Breaking News

భగవద్గీత బోధించే ప్రశాంత జీవన రహస్యం ఇదే..!

Published on Sun, 11/30/2025 - 13:50

భగవద్గీత, యుద్ధభూమిలో శ్రీకృష్ణ భగవానునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ. అయితే, దాని అసలైన సందేశం కేవలం యుద్ధం గురించే కాదు, ప్రతిరోజూ వివేకవంతంగా ఎలా జీవించాలో తెలియజేయడం. దాని అత్యంత ప్రధానమైన బోధన నిష్కామ కర్మ గురించి ఉంది.  ఫలితాలపై ధ్యాస ఉంచకుండా, మీ శక్తిమేరకు కృషి చేయడం. గొప్ప భారతీయ ఆధ్యాత్మిక గురువైన  పరమహంస యోగానంద, కోరికలు లేకుండా కర్మలను నిర్వర్తించడం యోగంలో ఒక ముఖ్యమైన అంశమని చెప్పారు. 

గాడ్ టాక్స్ విత్ అర్జున: 
ది భగవద్గీత (God Talks With Arjuna: The Bhagavad Gita) అనే తన మహత్తర గీతాభాష్యంలో, శ్రీకృష్ణుని సందేశం ఒక అర్థంకాని తత్వశాస్త్రం కాదని, గృహస్థునకైనా, ఒక సంస్థకు అధిపతికైనా, లేక ఒక దైవాన్వేషకునికైనా ఇది ఒక ఆచరణాత్మకమైన మార్గదర్శి అని ఆయన వివరించారు. 

భగవద్గీతలోని 2వ అధ్యాయం, 47వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా బోధించారు. “కర్మలు చేయుటయందు మాత్రమే నీకు అధికారము కలదు, వాటి ఫలితములందు ఎన్నడూ లేదు. నీ కర్మఫలములకు సృష్టికర్తవు నీవని భావించకు; అట్లని నిష్క్రియ పట్ల నీకు అనురక్తి కలగనీయకు.” 

దీని అర్థం ఏమిటంటే: 
అది మీ ఉద్యోగమైనా, మీ కుటుంబాన్ని పోషించడం అయినా, లేదా ఏదైనా బాధ్యత అయినా, మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కానీ ప్రతిఫలం గురించి, గుర్తింపు గురించి నిరంతరం ఆందోళన చెందుతూ ఉండకండి. “నాకేమి లభిస్తుంది” అనే ఆందోళన ఒత్తిడిని మాత్రమే తెస్తుంది. మీరు ఫలితంపై కాకుండా, కర్మపైనే దృష్టి సారించినప్పుడు స్వేచ్ఛ లభిస్తుంది. అదే సమయంలో, సోమరిగా లేదా నిష్క్రియగా మారకండి. 48వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా సలహా ఇచ్చారు:

“ఓ ధనంజయ, యోగంలో నిమగ్నుడవై, సమస్త కర్మలను ఆచరించుము. వాటి ఫలాలపై ఆసక్తిని త్యజించి, జయాపజయములయందు సమభావము గలవాడవై ఉండుము. ఈ మానసిక సమత్వమే యోగం అని చెప్పబడుతుంది.” జీవితం ప్రశంసలను, నిందలను, విజయాన్ని, అపజయాన్ని తెస్తుంది. ఈ రెండు పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉండాలని శ్రీకృష్ణుడు మనకు బోధిస్తారు. 

ఈ సమభావమే నిజమైన యోగం—ఆంతరంగిక శాంతిని బాహ్య కర్మాచరణతో అనుసంధానం చేయడం. 3వ అధ్యాయం, 30వ శ్లోకంలో, ఈ స్థితిని సాధించడానికి శ్రీకృష్ణుడు కీలకమైన మార్గాన్ని తెలియజేశారు. “సమస్త కర్మలను నాకు అర్పించుము! అహంకారం, ఆశలు విడచి, నీ మనస్సును ఆత్మపై కేంద్రీకరించి, ఆందోళన నుండి విముక్తుడవై, కర్మాచరణమనే యుద్ధంలో నిమగ్నమై ఉండుము.”

సరళమైన మాటల్లో చెప్పాలంటే, మీరు చేసే ప్రతి పనిని భగవంతునికి అంకితం చేయండి. ఈ విధంగా జీవించడం అంటే ప్రపంచం నుంచి విరమించుకోవడం కాదు, అశాంతికారకమైన కోరికలు లేకుండా, అహంకారం లేకుండా, అపేక్ష, తీవ్రమైన చింత లేకుండా, ప్రతి కర్మను ఆయనకు ఒక సమర్పణగా నిర్వర్తించడం. ప్రశాంతమైన జీవితానికి ఇదే ఏకైక మార్గం. 5వ అధ్యాయం, 10వ శ్లోకంలో, శ్రీకృష్ణుడు ఒక అందమైన ఉపమానాన్ని అందించారు:

“నీటిచే అంటబడని తామరాకు వలె, కర్మలను నిర్వర్తించే యోగి, ఆసక్తిని త్యజించి, తన కర్మలను అనంతునికి (భగవంతునికి) సమర్పించడం ద్వారా, ఇంద్రియ బంధాలకు లోనుకాకుండా ఉంటాడు.”
బురదలో పెరిగినా దాని మలినం సోకని కమలం వలె, నిష్కామ కర్మను ఆచరిస్తూ, భగవంతునికి శరణాగతి చెందడం ద్వారా ప్రాపంచిక పోరాటాల మధ్య జీవిస్తూ  కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. 

ఈ సనాతనమైన బోధనల వ్యాప్తికి యోగానంద పశ్చిమ దేశాలలో సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ (SRF)ను, మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ను భారతదేశంలోను స్థాపించారు. ఆయన విశిష్ట గ్రంథం, ఒక యోగి ఆత్మకథ (autobiography of a yogi), లక్షలాది మందికి యోగమును, ధ్యానాన్ని— ముఖ్యంగా భగవద్గీతలో కూడా ప్రస్తావించబడిన క్రియాయోగమనే సనాతన ప్రక్రియను,—  దైవానుభవం కలిగించే ఒక తిన్నని రాజమార్గంగా పరిచయం చేసింది.

నిష్కామ కర్మ అంటే బాధ్యతల నుంచి పలాయనం కాదు, అది హృదయపూర్వకంగా— కార్యాలయాలలోను, మానవ సంబంధాలలోను, వ్యక్తిగత లక్ష్యాలలోను — పనిచేయడం, కానీ ఫలితాల కోసం  ప్రాకులాడకుండా ఉండటం. యుద్ధభూమి ప్రతీకాత్మకమే కావచ్చు, కానీ పోరాటం నిజమైనది—వ్యామోహానికీ స్వేచ్ఛకూ మధ్య, అహంకారానికీ శరణాగతికీ మధ్య, నిష్కామకర్మలోనే విజయం ఉందని గీత మనకు చూపిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే శాశ్వత ఆనందాన్ని ఇవ్వగలదు.

(చదవండి: ఐదువారాల ఐశ్వర్య వ్రతం..మార్గశిర లక్ష్మీవార వ్రతం..!)

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)