Breaking News

బ్యాలెన్స్‌ లేకుంటే పడతారు..! 

Published on Mon, 12/29/2025 - 04:16

కేలండర్‌ మారుతోంది. కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వెస్ట్‌మెంట్ల సంగతేంటి? 2025 ధోరణే కొనసాగిద్దామా? లేక కొంతయినా మారుద్దామా? అందరిదీ ఇదే సందేహం. స్టాక్‌ మార్కెట్ల వైపు చూస్తే... ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాలకు దగ్గర్లో ఉన్నాయి. అంతకుముందు రెండేళ్లు అసాధారణంగా ర్యాలీ చేసిన స్మాల్, మిడ్‌క్యాప్‌ షేర్లు మాత్రం 
నేలచూపులు చూస్తున్నాయి. 

ఏడాదిలో సెన్సెక్స్‌ 10 శాతం పెరిగినా.. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 7 శాతం తగ్గింది మరి. పోనీ రిసు్క లేకుండా ఓ మోస్తరు రాబడులిస్తాయనుకుంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాస్తా తగ్గి కూర్చున్నాయి. పెట్టుబడి పెట్టేలోపే బంగారం, వెండి అనూహ్యంగా పరుగులు పెడుతున్నాయి. మరి ఈ పరుగులెంతకాలం? ఎల్లకాలమూ ర్యాలీ చేస్తూనే ఉండవు కదా? ఇక రియల్‌ ఎస్టేట్‌ మొదట్లో కూలబడి... ఇపుడిపుడే కోలుకుంటోంది.

 ఇలాచూస్తే ఇపుడు సరైన ఇన్వెస్ట్‌మెంట్‌ ఇదీ... అని చెప్పలేని పరిస్థితి. మరేం చేద్దాం? మన పోర్టుఫోలియో ఎలా ఉండాలి? ద్రవ్యోల్బణాన్ని మించి 4– 6 శాతం మేర వాస్తవిక రాబడులను ఎలా దక్కించుకోవాలి? ఎందులో.. ఎంత ఇన్వెస్ట్‌ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘వెల్త్‌’ స్టోరీ...  ఇపుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్‌డ్‌ పోర్టు ఫోలియో తప్పనిసరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. 

ఉదాహరణకు ఈక్విటీల్లో 30–45 శాతం, డెట్‌– ఫిక్స్‌డ్‌ ఇన్‌కం సాధనాలకు 25–35 శాతం, రియల్‌ ఎస్టేట్‌కి 20– 30 శాతం, పసిడి, వెండికి 10–15 శాతం మేర కేటాయించవచ్చు. ఇలా బ్యాలెన్స్‌ చేసుకుంటే కొన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. మిగిలినవి రాణించే చాన్సుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులొస్తాయి. ఒక్కో సాధనాన్నీ విడివిడిగా చూద్దాం...

2026 కొంత కొత్తగా... 
తేదీ మారినంత మాత్రాన జీవితమేమీ మారిపోదు. సంవత్సరం మారినంతమాత్రాన సంపదేమీ వచ్చి ఒళ్లో వాలదు. భారతీయ మధ్య తరగతి ఇప్పుడు ఆర్థిక కూడలిలో అయోమయంగానే నిలుచుంది. ఎందుకంటే జీతాలు బాగా పెరుగుతున్నాయి. కానీ చదువు, ఆరోగ్యం, ఇల్లు, డిజిటల్‌ లైఫ్‌కయ్యే ఖర్చు అంతకు మించి పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణకు పాత సూత్రాలు పనికిరావిప్పుడు. కొత్తగా చెయ్యాలి. కొంతయినా!!. 

