు ప్రభంజమైనప్పుడు డూప్లికేట్స్‌ మొదలైపోవడం మరో పరిణామం. తామే గరివిడి లక్ష్మి అని పల్లెల్లో ఆడేవాళ్లు మొదలైపోయారు. అసలు గరివిడి లక్ష్మి కంటే దొంగ గరివిడి లక్ష్ములు పెరిగిపోయారు. ఇంకో వైపు అశ్లీల నృత్యాల రికార్డింగ్‌ డాన్సుల కాలం వచ్చింది. కొత్తొక వింతగా మారింది. ఈ పరిణామాలన్నీ చూసి గరివిడి లక్ష్మి హుందాగా వేదిక దిగిపోయింది. 

రంగం నుంచి తప్పుకుంది. పాటను పంజరంలో పెట్టి తాళం వేసేసింది. తన గొంతుకు గొళ్లెం పెట్టి తన ఉనికే చెరిపేసుకుని ఎవరికి తెలియని జీవితం గడపసాగింది. చివరకు ఆమెకు దక్కాల్సిన సన్మానాలు, బిరుదులు కూడా ఆమె పేరుతో ఎవరో అందుకునే వరకూ కథ వెళ్లినా పట్టించుకోవడం మానేసింది. అయితే కాలం ఊరికే ఉండదు. కొత్తతరం వస్తుంది. చరిత్రను తవ్వి తీస్తుంది. అలా దర్శకుడు ‘గౌరి నాయుడు జమ్ము’ ఆమె కథను వెలికి తీసి తెర రూపం ఇచ్చాడు. కోట్లాది ప్రేక్షకుల ముందుకు గరివిడి లక్ష్మిని తీసుకువచ్చాడు. 

ఆమెను సాక్షాత్కారం చేశాడు. ఇక ఆమె కీర్తి ఆమెదే. ఆమె యశస్సు ఆమెదే. ఆమె పాట ఆమెదే. ఒక ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి జీవితం తెలుగు సినిమా రంగంలో బయోపిక్‌గా రూపుదాల్చడం మన సినిమాలకు, కళలకు మంచిరోజులొచ్చాయనే సూచన చేస్తోంది. ఇందుకై పెద్ద నిర్మాణ సంస్థలు ముందుకు రావడం సంతోషం. ఆనంది లాంటి ప్రతిభ ఉన్న నటీమణులు ఇలాంటి కథలకు ప్రాణం పోసేందుకు సిద్ధంగా ఉన్నారు. గరివిడి లక్ష్మి లాంటి కళాకారిణులు తెలుగు నేల నలుచెరగులా చరిత్రలో, వర్తమానంలో ఉన్నారు. స్త్రీ ఏ కళలో రాణించినా ఆ కథ ఒక బయోపిక్కే.  గరివిడి లక్ష్మి మళ్లీ పాట పాడాలి. ఆ పాటకు జగం ఊగాలి.                               

– కె

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)