Breaking News

కొరియా నేతకు పెను సవాళ్లు

Published on Thu, 06/05/2025 - 00:30

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై నియంతృత్వం ప్రతిష్ఠించటానికి ప్రయత్నించిన మితవాద పక్ష నాయకుడు, మాజీ అధ్యక్షుడు యూన్‌ సెక్‌–యోల్‌కు దక్షిణ కొరియా ప్రజానీకం తగిన బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఏ నాయకుడూ నియంత పోకడలకు పోకుండా మంగళవారం జరిగిన ఎన్నికల్లో గట్టి గుణపాఠం నేర్పారు. ఇటీవలి దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని భారీ మెజారిటీ కట్టబెట్టి మధ్యేవాద వామపక్షమైన డెమాక్రటిక్‌ పార్టీని అందలం ఎక్కించారు. ఆ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్‌ బుధవారం అధ్యక్షుడిగా ప్రమాణం చేశాక చెప్పినట్టు దక్షిణ కొరియా ఆర్థికంగా గడ్డుస్థితిలో వుంది. 

ఇందుకు యోల్‌ అస్తవ్యస్త పాలన కారణం. దీన్ని కప్పిపుచ్చుకోవటానికే ఆయన  నిరుడు డిసెంబర్‌లో ఒక చీకటిరాత్రిలో ఆత్యయిక స్థితిని ప్రకటించి, సైనిక పాలన విధించారు. తనకెదురులేకుండా చేసుకోవటానికి మ్యూంగ్‌పై ముందే దేశద్రోహంతోసహా రకరకాల ఆరోపణ లతో కేసులు రూపొందించారు. కానీ ఆ నిశిరాత్రి వేళే దేశమంతా రోడ్లపైకి రావటంతో ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. 

రాత్రికి రాత్రి విధించిన సైనిక పాలనను తెల్లారుజాముకే తొలగించక తప్పలేదు. ఆ ప్రహసనానికి తెగించకపోతే యోల్‌ 2027 వరకూ అధికారం చలాయించేవారు. యోల్‌ తన చేష్టలకు చెప్పిన కారణాలు చిత్రమైనవి. పొరుగునున్న శత్రుదేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో విపక్షాలు కుమ్మక్కయి, దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే ఆయన్ను, ఆ పార్టీనీ మెజారిటీ జనం నమ్మలేదు. 

కొత్త అధ్యక్షుడు మ్యూంగ్‌ ముందున్న సవాళ్లు తక్కువేమీ కాదు. అంతర్గతంగా దేశం కుడి, ఎడమలుగా చీలిపోవటం, ఆర్థికవ్యవస్థ కుంగుబాటులో ఉండటం, జనాభాలో యువత శాతమే తక్కువనుకుంటే వారికి కూడా ఉపాధి కల్పించే స్థితి లేకపోవటం వంటివి ఆయన దక్షతను పరీక్షించబోతున్నాయి. మరోపక్క అంతర్జాతీయంగా పరిస్థితులు తారుమారయ్యాయి. 

దక్షిణ కొరియాకు ఆది నుంచీ అన్నివిధాలా బాసటగా వున్న ఏకైక దేశం అమెరికా. కానీ మ్యూంగ్‌ ఆ మధ్య చెప్పినట్టు అక్కడ మొన్న జనవరిలో డోనాల్డ్‌ ట్రంప్‌ పీఠం ఎక్కాక అంతర్జాతీయంగా ‘ఆటవిక పాలన’ నడుస్తోంది. స్వపర భేదం లేకుండా అందరిపైనా సుంకాల భారం మోపేందుకు ఆయన తహతహ లాడుతున్నారు. తమ సైన్యం రక్షణ కోరుకునే దేశాలు అందుకు భారీయెత్తున డబ్బు చెల్లించాలంటున్నారు. 

దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం గణనీయంగానే ఉంది. అంతమాత్రాన మ్యూంగ్‌ ఆ దేశానికి దాసోహం అనే స్థితి ఉండకపోవచ్చు. అలాగే గతాన్ని మరిచి జపాన్‌తో సాన్నిహిత్యం పాటించాలన్న అమెరికా సలహాను యోల్‌ శిరసా వహించిన మాదిరిగా మ్యూంగ్‌ అంగీకరించక పోవచ్చు. డెమాక్రటిక్‌ పార్టీ మొదటి నుంచీ జపాన్‌ తన తప్పులు అంగీకరించి వలసపాలనలో కొరియా వాసులపై సాగించిన దుష్కృత్యాలకు క్షమాపణ చెప్పాలని, అందుకు మూల్యం చెల్లించా లని డిమాండు చేస్తోంది.

