Breaking News

డీప్‌ సీక్‌ నేర్పుతున్న పాఠం

Published on Thu, 01/30/2025 - 00:27

సాంకేతిక రంగంలో, అందులోనూ కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంలో ఇది సరికొత్త విప్లవం. కేవలం 200 మంది ఉద్యోగులతో, కోటి డాలర్లు వెచ్చించి, చైనాకు చెందిన చిన్న స్టార్టప్‌ కంపెనీ డీప్‌ సీక్‌ చేసిన మేజిక్‌ అగ్రరాజ్యపు బడా సంస్థల్ని సైతం ఆలోచనలో పడేసింది. డీప్‌ సీక్‌ ఇటీవల విడుదల చేసిన రెండు ‘స్వేచ్ఛా వినియోగ’ (ఓపెన్‌ సోర్స్‌) ఏఐ ప్రోగ్రామ్‌లు, ఛాట్‌బోట్‌లు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, ఈ 27న అప్‌డేట్‌ వచ్చిన డీప్‌ సీక్‌ గురించే చర్చ. 

భారత్‌లోనూ యాపిల్‌ యాప్‌ స్టోర్లలో ఛాట్‌ జీపీటీ, గూగుల్‌ జెమినీలను దాటేసి, అత్యధికంగా డౌన్‌లోడ్‌ అవుతున్న యాప్‌ ఇవాళ ఇదే. ఆర్‌1, వీ3 అల్గారిథమ్‌లను తక్కువ ఖర్చుతోనే తీర్చిదిద్దినట్టుగా చెబుతున్న డీప్‌సీక్‌ ఇప్పుడు ఏఐ వినియోగ సామర్థ్యంలో ఛాట్‌ జీపీటీ, గ్రోక్, క్లాడ్, లామా లాంటి తోటి ప్రత్యర్థుల సరసన పెద్ద గీతగా నిలబడింది. భారీగా పెట్టుబడులు పెడితే తప్ప, ఏఐలో సంచలనాలు సాధ్యం కావన్నది భ్రమ అనీ, ఆలోచన, ఆచరణ ఉంటే అద్భుతాలు అసాధ్యమేమీ కాదనీ నిరూపించింది. 

ట్రంప్‌ అధ్యక్షపీఠమెక్కిన వారం రోజులకే అమెరికా ఆభిజాత్యానికి డీప్‌ సీక్‌ దెబ్బకొట్టినట్టయింది. ఆగ్నేయ చైనాలోని హాంగ్‌జౌకు చెందిన అనామక ఇంజనీర్ల బృందం తమ సాంకేతికతతో ఈ స్థాయి విజయం సాధించడం అనూహ్యం. అనేక అత్యుత్తమ అమెరికా సంస్థలు అపారమైన పెట్టుబడులు, వనరులతో రూపొందించిన ఏఐ నమూనాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో, పరి మిత వనరులతో చైనాకు చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ ఇలా ప్రపంచాన్ని కుదిపేయడం విశేషం. 

ఆవిష్కృతమైన వారం రోజుల్లోనే డీప్‌ సీక్‌ సరికొత్త వెర్షన్‌ వీ3 అనేక సంక్లిష్టమైన, సూక్ష్మమైన ప్రశ్నలకు ఓపెన్‌ ఏఐ తాలూకు ఛాట్‌ జీపీటీ కన్నా మెరుగ్గా జవాబులివ్వడం గమనార్హం. సందర్భో చితంగా, కచ్చితత్వంతో, అంతకు మించి సృజనాత్మకంగా అప్పటికప్పుడు సమాధానాలివ్వడంలో డీప్‌ సీక్‌ ముందంజలో ఉంది. వివిధ భాషల్లోకి నిర్దుష్టమైన అనువాదాలు అందించడంలోనూ అగ్ర రాజ్యపు బడాబాబుల యాప్‌లన్నిటినీ అధిగమించేసింది. డీప్‌ సీక్‌ ఛాట్‌ బోట్‌ జవాబుల నాణ్యతను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ప్రశంసిస్తున్నారంటే అది చిన్న విజయమేమీ కాదు.

లెక్కతీస్తే డీప్‌ సీక్‌ సాధించిన విజయాలు అనేకం. ఓపెన్‌ ఏఐ కొన్ని వందల కోట్ల డాలర్ల ఖర్చు చేస్తే, కేవలం 60 లక్షల డాలర్లతో డీప్‌ సీక్‌ తన ఏఐ వేదికను అభివృద్ధి చేసిందని కథనం. అలాగే, అత్యాధునిక ఎన్‌విడియా ఏ100 చిప్స్‌ను చైనాకు విక్రయించడంపై షరతులున్న నేపథ్యంలో, వాటిపై ఆధారపడకుండా చౌక రకం, తక్కువ శ్రేణి వాటితోనే ఇంతటి విజయం సాధించింది. 

