పెన్షన్ ఎవరిచ్చారు... జగన్ బాబు.. మంత్రి ముందే చంద్రబాబు పరువు తీసిన అవ్వ
Breaking News
పెరిగిన డాలర్ విలువ.. అపార్ట్‌మెంట్స్ కొంటున్న ఎన్‌ఆర్‌ఐలు!
Published on Sat, 02/28/2026 - 15:56
ఏడాది క్రితం ఒక డాలర్‌కు రూ.85 వచ్చేవి.. కానీ, ఇప్పుడు ఏకంగా రూ.92 వచ్చే పరిస్థితి.. అంటే ఏడాదిలో 4.29 శాతం పెరిగింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రవాసులు ఇక్కడ పెట్టుబడి కోసం అన్ని అవకాశాలను అన్వేషిస్తున్నారు. కాకపోతే అనుకున్న వెంటనే పెట్టుబడి పెట్టగలిగేది, దీర్ఘకాలంలో లాభాలిచ్చేది స్థిరాస్తి రంగమే కావటంతో ఇటువైపు చూస్తున్నారు. ప్రధానంగా ముంబై, ఎన్‌సీఆర్(ఢిల్లీ), బెంగళూరు, హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌లలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ప్రవాసులకు టైమొచ్చింది.. పెట్టుబడి అనగానే ఎన్‌ఆర్‌ఐ (నాన్ రెసిడెంట్ ఇండియన్)లకు ముందుగా గుర్తొచ్చేది మ్యూచ్‌వల్ ఫండ్స్, షేర్ మార్కెట్లే.. ఆ తర్వాతే స్థిరాస్తి, బంగారం వంటివి. అయితే ఇందులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు ఎప్పుడూ లాభాలనే తీసుకొస్తాయన్నది కాదనలేని వాస్తవం. దీంతో రియల్టీ రంగంలో ప్రవాసుల పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. డాలర్ విలువ పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత, భౌగోళిక పరిస్థితులు, ఇండియాలో సరళీకృత పన్ను విధానాలు, రెరా, జీఎస్టీలతో స్థిరాస్తి రంగంలో పెరిగిన పారదర్శకత, డిజిటల్ లావాదేవీల సౌలభ్యం, సులువైన ఆస్తి నిర్వహణ, పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు, అధిక లాభాలు, పన్ను మినహాయింపులు, సరళీకృత పన్ను విధానాలు అందుబాటు ధరలు.. వంటి రకరకాల కారణంగా ఎన్‌ఆర్‌ఐలు భారత స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నారు.
రూ.లక్ష కోట్ల పెట్టుబడులు..
భారత స్థిరాస్తి రంగం బూమ్‌లో ప్రవాసులు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్‌ఎన్‌ఐ) వ్యక్తులు భాగస్వాములే.. అమెరికా, యూకే, యూరప్, సింగపూర్, కెనడా, ఆ్రస్టేలియా, పశ్చిమ ఆసియా దేశాల నుంచి ఎక్కువగా ప్రవాసుల పెట్టుబడులు పెడుతున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో ఎన్‌ఆర్‌ఐల వాటా 2015లో 7–10 శాతంగా ఉండగా.. 2025 నాటికి 18–20 శాతానికి పెరిగింది. 2024–25లో దేశీయ గృహ విభాగంలోకి ప్రవాసులు 85,000 నుంచి 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
ఎన్‌ఆర్‌ఐలు కొనాలంటే..
ఎన్‌ఆర్‌ఐల ప్రాపర్టీ లావాదేవీలు, నిబంధనలు విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఎఫ్‌ఈఎంఏ) కిందికి వస్తాయి. ప్రవాస భారతీయుడు గానీ భారత సంతతి(పీఐఓ) దేశంలోని నివాస, వాణిజ్య స్థిరాస్తులను కొనుగోలు చేయవచ్చు. అలాగే కొనుగోళ్లలో పరిమితి అంటూ ఏమీ లేదు. అయితే వ్యవసాయ భూమి గానీ ఫాంహౌజ్, ప్లాంటేషన్ ప్రాపర్టీలను మాత్రం కొనుగోలు చేసే వీలు లేదు. వీటి కొనుగోళ్లకు ఆర్‌బీఐ అనుమతి ఉండాలి. బహుమతి లేదా వారసత్వంగా పొందిన ప్రాపర్టీలకు మాత్రమే యాజమాన్య హక్కులు ఉంటాయి. ప్రాపర్టీల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేకుండా ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల ద్వారా కొనుగోళ్లు భారత రూపాయిలలో జరుగుతాయి. ప్రవాసులు కొనుగోలు చేసే ఆస్తిపై దీర్ఘకాలిక మూలధన లాభాలకు పన్ను మినహాయింపు(టీడీఎస్) 12.5 శాతం, స్వల్పకాలిక మూధన లాభాలు 30 శాతం మినహాయింపు ఉంటుంది.
