Breaking News

భాషలను కాపాడుకోవాలి

Published on Mon, 02/20/2023 - 01:19

‘భాష మన ఆలోచనలకు వాహకం మాత్రమే కాదు, మన ఆలోచనా సరళికి దోహదపడే గొప్ప పరికరం కూడా’ అన్నాడు బ్రిటిష్‌ ఆవిష్కర్త హంఫ్రీ డేవీ. ప్రస్తుత ప్రపంచంలో దాదాపు ఐదువేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. వాటిలో మూడోవంతు కేవలం ఆఫ్రికా ఖండంలోనే మనుగడలో ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడువేలకు పైగా భాషలు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. మన దేశంలోనే 192 భాషలు కొన ఊపిరితో కొనసాగుతున్నాయి. 

ప్రపంచంలోనే అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల్లో మన దేశానిది రెండో స్థానం. మన దేశంలో ఇప్పుడు 780 భాషలు మనుగడలో ఉన్నాయి. పాపువా న్యూగినీ విస్తీర్ణంలోను, జనాభా లోను చిన్న దేశమే అయినా, అక్కడ ఏకంగా 840 భాషలు మనుగడలో ఉన్నాయి. మన రాజ్యాంగం ఇరవైరెండు భాషలను గుర్తించింది. ప్రస్తుత ప్రపంచంలో రకరకాల భాషా కుటుంబాలకు చెందిన భాషలు మనుగడలో ఉన్నాయి. వాటిలో కొన్ని బలంగా ఉనికి చాటుకోగలుగుతున్నాయి. ఇంకొన్ని, క్రమంగా మరుగునపడే స్థితికి చేరుకుంటున్నాయి. భాష పుట్టుక గురించిన కచ్చితమైన వాస్తవాలు చరిత్రలో నమోదు కాలేదు. సమూహాలు సమూహాలుగా విడిపోయిన భాషా కుటుంబాలన్నీ ఒకే మూలభాష నుంచి విడివడిపోయినవనీ, ఒక్కో భాషా కుటుంబం నుంచి వేర్వేరు భాషలు పుట్టా యనీ భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. అన్ని భాషలకు మూలమైన తొలి భాష ఎప్పుడు ఎలా పుట్టిందో, ఎప్పుడు ఎలా అంతరించిపోయిందో చెప్పడానికి సరైన ఆధారాల్లేవు. మానవ సమూహాలు మనుగడ కోసం నేల నలు చెరగులా విస్తరించిన క్రమంలో ఏర్పడిన వేర్వేరు భాషా కుటుంబాల నుంచి పుట్టుకొచ్చిన భాషల గురించిన సమాచారం మాత్రమే మనకు తెలుసు. 

‘తన సొంత భాషను ప్రేమించని వాడు జంతువు కన్నా, దుర్గంధం వెదజల్లే చేప కన్నా నీచమైన వాడు’ అన్నాడు ఫిలిప్పినో రచయిత జోస్‌ రిజాల్‌. పుట్టి పెరిగిన నేలను, తొలి పలుకులు నేర్చిన మాతృభాషను ప్రేమించని వాళ్లు అరుదు. మాతృభాషల మనుగడ కోసం ప్రజలు రాజకీయ ఉద్యమాలు, ఆందోళనలు సాగించిన సందర్భాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌ ఇదివరకు తూర్పు పాకిస్తాన్‌గా ఉన్నకాలంలో అక్కడి ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దే ప్రయత్నాలు జరిగాయి. మిగిలిన జనాల కంటే భాషాభిమానం కాస్త ఎక్కువ మోతాదులో ఉన్న బెంగాలీలు దీనికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. తమ భాషకు గుర్తింపు కోసం పోరాటం సాగించారు. వారు తమ భాషకు గుర్తింపునే కాదు, స్వతంత్ర దేశాన్ని కూడా సాధించుకున్నారు. బెంగాలీలు తమ భాష కోసం పోరాటం ప్రారంభించిన ఫిబ్రవరి 21వ తేదీని ‘యూనెస్కో’ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకునే భాషలన్నింటి సంరక్షణ, పరిరక్షణలే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ ధ్యేయమని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2007 మే 16న ప్రకటించింది. భాషల సంరక్షణ, పరిరక్షణల బాధ్యతను ఐక్యరాజ్య సమితి నెరవేర్చలేదు. ఆ బాధ్యతను నెరవేర్చాల్సింది వివిధ దేశాల ప్రభుత్వాలే! 

