లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..
Breaking News
సక్సెస్‌కు ‘సప్త’పది! ‘కొత్త’గా ఇన్వెస్ట్ చేద్దాం..
Published on Mon, 04/13/2026 - 08:01
నిన్న మొన్నటిదాకా పెట్టుబడులు పోటెత్తాయి. దీంతో మార్కెట్లు దూసుకెళ్లాయి. కొత్త గరిష్ఠ స్థాయిలను నమోదు చేశాయి. ఆ పరిస్థితుల నుంచి ఇపుడు మార్కెట్లు ఆటుపోట్ల దశవైపు మళ్లాయి. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. గత కొన్నాళ్లుగా ఈక్విటీలు పటిష్టంగా ర్యాలీలు చేస్తుండటంతో ఇన్వెస్టర్లు అటువైపు మొగ్గు చూపటం వారికి మంచి లాభాలనే ఇచ్చింది. కానీ 2027 ఆర్థిక సంవత్సరం కాస్త విభిన్నంగా ఉండబోతోంది. అంతర్జాతీయంగా వృద్ధిపై అనిశ్చితి నెలకొంది. ద్రవ్యోల్బణం దిగి వస్తున్నా, అంత తేలిగ్గా లొంగడం లేదు. వడ్డీ రేట్లు కూడా మరీ దూకుడుగా ఏమీ తగ్గడం లేదు. భారతీయ ఇన్వెస్టర్లకు దేశీయంగా పటిష్టమైన వృద్ధి వల్ల అవకాశాలు మెరుగ్గానే ఉన్నప్పటికీ, విధానాలను కాస్త మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది, రాబడులపై ఆశలతో గుడ్డిగా పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులను స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవాల్సి ఉంది. దానికోసం ఉపయోగపడే ఏడు వ్యూహాల సమాహారమే ఈ వెల్త్ స్టోరీ...
ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ఆర్థిక లక్ష్యాల మదింపు
చాలా మంది ఇన్వెస్టర్లు ఒక్కసారి లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటే చాలు మళ్లీ వాటిలో మార్పులు, చేర్పులు చేసుకోరు. అయితే, కాలక్రమేణా మార్కెట్ పరిస్థితులు, ఆదాయ స్థాయిలు, వ్యక్తిగత బాధ్యతలు మారుతుంటాయి. కాబట్టి మీరు పెడుతున్న పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది పునఃసమీక్షించుకునేందుకు ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ఒక చక్కని అవకాశంగా మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యానికి 2–3 ఏళ్లే ఉన్నప్పుడు భారీ స్థాయిలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఒడిదుడుకులపరంగా అనవసర రిసు్కలు ఎదురుకావచ్చు. అదే రిటైర్మెంట్ లేదా సంపదను పెంచుకోవడంలాంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పెట్టి ఉంటే ఈక్విటీల్లో అధిక పెట్టుబడులను కొనసాగించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆటో పైలట్ మోడ్‌లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోవడం కాకుండా లక్ష్యానికి ఉన్న వ్యవధికి తగ్గట్లుగా కేటాయింపులు మార్చాల్సి ఉంటుంది.
అసెట్ అలోకేషన్ని సరి చేసుకోవడం
ఇపుడు అన్నింటికన్నా పెద్ద రిస్కు మార్కెట్ ఒడిదుడుకులు కాదు.. కేవలం ఒకే పెట్టుబడి సాధనంలో, అందులోనూ, ఈక్విటీల్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడమే రిస్కీ వ్యవహారం. చాలా మటుకు పోర్ట్‌ఫోలియోలు అనుకోకుండానే ఈక్విటీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. రాబోయే రోజుల్లో మార్కెట్లలో ఒకే రకమైన రిటర్నులు రాకపోవచ్చు. కాబట్టి, అసెట్ అలొకేషన్పై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈక్విటీ, డెట్, పసిడితో సమతూకమైన పోర్ట్‌ఫోలియో ఉంటే షాక్లేవైనా ఎదురైనా తట్టుకుంటూ సంపదను పెంచుకునేందుకు వీలవుతుంది. ఉదాహరణకు... ఈక్విటీలు పతనమైనప్పుడు, డెట్ సాధనాలు స్థిరత్వాన్ని అందిస్తాయి. ఇక గ్లోబల్ అనిశి్చతికి పసిడి హెడ్జింగ్ సాధనంగా పని చేస్తుంది. వార్షికంగా రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం వల్ల పోర్ట్‌ఫోలియోకి మీరు నిర్దేశించుకున్న స్థాయికి మించి రిస్కులు ఎదురవకుండా చూసుకోవచ్చు.
డైవర్సిఫికేషన్ ప్రధానం
పెట్టుబడుల్లో వైవిధ్యం పాటించడమంటే బోలెడన్ని మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉండాలనే అపోహ ఒకటి ఇన్వెస్టర్లలో ఉంది. వాస్తవానికి సదరు ఫండ్స్ అన్నీ కూడా ఒకే రకమైన రంగాలు లేదా మార్కెట్ క్యాప్‌లకు చెందినవైతే, అప్పుడు కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో ఒకే తరహా పెట్టుబడులున్నట్లే అవుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో సిసలైన డైవర్సిఫికేషన్ అంటే వివిధ అసెట్ క్లాస్‌లు, భౌగోళిక ప్రాంతాలు, పెట్టుబడి వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించడం. ఈక్విటీల విషయానికొస్తే, స్థిరత్వం కోసం లార్జ్ క్యాప్స్‌లో, అడాప్టబిలిటీ కోసం ఫ్లెక్సి క్యాప్స్‌లో, సమతూకం కోసం డెట్, పసిడిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా కొంత ఇన్వెస్ట్ చేస్తే డైవర్సిఫికేషన్ మరింతగా ఉంటుంది.
