Breaking News

హైదరాబాదీలు కోల్పోయిన‌ డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు!

Published on Thu, 01/02/2025 - 19:45

సాక్షి, హైదరాబాద్‌: రోజుకు రూ.3.8 కోట్లు.. వారానికి రూ.26.6 కోట్లు.. నెలకు రూ.114.1 కోట్లు.. ఏడాదికి రూ.1,369.5 కోట్లు.. ఈ లెక్కలు ఏమిటా అని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్‌ వాసుల నుంచి మోసగాళ్లు కాజేసిన సరాసరి మొత్తమిది. ఓ దోపిడీ ఘటనకు ఉన్న ప్రాధాన్యం, దాని దర్యాప్తుపై చూపించే శ్రద్ధ, మోసాలకు సంబంధించిన కేసులపై ఉండదు. ఇదే వైట్‌ కాలర్‌ నేరగాళ్లుగా పిలిచే మోసగాళ్లకు కలిసి వస్తోంది. 2023, 2024 సంవత్సరాల్లో నమోదైన మోసాల కేసుల్లో హైదరాబాద్‌ వాసులు కోల్పోయింది డబ్బు అక్షరాలా రూ.2,739 కోట్లు. ఈ ‘వైటుగాళ్లు’ఇలా రెచ్చిపోవడానికి అనేక అంశాలు కలిసి వస్తున్నాయి. 

ఆశ, నమ్మకాలే పెట్టుబడి 
ఈ మోసగాళ్లు ఎదుటి వారిలో ఉన్న ఆశ, నమ్మకాలనే పెట్టుబడిగా ముందుకు వెళ్తుంటారు. శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ.. ఇదీ వైట్‌కాలర్‌ అఫెండర్ల ప్రచారం. దొంగతనం, దోపిడీ వంటి నేరాలు చేయాలంటే దానికి భారీ తతంగం ఉంటుంది. టార్గెట్‌ను ఎంచుకోవడం, రెక్కీలు చేయడం, పక్కా ప్లాన్‌ సిద్ధం చేసుకోవడం... ఇలా ఎన్నో ముందస్తు ప్రక్రియలు పూర్తి చేయాలి. ఇంత చేసినా ఆ నేరం చేయడంలో పూర్తిస్థాయి ‘సక్సెస్‌’ అవుతారన్న నమ్మకం లేదు. కొన్ని సందర్భాల్లో నేరం చేయడానికి ముందో, చేస్తూనో పోలీసులకు చిక్కే ప్రమాదం కూడా ఉంటుంది. 

మోసాలకు సంబంధించిన ఆర్థిక నేరాలు చేసే వైట్‌కాలర్‌ నేరగాళ్లు ఇంత ‘శ్రమ’పడాల్సిన అవసరం ఉండదు. ఎదుటి వ్యక్తినో, వ్యక్తులనో, సంస్థనో పక్కాగా నమ్మించగలిగితే చాలు. ఒక్కోసారి వీరి లాభం రూ.కోట్లలోనూ ఉంటుంది. ఈ కారణంగానే వైట్‌కాలర్‌ అఫెండర్లు ఓ పక్క నేరుగా, మరోపక్క సైబర్‌ నేరగాళ్లుగా మారి అందినకాడికి దండుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తరవాత సైబర్‌ నేరాలూ అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి.  

చిక్కిన వారికి శిక్షలు తక్కువే 
ఈ మోసగాళ్లకు చట్టంలో ఉన్న లొసుగులే కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట ప్రకారం రూ.లక్ష మోసం చేసినా... రూ.10 కోట్లు మోసం చేసినా చీటింగ్‌ ఆరోపణలపై ఒకే సెక్షన్‌ కింద కేసులు నమోదవుతాయి. ఆ మోసం చేయడానికి అనుసరించిన మార్గాన్ని బట్టి ఇంకొన్ని సెక్షన్లు అదనంగా వచ్చి చేరే అవకాశం ఉంటుంది. ఎదుటి వారిని మోసం చేయడానికి పత్రాలు తయారు చేసినా, ఇతర గుర్తింపులు చూపించినా ఫోర్జరీ, ఇంపార్సినేషన్‌ తదితరాలు జోడిస్తారు. న్యాయస్థానంలో నేరం నిరూపితమైనప్పుడు అది నమోదైన సెక్షన్‌ ప్రకారమే శిక్ష ఉంటుంది. దీంతో ఎంత పెద్ద మొత్తం కాజేసినా మోసగాళ్లు తక్కువ శిక్షలతో బయటపడుతున్నారు. 

పదేపదే నేరాలు చేసేవారిపై పోలీసులు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ (పీడీ) యాక్ట్‌ ప్రయోగిస్తున్నారు. అయితే నిర్ణీత కాలంలో, నిర్ణీత సంఖ్యలో కేసులు ఉంటేనే దీన్ని వాడే ఆస్కారం ఉంది. ఓ మోసగాడు ఒకే ఉదంతంలో రూ.100 కోట్లు కాజేసినా అతడిపై దీన్ని ప్రయోగించడానికి అవకాశం లేదు. ఈ కారణాలతోనే అందినకాడికి దండుకుపోతున్న మోసగాళ్లకు చెక్‌ చెప్పడం పోలీసులకు తలనొప్పిగా మారింది.  

