విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
శామ్సంగ్ ఇండియాలో ఉద్యోగాల కోత
Published on Tue, 09/08/2026 - 12:21
వ్యయ నియంత్రణలో భాగంగా చిన్నాచితకా కంపెనీలు ఇటీవలి కాలంలో భారీగా తమ ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. అందులో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్సంగ్ ఏమీ తీసుపోలేదు. తన భారత విభాగంలో వ్యయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉద్యోగాల కోతకు పూనుకుంది. టీవీలు, హోమ్ అప్లయన్సెస్ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 80-100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఇప్పటికే బ్యాచ్‌ల వారీగా విధుల నుంచి తొలగించినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఆధారంగా వెలువడిన సమాచారం స్పష్టం చేస్తోంది. తొలగింపునకు గురైన వారిలో డైరెక్టర్ స్థాయి అధికారులు, ప్రధాన కార్యాలయంలోని టీమ్ లీడర్లతో పాటు బ్రాంచ్, ఏరియా మేనేజర్లు కూడా ఉన్నారు.
పెరిగిన ఒత్తడి.. తగ్గిన ఆదాయం
గత కొద్ది రోజులుగా చిన్న బ్యాచ్‌ల్లో టర్మినేషన్ లేఖలు జారీ చేస్తుండగా, కొందరికి నోటీసు పీరియడ్ గడువు కూడా ఇవ్వకుండా వెంటనే వైదొలగాలని కోరినట్టు తెలుస్తోంది. మెమొరీ చిప్‌ల ధరలు రెట్టింపు కావడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించడం వల్ల దిగుమతి చేసుకునే విడిభాగాలు, ఉత్పత్తుల ధరలు పెరిగిపోయాయి. దీనికితోడు ముడిసరుకు వ్యయాలు కూడా అధికమవడంతో శామ్సంగ్ లాభదాయకతపై ఒత్తిడి నెలకొంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కూడా ఏడాది ప్రాతిపదికన 11-12 శాతం క్షీణించడం సంస్థ ఆదాయంపై ప్రభావం చూపింది.
త్వరలో 25 శాతం కోత..
ప్రస్తుతానికి ఈ లేఆఫ్స్ టీవీ, అప్లయన్స్ వ్యాపారాలకే పరిమితమైనప్పటికీ రాబోయే రోజుల్లో సేల్స్, మార్కెటింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో మొత్తం సిబ్బందిలో 25 శాతం వరకు కోత విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనిలో ప్రత్యక్ష ఉద్యోగులతో పాటు మ్యాన్‌పవర్ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఆఫ్రోల్ సిబ్బంది కూడా ఉండవచ్చు. శామ్సంగ్ దేశీయ ఎలక్ట్రానిక్స్ సేల్స్ టీంలో దాదాపు 550-600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు.
పండగ సీజన్‌పై ఆశలు
ప్రస్తుత లేఆఫ్స్‌లో స్మార్ట్‌ఫోన్ విభాగం ప్రభావితం కాలేదని, దీపావళి సీజన్లో డిమాండ్ కోలుకుంటుందని సంస్థ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విక్రయాలను బట్టి భవిష్యత్తులో మొబైల్ వ్యాపారంపైనా సమీక్ష ఉండవచ్చని ఒక అధికారి తెలిపారు. బ్రాంచ్ నెట్వర్క్ ఏకీకరణతో సహా భారత కార్యకలాపాల సమగ్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు
Tags : 1