Breaking News

సానుకూలతలు కొనసాగొచ్చు

Published on Mon, 07/20/2026 - 00:47

 

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారం సానుకూలంగా ట్రేడయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, కంపెనీల యాజమాన్యాలు వెల్లడించే భవిష్యత్‌ వ్యాపార అంచనాలు (అవుట్‌లుక్‌) సూచీల కదలికలను నిర్దేశించనున్నాయి. వీటితో పాటు పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, నైరుతి రుతుపవనాల పురోగతిపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చు. గత వారం చివరిలో లభించిన బలమైన రికవరీతో నిఫ్టీ కీలకమైన 24,300 స్థాయిని తిరిగి అందుకోవడం మార్కెట్లో ట్రేడింగ్‌ మొమెంటాన్ని పెంచింది. 

250 కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు 
ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్‌ ప్రధానంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి దిగ్గజాల జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో ఇన్ఫోసిస్, వన్‌97 కమ్యూనికేషన్స్‌ (పేటీఎం), జొమాటో, ఇండిగో, మీషో, బీపీసీఎల్‌తో సహా 250కి పైగా కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

ఫలితాల సీజన్‌ ఊపందుకోవడంతో ఇన్వెస్టర్లు స్టాక్‌ ఆధారిత  ట్రేడింగ్‌కు మొగ్గు చూపొచ్చు. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌ ఫలితాల నేపథ్యంలో ఐటీ సెక్టార్‌పై అందరి దృష్టి కొనసాగనుంది. ఇప్పటికే టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అంచనాలకు మించిన ప్రదర్శన చేయడంతో ఐటీ రంగంపై సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. ఫలితాలతో పాటు కంపెనీల డిమాండ్‌ పరిస్థితులు, మార్జిన్లు, మూలధన వ్యయం (క్యాపెక్స్‌)పై యాజమాన్యాల వ్యాఖ్యలను విశ్లేషకులు నిశితంగా పరిశీలించనున్నారు. 

పశ్చిమాసియా పరిణామాలు 
జోర్డాన్‌ దాడిలో ఇద్దరు అమెరికన్‌ సైనికులు మరణించిన నేపథ్యంలో, ఇరాన్‌పై అమెరికా తాజా దాడులకు దిగింది. నెల రోజుల క్రితం కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం మరింత ముదిరింది. తాజా పరిణామాలపై ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతోల్లా మొజ్తబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రానున్న వారంలో గ్లోబల్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. ఇది ఇన్వెస్టర్లలో 
రిస్క్–ఆఫ్‌ సెంటిమెంట్‌ను పెంచవచ్చు. 

క్రూడాయిల్‌ ధరల భగభగలు 
అమెరికా–ఇరాన్‌ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో గల్ఫ్‌ ప్రాంతంలో సరఫరా అడ్డంకులు తలెత్తవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. స్ట్రెయిట్‌ ఆఫ్‌ హార్మూజ్‌ గుండా షిప్పింగ్‌ ఇబ్బందులకు తోడు, రెడ్‌ సీ (ఎర్ర సముద్రం) కూడా మూతపడవచ్చనే భయాలు మార్కెట్‌ను కలవరపరుస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు నాలుగు శాతానికి పైగా ఎగబాకి, నెల రోజుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత వారంలోనే బ్రెంట్‌ క్రూడాయిల్‌  ఏకంగా 16% ర్యాలీ (బ్యారెల్‌ 88 డాలర్ల పైకి) చేయడం గమనార్హం.

సాంకేతిక అంశాలు 
‘‘సాంకేతికంగా నిఫ్టీ ఇటీవలి కన్సాలిడేషన్‌ రేంజ్‌ నుంచి బ్రేక్‌అవుట్‌ ఇచ్చి బలంగా పైకి కదిలింది. ఇండెక్స్‌ తన కీలక రెసిస్టెన్స్‌ లెవెల్‌ 24,250ను అధిగమించింది. పైగా 21–రోజులు, 55– రోజుల ఈఎంఏల కంటే పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఇది మార్కెట్‌ ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. రానున్న రోజుల్లో ఇండెక్స్‌ 24,600 స్థాయి వైపు దూసుకెళ్లే అవకాశం ఉంది. దిగువ స్థాయిల్లో.. 24,000, 23,800 తక్షణ మద్దతు స్థాయిలుగా పనిచేస్తాయి. నిఫ్టీ ఈ స్థాయి(24,000, 23,800)ల పైన ఉన్నంత కాలం మొత్తం అవుట్‌లుక్‌ బుల్లిష్ గానే ఉంటుంది. కావున ఇన్వెస్టర్లు ‘బై ఆన్‌ డిప్స్‌’ (ప్రతి పతనంలోనూ కొనుగోలు) వ్యూహాన్ని అనుసరించడం లాభదాయకం’’ అని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రవి సింగ్‌ పేర్కొన్నారు.

మళ్లీ ఎఫ్‌పీఐల అమ్మకం 
జూలై నెలలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అమ్మకాల బాట పట్టారు. నగదు మార్కెట్లో రూ. 4,546 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఫారెక్స్‌ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనత నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు అప్రమత్తత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అయితే, గత నాలుగు వారాలతో పోలిస్తే అమ్మకాల పరిమాణం తగ్గడం ఊరట నిచ్చే అంశం. దీనికి భిన్నంగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ. 21,074 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. విదేశీ నిధుల ఉపసంహరణతో మార్కెట్‌పై పడే ఒత్తిడిని డీఐఐల బలమైన కొనుగోళ్ల మద్దతు సమర్థవంతంగా అడ్డుకుంది.

గతవారం ఇలా..
గత వారంలో దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు సానుకూలంగా ముగిశాయి. వారపు ప్రాతిపదికన సెన్సెక్స్‌ 582 పాయింట్లు (0.75%), నిఫ్టీ 127 పాయింట్లు (0.53%) పెరిగాయి. యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపుదలపై దూకుడు తగ్గించవచ్చనే అంచనాలు, లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు మార్కెట్‌ లాభాలకు కారణమయ్యాయి. అలాగే కేంద్ర మంత్రిమండలి రూ.1.27 లక్షల కోట్ల ‘సెమికాన్‌ 2.0’ ప్రోగ్రామ్‌కు ఆమోదం తెలపడం ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్‌ అనుబంధ షేర్లలో భారీ కొనుగోళ్లకు దారితీసింది.
 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)