Breaking News

లెక్కల్లో దాగుడుమూతలు

Published on Wed, 06/03/2026 - 01:46

గణాంకాలపై ఎందరికెన్ని ఫిర్యాదులున్నా, ఎవరెంత వేళాకోళం చేసినా ప్రభుత్వ విధానాల రూపకల్పనకూ, అమల్లోవున్న విధానాల దిద్దుబాటుకూ అవే ఆధారం. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మూడు రోజుల క్రితం విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) చూస్తే మన దేశం ఏయే రంగాల్లో మెరుగుపడింది, ఇంకెన్ని రంగాల్లో సవరించుకోవాల్సిన అవసరముంది అనే విషయాలు తెలుస్తాయి. 1992–93లో విడుదల చేసిన తొలి సర్వేనుంచీ చూస్తే తాజాగా విడుదలైన సర్వే ఆరోది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వే మాతా–శిశు ఆరోగ్యం, బాలల పౌష్టికాహారం, ఆరోగ్య బీమా వగైరాల్లో మన దేశం ముందడుగు వేసిందని చాటుతోంది. ఇది సమగ్రమైనదనీ, అత్యుత్తమ నాణ్యతతో కూడిన గణాంకాలు రాబట్టడానికి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నామనీ ఆ నివేదిక వివరిస్తోంది. 

2030 నాటికి ప్రపంచ దేశాలన్నీ సాధించి తీరాల్సిన వాటిగా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు ఎంత చేరువలో ఉన్నాం... ఎంత దూరంలో ఉన్నాం అనేది తెలుసుకోవటం, తగువిధంగా సవరించుకోవటం ఈ గణాంకాల ఉద్దేశం. గత నివేదికతో పోలిస్తే ఆసుపత్రుల్లో శిశుజననాల శాతం పెరిగిందనీ(88.6 శాతం నుంచి 90.6 శాతానికి), ప్రసవానికి ముందు ఆరోగ్య పరిరక్షణ 95.9 శాతానికి చేరుకుందనీ, సంతాన సాఫల్యత రేటు స్థిరంగా 2.0 దగ్గరుందనీ, పౌష్టికాహారలోపం తగ్గిందనీ, ఏడాది–రెండేళ్లమధ్య వయసుండే పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల శాతం 87.1 శాతానికి చేరుకుందనీ నివేదిక వివరిస్తోంది. అసలు తొలి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ నివేదికకూ, తాజా నివేదికకూ చూస్తే స్పష్టమైన పురోగతి కనిపిస్తుంది. అప్పట్లో కేవలం 40 శాతం ప్రసవాలు మాత్రమే ఆసుపత్రుల్లో జరిగేవి. అవి ఇప్పుడు 90 శాతానికి పెరగటం చిన్న విషయమేం కాదు. 

అయితే గణాంకాలు ఏం చెబుతున్నాయన్నది కాదు... ఏం చెప్పటం లేదన్నది ముఖ్యమని నిపుణులంటారు. ఆ కోణంలో ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ నివేదిక నిరాశపరుస్తుంది. గత నివేదికకూ, ఇప్పటికీ చూసినా ఎన్నో అంశాల దాటవేత తెలుస్తుంది. గత నివేదికకు మొత్తం 131 సూచీలుంటే ఇప్పుడవి 101కి తగ్గాయి. అంటే అనేక అంశాలను ఈ సర్వే పూర్తిగా విస్మరించిందన్నమాట! శిశువులు, పిల్లల మరణాల రేటైనా, కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలైనా, హెచ్‌ఐవిపై అవగాహన కల్పించటమైనా ఇందులో కనబడవు. అవి సర్వే చేయదగ్గ అంశాలు కాదనిపించటంలోని సహేతుకత ఏమిటో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖకే తెలియాలి. ఒకవేళ వేరే గణాంకాల కోసం విడిగా సర్వే చేసివుంటే ఆ సంగతి చెప్పాలి. 

2015–16 సంవత్సరంలో విడుదలైన నాలుగో నివేదికలో వంటగ్యాస్‌ వినియోగం 43.8 శాతం మేర ఉంటే ఆ తదుపరి సర్వే నాటికి అది 58.6 శాతానికి పెరిగిందని వెల్లడైంది. అటు తర్వాత కేంద్రం కోట్ల సంఖ్యలో అదనపు కనెక్షన్లు మంజూరు చేసింది. దాని ప్రభావం ఎలా ఉందో చూద్దామంటే ఇప్పుడది మాయం! స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణాల సంఖ్య 10 కోట్లకు చేరుకుందని 2019లో ప్రకటించి, దాన్ని కీలకమైన ఘట్టంగా చెప్పారు. తీరా తాజా నివేదిక ప్రస్తుత స్థితి ఎలా వుందో, అటుతర్వాత మెరుగుపడిందో లేదో చెప్పకుంటే ఎలా? ఇక పిల్లల్లో, మహిళల్లో రక్తహీనత ఎలా వుందన్న ప్రశ్న కూడా ఎగిరిపోయింది. గత సర్వేలో ఈ అంశానికి సంబంధించి ఏడు సూచీలున్నాయి. అయితే ఈ నివేదికలో నేరుగా నగదు బదిలీ, డిజిటల్‌ అక్షరాస్యత, ఆర్థిక లావాదేవీలు వగైరా అంశాలున్నాయి. మంచిదే. అంత మాత్రాన ఇతర సూచీలు తొలగించటం సరికాదు. 

మనం చెప్పుకోవటానికైతే జీడీపీపరంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆరో స్థానంలో ఉన్నాం. కానీ మౌలికంగా మనది అల్పాదాయ వర్గాలు అధికంగా ఉండే దేశం. సంపద పంపిణీ రీత్యాచూస్తే జనాభాలో కేవలం 10 శాతంమంది దగ్గర దాదాపు 65 శాతం సంపద ఉండగా, వీరిలో కేవలం 1 శాతంమంది చేతుల్లో 40 శాతం సంపద ఉంది. అట్టడుగు 50 శాతం జనాభా చేతిలో కేవలం 6.4 శాతంమేర మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన జోక్యాలతోనే నిరుపేద వర్గాలకు వివిధ అంశాల్లో సాయం అందించటం సాధ్యమవుతుంది. ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు అందుకోవాలంటే మన వర్తమాన స్థితిగతుల అధ్యయనం తప్పనిసరి. దాన్ని విస్మరించటం తెలివైన పనికాదు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)