అమెరికా నష్టపరిహారం చెల్లించాల్సిందే.. మీ ఇష్టం మళ్లీ యుద్ధమే!
Breaking News
పెట్రోల్ బండ్లు బ్యాన్.. రిజిస్ట్రేషన్లు బంద్!
Published on Sat, 04/11/2026 - 12:08
దేశ రాజధానిలో వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు 'ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026-2030' ముసాయిదాను రవాణా శాఖ విడుదల చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం.. రానున్న రెండేళ్లలో పెట్రోల్ వాహనాల రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో నిషేధం విధించి, నగరాన్ని ఈవీ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కీలక గడువులు ఇవే..
పెట్రోల్ వాహనాలను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం స్పష్టమైన టైమ్ లైన్లను ప్రకటించింది. జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కొత్తగా కేవలం ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల (ఆటోలు) రిజిస్ట్రేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. పెట్రోల్/సీఎన్జీ ఆటోల రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.
ఏప్రిల్ 1, 2028 నుండి పెట్రోల్ ద్విచక్ర వాహనాలపై (బైకులు, స్కూటర్లు) పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే అనుమతిస్తారు.
ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే.. డెలివరీ యాప్‌లు, అగ్రిగేటర్ల పరిధిలోని వాహనాలకు జనవరి 1, 2027 నుంచే కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఉన్న BS-6 వాహనాలను డిసెంబర్ 31, 2026 వరకు మాత్రమే అనుమతించి, ఆపై పూర్తిగా ఈవీలను తప్పనిసరి చేయనున్నారు.
వ్యక్తిగత వాహనాలే కాకుండా, ప్రభుత్వ, విద్యాసంస్థల వాహనాలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. 2030 నాటికి 30 శాతం పాఠశాల బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం ఏటా నిర్దిష్ట కోటాను పెంచుకుంటూ పోతారు.
ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ 100% ఎలక్ట్రిక్ మాత్రమే అయి ఉండాలి. అలాగే అద్దెకు తీసుకునే వాహనాలను కూడా తక్షణమే ఈవీలుగా మార్చాలని నిర్ణయించారు.
ఢిల్లీకి వచ్చే ఇతర రాష్ట్రాల బస్సులు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ లేదా హైడ్రోజన్ ఇంధన సాంకేతికతకు మారాల్సి ఉంటుంది.
ప్రజాభిప్రాయ సేకరణ
ఈ మార్పులు ఆకస్మికంగా కాకుండా, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా అమలు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఛార్జింగ్ పాయింట్ల విస్తరణపై ప్రభుత్వం భారీగా దృష్టి సారించిందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ ముసాయిదాను పౌరులు, నిపుణుల సలహాల కోసం పబ్లిక్ డొమైన్లో ఉంచారు. రాబోయే 30 రోజుల్లో వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం దీనిపై తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. శీతాకాలంలో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేసే కాలుష్య కోరల నుండి విముక్తి పొందేందుకు ఈ ఈవీ పాలసీ కీలకం కానుంది.
Tags : 1