బిహార్ లో NDA దిమ్మతిరిగే స్ట్రైక్ రేట్
Breaking News
చిల్డ్రన్స్ డే: బాలతారల ఇంటర్వ్యూలు
Published on Fri, 11/14/2025 - 05:51
నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన కొందరు బాలతారల ఇంటర్వ్యూలు, సిక్స్ ఇయర్స్ ఏజ్‌లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, సిక్స్‌టీన్‌లోకి అడుగు పెట్టి, యువ హీరో కావడానికి రెడీగా ఉన్న ర్యాన్ జాయ్‌తో మాటామంతీ!
చిన్నప్పటి మహేశ్‌ని!
ఆరేళ్ల వయసులోనే బాల నటుడిగా కెరీర్ స్టార్ చేసి, ఇప్పుడు స్వీట్ సిక్స్‌టీన్‌లో ఉన్నాడు ర్యాన్. కొంచెం మహేశ్‌బాబు పోలికలతో కనిపించే ర్యాన్ చిన్నప్పటి మహేశ్‌గా రెండు సినిమాల్లో నటించాడు. ఆ విశేషాలతో పాటు మరిన్ని విశేషాలు ఈ విధంగా పంచుకున్నాడు ర్యాన్ జాయ్.
→ మా నాన్నగారి వృత్తిరీత్యా మేం చిన్నప్పుడు ముంబైలో ఉండేవాళ్లం. నేను అక్కడే పుట్టాను. నాకు సిక్స్ ఇయర్స్ అప్పుడు మా అమ్మ నన్ను ఆడిషన్స్‌కి తీసుకెళ్లేవారు. ఆ క్యారెక్టర్లకు కావల్సిన ఏజ్ లేదని సెలక్ట్ చేసేవాళ్లు కాదు. ఫైనల్లీ ‘హైదరాబాద్ లవ్‌స్టోరీ’లో చాన్స్ వచ్చింది. తెలుగులో నా కెరీర్ ఆ సినిమాతో మొదలై, ఈ మధ్య చేసిన ‘జయమ్మ పంచాయతీ’ వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది.
→ నా ఫీచర్స్ మహేశ్ సార్‌కి దగ్గరగా ఉండటంవల్లే ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ చిత్రాల్లో చిన్నప్పటి మహేశ్‌బాబుగా యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అయితే మహేశ్ సార్‌తో నా కాంబినేషన్ సీన్స్ ఉండవు కాబట్టి, ఆయన్ను కలవలేదు. ఒకే ఒక్కసారి ‘మహర్షి’ సెట్స్‌లో ఆయన ఉన్నప్పుడు ఆ దగ్గర్లోనే నేను ఉన్నాను. ఫొటో కావాలని అడిగితే, అప్పుడు ఎమోషనల్ సీన్స్ చేస్తున్నారు. ఆయన కళ్లనిండా నీళ్లు ఉన్నాయి. కొంచెం ఆగమన్నారు. చాలా టైమ్ పట్టింది. ఇక వెళ్లిపోతుంటే, ఆయనే పిలిచి ఫొటో దిగే చాన్స్ ఇచ్చారు.
→ ఇప్పటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా 20కి పైగా సినిమాలు చేశాను. వాటిలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘నేల టికెట్టు’ వంటి సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ‘అల్లరి’ నరేశ్‌గారు హీరోగా చేస్తున్న ఒక సినిమాలో లెంగ్తీ రోల్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 16 కాబట్టి... అటు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేయలేను... ఇటు నా వయసున్న క్యారెక్టర్లు తక్కువ ఉంటాయి. సో... కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఉంది.
→ నేను హీరో అవాలనుకుంటున్నాను కాబట్టి... బాడీ బిల్డింగ్, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటి మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. చిన్నప్పుడు కరాటే నేర్చుకున్నాను. అలాగే థియేటర్ క్లాసెస్ తీసుకుందామనుకుంటున్నాను. హీరో అనిపించుకోవడానికి ఏమేం కావాలో అన్నీ నేర్చుకుంటాను. నాకు ఏదైనా బిజినెస్ చేయాలని కూడా ఉంది. మెయిన్ టార్గెట్ హీరో అయినప్పటికీ ఫ్యూచర్‌లో బిజినెస్ మీద కూడా ఫోకస్ పెడతాను.