ఒడిదుడుకులు.. వ్యూహాలు
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆటుపోట్లు ప్రత్యేకంగా కనిపించనున్నాయి. ఇన్వెస్టర్లు వీటిని రిస్కులుగా అనుకోకుండా, అవకాశాలుగా మార్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) చక్కగా పని చేస్తాయి. దీనివల్ల కాలక్రమేణా కొనుగోలు రేటు సగటు స్థాయికి వస్తుంది. అయితే, మార్కెట్లు కరెక్షన్లకు లోనైనప్పుడు సిప్‌లతో పాటు వ్యూహాత్మక పెట్టుబడులను కూడా జోడిస్తే స్మార్ట్ విధానంగా ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లు అర్థవంతంగా తగ్గితే, అదనంగా పెట్టుబడులను కొద్ది కొద్దిగా పెట్టడం వల్ల దీర్ఘకాలిక రాబడులు మెరుగుపడతాయి. మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్నప్పుడు భావోద్వేగాలతో కాకుండా క్రమశిక్షణతో వ్యవహరించడం ముఖ్యం.
లిక్విడిటీ పటిష్టం చేసుకోవాలి
అనిశ్చితిలో రాబడులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో లిక్విడిటీకి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పట్టించుకోరు. ఫలితంగా చాలా మటుకు డబ్బును మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. నిర్మాణాత్మకమైన ఆర్థిక ప్రణాళికలో కనీసం ఆరు నెలలకు సరిపడే ఎమర్జెన్సీ నిధి కూడా ఉంటుంది. అనూహ్య పరిస్థితులు ఏవైనా తలెత్తితే దీర్ఘకాలిక పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఇది తోడ్పడుతుంది. లిక్విడిటీ ఉంటే ప్రధాన పోర్ట్‌ఫోలియోని డిస్టర్బ్ చేయకుండా మార్కెట్లో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలవుతుంది.
పోర్ట్‌ఫోలియోలో డెట్ సాధనాలకూ చోటివ్వండి
ఈక్విటీ మార్కెట్లు బాగున్నప్పుడు డెట్ పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. కానీ రాబడులు ఒక మోస్తరు స్థాయికి పరిమితమై, వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్న దశలో వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. డెట్ సాధనాల వల్ల అంచనాలకు అనుగుణమైన రాబడులు వస్తాయి. పోర్ట్‌ఫోలియోలో ఆటుపోట్లు తగ్గుతాయి. మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న దశలో పోర్ట్‌ఫోలియోకి కాస్త స్థిరత్వం లభిస్తుంది. ముఖ్యంగా పెట్టుబడిని సంరక్షించుకోవడం చాలా కీలకంగా ఉండే స్వల్పకాలిక, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి 2026–27లో అత్యంత నాణ్యమైన డెట్ సాధనాలకు సమతూకంగా కేటాయిస్తే, భారీ రాబడులు లేకపోయినా, రిసు్కకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను అందుకునేందుకు వీలవుతుంది.
క్రమశిక్షణ ముఖ్యం
సాధారణంగా సరైన ఫండ్‌ని ఎంపిక చేసుకుంటే చాలు మంచి రాబడులు వస్తాయనే దృష్టితో చాలా మంది ‘అత్యుత్తమ మ్యూచువల్ ఫండ్‌ని వెతికి పట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తుంటారు. నిజానికి, నిలకడ, క్రమశిక్షణ, అసెట్స్‌కి సరైన అలొకేషన్ చేయడమే దీర్ఘకాలికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఇటీవలి కాలంలో పనితీరు బాగుండటం లేదంటూ మాటిమాటికీ ఫండ్స్‌ని అటూ ఇటూ మార్చడం వల్ల అసలుకే మోసం వస్తుంది. దీనివల్ల భారీ వేల్యుయేషన్స్కి కొనుక్కుని, తాత్కాలికంగా పడగానే, ని్రష్కమించినట్లవుతుంది. అలా గాకుండా మెరుగ్గా నిర్వహిస్తున్న కొద్ది ఫండ్స్‌ని ఎంచుకుని, పెట్టుబడులను కొనసాగిస్తూ, మధ్యమధ్యలో వాటిని సమీక్షించుకుంటూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. కాలం గడిచే కొద్దీ తాత్కాలిక భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల గాకుండా క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేయడం వల్లే మంచి ఫలితాలు పొందవచ్చు.
కొత్త ఆర్థిక సంవత్సరంలో దూకుడుగా, అస్తవ్యస్తంగా పెట్టుబడులను పెడితే ఫలితాలు దక్కేలా లేవు. ఎవరైతే సమతూకం, నిలకడ, రిస్క్ మేనేజ్మెంట్పై ప్రధానంగా ఫోకస్ చేస్తారో వారికే ప్రయోజనాలు లభిస్తాయి. మార్కెట్ కదలికలను ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నం చేయడం కాకుండా, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే విధంగా పోర్ట్‌ఫోలియోని తీర్చిదిద్దుకోవడం స్మార్ట్ వ్యూహంగా ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సరిచేసుకుంటూ, సరైన అసెట్ అలొకేషన్ని పాటిస్తూ, సమర్ధవంతంగా డైవర్సిఫై చేస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఇన్వెస్టర్లు ఒకవైపు దీర్ఘకాలికంగా సంపదను పెంచుకుంటూనే మరోవైపు అనిశ్చితి నుంచి బైటపడొచ్చు. చివరగా చెప్పేదేమిటంటే, గొప్ప ఫలితాలు సాధించాలంటే ఏదైనా అసాధారణమైనది చేయడం కాదు.. నిలకడగా కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటే చాలు.
Tags : 1