ఇదేనా నీ సనాతన ధర్మం..! పవన్ పై జడ శ్రవణ్ సంచలన కామెంట్స్
Breaking News
క్వాల్‌కామ్‌లో లేఆఫ్స్ కలకలం.. లీగల్ క్లెయిమ్‌పై హెచ్చరిక
Published on Wed, 11/11/2026 - 09:12
ప్రముఖ చిప్‌మేకర్ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్లో కోత విధించే ప్రక్రియ ప్రారంభించింది. ముఖ్యంగా భారత్‌తో పాటు కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఈ ప్రభావం గట్టిగానే పడింది. ఏటా నిర్వహించే ఉద్యోగుల పనితీరు మదింపు ఆధారంగా ఈ పీరియాడిక్ లేఆఫ్స్‌ను అమలు చేస్తున్నట్లు కంపెనీ సీఈఓ క్రిస్టియానో అమన్ గతంలోనే అంతర్గత మెమో ద్వారా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోతున్న సిబ్బందికి కంపెనీ అందిస్తున్న పరిహారాలు, ఇతర ప్రయోజనాల వివరాలు ప్రస్తుతం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పనితీరు ఆధారంగానే కోత..
ప్రస్తుతం జరుగుతున్న ఈ ఉద్యోగాల కోత పూర్తిగా పనితీరు ఆధారిత పునర్వ్యవస్థీకరణలో భాగమేనని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఐ ఆటోమేషన్ కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం వ్యాపార ప్రాధాన్యతలు, వ్యక్తిగత పనితీరు ప్రమాణాల మీదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. స్మార్ట్‌ఫోన్ చిప్ మార్కెట్‌లో నెలకొన్న మందగమనం, పెరుగుతున్న మెమొరీ ధరలు, విక్రయాల అంచనాల్లో వ్యత్యాసాల కారణంగా కంపెనీ తన వ్యూహాలను మార్చుకుంటోంది. ఇందులో భాగంగానే ఆటోమోటివ్ చిప్స్, డేటా సెంటర్లు వంటి కొత్త రంగాలపై దృష్టి సారించి సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఉద్యోగులకు అందే బెనిఫిట్స్
ఉద్యోగం కోల్పోతున్న సిబ్బందికి కంపెనీ నిబంధనల ప్రకారం ఆకర్షణీయమైన సెవరెన్స్ ప్యాకేజీలను ప్రకటిస్తున్నారు. ఉద్యోగి క్వాల్‌కామ్‌లో పనిచేసిన ప్రతి ఏడాదీ పరిగణలోకి తీసుకుని దానికి అదనంగా బేసిక్ వేతనాన్ని కలుపుకొని సెవరెన్స్ అమౌంట్ లెక్కగడుతున్నారు. సాధారణంగా ఉద్యోగులకు మూడు నెలల జీతానికి సమానమైన ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. కొన్ని విభాగాల్లో సర్వీస్ నిబంధనలను బట్టి రెండు వారాల గ్రాస్ శాలరీ, అదనంగా ప్రతి ఏటా సేవలకు సంబంధించి మరో రెండు వారాల వేతనాన్ని ఇస్తున్నట్లు సమాచారం.
త్వరితగతిన అంగీకరిస్తే అదనపు బోనస్
కంపెనీ అందించే సెవరెన్స్ ఒప్పంద పత్రాలపై త్వరగా సంతకం చేసే ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకం లభిస్తోంది. నోటీసులు అందుకున్న రెండు లేదా మూడు రోజుల్లోగా డాక్యుమెంట్లపై సంతకం చేసే వారికి అదనంగా మరో నెల జీతాన్ని అదనపు ప్రయోజనంగా ఇస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన సిబ్బందికి కొంతకాలం పాటు హెల్త్ కవరేజ్ కొనసాగేలా చెల్లింపులు, కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ వంటి బెనిఫిట్స్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ సెవరెన్స్ ఒప్పందాలపై సంతకం చేసే ముందు ఉద్యోగులు భవిష్యత్తులో కంపెనీపై ఎలాంటి న్యాయపరమైన క్లెయిమ్‌లు చేయకూడదనే నిబంధనలు కూడా ఉంటున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్వాల్‌కామ్ తన పునర్వ్యవస్థీకరణ ఖర్చుల కోసం భారీగా నిధులను కేటాయించిందని వార్షిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒత్తిళ్లను తట్టుకుంటూ సంస్థను మరింత పటిష్టంగా నడిపించేందుకు యాజమాన్యం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు గ్లోబల్ టెక్ రంగంలో కలకలం రేపుతున్నాయి.
ఇదీ చదవండి: ‘దుస్తులు ధరించని సమయాల్లో రికార్డు చేస్తున్నారు!’
Tags : 1