కడప స్టీల్ పై బాబు నాటకం
Breaking News
నకిలీ ట్రేడింగ్ యాప్‌లకు సెబీ చెక్
Published on Thu, 03/26/2026 - 15:27
స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుల రక్షణే ధ్యేయంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మరో ముందడుగు వేసింది. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేస్తూ గూగుల్ ప్లే స్టోర్‌లోని స్టాక్ ట్రేడింగ్ యాప్‌ల కోసం ‘వెరిఫైడ్’ లేబుల్‌ను సెబీ అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన వ్యవస్థ ద్వారా రిటైల్ పెట్టుబడిదారులు నిజమైన, మోసపూరిత యాప్‌ల మధ్య తేడాను సులభంగా గుర్తించే అవకాశం లభించనుంది.
ముంచుకొస్తున్న ముప్పు
ఇటీవల కాలంలో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల పేర్లను, లోగోలను పోలి ఉండేలా నకిలీ యాప్‌లను సృష్టించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు భారీగా పెరుగుతున్నాయి. ‘ఈ అక్రమ యాప్‌లు అచ్చం ఒరిజినల్ ప్లాట్‌ఫారమ్‌ల వలె కనిపిస్తూ తమ డబ్బు నియంత్రిత మార్కెట్‌కే వెళ్తోందని పెట్టుబడిదారులు నమ్మేలా చేస్తున్నాయి. ఇది రిటైల్ ఇన్వెస్టర్లకు తీవ్ర ముప్పు’ అని సెబీ తన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సవాలును ఎదుర్కోవడానికి సెబీ గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సెబీ వద్ద రిజిస్టర్ అయిన సంస్థల యాప్‌లకు మాత్రమే ‘వెరిఫైడ్ బ్యాడ్జ్’ గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం 600కి పైగా స్టాక్ ట్రేడింగ్ యాప్‌లను ఇప్పటికే వెరిఫై చేసినట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇతర ఆర్థిక మధ్యవర్తుల (Intermediaries) యాప్‌లకు కూడా ఈ ఫీచర్‌ను విస్తరించనున్నారు.
‘ఫిన్‌ఫ్లుయెన్సర్ల’పై నిఘా
ఈ సందర్భంగా సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సలహాలిచ్చే ఫిన్‌ఫ్లుయెన్సర్లను ఏరిపారేయడానికి కృత్రిమ మేధ సాధనాలను వాడాలని గూగుల్‌ను కోరినట్లు తెలిపారు. ‘డిజిటల్ ప్రపంచంలో సమాజానికి సమస్యగా మారుతున్న వ్యవస్థలను రూపుమాపడానికి చట్టాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాల్సి ఉంది’ అని పాండే చెప్పారు.
ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
పెట్టుబడిదారులు ఎలా మోసపోతున్నారు?
సోషల్ మీడియా లేదా వాట్సాప్ ద్వారా అసాధారణ లాభాలు వస్తాయని ఆశ చూపుతారు.
సెబీ బ్రోకర్‌ను పోలి ఉండే నకిలీ యాప్ లింక్ పంపి డౌన్లోడ్ చేయిస్తారు.
యాప్‌లో గ్రాఫ్‌లు, లాభాలు కనిపిస్తున్నా వాస్తవానికి ఆ డబ్బు నిందితుల ఖాతాలకు మళ్లుతుంది.
పెట్టుబడిదారులు తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించే సమయానికి స్కామర్లు అదృశ్యమవుతారు.
Tags : 1