విక్రయించాలనుకుంటే..
ఫెమా నిబంధనల ప్రకారం ఎన్‌ఆర్‌ఐ సొంత ఆస్తి, వారసత్వంగా పొందిన నివాస, వాణిజ్య స్థిరాస్తిని దేనినైనా విక్రయించే వీలుంది. ఒకవేళ ఎన్‌ఆర్‌ఐకి వారసత్వంగా పొందిన వ్యవసాయ భూమి, ప్లాంటేషన్, ఫాంహౌజ్ గానీ ఉంటే దాన్ని విక్రయించాలనుకుంటే మాత్రం కేవలం స్థానికులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇతర ఎన్‌ఆర్‌ఐ లేదా భారత సంతతికి గానీ గిఫ్ట్‌గా అందించవచ్చు. అలాగే ప్రవాసులకు అద్దె ఆదాయంలోనూ మినహాయింపులు ఉన్నాయి.
హైదరాబాద్‌లో ప్రవాసుల పెట్టుబడులు..
అమెరికా, ఆ్రస్టేలియా దేశాల్లో నివాసం ఉంటున్న సిటీకి చెందిన ఎన్‌ఆర్‌ఐలు రూ.3 కోట్లు, ఆపై విలువ ఉన్న ప్రాపర్టీలను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రియల్టీ వర్గాలు చెబుతున్నాయి. 2024–25లో నగరంలో ప్రవాసులు రూ.6,800 కోట్లు–రూ.10,000 కోట్ల విలువైన లావాదేవీలు జరిపారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉండటం ప్రవాసులకు కలిసొస్తుంది. కొంత కాలంగా స్థిరాస్తి మార్కెట్‌లో ఆశించిన జోరు లేకపోవడంతో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని ఎన్‌ఆర్‌ఐలు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఇంటి రుణాలు తీసుకొని మరీ నగరంలో ఉంటున్న వారి తల్లిదండ్రులకు పంపించి ఫ్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.
విల్లాల కంటే ఫ్లాట్ల కొనుగోళ్లకే ప్రవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఫ్లాట్ల ధరలు తక్కువగా ఉండటం, అద్దె కూడా వస్తుండటం దీనికి ప్రధాన కారణాలు. పైగా నిర్వహణ వ్యయం తక్కువగా ఉంటుంది. కోట్లు వెచ్చించి విల్లా కొనుగోలు చేసినా.. త్వరగా అద్దెకు పోదు. అందుకే అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లకే ఎన్‌ఆర్‌ఐలు ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు.
కొనేముందే పరిశీలించాలి
యాజమాన్య హక్కులు, పత్రాలు, టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో నిపుణులు, న్యాయవాదులతో తనిఖీ చేయించాలి. యాజమాన్య హక్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? వారసత్వంగా వచ్చిందా? సంయుక్త భాగస్వామ్యంగా ఉందా? బ్యాంకులో తనఖా కింద ఉందా? వంటి కోణాల్లో ఆరా తీయాలి.
స్థిరాస్తిని కొనుగోలు చేసేముందు నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం(ఎన్‌ఓసీ) తీసుకోవాలి. నీరు, విద్యుత్ వంటి బిల్లులు చెల్లించారో లేదో పూర్తిగా పరిశీలించాలి.
కొత్త నిర్మాణాల్లో అయితే ల్యాండ్ టైటిల్స్ సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. స్థానిక సంస్థల నుంచి అన్ని రకాల నిర్మాణ అనుమతులు, ఎన్‌ఓసీలను తీసుకున్నారా లేదా గమనించాలి.
నిర్మాణంలో ఉంటే..
నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేస్తుంటే.. పవర్ ఆఫ్ అటార్నీ(పీఓఏ)ను ఇవ్వాల్సిందిగా డెవలపర్‌ను కోరాలి. దీన్ని డాక్యుమెంటేషన్ చేసుకోవడం మంచిది. సులభతరం కూడా.. పీఓపీ పొందిన వ్యక్తి ద్వారా మీ ప్రాపర్టీ కాంట్రాక్ట్‌కు గానీ మార్ట్‌గేజ్‌కు గానీ లేదా అమ్మకానికి గానీ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా సంబంధిత ప్రాపర్టీని డిస్పోజల్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్వాదీనం, అగ్రిమెంట్ వంటి విషయంలో పీఓపీ ఎంతగానో ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవాలి.
Tags : 1