ఎగ్జిట్ పోల్ ఇవ్వలేం, Axis My India రియాక్షన్
Breaking News
ఒప్పో, వన్‌ప్లస్, రియల్మీ విలీనం!
Published on Thu, 04/30/2026 - 12:36
గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దిగ్గజ సంస్థ ఒప్పో కీలక నిర్ణయం తీసుకుంది. మారుతున్న మార్కెట్ సమీకరణలు, తీవ్రతరమవుతున్న పోటీని తట్టుకునేందుకు తన అనుబంధ బ్రాండ్లు అయిన వన్‌ప్లస్, రియల్మీలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ఒక కొత్త బిజినెస్ యూనిట్‌గా విలీనం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యూహాత్మక పునర్నిర్మాణం ద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో సమన్వయాన్ని పెంచాలని ఒప్పో భావిస్తోంది.
ఈ విలీనం ద్వారా వన్‌ప్లస్, రియల్మీ బ్రాండ్లు తమ గ్లోబల్, దేశీయ కార్యకలాపాలను ఒకే విభాగం కింద నిర్వహించనున్నాయి. వన్‌ప్లస్ చైనా ప్రెసిడెంట్ లీ జీ ఈ కొత్త ప్రొడక్ట్ హబ్‌కు నాయకత్వం వహించనున్నారు. ఆయన నేరుగా వన్‌ప్లస్ వ్యవస్థాపకుడు, సీఈఓ పీట్ లావుకు రిపోర్ట్ చేస్తారు. ఉత్పత్తుల అభివృద్ధితోపాటు మార్కెటింగ్, సర్వీసు విభాగాలు కూడా ఒకే యూనిట్ కిందకు రానున్నాయి. టీమ్‌ల మధ్య డూప్లికేషన్‌ను (ఒకే పనిని రెండు వేర్వేరు బృందాలు చేయడం) తగ్గించి కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే సమయాన్ని వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.
వినియోగదారులపై ప్రభావం ఎంత?
ఈ విలీనం జరిగినప్పటికీ మార్కెట్లో వన్‌ప్లస్, రియల్మీ తమ వ్యక్తిగత బ్రాండ్ గుర్తింపును కోల్పోవని తెలుస్తోంది. అంటే, యూజర్లు ఇప్పటిలాగే వన్‌ప్లస్ నుంచి ప్రీమియం అనుభవాన్ని, రియల్మీ నుంచి బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లను ఆశించవచ్చు. అయితే, తెరవెనుక పనిచేసే టెక్నాలజీ, వనరులు, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో సమన్వయం కనిపిస్తుంది. భారతదేశం, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో ఒప్పో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్య దోహదపడుతుంది. ముఖ్యంగా భారత్‌లో నాయకత్వ మార్పులపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కంపెనీ ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. ‘స్థానిక వ్యూహాలతో భారత కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ పునర్వ్యవస్థీకరణ కేవలం అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడానికే’ అని చెప్పింది.
ఇదీ చదవండి: కెరీర్ వృద్ధికి ‘వన్ మంత్’ టెస్ట్
Tags : 1