→ ఒక కంప్లీట్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం. ఆమిర్ ఖాన్‌లా అన్నమాట. ఆయన చేసే సినిమాలు ఒకదానికి ఒకటి పోలిక ఉండవు. వెరైటీగా ఉంటూ ట్రూగా ఉంటాయి. అలా నిజాయతీకి దగ్గరగా ఉండే సినిమాలు చేయాలనుకుంటున్నాను.
సినిమా...నాటిక
‘ఒక్క క్షణం, కేజీఎఫ్ 2, తండేల్, కింగ్‌డమ్, కిష్కింధపురి, లవ్‌స్టోరీ, సరిలేరు నీకెవ్వరు’.. వంటి మూవీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాశ్ చెప్పిన విశేషాలు.
→ అన్నమయ్య జిల్లా సోమల మండలం నెల్లిమంద గ్రామం ఎగువపల్లి మా ఊరు. మా నాన్న సురేశ్ అమసగారు. చిన్నప్పుడే మా తాతయ్య హైదరాబాద్‌కి వచ్చేశారు. మా నాన్న ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ కాంట్రాక్టర్‌గా చేస్తున్నారు. మా నాన్నకి డైరెక్టర్ కావాలని లక్ష్యం. అయితే ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో నిర్మాతగా సుమారు 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించారు నాన్న. అలా మా నాన్న నిర్మిస్తున్న ‘నీ కొరకు నేను వేచి ఉంటాను’ షార్ట్ ఫిల్మ్‌లో ఒక పాత్రకి ఓ అబ్బాయి కావాల్సి వచ్చింది. ఎవరూ సెట్ కాలేదు.. ‘నువ్వు చేస్తావా? అని నాన్న అడగడంతో చేశాను. అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అల్లు శిరీష్ సార్ హీరోగా నటించిన ‘ఒక్క క్షణం’ (2017) బాల నటుడిగా నా ఫస్ట్ మూవీ.
→ నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెట్స్‌కి బుక్స్ తీసుకెళతాను. ఆ రోజు జరిగిన క్లాస్ నోట్స్‌ని నా ఫ్రెండ్స్‌ని అడిగి, షూటింగ్ గ్యాప్‌లో రాసుకుంటాను. చాలా సందర్భాల్లో ఒకే సమయంలో ఇటు ఎగ్జామ్స్, అటు షూటింగ్స్ వచ్చాయి. అయితే షూటింగ్స్ షెడ్యూల్ సడెన్ గా ఫిక్స్ అవుతుంటాయి కాబట్టి వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎఫ్‌ఏ 1, ఎఫ్‌ఏ 2 వంటి పరీక్షలుంటే టీచర్స్ నా కోసం మళ్లీ కండక్ట్ చేస్తారు.
→ నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంత తోపు, తురుం అయినా కానీ ఫ్రెండ్స్ వద్ద నేను జస్ట్ భానుప్రకాశ్ అంతే... నేను నటించిన ఏదైనా సినిమా చూసినప్పుడు నా నటన గురించి టీచర్లు, ఫ్రెండ్స్ మాట్లాడతారు. వాళ్లందరికీ నేను నటించిన ఓ మంచి సినిమా చూపించాలని కోరిక. మా బంధువులు నేను నటించిన సినిమా చూస్తున్నప్పుడు ‘హే.. భాను వచ్చాడు...’ అంటూ బాగా ఎగ్జయిట్ అవుతారు.
→ ప్రస్తుత పరిస్థితుల్లో నాటకాలు అంతరించిపోతున్నాయి. వాటికి ఆదరణ దక్కడం లేదు. నేను ‘అమ్మ చెక్కిన బొమ్మ’ అనే నాటికలో నటించాను. ఈ ఏడాది మార్చి 28న తొలి ప్రదర్శన ఇచ్చాను. ఇప్పటివరకూ పద్దెనిమది ప్రదర్శనలు ఇచ్చాను. ఆ నాటిక ఎక్కడ వేసినా శశి అనే నా పాత్రకు నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తోంది. సినిమా పుట్టకముందు నుంచి నాటకరంగం ఉంది. ఈ రంగంలో ఇప్పటి వరకూ ఉన్న నాలాంటి చైల్ట్ ఆర్టిస్ట్స్‌కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు కానీ, బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదు. కానీ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటకం ఎక్కడ ప్రదర్శించినా ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. హిందీలో, గుజరాతీలోనూ ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నాటిక వేశాం.
