Breaking News

ప్రయోగాత్మక పౌరస్మృతి

Published on Wed, 01/29/2025 - 00:18

దేశంలో తొలిసారిగా ఒక రాష్ట్రం ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలుకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో చట్టసభ ఆమోదించిన యూసీసీని ఉత్తరాఖండ్‌ ఆచరణలోకి తెచ్చింది. ఆ రాష్ట్ర సీఎం సోమవారం డెహ్రాడూన్‌లో యూసీసీ నియమావళి ప్రకటించి, పోర్టల్‌ను ప్రారంభించడంతో కొత్త కథ మొదలైంది. వివాదాస్పద యూసీసీ అమలు ‘దేవభూమి’ నుంచి ఆరంభమైందన్న మాటే కానీ, వివాదాల పెనుభూతం మాత్రం ఇప్పుడప్పుడే వదిలిపెట్టడం కష్టం. 

ఇదంతా చూపులకు... మతాలకు అతీతంగా అందరికీ ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలుండేలా ప్రమాణీకరించే ఉద్దేశంతో చేపట్టిన ప్రయత్నంగా, సమానత్వం – సమన్యాయ సిద్ధాంతాలకు అనుగుణంగా గొప్పగా అనిపించవచ్చు. ఆధునిక విలువలకూ, లైంగిక సమానత్వ – న్యాయాలకూ జై కొట్టినట్టు కనిపించవచ్చు. కానీ, లోతుల్లోకి వెళితే – ఆచరణలో ఇది కీలకాంశాలను అందిపుచ్చుకోలేదు. అనేక లోటుపాట్లూ వెక్కిరిస్తాయి. ముఖ్యంగా... చట్టసభలో సమగ్ర చర్చ లేకుండానే, ఏకాభిప్రాయం సాధించకుండానే హడావిడిగా యూసీసీ తేవడం బీజేపీ పాలకుల తెర వెనుక ఉద్దేశాలకు ప్రతీకగా కనిపిస్తుంది. 

ఉత్తరాఖండ్‌లో ఇకపై పెళ్ళిళ్ళు, విడిపోవడాలు, భరణాలు లాంటివన్నిటికీ అన్ని మతాలకూ ఒకే చట్టం వర్తించనుంది. ఆ రాష్ట్రంలో పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. చేయకపోతే, జరిమానాతో పాటు, వివాహాల రిజిస్ట్రేషన్‌ కానివారు ప్రభుత్వ ప్రయోజనాలకు పూర్తిగా అనర్హులు. అలాగే, విడాకుల కేసుల్లో భార్యాభర్తలకు ఒకే నియమావళి వర్తిస్తుంది. బహుభార్యాత్వంపై నిషేధమూ విధించారు. 

అదే సమయంలో, భిన్న సంస్కృతి, సంప్రదాయాలను అంటిపెట్టుకొని ఉండే షెడ్యూల్డ్‌ ట్రైబ్‌లను మాత్రం నిషేధం నుంచి మినహాయించారు. ప్రభుత్వ కొత్త ప్రతిపాదనలో కొన్ని అంశాలు నైతిక నిఘా అనిపిస్తున్నాయి. పెళ్ళి చేసుకున్నవారే కాదు, సహజీవనం చేస్తున్నవారూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనడం, అలా చేయకపోతే జైలుశిక్ష, జరిమానా అనడం బలవంతంగా అందరినీ దారికి తెచ్చుకోవడమే తప్ప, న్యాయపరిరక్షణ అనుకోలేం. 

అసలు విభిన్న మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో పెళ్ళి, విడాకులు, దత్తత, వారసత్వం, పిత్రార్జితం లాంటి అంశాల్లో అందరినీ ఒకే తాటిపైకి తీసుకు రావాలని సమష్టి వ్యక్తిగత చట్టాలు చేయడం సరైనదేనా అన్నది మౌలికమైన ప్రశ్న. ఎవరి మత ధర్మం వారికి ఉండగా, అందరినీ ఒకే గాటన కట్టి, మూకుమ్మడి పౌరస్మృతిని బలవంతాన రుద్దడ మేమిటని జమైత్‌ ఉలేమా ఇ–హింద్‌ లాంటివి అభ్యంతరం చెబుతున్నాయి. షరియాకూ, మతానికీ విరుద్ధమైన చట్టాన్ని ముస్లిమ్‌లు ఆమోదించలేరని కుండబద్దలు కొడుతున్నాయి. 