పైపెచ్చు, ఓపెన్‌ ఏఐకి పూర్తి భిన్నంగా డీప్‌ సీక్‌ అనేది... డెవలపర్లు ఎక్కడైనా, ఎప్పుడైనా వాడు కొని, దాన్ని తమ అవసరాలకు తగ్గట్టుగా మార్చుకొని, మరింత పెంపొందించుకోవడానికీ వీలున్న ‘స్వేచ్ఛా వినియోగ’ సాఫ్ట్‌వేర్‌. ఇన్ని ప్రత్యేకతలున్నందున డీప్‌ సీక్‌ ప్రభావం తక్షణమే విస్తృతంగా కనిపించింది. అమెరికాలోని ఏఐ సంస్థల స్టాక్‌ మార్కెట్‌ ప్రపంచం తలకిందులైపోయింది. ఓపెన్‌ ఏఐ తాలూకు ఛాట్‌ జీపీటీని సైతం రెండో స్థానానికి నెట్టి, యాపిల్‌ వాళ్ళ యాప్‌ స్టోర్‌ జాబితాలో ఈ చైనీస్‌ యాప్‌ ఏకంగా అగ్రేసర స్థానాన్ని అధిష్ఠించడం గణనీయమైన అంశం.

మొత్తానికి ఈ స్టార్టప్‌ తన ‘డీప్‌ సీక్‌–ఆర్‌1’ మోడల్‌తో ప్రపంచ ఏఐ చిత్రాన్నే మార్చేసింది. ఏఐకి సంబంధించిన ఆర్థిక, సాంకేతిక చలనసూత్రాలను తిరగరాసింది. అదే సమయంలో రాజకీ యంగా, మరీ ముఖ్యంగా చైనాకు సున్నితమైన 1989 నాటి తియానన్మెన్‌ స్క్వేర్‌ ఊచకోత ఘటన, అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి అంశాలపై జవాబిచ్చేందుకు ఇది నిరాకరించడం విచిత్రం. 

అంటే, ఆధునిక ప్రపంచంలో ఒకరకంగా సాంకేతిక పురోగతితో పాటు జనానికి ఏది చెప్పాలి, ఏది చూపాలి,ఎంత వివరించాలనే అంశాన్ని ఈ కొత్త సాధనాలతో నిర్ణయించేలా సెన్సార్‌షిప్‌లూ పెరగనున్నాయన్న మాట. పారదర్శకత, ఏఐ వ్యవస్థల్లో సిసలైన స్వేచ్ఛ ఎంత అన్న నైతిక ప్రశ్నలకు ఇది తావి స్తోంది. ఇంతటి సంచలనాత్మక ఏఐ మోడల్‌ సైతం చైనా ప్రభుత్వ సెన్సార్‌షిప్‌ సంకెళ్ళలో బందీగా, ప్రభుత్వ నియంత్రణలో పాలక వర్గాల ప్రచారానికే పరిమితమనే భావన కలుగుతోంది. 

ఏమైనా, పదే పదే ‘ఆత్మనిర్భర భారత్‌’ అంటూ పెడబొబ్బలు పెట్టే మన పాలకులకు డీప్‌ సీక్‌ విజయం కళ్ళెదుటి పాఠం. ప్రపంచానికి పెద్దన్నగా భావిస్తూ, అమెరికా అనేక ఆంక్షలు పెట్టి, సుంకాలు విధించినా చైనా తన సొంత కాళ్ళపై నిలబడడం ఎవరికైనా స్ఫూర్తిదాయకం, ఆదర్శం. అవరో ధాలను అధిగమించి, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఏఐ, పర్యావరణ సానుకూల టెక్నాలజీ లాంటి అనేక అంశాల్లో డ్రాగన్‌ సాధించిన విజయం అసామాన్యం. 

దూరదృష్టితో కూడిన విధాన నిర్ణయాలు, వాటి సమగ్ర ఆచరణ వల్లనే పొరుగునున్న చైనాకు ఇది సాధ్యమైంది. ఆ మార్గాన్ని మనమూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో అనుసరించాలి. భారత్‌లోనూ ప్రతిభకు కొదవ లేదు. మన విద్యార్థులు, ఐటీ రంగ నిపుణులు అందరూ పొలోమని అమెరికా వైపు చూడడానికీ, ఆ సంస్థల వైపు ఆకర్షితులు కావడానికీ కారణాలను అన్వేషించాలి. 

ప్రతిభావంతుల్ని ఇక్కడే స్థిరపడేలా చేసి, వారి సేవలను జన్మభూమికి ఉపకరించేలా చూసుకోవాలి. హెచ్‌1బీ వీసాల విషయంలో ట్రంప్‌ను మంచి చేసుకోవడానికి శత విధాల ప్రయత్నిస్తున్న మనం డీప్‌ సీక్‌ ఉదంతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. అదే సమయంలో నియంత్రణ, సెన్సార్‌లకు అతీతంగా సరికొత్త సాంకేతికతల్ని ఎదగనిచ్చేలా చైతన్యవంతమైన చట్టాలు చేయాలి. నైతికత, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పునాదిపై నూతన శకానికి దారులు వేయాలి. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)