నెల జీతం... ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.. బంగారం. దశాబ్దాలుగా భారతీయుల పొదుపు సూత్రమిదే. మరిప్పుడో..? ఉద్యోగాలకు రక్షణ లేదు. మారిన జీవనశైలి పొదుపును మింగేస్తోంది. ఆసుపత్రికెళితే బిల్లును అంచనా వెయ్యలేం. ఎల్‌కేజీ నుంచే ఫీజులకు జీతాలు సరిపోవట్లేదు. మరేం చెయ్యాలి? ధనంతో అనుబంధాన్ని... అంటే ధనబంధాన్ని మార్చుకోవాలి. తక్షణ లాభాలు, సోషల్‌ మీడియా టిప్‌లకు దూరంగా ఉందాం. లగ్జరీ వస్తువులు కొనేముందు... అత్యవసర నిధికి ప్రాధాన్యమిద్దాం. మొహమాటం కోసం కొనే పాలసీలకన్నా... నిజంగా రక్షణనిచ్చే బీమా కావాలి. ఆద్భుతాలు చేసే పథకాలకన్నా... స్థిరంగా పెరిగే పెట్టుబడులు చూడాలి. సంపద రాత్రికిరాత్రే రాదు. మెరుగైన అలవాట్లతో నెలలు, సంవత్సరాలు వేచిచూస్తేనే చెంతకొస్తుంది. ‘సాక్షి’ వెల్త్‌తో కలిసి ఇప్పటినుంచైనా కొత్త ప్రయాణం మొదలు పెడదాం..!  
 

ఎందులో, ఎలా ఇన్వెస్ట్‌ చేయొచ్చు
ఈక్విటీలు (30–45 శాతం కేటాయింపు) 
లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌లోను, ఇండెక్స్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్‌ను నిరంతరం ఫాలో అయ్యే అవకాశం లేనివారు, మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే నెలవారీగా ఇంత మొత్తం (ఇప్పుడు వారంవారీ, రోజువారీవి కూడా వచ్చాయి) చొప్పున పెట్టుబడి పెట్టేలా సిప్‌ (సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) తరహా ఇన్వెస్టింగ్‌ విధానాన్ని అనుసరించవచ్చు. అంతేతప్ప డే ట్రేడింగ్, టిప్స్‌ మాయలో పడొద్దు. తక్షణ లాభాలొస్తాయంటూ వచ్చే కాల్స్‌ను ఆన్సర్‌ చేయొద్దు. ఈక్విటీల్లో పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉండాలి. రిటైర్మెంట్‌ తరువాతి జీవనానికి, పిల్లల చదువుకు ఉపయోగపడతాయి.

డెట్, ఫిక్స్‌డ్‌ ఇన్‌కం (25–35 % కేటాయింపు)
భారీ రిటర్నుల కన్నా పోర్ట్‌ఫోలియోని స్థిరంగా ఉంచేందుకు ఈ సాధనం ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో  ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ), డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లు, కార్పొరేట్‌ బాండ్లు వంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇతరత్రా సాధనాలతో పోలిస్తే ఈ తరహా సాధనాలపై రాబడులు ఒక మోస్తరుగానే దక్కే అవకాశం ఉన్నప్పటికీ.. మన పెట్టుబడి మొత్తానికి పెద్దగా రిస్కు ఉండదు. భద్రత అధికం. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ అనేవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ బాండ్లు, ట్రెజరీ సాధనాల్లాంటి స్థిరాదాయాన్ని అందించే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం నిధులను సమీకరించుకునేందుకు జారీ చేసే వాటిని కార్పొరేట్‌ బాండ్లుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌డీలతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువ రాబడినిచ్చే విధంగా ఉంటాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ట్రిపుల్‌ ఏ రేటెడ్‌ సాధనాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.

రియల్‌ ఎస్టేట్‌ (20–30 శాతం) 
ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా రియల్‌ ఎస్టేట్‌ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో ఓ 20–30 శాతాన్ని ఇందులో ఇన్వెస్ట్‌ చేయొచ్చు. స్వయంగా నివసించేందుకు కొనుక్కోవడం కావచ్చు... అద్దె రూపంలో రాబడులిచ్చే రెంటల్‌ ప్రాపరీ్టపై లేదా ఫ్రాక్షనల్‌ కమర్షియల్‌ ప్లాపరీ్టలో కావచ్చు. ఆర్థికంగా వెసులుబాటను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, స్పెక్యులేషన్‌కి తావివ్వకుండా క్యాష్‌ ఫ్లోపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.