పేరెంట్స్‌కి గిఫ్ట్స్
‘‘భవిష్యత్‌లో నేను ఒక మంచి ఆర్టిస్టును అవ్వాలనుకుంటున్నాను. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే రోల్స్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తున్నాను. యాడ్స్ కూడా చేస్తున్నాను. వేటికవే డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్’’ అని చెప్పాడు ఉజ్వల్ తేజ్. ‘భైరవం, ఆయ్’ వంటి సక్సెస్‌ఫుల్ సినిమాలతో పాటు ‘గాలివాన, పరంపర’ వంటి వెబ్ సిరీస్‌లోనూ మెరిశాడు ఉజ్వల్ తేజ్. ‘నిండు నూరేళ్ళ సావాసం’, ‘పాపే మా జీవనజ్యోతి’ వంటి సీరియల్స్‌తో బిజీగా ఉంటున్న ఉజ్వల్ పంచుకున్న కొన్ని విషయాలు...
→ మా స్వస్థలం కర్నూలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాం. 8వ క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పట్నుంచి యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం. వాటిలో నాకున్న స్కిల్‌ని మా పేరెంట్స్ గమనించి, డ్యాన్స్ స్కూల్‌లో జాయిన్ చేయించారు. అక్కడ మా పేరెంట్స్ ఫ్రెండ్ ఒకరి సలహాతో జూనియర్ మోడల్ ఇంటర్‌నేషనల్ కాంటెస్ట్‌లో పోటీ చేశాను. తమిళనాడులో తెలంగాణ స్టేట్‌ను, దుబాయ్‌లో ఇండియానూ రిప్రజెంట్ చేసి, విజేతగా నిలిచాను.
→ నా తొలి సినిమా పేరు ‘నా సినిమా ఆగిపోయింది’. ఈ చిత్రంలో యాక్ట్ చేసేప్పుడు నాకు సరిగ్గా యాక్టింగ్ రాదు. కానీ ఆ సినిమా డైరెక్టర్ ప్రోత్సాహంతో బాగా నటించగలిగాను. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుంది. దీనికన్నా ముందు నేను యానీ మాస్టర్‌తో ఓ యాడ్ చేశాను.ఏ ఒక వైపు యాక్టింగ్... మరోవైపు స్టడీస్... ఈ రెంటినీ ఎలా బ్యాలన్స్ చేస్తున్నానంటే.. షూటింగ్ స్పాట్‌కి బుక్స్ తీసుకు వెళ్తాను. షూటింగ్‌లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా మా అమ్మగారు నా చేత చదివిస్తుంటారు. నేను ఏవైనా క్లాసులు మిస్ అయితే నా టీచర్స్ నాకు రీ క్యాప్ చేస్తారు. నా ఫ్రెండ్స్ నోట్స్‌లు ఇస్తారు.
→ మా స్కూల్లో చిల్డ్రన్స్ డేని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక చిల్డ్రన్స్ డేకి మా స్కూల్‌లో ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ అదే రోజు నేను షూటింగ్‌లో పాల్గొనాలి... అయితే అనుకోకుండా నేను ఆ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇది తెలిసి మా ప్రిన్సిపాల్ మేడమ్ నన్ను పిలిపించి, అప్పటికప్పుడు నాతో డ్యాన్స్ చేయించారు. అది నాకో హ్యాపీ మూమెంట్. కొన్నిసార్లు నాకు షూటింగ్ ఉన్న రోజే ఎగ్జామ్స్ కూడా ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో నేను సినిమా యూనిట్ దగ్గర అనుమతి తీసుకుని, ఎగ్జామ్స్ రాసేవాడిని. ఇలా కుదరకపోతే మా ప్రిన్సిపాల్ నాకు సపోర్ట్ చేస్తారు.ఏ నా తొలి సంపాదనతో మా అమ్మానాన్నలకు బహుమతులు ఇవ్వడం నాకెంతో సంతృప్తినిచ్చింది. నా మూవీస్ ‘బ్రిలియంట్ బాబు’, ‘స్మాల్ టౌన్ బాయ్స్’ విడుదలకు సిద్ధమవుతున్నాయి.
సుద్దపూసని కాదు
‘‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్‌లోలాగా నేను చదువులో సుద్దపూసని కాదు. నాకెప్పుడూ 90కి పైగా మార్కులు వస్తుంటాయి. నాకు పరీక్షలు ఉన్నప్పుడు ఏవైనా షూటింగ్స్ ఉంటే అమ్మ ఒప్పుకోదు. ఎందుకంటే ఫస్ట్ చదువుకే ప్రియారిటీ.. ఆ తర్వాతే ఏదైనా. అందుకే ఏ పరీక్షనూ ఇప్పటివరకు మిస్ అవలేదు’’ అని రోహన్ రాయ్ తెలిపాడు. ‘వినయ విధేయరామ, రాజుగారి గది 2, రంగుల రాట్నం, మిస్టర్ మజ్ను, చెక్, సూపర్ మచ్చి, గుడ్‌లక్ సఖి..’ వంటి పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లో, ‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన రోహన్ రాయ్ చెప్పిన విశేషాలు.
