Breaking News

యవ్వన వ్యామోహం

Published on Mon, 07/20/2026 - 00:50

‘పాడు జీవితము యవ్వనం మూడునాళ్ల ముచ్చటలోయి/ అయ్యయ్యో నీదు పరుగు లెచ్చటకోయి’ – ఆరుద్ర ఏనాడో ఒక డబ్బింగ్‌ సినిమా కోసం రాసిన పాట ఇది. జీవితం, యవ్వనం మూడునాళ్ల ముచ్చటనే మాట చెప్పినది ఆరుద్ర మాత్రమే కాదు, ఆయన కంటే ముందు ఆదిశంకరుడు మొదలుకొని ఎందరెందరో ఆధ్యాత్మికవేత్తలు దాదాపు ఇదే సంగతిని పదే పదే చెప్పారు. జీవితమే క్షణభంగురం అనుకుంటే, అందులో యవ్వనం ఉండేది ఎన్నాళ్లని! క్షణభంగుర సిద్ధాంతాన్ని ఎవరు ఎన్నివిధాలుగా చెప్పినా మనిషికి యవ్వన వ్యామోహం, చిరకాల జీవనేచ్ఛ తీరేవి కావు.

‘భోగా న భుక్తా వయమేవ భుక్తాః/ తపోన తప్తం వయమేవ తప్తః/ ‘కాలో న యాతో వయమేవ యాతాః/ తృష్ణా న జీర్ణా వయమేవ జీర్ణాః’ అన్నాడు భర్తృహరి. ఈ శ్లోకానికి అర్థమేమిటంటే, భోగాలను మనం అనుభవించలేదు, భోగాలే మనల్ని అనుభ వించాయి. మనం తపస్సు చేయలేదు, తాపత్రయాలతో మనమే తపించిపోయాం. కాలం గడిచిపోలేదు, మనమే గడిచిపోయాం. కోరికలు నశించలేదు, మనమే నశించిపోయాం. శాస్త్ర పురాణేతిహాసాలు ఎన్ని చెప్పినా, మనిషి స్వభావం మారదు. జరామరణాలు ప్రకృతి సహజాలు అని తెలిసినా, దీర్ఘ యవ్వనాన్ని, చిరంజీవిత్వాన్ని కోరుకోవడం మానవ సహజం. అత్యధికులు జీవించి ఉన్నంత కాలం యవ్వనాన్ని పొడిగించుకోవడా నికి పడరాని పాట్లు పడుతూనే ఉంటారు. చివరకు ఏమీ చేయలేక ప్రకృతిధర్మానికి తల ఒగ్గి కాలధర్మం చెందుతుంటారు. అరుదుగా కొందరు మాత్రం ప్రకృతికి ఎదురెళ్లి మరీ జరామరణాలను జయించడానికి ప్రయత్నిస్తారు.

మానవుల్లో తరగని యవ్వన వ్యామోహానికి పురాణాల్లోని యయాతి ఉదంతం ఒక ఉదాహరణ. యయాతి అసురగురుడైన శుక్రాచార్యుడి కుమార్తె దేవయానిని పెళ్లాడాడు. తర్వాత రాక్షసరాజు వృషపర్వుడి కుమార్తె శర్మిష్టను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తన కూతురికి అన్యాయం తలపెట్టాడని కోపించిన శుక్రుడు– యయాతిని శపించాడు. శుక్రాచార్యుడి శాపఫలితంగా యయాతికి అకాల వార్ధక్యం కలిగింది. అప్పటికి యవ్వన భోగాలపై కాంక్ష నశించని యయాతి తన వార్ధక్యాన్ని తీసుకుని, తమ యవ్వనాన్ని తనకు ఇవ్వమని కొడుకులను కోరాడు. దేవయాని కొడుకులిద్దరూ అందుకు నిరాకరించారు. శర్మిష్ఠ ముగ్గురు కొడుకుల్లో ఒకడైన పూరుడు మాత్రమే తండ్రి కోరిక మేరకు అతడికి తన యవ్వనాన్ని ఇచ్చి, అతడి వార్ధక్యాన్ని తాను  స్వీకరించాడు. కొడుకు ద్వారా యవ్వనాన్ని పొందిన యయాతి వెయ్యేళ్లు రాజ్యపాలన చేశాడు. 

పురాణాల్లో పునర్యవ్వన గాథలు మరికొన్ని కూడా ఉన్నాయి. పురాణాల్లో సప్త చిరంజీవులు కూడా ఉన్నారు. వాస్తవ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చిరంజీవులు కాలేదు. అంతేకాదు, నిత్యయవ్వనులు కూడా ఎక్కడా కనిపించరు. ఆకాశంలో ఎగరగలిగే విమానాల వంటి పురాణ కల్పనలు అధునాతన కాలంలో వాస్తవరూపం దాల్చడాన్ని మనం ఇప్పటికే చూశాం. వార్ధక్యాన్ని ఇంతవరకు ప్రకృతి సహజ పరిణామంగానే భావిస్తూ వస్తున్నాం. కాని, కొందరు వైద్య పరిశోధకులు వార్ధక్యాన్ని వ్యాధిగా గుర్తిస్తున్నారు. వ్యాధిని గుర్తించాక, దాన్ని నయం చేసే మార్గాన్ని కూడా శాస్త్రవేత్తలు ఏదో రీతిలో ఎప్పుడో ఒకప్పుడు కనుగొంటారు కదా! అందుకే, ఆ దిశగా ప్రయోగాలు సాగిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లోనే అమెరికన్‌ సంపన్నుడు బ్రయాన్‌ జాన్సన్‌ కొన్నేళ్లుగా జరామరణాలపై యుద్ధం సాగిస్తూ వార్తలకెక్కాడు. ఇతగాడిని కలియుగ యయాతిగా చెప్పుకోవచ్చు. నిత్య యవ్వన ప్రయోగాల్లో భాగంగా పద్దెనిమిదేళ్ల యువకుడైన తన కొడుకు రక్తాన్ని తన శరీరంలోకి ఎక్కించుకోవడం సహా బ్రయాన్‌ చేయని ప్రయోగాలు లేవు. ప్రయోగాలన్నాక ఒక్కోసారి వికటించడం సహజం. బ్రయాన్‌ ప్రయోగాలు కూడా వికటించాయి. ఇప్పుడతడు ‘ఆటో ఇమ్యూన్‌ అట్రోఫిక్‌ గ్యాస్ట్రైటిస్‌’ అనే నయం చేయలేని వ్యాధి బారినపడ్డాడు. వైద్యులు అతడి వ్యాధిని గుర్తించిన వెంటనే, ‘నా కడుపు నన్నే తినేస్తోంది’ అని బ్రయాన్‌ ప్రకటించాడు. అయినా సరే, తాను దీనిని ఎలాగైనా ఎదుర్కొని జయిస్తానని కూడా ప్రకటించాడు. ఈ కలియుగ యయాతి కథ ఏమవుతుందో చూడాలి! 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)