ఇలా ఉత్తరాఖండ్‌ యూసీసీపై ఒకపక్క దేశవ్యాప్తంగా వాడివేడి చర్చలు జరుగుతుండగానే, మరోపక్క గౌరవ ఉపరాష్ట్రపతి హోదాలోని వారు మాత్రం ‘ఇలాంటి చట్టం దేశమంతటా త్వరలోనే రావడం ఖాయమ’ని ఢంకా బజాయించడం విడ్డూరం. నిజానికి, ఉత్తరాఖండ్‌ యూసీసీలో లోటుపాట్లకు కొదవ లేదు. అందరూ సమానమే అంటున్నా, స్వలింగ వివాహాల ప్రస్తావన లేదేమని కొందరి విమర్శ. అలాగే, దత్తత చట్టాలపైనా యూసీసీ నోరు మెదపలేదని మరో నింద. అందరూ సమానం అంటూనే కొందర్ని కొన్ని నిబంధనల నుంచి మినహాయించడమేమిటని ప్రశ్న. ఎస్టీలకు సహేతుకంగా వర్తించే అదే మినహాయింపులు ఇతర వర్గాలకూ వర్తించాలిగా అన్న దానికి జవాబు లేదు. 

44వ రాజ్యాంగం అధికరణం యూసీసీని ప్రస్తావించిందన్నది నిజమే. దీర్ఘకాలంగా యూసీసీపై అందరూ మాట్లాడుతున్నదీ నిజమే. కానీ, అది ఏ రకంగా ఉండాలి, లేదా ఉండకూడదన్న దానిపై ఇప్పటికీ ఎవరికీ స్పష్టత లేదు. పైగా, గందరగోళమే ఉందన్నదీ అంతే నిజం. ఆది నుంచి ఉమ్మడి పౌరస్మృతిని తారకనామంగా జపిస్తున్న కమలనాథులు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారనుకోవాలి. యూసీసీ వల్ల జరిగే మంచి మాట దేవుడెరుగు, అసలిది చేయగలిగిన పనే అని ప్రపంచానికి చాటాలనుకున్నారు. అయితే, ఈ ఉత్తరాఖండ్‌ యూసీసీ రాజ్యాంగబద్ధత పైనా సందేహాలున్నాయి. 

ఒక రాష్ట్ర చట్టసభలో చేసిన చట్టాలు ఆ రాష్ట్ర పరిధికే వర్తిస్తాయని 245వ రాజ్యాంగ అధికరణ ఉవాచ. కానీ, రాష్ట్రం వెలుపల ఉన్న ఉత్తరాఖండీయులకూ యూసీసీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది హాస్యాస్పదం. అలాగే, సహజీవనాల రిజిస్ట్రేషన్‌ తప్పదంటున్నారే తప్ప, అలా చేసుకుంటే చట్టపరంగా ఆ భాగస్వాముల పరస్పర హక్కులకు రక్షణ లాంటివేమీ కల్పించ లేదు. వారి ప్రైవేట్‌ బతుకులు వ్యవస్థలో నమోదై నడిబజారులో నిలవడమే తప్ప, నిజమైన ప్రయో జనమూ లేదు. పైగా 21వ అధికరణమిచ్చిన గోప్యత హక్కుకు విఘాతమే! 

నిజానికి, గోప్యత హక్కులో సమాచార గోప్యత, స్వతంత్ర నిర్ణయాధికారం కూడా ఉన్నాయని జస్టిస్‌ పుట్టస్వామి కేసులో తొమ్మండుగురు న్యాయమూర్తుల సుప్రీమ్‌ కోర్ట్‌ ధర్మాసనం ఏనాడో తేల్చి చెప్పింది. ఇప్పుడీ యూసీసీ నిబంధన అచ్చంగా దానికి విరుద్ధమే. 

అలాగే, కులాంతర, మతాంతర వివాహాలపై విచ్చుకత్తులతో విరుచుకుపడి, ప్రాణాలు తీసే స్వభావం నేటికీ మారని సమాజంలో ఈ తరహా నిబంధనలు ఏ వెలుగులకు దారి తీస్తాయి? వెరసి, ఉత్తరాఖండ్‌ సర్కారు వారి యూసీసీ పైకి పెను సంస్కరణగా కనిపించినా, ఆఖరికి వేర్వేరు చట్టాల్లోని అంశాల్ని అనాలోచితంగా కాపీ చేసి అతికించిన అతుకుల బొంతగా మిగిలింది. ఇది ఏకరూపత పేరిట ప్రభుత్వం బల ప్రయోగం చేయడమే అవుతుంది. ఉత్తరాఖండ్‌ బాటలోనే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలూ పయనించి, ఆఖరికి యూసీసీని దేశవ్యాప్తం చేస్తారన్న మాట వినిపిస్తున్నందున ఇకనైనా అర్థవంతమైన చర్చ అవసరం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)