మా నాన్న సుబ్బారాయుడుగారు (చీరాల) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ప్రస్తుతం బెంగళూరులో పని చేస్తున్నారు. అమ్మ రాధామాధవి బేసికల్‌గా నా మేనేజర్ కూడా. నా కోసం తన పని వదులుకుంది. నా డేట్స్ చూసుకోవడంతో పాటు షూటింగ్స్‌కి నా వెంట వస్తుంటుంది.
→ చిన్నప్పుడు ఇంట్లో టీవీ బాగా చూసేవాణ్ణి. నా వయస్సు ఐదేళ్లున్నప్పుడే ఎవరైనా మా ఇంటికి వచ్చి వెళ్లాక వాళ్లని ఇమిటేట్ చేసేవాణ్ణి. వాళ్లు కూర్చునే, నడిచే విధానాన్ని కూడా. అప్పుడు నాకు, మా కుటుంబ సభ్యులకు అర్థమైంది నాకు నటన అంటే ఇష్టం అని. టీవీలో స్క్రోలింగ్ చూసి ‘డ్రామా జూనియర్స్’ ఆడిషన్స్కి నన్ను తీసుకెళ్లింది అమ్మ. అందులో నేనే ఫస్ట్ కంటెస్టెంట్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 4 చేశాను. ‘డ్రామా జూనియర్స్’లో నా నటన చూసి డైరెక్టర్ బోయపాటి శ్రీనుగారు ఆడిషన్ చేసి, ‘వినయ విధేయ రామ’ సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఓంకార్‌గారు ‘రాజుగారి గది 2’లో చాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నా ప్రయాణం కొనసాగుతోంది.
→ హీరోలు నానీగారిని, నవీన్ పొలిశెట్టిగారిని చూసినప్పుడు నేను కూడా వారిలా కావాలనిపించేది. తెరపై వాళ్లు నటిస్తున్నట్లు ఉండదు... వారిద్దరూ నేచురల్ యాక్టర్స్. కథ, పాత్రల్ని ఎంపిక చేసుకునే విధానంలో వాళ్లిద్దర్నీ స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటాను. నానీగారు హీరో కాదు.. ఆర్టిస్ట్. కథ నచ్చితే ఆయన ఏదైనా చేయగలరు.
→ నా జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘హ్యాష్‌టాగ్ 90స్’ వెబ్ సిరీస్. దాని తర్వాత వెంట వెంటనే సినిమాలు రావడం, మంచి పాత్రలు ఎంచుకుని చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరువీర్‌గారు హీరోగా రాహుల్ శ్రీనివాస్‌గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రంలో నేను చేసిన రాము పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం శివాజీగారితో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే సినిమా చేశాను. త్వరలో విడుదల కానుంది.
→ షూటింగ్ ఉన్నప్పుడు క్లాసులు మిస్ అవుతాను. నైట్ లేదా షూటింగ్ గ్యాప్‌లో చదువుకోవడం, రాసుకోవడం చేస్తుంటాను. యూట్యూబ్, గూగుల్ తల్లి కూడా ఉంది. వాటి నుంచి కూడా నేర్చుకుంటూ ఉంటాను. రాత్రిళ్లు మేలుకుని నోట్స్ రాసుకుంటాను. ఈ విషయంలో మా ఫ్రెండ్స్, టీచర్స్ నాకు బాగా సపోర్ట్ చేస్తారు.
అప్పులు తీర్చాను
‘కిష్కింధపురి, పరాక్రమం’ చిత్రాల్లో బాలనటుడిగా ప్రేక్షకులను మెప్పించాడు అర్షిత్. చిరంజీవి, నాగార్జునలను స్ఫూర్తిగా తీసుకుని, భవిష్యత్‌లో పెద్ద నటుడు కావాలనుకుంటున్న అర్షిత్ పంచుకున్న కొన్ని విషయాలు....
