Breaking News

అధిక సంతానంపై ప్రేమ!

Published on Sat, 03/14/2026 - 01:15

ఈమధ్య జనాభా పెంచండంటూ పిలుపునిచ్చే నాయకులు దేశంలో ఎక్కువయ్యారు. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ ‘ఇద్దరు లేక ముగ్గురు చాలు’, ‘మేమిద్దరం... మాకిద్దరు’ వంటి నినాదాలు హోరెత్తిన దేశంలో ఇలా కోరటం కాస్త వింతగానే ఉంటుంది. ఆరెస్సెస్‌ ఛీఫ్‌ మోహన్‌ భాగవత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు తరచూ బహిరంగ సభల్లో ఇలాంటి పిలుపునిస్తున్నారు. వాస్తవానికి మన దేశ జనాభా తక్కువేం లేదు. జనగణన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు గనుక నికరంగా ఆ సంఖ్య ఎంతన్నది తెలియకపోయినా అది 145 కోట్ల వరకూ ఉండొచ్చని వివిధ నివేదికలు చెబుతున్నాయి. ఐక్యరాజ్యసమితి కూడా దాన్నే ధ్రువీకరించింది. అంటే ప్రపంచంలో జనాభారీత్యా మనదే ప్రథమస్థానం. 

అయినా అధిక సంతానం అవసరమంటున్నారు నేతలు. జనాభా తగ్గించటం కోసం పది పదిహేనేళ్ల క్రితం వరకూ ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ప్రకటించేవి. ఉచితంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు, నగదు బహుమతి, ఇళ్ల కేటాయింపు వంటి నజరానాలుండేవి. వైద్యులకు సైతం ప్రోత్సాహకాలుండేవి. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారు పంచా యతీరాజ్‌ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ చాలా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. అయిదేళ్ల క్రితం కూడా అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఇద్దరికి మించి పిల్లలుంటే సంక్షేమ పథకాలు వర్తించబోవని, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల్ని చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగిగా మారాక సంతానం పెరిగినా కొలువుండదని చెప్పారు.

ఇప్పుడు గాలి మళ్లింది. నాయకుల స్వరం మారింది. అయితే వీరందరి ఉద్దేశాలూ ఒకటి కాదు. కొందరి పిలుపు వెనక హిందూ జనాభా తగ్గుతోందన్న ఆందోళన ఉంది. స్టాలిన్‌ వంటి వారైతే ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల జనాభా వ్యత్యాసం వల్ల పార్లమెంటులో సీట్ల సంఖ్య మొదలుకొని వనరుల కేటాయింపు వరకూ అన్నిటా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆదుర్దా పడుతున్నారు. అయితే చంద్రబాబు ఆంతర్యమేమిటో ఎవరూ చెప్పలేరు. స్టాలిన్‌తో ఏకీభవిస్తున్నట్టు తెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీకి ఆగ్రహం వస్తుందని భయం. జనాభా పెంచమని ఆమధ్య ఒకటి రెండుసార్లు ముసిముసి నవ్వులతో  చెప్పిన ఆయన... ఇటీవల నజరానాలు ప్రకటించారు. ఇద్దర్ని లేదా ముగ్గుర్ని కనే తల్లిదండ్రులకు రూ. 25,000, జంటలకు అవసరమైతే ఉచిత సంతాన సాఫల్య (ఐవీఎఫ్‌) చికిత్స, మూడో సంతానాన్ని కంటే... వారికి అయిదేళ్లు వచ్చేవరకూ నెలకు రూ. 1,000, పద్దెనిమిదేళ్ల వరకూ ఉచిత ప్రభుత్వ విద్య వంటివి అందులో ఉన్నాయి. ఎటూ అమలు చేసే అలవాటు లేదు గనుక  ఇలాంటి వాగ్దానాలు ఆయన ఎన్నయినా చేయగలరు. 

దేశంలో సంతానోత్పత్తి (టీఎఫ్‌ఆర్‌) జాతీయ సగటు 2000 సంవత్సరం నాటికి 3.2. అంటే సగటున ఒక మహిళకు ముగ్గురు సంతానం. అదిప్పుడు దాదాపు 2కు చేరుకుంది. తాజా లెక్కల ప్రకారం ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల సగటు 1.5 నుంచి 1.6 వరకూ ఉంది. టీఎఫ్‌ఆర్‌ 2.1 ఉంటే జనాభా స్థిరంగా ఉంటుందని, తగ్గితే జనాభా క్షీణిస్తూ వృద్ధుల సంఖ్య పెరుగుతుందని, 2.1 కన్నా హెచ్చితే పెరుగుదల వేగం హెచ్చుగా ఉంటుందని అంచనా. అక్షరాస్యత పెరగటం, మహిళలు ఉద్యోగాలు చేయటం, కుటుంబాల్లో వారి మాట చెల్లుబాటు కావటం, అస్థిర జీవితాలు, వలసలు వగైరాలన్నీ ఒకరి తోనో, ఇద్దరితోనో సరిపెట్టుకునేలా చేస్తున్నాయి. 

కారణాలు ఏమైనా ఉండొచ్చు... అవి సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఇలాంటి ఉద్బోధల వల్ల కుటుంబాల్లో స్త్రీలు ఎన్ని ఒత్తిళ్లు ఎదుర్కొనాలో, వారికెదురయ్యే ఆరోగ్య సమస్యలేమిటో చంద్రబాబు గమనించారా? ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు నా బాధ్యత’ అంటూ సంతకం చేసి గుప్పించిన వాగ్దానాలకే దిక్కు లేకుండా పోయాక ఇలాంటి హామీలు మహిళలు ఎలా నమ్మాలి? మద్యపానంతో మగవాళ్లు ఇల్లు గుల్ల చేస్తుంటే ఏం పెట్టి పిల్లల్ని పెంచాలి? సంతానం విషయంలో స్త్రీకి స్వయంప్రతిపత్తి ఉంటుందని గుర్తుందా? అసలు విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో చేస్తున్నదేమిటి? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సాధనపై శ్రద్ధవుందా? వీటన్నిటినీ నిజాయతీగా సమీక్షించుకుని సంతానం పెంచటం గురించి బాబు మాట్లాడాలి.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)