వీళ్లతో కొత్త తలనొప్పులు 
ఈ వైట్‌కాలర్‌ నేరాల్లో సైబర్‌ క్రైమ్‌ కూడా ఒకటి. సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న నేరగాళ్లు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పాత్రధారులు, దళారులు తప్ప సూత్రధారులు చిక్కట్లేదు. కొన్ని సందర్భాల్లో ఈ నేరాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలన్నది సామాన్యులకు స్పష్టంగా తెలియక, స్థానిక పోలీసుల నుంచి సరైన స్పందన లేక కేసులే నమోదు కావట్లేదు. నమోదైనా అవసరమైన స్థాయిలో దర్యాప్తు ఉండదు. సైబర్‌ నేరగాళ్లు తీసుకుంటున్న జాగ్రత్తలకు తోడు ఈ నేరాల దర్యాప్తులో అన్ని విభాగాల పోలీసులకు పట్టు ఉండట్లేదు. ఫలితంగా ఇంటర్‌నెట్‌ కేంద్రంగా జరిగే సైబర్‌ నేరాల్లో 50 శాతం కూడా నమోదు కావట్లేదు. నమోదైన నేరాల్లో సగానికి సగం కూడా కొలిక్కి రావట్లేదు. 

ఇక వీరి నుంచి నగదు రికవరీ అనేది దుర్లభం. మోసాలు చేసే నేరగాళ్లు చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నా శిక్షలు పడటం అరుదుగా మారింది. దీనికి దర్యాప్తు అధికారులకు ఉన్న అవగాహన లోపాలు ఒక కారణమైతే.. బాధితుల రాజీ ధోరణి మరో కారణంగా మారింది. వైట్‌కాలర్‌ నేరాలను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అవసరమైన స్థాయిలో ఇతర విభాగాల నుంచి సహకారం లభించట్లేదు. కేసు నమోదై, దర్యాప్తు పూర్తయినప్పటికీ.. కోర్టు విచారణ ప్రక్రియ ముగియడానికి చాలా సమయం పడుతోంది. అప్పటివరకు వేచి ఉండేందుకు ఆసక్తి చూపని బాధితులు మధ్యలోనే మోసగాళ్లతో రాజీ పడుతున్నారు.  

చక్కదిద్దే చర్యలు ప్రారంభం 
ఈ పరిస్థితులను బేరీజు వేసిన పోలీసు విభాగం.. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు నానాటికీ పేట్రేగుతుండటం, ఆర్థిక నేరాల వల్లే ప్రజలు ఎక్కువ నష్ట పోవడాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమికంగా అధికారులకు దర్యాప్తు తీరుతెన్నుల్లో మెళకువలు నేర్పిస్తున్నారు. సీసీఎస్‌ అధికారులకు అనుభవజ్ఞులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. సైబర్, ఎకనమిక్‌ నేరాల దర్యాప్తుపై తర్ఫీదు ఇవ్వడంతో పాటు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. తీవ్ర నేరాల్లో ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సమాచారం ఇస్తున్నారు. ఆయా కేసులను పరిగణనలోకి తీసుకున్న నేపథ్యంలో ఈ విభాగాలూ దర్యాప్తు చేపడుతున్నాయి.  

హైదరాబాద్‌లో నమోదైన నేరాల గణాంకాలు 
2023లో సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన 361 వైట్‌ కాలర్‌ నేరాల్లో రూ.1,355 కోట్లు.. 2,984 సైబర్‌ నేరాల్లో రూ.147 కోట్లు బాధితులు నష్టపోయారు.  
2024లో (నవంబర్‌ వరకు) సీసీఎస్‌ పోలీసులు నమోదు చేసిన 248 వైట్‌కాలర్‌ నేరాల్లో రూ.1,036 కోట్లు, 2,868 సైబర్‌ నేరాల్లో రూ.38 కోట్లు బాధితులు కోల్పోయారు.

చ‌ద‌వండి: ఖాజాగూడ కూల్చివేతలపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్‌

కఠిన చట్టం అవసరం 
మోసగాళ్లను కట్టడి చేయడానికి మరిన్ని కఠిన చ ట్టాలు అవసరం. ప్రస్తుతం కేవలం డిపాజిటర్స్‌ ప్రొటెక్ష న్‌ యాక్ట్‌తో నమోదైన కేసులతో పాటు మనీ లాండరింగ్‌ కేసుల్లో మాత్రమే నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతి ఆర్థిక నేరంలోనూ ఈ విధానం అమలయ్యేలా మార్పులు రావాలి. దీనికితోడు చోరీలు, దోపిడీలు చేసే వారితో పాటు ఇలాంటి వైట్‌ కాలర్‌ నేరగాళ్ల పైనా నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. మోసగాళ్లు కాజేసిన మొత్తం ఆధారంగా శిక్షలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కొత్తగా అమలులోకి వచ్చిన బీఎన్‌ఎస్‌లోనూ ఇలాంటి అవకాశం లేదు.  
– ప్రభాకర్, మాజీ డీఎస్పీ     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)