→ స్వస్థలం గోదావరి ఖని. హైదరాబాద్‌లో ఉంటున్నాం. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాను. నాకు నటన అంటే ఆసక్తి కలగడానికి మా అక్క కారణం. అలాగే ‘పిల్లలు పిడుగులు’ టీవీ షో నుండి ‘డ్రామా జూనియర్స్’ వరకు... నేను ఇండస్ట్రీలోకి రావడానికి చాలామంది స్ఫూర్తిగా నిలిచారు. షూటింగ్ సమయంలో ఎగ్జామ్స్ ఉంటే ముందుగా షూటింగ్స్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను పరీక్షలకు హాజరు కాకపోయినా వాళ్ళు నాకు విడిగా ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. నా క్లాస్‌లో నేనే టాపర్‌ని. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటాను. నా ట్విన్ సిస్టర్ స్టడీ సిలబస్‌లో నాకు సహాయం చేస్తుంది. ఇంట్లో కూడా అమ్మానాన్నలు నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు.
→ సినిమాల్లో నటిస్తూ, సిల్వర్ స్క్రీన్ పై కనిపించినంత మాత్రాన నన్ను క్లాస్‌లో ప్రత్యేకంగా ఏం చూడరు. క్లాస్‌లో అందరిలానే నేనూ ఓ సాధారణ అబ్బాయిని. అయితే మా బంధువులు నన్ను చూసి గర్వపడుతుంటారు. పెద్ద హీరోలతో పని చేయడం నాకు స్ఫూర్తినిస్తుంది. సెట్స్‌లో వారి కష్టాన్ని గమనిస్తుంటాను. వాళ్ల కష్టాన్ని చూసి, నేను చాలా నేర్చుకుంటుంటాను. హీరోలతో కలిసి పని చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.
→ చైల్డ్ ఆర్టిస్టుగా నా మొదటి సినిమా ‘సర్కిల్’. ఈ చిత్రంలో నటించినందుకు రూ. 1000 పారితోషికం ఇచ్చారు. నా తొలి సంపాదనను మా తల్లిదండ్రులకు ఇచ్చేశాను. అలాగే ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించగా, నేను యాక్ట్ చేసిన ‘పచ్చిపులుసు’ షార్ట్ ఫిల్మ్‌కి, రూ. 15 లక్షల ప్రైజ్ మనీ బహుమతిగా లభించింది. ఆ తర్వాత మా అప్పులు కొన్ని తీర్చేశాను. ‘కిష్కింధపురి’ సినిమా తర్వాత నాకు మంచి గుర్తింపు లభిస్తోంది. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఒక మంచి యాక్టర్‌గా ప్రేక్షకుల చేత గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం.
యాక్టింగ్... చారిటీ
బాల నటుడిగా 25కి పైగా సినిమాల్లో నటించాడు నాగచైతన్య వర్మ. ‘అమీర్‌పేటలో, నారప్ప, నా సామిరంగా, జటాధర, పేకమేడలు, లగ్గం’ వంటి పలు సినిమాలతో పాటు ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌తో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్న నాగచైతన్య వర్మ తన ఫ్యూచర్ ప్లాన్స్‌ని ఇలా పంచుకున్నాడు...
→ మాది అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చమర్తివాండ్ల పల్లి. నటుడు కావాలనే నా ఆకాంక్షను మా అమ్మానాన్న వరలక్ష్మి దేవి, నాగార్జున రాజు ప్రోత్సహించారు. ‘అమీర్‌పేటలో’ సినిమాతో నటుడిగా నా జర్నీ మొదలైంది. ప్రస్తుతం ఎయిత్ క్లాస్ చదువుతున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు స్కూల్‌కి సెలవు పెడతాను కదా... అప్పుడు ఫ్రెండ్స్‌ని అడిగి నోట్స్ రాసుకుంటాను. స్కూల్ వాళ్లు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. నా ఫస్ట్ ప్రియారిటీ ఎగ్జామ్స్‌కే. ఎగ్జామ్స్‌లో నాకు 80 శాతంపైన మార్కులు వస్తుంటాయి. టాప్ 5 ర్యాంక్స్‌లో కచ్చితంగా నేను ఉంటాను.
→ నా సినిమాలు చూసినప్పుడు ‘బాగా నటించావ్.. ఇలాగే ముందుకెళ్లు’ అని టీచర్లు, నా స్నేహితులు చెబుతుంటారు.. ఈ ఆగస్టులో విడుదలైన ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్‌లో అవసరాల శ్రీనివాస్‌గారి చిన్నప్పటి పాత్రలో నెగటివ్ రోల్ చేశాను. నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. ఈ నెల 7న విడుదలైన ‘జటాధర’ సినిమాలో హీరో సుధీర్ బాబు చిన్నప్పటి పాత్ర చేశాను. మంచి మూవీ చేశానని పొగిడారు.