బంగారం, వెండి (10–15 శాతం)
సాధారణంగా బంగారం, వెండి లాంటి మెటల్స్‌కు, ఈక్విటీలకు నెగటివ్‌ కో–రిలేషన్‌ ఉంటుంది. చాలా సందర్భాల్లో షేర్‌ మార్కెట్‌ పెరిగినప్పుడు ఈ మెటల్స్‌ ధరలు నిదానించడం, పసిడి ధర పెరిగినప్పుడు షేర్లు తగ్గడంలాంటిది జరుగుతుంది. కానీ 2025లో పరిస్థితి అలా లేదు. సూపర్‌గా పరుగులు తీసిన సాధనంగా బంగారం నిల్చింది. అంతటి పరుగును కూడా వెండి దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం 74%, వెండి 160% మేర పెరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరుగు కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. పేపర్‌ కరెన్సీలాగా కాలక్రమేణా మారకం విలువను కోల్పోకుండా, పెరిగే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడే సురక్షితమైన హెడ్జింగ్‌ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. తన విలువను కాపాడుకుంటూ, ఈక్విటీలు తగ్గినా సంక్షోభ సమయాల్లో ఆదుకునే పసిడి, వెండిలో ఓ పది నుంచి పదిహేను శాతం ఇన్వెస్ట్‌ చేస్తే పోర్ట్‌ఫోలియోకి శ్రీరామరక్షగా ఉంటుంది.  

క్యాష్, లిక్విడ్‌ ఫండ్స్‌ (5 శాతం) 
అత్యవసర పరిస్థితులేవైనా తలెత్తితే చేతిలో ఎంతో కొంత నగదు ఉండటం చాలా ముఖ్యం.  కాబట్టి సంపద వృద్ధి కోసం ఎందులో ఎంత ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ, ఎమర్జెన్సీలో ఆదుకునేందుకు కనీసం ఆరు నెలల ఆర్థిక అవసరాలకైనా సరిపడే ఫండ్‌ అనేది ఒకటుండాలి. దీన్ని సేవింగ్స్‌ ఖాతాలోనైనా ఉంచుకోవచ్చు. లేదా దానికన్నా కాస్త ఎక్కువ రాబడినిచ్చే అవకాశాలున్న లిక్విడ్‌ ఫండ్స్‌లోనైనా సుమారు 5 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

కొన్ని తప్పిదాలకు  దూరం.. 
కొత్త సంవత్సరంలోనైనా కొన్ని తప్పిదాలకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫికేషన్‌ సూత్రం అంటూ ఒకటుంటుంది. అంటే, ఎప్పుడూ చేతిలో ఉన్నదంతా తీసుకెళ్లి ఒకే సాధనంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఎందుకంటే ఏ సాధనానికైనా కొన్ని సాధకబాధకాలుంటాయి. ఒకోసారి పెరుగుతుంది. ఒకోసారి తగ్గుతుంది. పెరిగితే ఫర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ తగ్గినప్పుడే సమస్య. 

మొత్తం అంతా అందులోనే ఉంచేయడం వల్ల సవాళ్లు తప్పవు. మళ్లీ అది కోలుకునేంత వరకు ఓపిగ్గా కూర్చువడమో లేదా నష్టానికి అమ్ముకుని బైటపడటమో చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బంతా ఒకే దానిలో ఇన్వెస్ట్‌ చేయకుండా వివిధ సాధనాల్లో కొంత చొప్పున డైవర్సిఫై చేస్తే మంచిది. ఇక పోయినేడాది రాబడి బాగా వచి్చంది.. ఈసారి కూడా అదే స్థాయిలోనో లేదా దానికి మించిన స్థాయిలోనో రాబట్టాలి అని పంతం పట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి పరిస్థితులను బట్టి రాబడులను సహేతుకంగా అంచనా వేసుకుని, తగిన నిర్ణయం తీసుకోవాలి. 

బీమాను, పెట్టుబడిని కలిపి చూడొద్దు. బీమా అనేది అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఆర్థికంగా ఆదుకోగలిగే సాధనం. పెట్టుబడి అనేది సంపదను సృష్టించుకునేందుకు, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రతను సాధించుకునేందుకు ఉపయోగపడే సాధనం. బీమా, పెట్టుబడి ప్రయోజనాలను కలిపి అందించే సాధనాలు మార్కెట్లో ఉన్నప్పటికీ వివేకవంతంగా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని ఇచ్చే బీమా పాలసీని ఎంచుకుని, విడిగా పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరం.  

– ఎడిటర్‌

Videos

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)