బ్రిటన్‌కు బర్న్‌హామ్‌ సారథ్యం

Published on Thu, 07/23/2026 - 01:53

బ్రెగ్జిట్‌ కాలంనుంచీ అస్థిరతకు ఆనవాలుగా మారిన బ్రిటన్‌లో కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించి అధికారంలోకొచ్చిన రెండేళ్లలోనే కీర్‌ స్టార్మర్‌ ప్రధాని పదవినుంచి వైదొలగక తప్పలేదు. ‘విదేశీ’ ప్రధానిగా అపకీర్తిపాలైన స్టార్మర్‌తో పోలిస్తే బర్న్‌హామ్‌కు విదేశాంగ విధానం విషయంలో అనుభవం లేదు. ఆసక్తి కూడా తక్కువే. నెలక్రితం ప్రధాని పదవికి గట్టి అభ్యర్థిగా తొలిసారి పేరు వినబడే నాటికి యూరప్‌ ఖండంలోనే చాలామందికి ఆయన తెలియదు. కీలక పరిశ్రమలపై ప్రభుత్వాధిపత్యం ఉండాలనీ, నగరాలకూ, ప్రాంతీయ ప్రభుత్వాలకూ అధికారాల వికేంద్రీకరణ జరగాలనీ కోరుకునే రాజకీయ నాయకుడిగా ఆయన దేశంలో అందరికీ తెలుసు. ఉత్తర ఇంగ్లండ్‌ లోని గ్రేటర్‌ మాంచెస్టర్‌కు మేయర్‌గా పనిచేసి బర్న్‌హామ్‌ సాధించిన విజయాలతో ఆయనకు ‘కింగ్‌ ఆఫ్‌ నార్త్‌’గా పేరొచ్చింది. ఆ విజయాల్లో అంతక్రితం ప్రైవేటు రంగానికి పోయిన బస్సు రవాణా విభాగాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకురావటం వంటివి ఉన్నాయి. గ్రేటర్‌ మాంచెస్టర్‌కు మేయర్‌గా 2017లో వెళ్లటానికి ముందు ఆయన లేబర్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 

చాలా యూరప్‌ దేశాల మాదిరే పలు సంవత్సరాలుగా అధిక ధరలతో, అరకొర ఆర్థిక వృద్ధితో బ్రిటన్‌ ఇబ్బంది పడుతోంది. అక్రమ వలసలు మొదలుకొని సక్రమంగా పనిచేయని ప్రభుత్వ సంస్థలవరకూ అనేక సమస్యలున్నాయి. ఈ కారణంగా జనంలో అసంతృప్తి పెరుగుతోంది. ఫ్రాన్స్‌లో మెరిన్‌ లీ పెన్, జర్మనీలో అలైస్‌ వీడెల్‌ వంటి మితవాదపక్ష నాయకుల మాదిరే బ్రిటన్‌లో సైతం దీన్ని తమకనుకూలంగా మార్చు కోవటానికి ప్రయత్నించే జాతీయవాద శక్తులు లేకపోలేదు. 2016లో బ్రెగ్జిట్‌ మొదలైన దగ్గర్నుంచి దేశాన్ని అస్థిరత పీడిస్తున్న నేపథ్యంలో ఉదారవాద పార్టీలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది. బ్రెగ్జిట్‌ అనుకూల యూకే ఇండిపెండెన్స్‌ పార్టీ(యూకేఐపీ) అధినేత నైజెల్‌ ఫరాజ్‌ కొత్తగా రిఫామ్‌ యూకే పార్టీ పేరుతో రంగంలో ఉన్నారు. ఒక దాత నుంచి 50 లక్షల పౌండ్ల విరాళాన్ని తీసుకుని దాన్ని వెల్లడించ లేదన్న ఆరోపణ ఆయనపై రాకపోయి ఉంటే ఈపాటికే ఆయనపై ప్రజల్లో అభిమానం పెరిగేది.

అందువల్లే ప్రధాని అయిన వెంటనే బర్న్‌హామ్‌ ఆర్థిక సుస్థిరత గురించి మాట్లాడారు. దీన్ని సాధించటానికి ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తామన్నారు. అందుకు ముందుగా అవసరమైనది రాజకీయ సుస్థిరత గనుక ఆ విషయంలో ఆయనేం చేస్తారో చూడాల్సి ఉంది. స్టార్మర్‌ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసి, తన శాఖకు ఆర్థిక మంత్రి తగిన కేటాయింపులు చేయలేదని అలిగిన జాన్‌ హేలీకి బర్న్‌హామ్‌ ఆర్థిక శాఖ అప్పగించారు. బస్సు చార్జీలకు పరిమితి విధించటం, అద్దెలపై మారటోరియం, ఇంధన బిల్లుల తగ్గింపు వంటివి అమలు చేస్తామంటూ ఇప్పటికే బర్న్‌హామ్‌ చెప్పిన నేపథ్యంలో ఆర్థిక శాఖ రాబడి మరింత పడిపోతుంది. ఈ నేపథ్యంలో రక్షణ కేటాయింపులు పెంచటం సంగతలా ఉంచి ఇతరత్రా రంగాలకు హేలీ ఎలాంటి కేటాయింపులు చేస్తారన్నది ప్రశ్నార్థకం. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ వ్యయాన్ని ఇంకా పెంచాలని చూస్తే బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని వారంక్రితం ఐఎంఎఫ్‌ హెచ్చరించింది.

తన విధానం ‘వ్యాపార అనుకూల సోషలిజం’ అని బర్న్‌హామ్‌ ప్రవచించారు గానీ... ఆచరణలో అదంత సులభం కాదు. వందరోజుల్లో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పెంపు, వ్యాపార వృద్ధి వంటి అంశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటానన్న ఆయన హామీ నెరవేర్చటానికి హేలీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ వ్యయం పెరగటం కోసం అధికాదాయం ఉన్నవారు తాము చెల్లించే పన్ను స్వల్పంగా పెంచటానికి సహకరించాలని ఇప్పటికే బర్న్‌హామ్‌ కోరారు. అలా పెంచితే ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ల పెంపు, వేతన సవరణ వంటి హామీలు నెరవేర్చవచ్చని ఆయన భావన. అయితే లేబర్‌ పార్టీవల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని ఈ రెండేళ్ల ఏలుబడికే సర్వత్రా అసంతృప్తి నెలకొన్న స్థితిలో పార్టీకి అనుకూలత తీసుకురావటం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఈ విషయంలో ఏ మేరకు బర్న్‌హామ్‌ విజయం సాధిస్తారో, లేబర్‌ను ఎంతవరకూ గట్టెక్కిస్తారో చూడాల్సి ఉంది.  

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)