Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?
Breaking News
అచ్చు బంగారమే.. ఇంత చవకగా వస్తే ఆడాళ్లు వదులుతారా?
Published on Mon, 11/10/2025 - 08:41
జనగామ: బంగారం ధరలకు రెక్కలొచ్చినా, మహిళలు అలంకరణలో తగ్గడం లేదు. ధరలు ఆకాశాన్ని తాకినా అందం మీద మక్కువ మాత్రం తీరడం లేదు. గోల్డ్‌కు ప్రత్యామ్నాయంగా వన్ గ్రామ్ ఆభరణాలతో ఆడపడుచులు తమ అందాన్ని మరింత చిగురింపజేసుకుంటున్నారు. చవక ధరలో చక్కని మెరుపు, బంగారానికే పోటీగా మెరిసే డిజైన్లు ప్రతీ మహిళ మెడలో కొత్త కాంతి నింపుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.లక్షా 27 వేలు దాటింది. దీంతో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు ఆభరణాలు కొనడం కలగా∙మారింది.
పెళ్లిళ్లు, పుట్టినరోజులు, శుభకార్యాలు ఎన్ని ఉన్నా బంగారం ధరలు అలంకారాన్ని అడ్డుకుంటున్నాయి. అయితే, అందం మీద మక్కువ మాత్రం తగ్గలేదు. అలా బంగారం స్థానాన్ని వన్‌గ్రామ్ ఆభరణాలు ఆక్రమిస్తున్నాయి. కొన్నేళ్లుగా కొంత మేరకే∙ఆదరణ పొందిన ఈ వన్‌గ్రామ్ ఆభరణాలు ఇప్పుడు పూర్తిగా మార్కెట్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ముఖ్యంగా ఎనిమిది నెలల్లో అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరల పెరుగుదలతో పాటు చోరీల భయం కూడా ప్రజలను వన్‌గ్రామ్ వైపు మళ్లిస్తోంది. మహిళలు తమ బంగారు నగలను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుని, బయటకు వెళ్లేటప్పుడు వన్‌గ్రామ్ ఆభరణాలతో మెరిసిపోతున్నారు.
బంగారానికి పోటీగా మెరిసేవ గ్రామ్ ..
కంపెనీలు కూడా ఈ ధోరణిని అందిపుచ్చుకుని ఫ్యాషన్ డిజైన్లలో కొత్తదనం చూపుతున్నాయి. వజ్రాల్లాంటి రాళ్లు, ముత్యాలు, రంగు రాళ్లతో అద్భుతంగా మెరిసే డిజైన్లు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. బంగారం లాంటి ఫినిషింగ్, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఆభరణాలు అసలు బంగారం కంటే ఎక్కువ మెరుస్తూ, చూసే వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
వ్యాపారం రూ. లక్షల నుంచి కోట్ల దాకా..
గతంలో కేవలం చిన్న షాపుల్లో మాత్రమే అమ్ముడయ్యే వన్‌గ్రామ్ ఆభరణాలు ఇప్పుడు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా విస్తరించింది. ఆన్‌లైన్ మార్కెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, బ్యూటీ పార్లర్లు, గృహిణిలు సైతం ఈ వ్యాపారంలో భాగస్వామ్యులవుతున్నారు. జనగామ జిల్లాలో ప్రతీ నెల వ్యాపారం రూ. కోటికి పైగా ఉంటుందని అంచనా. రూ. 1,000 నుంచి రూ.1,500, రూ. 2,500, ఇలా రూ.20 వేలకు పైగా ధరల్లో లభించే ఈ ఆభరణాలు ఇప్పుడు ప్రతీ మహిళను ఆకర్షిస్తున్నాయి. వివాహాలు, పండుగలు, పార్టీలు, సెలబ్రేషన్లలో వన్‌గ్రామ్ ఆభరణాలు తళుక్కుమంటున్నాయి. బంగారంలా కనిపించే, అందరికీ అందుబాటులో ఉండే వన్‌గ్రామ్ ఆభరణాలు ప్రస్తుతం ఫ్యాషన్ సింబల్‌గా మారాయి. విద్యార్థినుల నుంచి ఉద్యోగిణుల వరకు, గ్రామీణుల నుంచి పట్టణ మహిళల వరకు అందరి మెడలో, చేతుల్లో ఈ నగలు మెరిసిపోతున్నాయి. తక్కువ ధర.. ఎక్కువ ఆకర్షణ.. ఈ రెండు అంశాలే వన్‌గ్రామ్ ఆభరణాల విజయ రహస్యం. మార్కెట్ అంచనాల ప్రకారం రాబోయే సంవత్సరాల్లో ఈ వ్యాపారం మరింత రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాపారం పెరిగింది
గతేడాదితో పోలిస్తే ఈ సారి వన్‌గ్రామ్ ఆభరణాల వ్యాపారం పెరిగింది. ప్రస్తుతం ఒక్కో కుటుంబం నాలుగు నుంచి ఐదు రకాల ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. నెలవారీ వ్యాపారం బాగానే ఉంటోంది. హోల్‌సేల్‌గా ప్రతీ నెల ఆర్డర్‌పై తెప్పిస్తాం.
ఉత్తమ్, వ్యాపారి, జనగామ
మహిళలు మక్కువ చూపుతున్నారు
ప్రస్తుతం వన్ గ్రామ్ ఆభరణాలకు క్రేజ్ ఉంది. బంగారం రూ.లక్షా 30వేలకు పైగా ఉండడంతో చాలా మంది మహిళలు వన్ గ్రామ్ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. బంగారం చేయించుకుంటే ఎక్కువ ఖర్చుతో పాటు దొంగల భయం ఉంది. అందుకే వన్ గ్రామ్ ఆభరణాలు చేయించుకున్నాం. శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఈ ఆభరణాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
శానబోయిన కల్యాణి, శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్
వన్ గ్రామ్ ఆభరణం బెటర్
రోజురోజుకూ బంగారం ధర పెరుగుతూ మాలాంటి సామాన్య కుటుంబాలు కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోతోంది. బంగారం ధర పెరగడంతో ఇటీవల చోరీలు, దాడులు జరుగుతున్నాయి. దీంతో బంగారం బదులు వన్ గ్రామ్ ఆభరణాలు ఉత్తమమని కొనుగోలు చేయాలనుకుంటున్నా. నిరుపేద, సామాన్య కుటుంబాలు బంగారానికి ప్రత్యామ్నాయంగా వన్ గ్రామ్ ఆభరణాలు కొనుగోలు చేయడం మంచిది.
మేకల సునీత, రామన్నగూడెం,కొడకండ్ల
Tags : 1