Breaking News

ఆదిమ నిద్రకళ

Published on Mon, 09/15/2025 - 00:32

నిద్ర అనే మాటే ఒక మత్తు, మహత్తు. అలసిన శరీరానికి హాయి... నిద్ర. గడిచిన దినానికి తీపి వీడ్కోలు... నిద్ర. నిద్ర పోవడం అనే దశ నుంచే శిశువు జీవితం ఆరంభమవుతుంది. రోజులో పదహారు గంటలు నిద్రపోతూనే దినదిన ప్రవర్ధమానమవుతాడు. ఏ పాటా రాని తల్లి కూడా పసివాడిని నిద్రపుచ్చడానికి ‘ఉళుళుళు హాయి’ అని లాలి రాగం తీస్తుంది. ఆ లెక్కన ప్రతి తల్లీ ఒక గాయనే అనుకోవాలి. నిద్ర అనేది మనిషికి ప్రకృతి ప్రసాదించిన చవకైన విలాసం.

నిద్ర అనేది నిజమైన సమవర్తి కూడా! ఏ మనిషైనా తన దగ్గర అన్ని కిరీటాలనూ పక్కన పెట్టాల్సిందే. కేవలం శ్వాసించే మాంసపు బంతులుగా ఆడాల్సిందే. ‘‘ఈ నీడల నాటకరంగం మీద జీవితపు మెరకపల్లాల్లోంచి వచ్చిన వాళ్లందరూ ఒకే హోదాతో నిలబడతారు. ఇక్కడ విభేదాలు లేవు. ఈ కౌగిలి అందరికీ ఒకేరకపు శాంతినిస్తుంది. ఇక్కడ యాచన లేదు. లేదనటం లేదు. అవమానం లేదు. 

ఈ వాకిలి దగ్గరకు వచ్చినవాడెవ్వడూ ఉత్త చేతులతో తిరిగి వెళ్లడు’’ అంటాడు కథక కవి ఆలూరి బైరాగి. నిద్ర అనేది దివ్యలోకాలకు తలుపులు తెరిచే సాధనం. ఏ మనిషికా మనిషి సమాంతర ప్రత్యేక లోకాలను ఆవిష్కరించుకోగలిగే తరుణోపాయం. కలల రెక్కల మీద ప్రతి జీవీ అక్కడ ఎల్లలు లేకుండా తిరుగుతాడు. తెల్లారేసరికి ఏమీ ఎరగనట్టే మామూలుగా ఉండిపోతాడు.

మనిషికి ఉన్నవి రెండే స్థితులు: పగలు పని, రాత్రి నిద్ర. అవి తారుమారవ్వడం ఆధునిక పరిణామం. ఆకలి రుచెరగదు, నిద్ర సుఖమెరగదంటారు. నిద్రలోంచి లేవడమంటే దాదాపు చచ్చి మళ్లీ బతికినట్టే! అందుకే కొందరు నిద్ర లేవగానే కృతజ్ఞతగా దేవుడికి దండం పెట్టుకుంటారు. కానీ అదంతా కాయకష్టం చేసిన రోజుల్లో! ఇప్పుడు మనిషి స్థానాన్ని యంత్రం ఆక్రమించాక, నడుం వంచడం అనేదే పెద్ద పనైపోయింది. 

లక్షల ఏళ్ల మనిషి నాగరికతా ప్రస్థానంలో 10,000 ఏళ్ల నుంచే మనుషులు నగరాల్లో జీవించడం మొదలుపెట్టారు. పంతొమ్మిదో శతాబ్దం చివరలోనే కరెంట్‌ మనిషి జీవితంలోకి వచ్చింది. 1970ల తర్వాతే కంప్యూటర్లు ఇళ్లల్లోకి ప్రవేశించాయి. వీటన్నింటికీ మనిషి మెదడు సర్దుకుపోతూ వచ్చింది.

ఈ క్రమంలో చరిత్ర పూర్వ మనుషులు ఎలా నిద్దరోయారు అనేది ఒక ఆసక్తి. చెట్టు కొమ్మలనే పాన్పులుగా చేసుకుని అదే చెట్ల మీద పడుకోవడమూ ఉండేది. ఎటో జారిపోతున్న భావన కలిగి ఉన్నట్టుండి మనం ఇప్పుడు నిద్రలోంచి మేల్కొనడం అనేది మన పూర్వీకుల చెట్ల నిద్ర తాలూకు అవశేషం మన రక్తంలోకి ఇంకిపోవడం వల్ల జరుగుతున్నదని నిద్రా నిపుణులు చెబుతుంటారు. 

అలా జారిపోతున్న సంవేదన ఆ ఆదిమ మానవులకు ఒక రక్షాకవచంలా పనిచేసి, క్రూర మృగాల పట్ల అప్రమత్తతతో ఉంచింది. అయితే, రెండు లక్షల ఏళ్ల క్రితమే మనుషులకు ‘మంచం’ లాంటిది ఏర్పాటు చేసుకోవడం తెలుసు అంటారు ‘హౌ టు స్లీప్‌ లైక్‌ ఎ కేవ్‌మ్యాన్‌: ఏన్షియెంట్‌ విజ్‌డమ్‌ ఫర్‌ ఎ బెటర్‌ నైట్స్‌ రెస్ట్‌’ రచయిత డాక్టర్‌ మెరిజిన్‌ వాన్‌ డెలార్‌. 

పట్టు పాన్పు, మబ్బు దుప్పట్లు లేకపోయినా, మట్టిని బల్లపరుపుగా చేసుకొని, దాన్ని మరిన్ని పొరలుగా ఉబ్బుగా దిద్దుకుని, దాన్ని కొమ్మలు, గడ్డి, ఆకులతో మెత్తబరుచుకొని పడుకునేవాళ్లు. పురుగూ పుట్రను తరిమికొట్టే మొక్కలను అక్కడ ఉంచేవాళ్లు. పక్కనే క్యాంప్‌ ఫైర్‌ ఉండనే ఉంటుంది. అదే మంటతో ఆ మంచాన్ని నియమిత సమయాల్లో కాల్చుతుండేవాళ్లు. 

దానివల్ల కూడా పురుగూ పుట్రా ఆ దరికి చేరకుండా ఉండేవి. అవే మంచాలను బహుముఖంగా పని ప్రదేశాలుగానూ, పని ముట్లను సాఫుచేసుకోవడానికీ వాడుకునేవాళ్లు. అందుకే చరిత్ర పూర్వ మనుషులనగానే అనాగరికమైన ఊహ రావడాన్ని వ్యతిరేకిస్తారు వాన్‌ డె లార్‌. 

నిద్ర, తిండి విషయంలో వాళ్లు అత్యంత వివేకంతో వ్యవహరించారన్నది నెదర్లాండ్స్‌కు చెందిన ఈ ‘స్లీప్‌ సైంటిస్ట్‌’ వాదన. వ్యాయామం ఉండటం, తిండిలో చక్కెర లేకపోవడం అనే రెండు కారణాల వల్ల వాళ్లకు ఇట్టే నిద్రపట్టేది. ఆ రెండూ రివర్సు కావడం వల్ల ఇప్పుడు నిద్ర కరవవుతోంది. వీటినే సూచనలుగా స్వీకరిస్తే మనం కోల్పోతున్న నిద్రను మళ్లీ పొందొచ్చేమో! 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)