Breaking News

శతప్రయోగ విజయసీమ

Published on Fri, 01/31/2025 - 00:47

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం ఉదయం జరిపిన నూరవ రాకెట్‌ ప్రయోగంతో చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్‌)లో రెండో లాంచ్‌ ప్యాడ్‌ నుంచి నింగిలోకి ఎగసిన భూ సమకాలిక ఉపగ్రహ ప్రయోగవాహక నౌక (జీఎస్‌ఎల్వీ–ఎఫ్‌15) ఎన్వీఎస్‌–02 ఉపగ్రహాన్ని విజయ వంతంగా నిర్ణీత కక్ష్య అయిన జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ – జీటీఓలోకి చేర్చింది. 

ఈ కొత్త ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం నిర్విఘ్నంగా సాగడం శాస్త్రవేత్తల్లో ఆనందం పెంచింది. రోదసిలో చేరిన ఈ తాజా శాటిలైట్‌తో మన ‘నావిక్‌’ (నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టలేషన్‌)లో విధులు నిర్వహిస్తున్న ఉపగ్రహాల సంఖ్య 4 నుంచి 5కు పెరిగింది. దీని వల్ల మన దేశంతో పాటు మన పొరుగు దేశాలకూ మొబైల్‌ ఫోన్లలో జీపీఎస్‌ సహా అనేక సేవల్లో కచ్చితత్వం పెరగనుంది. ఇతర దేశాలన్నీ అమెరికా తాలూకు జీపీఎస్‌పై ఆధారపడితే, భారత్‌ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌లో సొంత కాళ్ళపై నిలబడేందుకు చేస్తున్న ఈ కృషి సగటు భారతీయుడి ఛాతీ ఉప్పొంగే క్షణం. 

సైకిళ్ళు, ఎడ్లబండ్లపై రాకెట్‌ విడిభాగాలను తరలించిన కాలం నుంచి ఇటీవలే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించే (డాకింగ్‌ చేసే) స్థాయికి ఇస్రో చేరడం చిరకాలం చెప్పుకోవా ల్సిన స్ఫూర్తిగాథ. విక్రమ్‌ సారాభాయ్, సతీశ్‌ ధవన్‌ లాంటి దిగ్గజాల తొలి అడుగులతో ఆరంభించి, ఆపైన కలామ్‌ లాంటి వారి మేధను వినియోగించుకొని అయిదు దశాబ్దాల పైగా సాగించిన ప్రస్థానం చిరస్మరణీయం. 

1962లో అణుశక్తి విభాగం కింద ఏర్పాటైన ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ద్వారా ఇస్రోకు బీజం పడింది. చంద్రుడి మీదకు అమెరికా మానవుణ్ణి పంపిన 1969లోనే ఇప్పుడు మనం చూస్తున్న ఇస్రో స్థాపన జరిగింది. 1972లో ప్రత్యేకంగా అంతరిక్ష శాఖ ఏర్పాటైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అంతరిక్ష పరిశోధనా సంస్థ అనేక రాకెట్లకు పురుడు పోయడమే కాక, ఇతర దేశాల ఉపగ్రహ ప్రయోగాలలోనూ విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది. 

మన ఇస్రో 1979 ఆగస్ట్‌ 10న తొలిసారిగా ఉపగ్రహ ప్రయోగ నౌక (ఎస్‌ఎల్వీ–3 ఈ10) ద్వారా ప్రయోగాత్మకంగా రోహిణీ టెక్నాలజీ పేలోడ్‌ను నింగిలోకి పంపిన క్షణాలు ఆ తరంలో చాలామందికి ఇప్పటికీ గుర్తే. అప్పట్లో ఇస్రోతో పనిచేస్తున్న అబ్దుల్‌ కలామే ఆ ప్రయోగానికి డైరెక్టర్‌. సదరు ప్రయోగం పాక్షికంగానే విజయం సాధించింది కానీ, ఆ తర్వాత కాలగతిలో అంతరిక్ష ప్రయోగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఆరితేరాం. అంకెల్లో చెప్పాలంటే, ఇప్పటి వరకు ఇస్రో 548 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాదాపు 120 టన్నుల పేలోడ్‌ను నింగిలోకి పంపింది. అందులో 433 విదేశీ ఉపగ్రహాలకు చెందిన 23 టన్నులూ ఉంది. 

