ఇందిరమ్మ ఇల్లు వివాదం... లంచం తెచ్చాను తీసుకోండి..
Breaking News
రూ.20 లక్షల నుంచి రూ.20 వేలకు తగ్గిన సంపాదన..
Published on Sat, 04/25/2026 - 09:27
నేటి ఆధునిక సమాజంలో సక్సెస్ అంటే ఏంటి? ఆరంకెల జీతం, ఏటా పెరిగే బోనస్‌లు, సమాజంలో హోదా పెంచే కార్పొరేట్ పదవులు.. ఇదే కదా అందరి లెక్క! కానీ, వీటన్నింటినీ కాదని ఆత్మసంతృప్తి కోసం ఒక మహిళ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ భార్య రుచి వారికూ కార్పొరేట్ కంపెనీలో వార్షికంగా రూ.20 లక్షల ప్యాకేజీని వదులుకొని నెలకు కేవలం రూ.20 వేలు వచ్చే సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసి ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కలల కొలువు నుంచి బ్రేక్
వైరల్ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. రుచి వారికూ కెరీర్ ప్రారంభం నుంచి ఒక మూస పద్ధతిలో ఆలోచించలేదు. 19 ఏళ్ల వయస్సులోనే ఆమెకు భవిష్యత్తుపై స్పష్టమైన, భిన్నమైన ఆలోచనలు ఉండేవని అంకుర్ గుర్తు చేసుకున్నారు. కాలేజీ పూర్తి కాగానే ఒక మ్యాగజైన్‌లో చేరిన ఆమె ఆ తర్వాత తన కలల సంస్థ అయిన డిస్కవరీ ఛానెల్‌లో ఉద్యోగం సంపాదించారు. 2005 నుంచి 2010 వరకు అక్కడే పనిచేస్తూ ఏటా రూ.20 లక్షల ఆదాయంతో అత్యున్నత స్థాయిలో నిలిచారు.
జీవితం మలుపు తిరిగింది ఇలా..
తమకు మొదటి బిడ్డ పుట్టిన తర్వాత రుచి తన ప్రాధాన్యతలను మార్చుకున్నారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే తన కుమారుడి పెంపకం కోసం ఉద్యోగానికి విరామం ప్రకటించారు. నాలుగు ఏళ్ల పాటు పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆమె మళ్లీ కెరీర్ ప్రారంభించాలనుకున్నప్పుడు అందరిలా తిరిగి కార్పొరేట్ రంగానికి వెళ్లలేదు. ‘నా భార్య సంవత్సరానికి రూ.20 లక్షల సంపాదన నుంచి నెలకు రూ.20 వేల సంపాదనకు మారింది. 2014లో ఆమె సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపింది. నెలకు కేవలం రూ.20 వేలు మాత్రమే అందుతున్నా ఆమె పొందిన సంతృప్తి వెలకట్టలేనిది’ అని అంకూర్ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో అన్నారు.
సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు
లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ‘విజయం కేవలం ఆదాయం గురించి కాదు, ఆ దశలో మీకు ఏది ముఖ్యమో దానితో కలిసి ప్రయాణించడం’ అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు. ‘కెరీర్ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. పరిస్థితులను బట్టి మారుతుంటుంది’ అని మరొకరు పేర్కొన్నారు. డబ్బు కంటే మానసిక ప్రశాంతత, కుటుంబం, వ్యక్తిగత ఆసక్తి ముఖ్యమని నిరూపించిన రుచి వారికూ కథ, కెరీర్ రేసులో పరుగెడుతున్న నేటి యువతకు గొప్ప పాఠం.
ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!
Tags : 1