→ నేను నటించడం మా బంధువులకు, ఇరుగు పొరుగు వాళ్లకి చాలా ఇష్టం. ‘నువ్వు ఇంకా బాగా నటించి, మంచి స్థాయికి వెళ్లాలి’ అని అంటుంటారు. నా సినిమా చూసి బాగా చేశావని చెబుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. తెలుగు సినిమా వేదిక మా తెలుగు తల్లి, కళావారధి సౌజన్యంతో 2023లో నిర్వహించిన ఉగాది పురస్కారాల్లో ఉత్తమ బాలనటుడిగా ఆర్. నారాయణమూర్తి సార్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది.
→ జూలై 28న నా పుట్టినరోజు సందర్భంగా కడపలోని బాలల అనాథాశ్రమానికి నా పారితోషికంలో నుంచి ప్రతి ఏడాదీ నగదు సాయం చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది.ఏ ప్రస్తుతం ప్రభాస్‌గారి ‘ఫౌజి’తోపాటు ‘హే భగవాన్, యుఫోరియా, సహకుటుంబానాం, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, బ్యాచ్ మేట్స్, అర్జునుడి గీతోపదేశం’ సినిమాలు చేస్తున్నాను. ప్రేక్షకుల మనసుల్లో గుర్తుండిపోవాలనుకుంటున్నా.
ఏడేళ్లు...మూడు గంటలు...ఏడు రికార్డులు
∙నృత్య ప్రతిభ
కళ పట్ల ప్రేమ ఉంటే ఏ వయసు అయినా వండర్స్ సృష్టించవచ్చు అనడానికి నిదర్శనం శర్నీథా దత్త రచ్చ. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న ఈ చిన్నారి వయసు ఏడేళ్లు. ఇటీవల రంగప్రవేశం (సోలో అరంగేట్రం)తో ఏకధాటిగా మూడు గంటల పాటు కూచిపూడి నృత్యం చేసిన అరుదైన గుర్తింపుతో పాటు ఏడు రికార్డులను సొంతం చేసుకుంది. అతి పిన్న వయస్కురాలైన కళాకారిణి గా శర్నీథ వార్తల్లో నిలిచింది.
శర్నీథా దత్త రచ్చ రెండవ తరగతి చదువుతోంది. రెండేళ్లక్రితం శాస్త్రీయ నృత్యంలో ఓనమాలు దిద్దిన శర్నీథ ఇటీవల సంక్లిష్టమైన నాట్య భంగిమలను, తిల్లానాలను అత్యద్భుతంగా ప్రదర్శించి ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.
సాధనమున రికార్డులు... శర్నీథా నృత్యాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, డైమండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వం బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.. చూసి శర్నీథ ప్రతిభను గుర్తించాయి. అసాధారణమైన ఈ ప్రతిభకు శారద కళాక్షేత్రం నుంచి ’నాట్యమయూరి’ అవార్డును గురువు భావన పెద్రపోలు నుంచి అందుకున్నది.
అలసట ఎరగని తపన... శర్నీథా తల్లిదండ్రులు రచ్చ హరి వినోద్, నరీనా దేవి కూతురి మూడేళ్ల వయసు నుంచి శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టారు. ‘నృత్యం అంటే శర్నీథకు ప్రాణం. ప్రాక్టీస్ అంటే చాలు సాధన చేస్తూనే ఉంటుంది. నృత్యాంగేట్రం చేయడానికి ఎనిమిది నెలలు ప్రాక్టీస్ చేసింది. వారణాసి లో అసి ఘాట్, అయోధ్య రామమందిరం లోపల, చిదంబరం గర్భగుడి దగ్గర, బాసరలో... నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా డ్యాన్స్ ఫెస్టివల్ సబ్ జూనియర్‌లో పాల్గొని, ఐదవ స్థానంలో నిలిచింది. శర్నీథ నృత్యసాధనలో చూపే భక్తి, శ్రద్ధ ప్రముఖ నృత్యకారులను కూడా మెప్పిస్తుంది. అభినయంలో చిన్న వయస్సులోనే చూపే ఆత్మవిశ్వాసం ప్రేక్షకులను సమ్మోహ పరుస్తుంది.
– నిర్మలారెడ్డి
Tags : 1