ఆర్థికవ్యవస్థ బాగుకు చైనా సహాయం స్వీకరించాలని మ్యూంగ్‌ అనుకుంటున్నా అమెరికాతో స్నేహానికి అది అవరోధం అవుతుంది. మితవాదులు మొదటి నుంచీ దీన్నే ప్రచారం చేస్తూ వచ్చారు. ప్రాంతీయ భద్రతలో భాగంగా అమెరికా, జపాన్‌లతో సాన్నిహిత్యం కొనసాగుతుందని డెమాక్రటిక్‌ పార్టీ ఆ మధ్య ప్రకటించింది. చైనా, ఉత్తర కొరియాలతో వచ్చిన విభేదాల పరిష్కారానికి కృషి చేస్తానని మ్యూంగ్‌ తాజాగా తెలిపారు. కానీ ఆచరణలో అదెంత వరకూ సాధ్యమన్నది చూడాల్సి ఉంది. 

మొత్తానికి గత అధ్యక్షులెవరికీ లేనంత బలం ఆయనకు సమకూడింది. చట్టసభలో సైతం ఆయన పార్టీదే పైచేయి. దీన్ని ఆయన ఎలా ఉపయోగిస్తారన్నదే అందరిలోనూ ఉన్న సంశయం. ఎందుకంటే ఇంతవరకూ కొత్త అధ్యక్షుడు రాగానే గత అధ్యక్షుడిపై రకరకాల ఆరోపణలతో కేసులు పెట్టడం రివాజుగా మారింది. అయితే దేశాన్ని నియంతృత్వంలోకి నెట్టాలని చూసి యోల్‌ తన గొయ్యి తానే తవ్వుకున్నారు. ఆయనకు గుదిబండగా మారటానికి ఆ కేసు ఒక్కటీ చాలు. 

‘యుద్ధంలో విజయం సాధించటం చాలా ముఖ్యమే. కానీ అసలు యుద్ధం లేకుండానే విజయం సాధించటం అంతకన్నా ఎన్నో రెట్లు కీలకమైనది’ అని మ్యూంగ్‌ ఇటీవల ప్రకటించారు. చైనా, ఉత్తర కొరియాల విషయంలో దీన్ని ప్రయోగించే అవకాశం ఎటూ ఉంది. కానీ అంతర్గత వ్యవ హారాల్లో కూడా ఈ నీతి పాటిస్తారా? దేశంలో అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది దాని గురించే!

ఎందుకంటే గతంలో జాతీయవాదం పేరిట యోల్‌ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఉత్తర కొరియాతో ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదన్న అభిప్రాయం కలగజేశారు. దానికితోడు ఫెమినిస్టులపై ఆయన ద్వేషం అవధులు దాటింది. దేశ ఆర్థికవ్యవస్థ పతనానికి కూడా వారే కారకులన్న స్థాయిలో యోల్‌ ప్రచారం చేశారు. అదెంతగా పనిచేసిందంటే ఆ విషయంలో ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతో డెమాక్రటిక్‌ పార్టీ మౌనం వహించింది. 

కానీ దేశంలో హింసాత్మక ఘటనల్లో అత్యధిక బాధితులు మహిళలు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, వివక్ష ఏమేరకు తగ్గినా వారు సంతోషిస్తారు. యువతకు ఉపాధి, పడిపోయిన జననాల రేటును పట్టా లెక్కించటం కూడా పరిష్కరించాల్సిన సమస్యలే. ఇక పింఛన్లు తీసుకునేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 

80,000 కోట్ల డాలర్ల పింఛన్‌ నిధి క్రమేపీ ఆవిరవుతున్న దశలో ఉత్పాదకత పెంచి ఖజానా కళకళ లాడేలా చేయటం ఎలా అన్నది అంతుబట్టడం లేదు. ముందు సుస్థిరత సాధించి, ఈ సమస్యలపై దృష్టి సారిస్తే తప్ప మ్యూంగ్‌ తనకొచ్చిన జనాదరణను నిలబెట్టుకోవటం అంత సులభమేమీ కాదు! 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)