ఒక భాషలో మాట్లాడేవారు ఎవరూ లేనప్పుడు ఆ భాష అంతరించిపోతుంది. ఒక భాష అంతరిస్తే, ఆ భాషకు చెందిన సంస్కృతీ సాహిత్యాలు కూడా అంతరించిపోతాయి. వలస రాజ్యాలు మొదలైన తర్వాత ప్రపంచంలో చాలా భాషలే అంతరించిపోయాయి. ‘ఒక జాతిని అంతమొందించాలంటే, ఆ జాతి మాట్లాడే భాషను అంతమొందించాలి’ అనే నానుడి ఉంది. ఖండాంతరాలకు పాకి వలస రాజ్యాలను స్థాపించుకున్న పాలకులు చాలావరకు చేసిన పని ఇదే! ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, డచ్, పోర్చుగీస్‌ తదితర యూరోపియన్‌ వలస రాజ్యాల్లో వందలాది స్థానిక భాషలు కనుమరుగైపోయాయి. వలస రాజ్యాల కాలంలో బలవంతులైన పాలకుల భాషలకు విపరీతంగా ప్రాబల్యం పెరిగింది. ఉపాధి కోసం పాలకుల భాషలను నేర్చుకోవడం జనాలకు అనివార్యంగా మారింది. తమ తమ మాతృభాషలను కాపాడుకోవడం పెను సవాలుగా మారింది. రెండు మూడు తరాలు గడిచే సరికి చాలా భాషలు కొడిగట్టిపోయాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, యూరోపియన్‌ వలస పాలకుల దెబ్బకు గడచిన నాలుగు శతాబ్దాల్లో కేవలం ఉత్తర అమెరికాలోనే దాదాపు రెండువందలకు పైగా స్థానిక భాషలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.

ఒక భాష అంతరించిపోతే, ఆ భాషకు చెందిన సంస్కృతి అంతరించిపోతుంది. ఆ భాషలో నిక్షిప్తమైన జ్ఞానసంపద కనుమరుగైపోతుంది. ఒక్కొక్కసారి ఒక నాగరికత సైతం అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు, ఆ భాషా సంస్కృతులకు చరిత్రతో లంకె తెగి పోతుంది. ఒకటికి మించిన భాషలను నేర్చుకోవడం, ఒక భాష నుంచి మరొక భాషకు సాహితీ సంపదను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా భాషలు చిరకాలం మనుగడ సాగించగలుగుతాయి. ‘నా భాష పరిమితులంటే, నా ప్రపంచం పరిమితులే’ అన్నాడు ఆస్ట్రియన్‌ తత్త్వవేత్త లుడ్విగ్‌ విట్గెన్‌స్టీన్‌. ఒకటికి మించిన భాషలు తెలిసి ఉన్నప్పుడు లేదా ఒకటికి మించిన భాషల్లోని సాహిత్యం మన భాషలోనే మనకు అందుబాటులో ఉండటం జరిగినప్పుడు మన పరిమితులు తొలగి, మన ప్రపంచం మరింతగా విస్తరిస్తుంది. బహుశా ఇందుకే కాబోలు ‘ఇంకో భాష తెలిసి ఉండటమంటే, రెండో ఆత్మను కలిగి ఉండటమే’ అన్నాడు రోమన్‌ చక్రవర్తి షాలమేన్‌. మనం మన చరిత్రను కాపాడుకోవాలంటే, మన భాషలను కాపాడుకోవడమే మార్గం.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)