చందమామకు గాయం

Published on Thu, 08/06/2026 - 01:21

అనుకున్నట్టే స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నుంచి విడివడి అదుపుతప్పిన భాగం బుధవారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.05 నిమిషాలకు చంద మామను ఢీకొట్టింది. రాకెట్‌లోని అడుగుభాగం లోగడే సురక్షితంగా భూమ్మీదకు తిరి గొచ్చింది. అయిదంతస్తుల నిడివుండే రెండో భాగం మాత్రం దారితప్పింది. వాస్తవానికి ఇది కూడా పునర్వినియోగానికి వీలుగా రూపొందిందే. కానీ సరైన సమయంలో నియంత్రించకపోవటంవల్ల అది కాస్తా దారితప్పి చంద్రుడి కక్ష్యలోకి పోయింది. అంతరిక్షంలో మేం సైతం ఉన్నామని చెప్పుకోవటానికి అనేక దేశాలు పోటీపడి అంతరిక్ష నౌకలనూ, ఉపగ్రహాలనూ భూ కక్ష్యలో ప్రవేశపెడుతున్నాయి. అందువల్ల వాతావరణ పరిస్థితులు మొదలుకొని శాస్త్ర, సాంకేతిక, సైనిక రంగాల్లో ప్రగతి సాధించగలుగుతున్నాయి. 

కానీ ఈ ప్రయోగాల క్రమంలో అనుకోకుండా సంభవించగల ప్రమాదాలేమిటో చెప్పటానికి అదుపు తప్పిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ విడి భాగమే తార్కాణం. నిరుడు జనవరిలో జరిపిన ఈ ప్రయోగం ఇది మినహా అన్నివిధాలా విజయవంతమైంది. అది గత 18 నెలలుగా భూమితోపాటు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తికి లోనవుతూ, సౌరశక్తిని గ్రహిస్తూ సాగుతోంది. ఇది ఇలా క్రమేపీ వేగం పుంజుకుంటూ చంద్రుణ్ణి ఢీకొడుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారణకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ ఢీకొడుతుందో, ఏమేరకు దాని ప్రభావం ఉంటుందో కూడా అంచనా వేశారు. జరిగింది ప్రమాదమే అయినా... దాని గమనం గురించి శాస్త్రవేత్తలు వేసిన లెక్కలన్నీ కచ్చితత్వంతో ఉన్నాయని తేలింది. 

వేలాది సంవత్సరాలపాటు భూకక్ష్య విశాలంగా, శూన్యంగా ఉండిపోయింది. 1957లో అప్పటి సోవియెట్‌ నుంచి తొలిసారి నాలుగు రేడియో ఏంటెన్నాలున్న ఒక లోహపు బంతి పెనువేగంతో దూసుకెళ్లి భూకక్ష్యను చేరింది. అది అంతరిక్ష యుగానికి పడిన మొట్టమొదటి అడుగు. భూమ్మీద ఏం జరుగుతున్నదో తెలుసుకోవటానికి విప్పారిన తొలి అంతరిక్ష నేత్రం. మరో నాలుగైదేళ్లలో గుప్పెడు ఉపగ్రహాలు చకచకా అటువైపు కదిలి వెళ్లాయి. 70వ దశకం చివరికల్లా అవి 14,000కు చేరుకున్నాయి. 90ల చివరికి మరిన్ని ఉపగ్రహాలు పయనమయ్యాయి. అప్పటికల్లా వాటి సంఖ్య దాదాపు 20,000. ఇప్పుడిక ప్రైవేటు రంగం కూడా అంతరిక్షంవైపు చూడటం మొదలుపెట్టింది. ఇంకేం... వాటి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. 

పైగా గతంలో ఒక స్కూల్‌ బస్‌ సైజుకు మించని ఉపగ్రహాలు పంపే సంప్రదాయం ఉండగా... స్పేస్‌ ఎక్స్‌ మెగా బహుళ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఒరవడికి 2019లో శ్రీకారం చుట్టింది. తాజాగా 32,000 ఉపగ్రహాలు పెనువేగంతో సంచరిస్తున్నాయి. అదుపుతప్పి పడిపోయిన వాటిని మినహాయించగా తేలిన లెక్క ఇది. ఈ దశాబ్దం ముగిసేసరికి మొత్తం ఉపగ్రహాల సంఖ్య 60,000కు చేరుతుందని అంచనా. పాత ఉపగ్రహాల తాలూకు శకలాలు కావొచ్చు... విడివడిన రాకెట్‌ల తాలూకు తునకలు కావొచ్చు... ఉపగ్రహాల శకలాలు కావొచ్చు... పెను వేగంతో చక్కర్లు కొడుతున్నాయి. అవి దాదాపు 13 కోట్ల వరకూ ఉంటాయని అంచనా. ఇది మనుషులకూ ముప్పు తెస్తుందని కొందరు నిపుణులంటున్న మాట.

మాజీ అంతరిక్ష యాత్రికుడు స్టీవ్‌ రాబిన్‌సన్‌ పలుమార్లు అంతరిక్ష యాత్రలు చేశాడు. ప్రతిసారీ తమ నౌకను ఏదో ఒక శకలం ఢీకొడుతూనే ఉండేదని ఆయన ఒక సందర్భంలో చెప్పాడు. గత నవంబర్‌లో చైనా అంతరిక్ష నౌకను ఆ దేశానికే చెందిన మరో ఉపగ్రహం తాలూకు శకలం ఢీకొట్టడంతో అది కాస్తా పనికిరాకుండా పోయింది. వ్యోమ గాముల్ని వెనక్కు తీసుకురావడానికి మరో నౌక పంపాల్సివచ్చింది. ఇలాంటి ప్రమాదాలపై 1972లోనే అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. పరిహారం ఎలా నిర్ణయించాలన్నది కూడా ఉంది. 

కానీ నిర్దిష్టంగా ఫలానా శకలంవల్లే ప్రమాదం జరిగిందని గుర్తించటం కష్టం. అందుకే లక్ష్యం పూర్తయ్యాక భూవాతావరణంలో పునఃప్రవేశించినప్పుడు వాటంతటవే ముగిసిపోయే ‘డిజైన్‌ ఫర్‌ డిమైజ్‌’ విధానంలో ఉపగ్రహాలు రూపొందుతున్నాయి. వీటితోపాటు నిర్దేశిత సముద్ర ప్రాంతాల్లో సురక్షితంగా కూల్చి వేసేలా ఆన్‌బోర్డ్‌ చోదనవ్యవస్థలూ వినియోగిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ దేశాలన్నీ అంతరిక్ష వ్యర్థాలపై దృష్టి పెట్టడం మంచిది. వాటి తొలగింపునకు లక్ష్యం నిర్దేశించుకుని పరిపూర్తి చేసుకోవటం ఉత్తమం. 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)