ఈ సుదీర్ఘ ప్రయాణంలో షార్‌ కేంద్రం ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు వేదికైంది. మూడు చంద్రయాన్‌లు, ఒక మార్స్‌ ఆర్బిటర్‌ ప్రయోగం, ఆదిత్య ఎల్‌1 ప్రయోగం లాంటివి గణనీయమైనవి. కక్ష్యలో పరిభ్రమించే వ్యోమనౌకను భూవాతావరణంలోకి ప్రవేశింపజేసి... భూమి పైకి క్షేమంగా తెచ్చి రికవరీ చేసే ‘స్పేస్‌ క్యాప్సూల్‌ రికవరీ ప్రయోగం’ (ఎస్‌ఆర్‌ఈ), అలాగే ఒకే రాకెట్‌తో 104 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం వగైరా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. ఇస్రో ప్రయోగించినవాటిల్లో కమ్యూనికేషన్‌ శాటిలైట్లు, భూ పరిశీలన ఉపగ్రహాలు, మార్గనిర్దేశక (నావిగేషనల్‌), ప్రయోగాత్మక శాటిలైట్లు అనేకం. ఆ వివరాలు సగర్వంగా తోస్తాయి. 

రానున్న రోజుల్లోనూ మరిన్ని చారిత్రక ఘట్టాలకు ఇస్రో చోదకశక్తి కానుంది. గగన్‌యాన్‌లో భాగంగా మానవరహిత జి1 ప్రయోగం తొలిసారి చేయనున్నారు. అలాగే, నెక్స్‌›్ట జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎన్జీఎల్వీ), చంద్రయాన్, శుక్రయాన్‌ జరగనున్నాయి. ప్రైవేట్‌ ఉపగ్రహ ప్రయోగాలకు సైతం వేదికగా నిలిచి, అంతరిక్ష వాణిజ్యంలో తగిన వాటా కోసం ప్రయత్నిస్తున్న ఇస్రో మరో రెండేళ్ళలో శ్రీహరికోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించనుండడం విశేషం. 

అలాగే, తమిళనాడులోని కులశేఖరపట్నంలో రెండో ఉపగ్రహ ప్రయోగ కాంప్లెక్స్‌ సైతం సిద్ధమవుతోంది. భారీ పేలోడ్‌ లను రోదసిలోకి తీసుకెళ్ళగలిగే ఎన్జీఎల్వీల రూపకల్పనకూ, మూడో లాంచ్‌ ప్యాడ్‌ నిర్మాణానికీ దాదాపు రూ. 4 వేల కోట్లు ఖర్చవుతుంది. అంత మొత్తం వెచ్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం. భారత అంతరిక్ష పరిశోధన, ప్రయోగ రంగానికి ఇది పెద్ద ఊతం. ఇవన్నీ ప్రైవేట్‌ రంగ రోదసీ ప్రయోగాల్లో ఇస్రో సింహభాగం దక్కించుకోవడానికి ఉపకరిస్తాయి. 

ఒకప్పుడు అగ్రరాజ్యాలు సాంకేతిక విజ్ఞానాన్ని అందించడానికి నిరాకరించినప్పుడు స్వశక్తితో దేశీయంగా బుడిబుడి అడుగులతో మొదలుపెట్టిన భారత్‌ దాదాపు అయిదు పదుల ఏళ్ళలో శత రోదసీ ప్రయోగాలు సాగించింది. రానున్న అయిదేళ్ళలోనే రెండో శతం పూర్తి చేసి, మొత్తం 200 ప్రయోగాల మైలురాయికి చేరుకోవడానికి ఉరకలు వేస్తోంది. ఇన్నేళ్ళుగా మన అంతరిక్ష పరిశోధ కులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చూపుతున్న అచంచలమైన నిబద్ధత, అంకితభావానికి మచ్చుతునక ఈ ఇస్రో విజయగీతిక. 

విశ్వవేదికపై అగ్రరాజ్యాల సరసన అంతరిక్షంలో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదిగిందనడానికీ ఇది ప్రతీక. అనేక ఆర్థిక, సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ సృజనాత్మకంగా ఆలోచించి, పరిస్థితులకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకొంటే గణనీయ విజయాలు సాధ్యమే అనడానికి ఇదే తిరుగులేని రుజువు. 1975లో తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం నుంచి ఆ మధ్య మంగళ్‌యాన్‌ వరకు ప్రతిసారీ తక్కువ ఖర్చుతో, అంచనాలకు అందని విజయాలు సాధించిన మన శాస్త్రవేత్తల ఘనతకు భవిష్యత్తులోనూ ఆకాశమే హద్దు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)